Sunday 16 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదిఆరవసర్గ

                                        రామాయణము 

                                           అరణ్యకాండ -ఏబదిఆరవసర్గ 

రావణుడు ఆవిధముగా పలుకగా సీతాదేవి నిర్భయముగా ఒక గడ్డిపోచను అడ్డుపెట్టుకుని "రాక్షసుఁడా !నా భర్త రగువంశోత్తముడు ,శూరుడు ఆయనే తలుచుకున్నచో చంద్రుడిని సైతము పడవేయగలడు . సముద్రమును ఇంకిపోవునట్టు చేయగలడు . అతడు తనసోదరుడు లక్ష్మణుడితో సహా వచ్చి నిన్ను నీ పరివారమును సర్వనాశనం చేయుదుడు . దండకారణ్యము నుండి నీవు కపటోపాయముతో నన్ను చెట్టితివి . అప్పుడే నీవు రాముని కంట పడివుండిన యెడల నీ ఆయువు అప్పుడే తీరిపోయివుండేది . రాముడు తప్పక ఇచటకు వచ్చి నన్ను తీసుకువెళ్తాడు . 
నేను జనకుని పుత్రికను ,దశరధుని కోడలిని ,శ్రీరాముని ఇల్లాలును . ఎట్టిపరిస్థితిలలో నేను ధర్మము తప్పి వర్తించను . కలలో కూడా నా భర్తను తప్ప అన్య పురుషులను తలవను . ఇది సత్యము "అని పలికెను . 
సీత మాటలకు క్రోధోదిక్తుడైన రావణుడు "సీతా !నీకు పండ్రెండు నెలల సమయము ఇచ్చుచున్నాను . ఈ లోపు నా దారికిరా . లేనియెడ నిన్ను మా వంటవాళ్లు ముక్కలుముక్కలుగా కోసి కూరగా చేసెదరు . "అని పలికి అక్కడ వున్న రాక్షస స్త్రీలతో ఈమెను అశోకవనంలో రహస్య ప్రదేశములో ఉంచి జాగరూపులై కాపాడుడు . నయానో భయానో నా దారికి తీసుకు రండు "అని పలికి 
భూమిని బద్దలు చేయుచున్నాడా అన్నట్లుగా పెద్దగా పెద్దగా చప్పుడు చేయుచు నడిచి వెళ్లిపోయెను . అంతట ఆ రాక్షస స్త్రీలందరూ అశోకవనమునకు సీతాదేవిని తీసుకెళ్లి అచట తమ మాటల్తో భయపెడుతూ ఉండెను . సీతాదేవి ఆ రాక్షస స్త్రీల మధ్యలో భయముతో బతుకుతూ శ్రీరామునే మనసులో తలుచుకుంటూ కాలము వెళ్లదీయసాగెను . 

రామాయణము అరణ్యకాండ ఏబది ఆరవసర్గ సమాప్తము . 

                                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment