Saturday 15 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదియైదవసర్గ

                                           రామాయణము 

                                               అరణ్యకాండ -ఏబదియైదవసర్గ 

 రావణుడు తాను చేసిన ఘనకార్యమును తలుచుకుని మిక్కిలి సంతుష్టుడై సీతాదేవిపట్ల కామపరవశుడై ,సీతాదేవిని చూచుటకై రమ్యమైన అంతః పురములోకి ప్రవేశించెను . అచట రాక్షస కాంతల రక్షణలో కన్నీరుమున్నీరుగా విలపించుచు ఉండెను . అట్టి సీతాదేవి కడకు రావణుడు చేరి తన వైభవమును చూపించుటకు తన భవనములు అన్ని చూపించసాగెను . 
రత్న మణిఖచితములై బంగారు తాపడములతో ఉన్న రకరకాల భవనములు  రావణుడు సీతాదేవికి చూపించినను ఆమె దుఃఖముతో ,భాదతో వాటిపట్ల విముఖురాలై ఉండెను . పిమ్మట రావణుడు "సీతా !నా అధీనములో ముప్పదిరెండు కోట్లమంది రాక్షసయోధులు కలరు . భయంకర కార్యములు చేయుటలో సిద్దహస్తులు . వీరు కాక బాలురు ,వృద్దులు అనేకులు కలరు . వారందరికీ నేను ప్రభువును . వెయ్యి మంది సేవకులు నా ఒక్కటి సేవకై నియమితులై ఉండెను . 
నీవు నన్ను భర్త గా అంగీకరించినచో వీరందరూ నీకు సేవకులవుదురు . అంతేకాదు నాకు జీవనసర్వస్వమూ నేవే . నీవు నాకు ప్రాణముల కంటే మిన్న . నా రాజ్యము వేయి యోజనముల విస్తీర్ణముకలది . ఇంద్రాది దేవతలు వచ్చినను నన్ను జయించలేరు . రాముడు రాజ్యభ్రష్టుడు ,మనుష్యమాత్రుడు అట్టి వానితో నీకేమి పని . సుందరీ !రాముడిని చూడవలెననే కోరిక మానుకొనుము . రాముడు మానసికముగా అయినా ఇచటకు రాలేడు . 
ఓ తరుణీ నీ ముఖారవిందం మిక్కిలి కోమలమైనది . అది నిరంతరము ఏడ్చుటచే కల తప్పి ఉండెను . "అని రావణుడు పలుకుచుండగా సీతాదేవి చీర చెంగుతో ముఖము దాచుకుని ఎక్కీఎక్కి ఏడ్చుచుండెను . ఆమె తన మనసులో రాముడిని ధ్యానించుచుండెను . అట్టి స్థితిలో పాపాత్ముడవైన రావణుడు "ఓ వైదేహి ఇట్లు చేయుట అధర్మమని భావించరాదు . విధివశమున ఏర్పడిన ఈ బంధము ధర్మసమ్మతమే . 
ఓ జానకీ !నీ పాదములు మిగుల మృదువైనవి . అట్టి పాదములకు నేను నా పదితలలతో మోకరిల్లుదును . వెంటనే నన్ను అనుగ్రహింపుడు . నేను సర్వదా నీ దాసుడనై నీ అధీనములో ఉండెదను . నేను ఇదివరకెన్నడూ ఏ స్త్రీ కి శిరసా నమస్కరింపలేదు . "అని పలికి ఆ రావణుడు ఈమె నాకు దక్కినట్టే అని తన మనసులో తలచుకొనెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment