Wednesday 12 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదిమూడవసర్గ

                                       రామాయణము 

                                       అరణ్యకాండ -ఏబదిమూడవసర్గ 

ఆ విధముగా రావణుడు బలవంతముగా ఎత్తుకుపోవుటచే సీతాదేవి ఎక్కి ఎక్కి ఏడ్చుటచే ఆమె కనులు మిక్కిలి ఎరుపెక్కేను . భయముతో కంపిస్తూ ఆ రావణుడితో "ఓ నీచరావణా !రామలక్ష్మణులు లేని సమయము చూసుకుని ,ఒక దొంగవలె నన్ను తీసుకుని పారిపోవుచుంటివి . ఇట్టి పని చేయుటకు నీకు సిగ్గులేదా ?దుర్మార్గుడా !నన్ను అపహరించదలిచి ,నా భర్తకు బయపడి నీవు మాయామృగ రూపముతో ఆయనను నాకు దూరము చేసితివి అనుట నిశ్చయము . మా మామగారి ప్రియమిత్రుడైన జటాయువు నన్ను కాపాడుటకు పూనుకొనగా అతనిని నీవు వధించితివి . అట్లు ఒక ముసలి పక్షిని చంపిన నీవేమి శూరుడవు . 
ఓ రాక్షసాధమా !యుద్ధరంగమున నీ పేరు చెప్పుకుని ,రఘువీరులతో పోరి నన్ను ఇటు తీసుకురాలేదుకదా !దీనినిబట్టీ నీ పరాక్రమము యొక్క గొప్పతనము కనపడుచున్నది . ఓ నీచుడా ! శ్రీరామునకు బయపడి పారిపోవుచున్నావు . క్షణకాలం ఆగుము . నీవు ప్రాణములతో ఇంటికి చేరవు . రామలక్ష్మణుల కంట బడినచో నీవు నీ సైన్యమూ ఒక్క క్షణకాలం కూడా బతికి ఉండుట దుర్లభము . ఆనాడు తమ్ముడు తోడులేకుండానే దండకారణ్యమున ఖరుడు మొదలగు పదునాలుగువేల రాక్షసయోధులను శ్రీరాముడు క్షణకాలంలో మట్టికరిపించెను . 
వివిధములగు అస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవాడు ,వీరుడు ,బలశాలి అయిన  శ్రీరాముడు తన ప్రియభార్యను అపహరించిన నిన్ను తన తీక్షణమైన శరములచే చంపకుండా ఎట్లుండగలడు ?మిక్కిలి బయశోకములకు లోనైన సీతాదేవి విలపించుచు దైన్యముతో ,జాలిగొలుపునట్లు బహువిధములుగా వచించెను . అయినను ఆమె మాటలను లెక్కచేయక భయకంపితయై దయనీయముగా మెలికలు తిరుగుచున్న ఆ రాజకుమారిని తీసుకుని పోవుచునేవుండెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదిమూడవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment