Friday 14 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదినాల్గవసర్గ

                                         రామాయణము 

                                              అరణ్యకాండ -ఏబదినాల్గవసర్గ 

రావణుని చేతిలో అపహరణకు గురియైన సీతాదేవికి ఆమెను ఆదుకొనువారు ఎవ్వరును కానరారైరి . ఇంతలో ఒక పర్వత శిఖరంపై ఐదుగురు వానర ప్రముఖులను సీతాదేవి చూసేను . బంగారుకాంతులీను తన ఉత్తరీయపు కొంగున తన జారిపోగా మిగిలిన కొన్ని ఆభరణములను కట్టి వారిమధ్య పడునట్లుగా వదిలెను . శ్రీరాముడు అటుగా వచ్చిన యెడల ఆ నగలను చూసి  గుర్తు పట్టి ఆ దారిగా వస్తాడని ఆశతో సీతాదేవి ఆలా చేసెను . 
రావణుడు లంకకు వెళ్లు తొందరలో అది గమనించలేదు . దూరముగా వున్న వస్తువులను కానీ ,వ్యక్తులను కానీ స్పష్టముగా చూడగల ఆ వానర ప్రముఖులు ఆ సీతాదేవిని కన్నార్పకుండా దేవతలా వలె చూసిరి . రావణుడు అరణ్యములు దాటి ,కొండలు ,కోనలు దాటి సముద్రమును దాటి లంకా నగరంలోని వీధులను ,వాడలను దాటి తన అంతః పురములోకి ప్రవేశించి సీతను అచట ఉంచి "ఈమెను జాగ్రత్తగా చూడుడు . ఈమెకు అవసరమగు సమస్త వస్తువులను అందించండి . పట్టు వస్త్రములు వజ్రవైఢూర్య ఆభరణములు సమృద్ధిగా ఇవ్వుడు .జాగరూపులై ఈమెను రక్షించుడు . పురుషులు కానీ స్త్రీలు కానీ ఈమెను కలువుటకు వీల్లేదు  "అని రాక్షస స్త్రీలను ఆదేశించెను . 
ఆ విధముగా రాక్షస స్త్రీలను ఆదేశించి ఆ అంతః పురము నుండి వెలుపలికి వచ్చి ఇప్పుడు చేయవలినదేమి ?అని ఆలోచించుచుండగా  మాంసభక్షకులు ,మహావీరులు ఐన 8 మంది రాక్షసయోధులు రావణుడి వద్దకు వచ్చి నమస్కరించిరి . రావణుడు ఆ రాక్షసయోధులను పొగుడుతూ "ఓ రాక్షసయోధులారా !మీరు పరాక్రమవంతులు . పూర్వము దండకారణ్యములో ఖరుడు మొదలయిన మహాసైన్యము ఆ అరణ్య రక్షణార్ధము అచట ఉంచితిని . కానీ రాముడు వారినందరిని చంపివేసెను . ఇప్పుడది నా అధికారము న లేదు . కావున మీరందరూ వెంటనే సాయుధులై వెళ్లి అచట వుండండి . అచట మన అధికారమును ప్రదర్శించండి . 
ముఖ్యముగా ఆ రాముడి మీద కన్నేసి ఉంచండి . అతడిని వధించండి . అతడి సమాచారమును నాకు ఎప్పటికప్పు డు సమాచారం అందించండి . మీరు ఇదివరలో పెక్కు యుద్ధములలో మీ ప్రతిభ చూపించి ఉండుటచే ఏ పని మీకు అప్పగించితిని . "అని పలికెను . ఆ రాక్షస యోధులు రావణుడికి నమస్కరించి తమకు అప్పగించిన ఘన కార్యము సాధించుటకై లంకను వీడి వెళ్లెను . పిదప రావణుడు సీతను తీసుకొచ్చినందులకు మిక్కిలి సంతుష్టుడై ఉండెను . 

 రామాయణము అరణ్యకాండ ఏబదినాల్గవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment