Wednesday 10 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదిరెండవసర్గ

                                 రామాయణము 

                                యుద్ధకాండ -ఇరువదిరెండవసర్గ 

పిమ్మట రఘువరుడు సముద్రునితో "ఓ మహా సముద్రుడా !నేడే పాతాళ లోకము వరకు వ్యాపించి ఉన్న నిన్ను శుష్కింప చేసెదను . నీవు ఇంకి పోయిన తర్వాత వానరులంతా నడుచుకుంటూ ,లంకకు చేరుకుంటారు . సాగరుడా ! దానవులకు ఆశ్రయమిచ్చుట వలన వారి గుణములు నీకు కూడా అబ్బినట్టున్నవి . "అని పలికి ,బాణమును ఎక్కుపెట్టి బ్రహ్మాస్త్ర మంత్రము చదివేను . అప్పుడు లోకములన్నీ అల్లకల్లోలములు అయినవి . పర్వతము కదిలినవి . దిక్కులన్నిటా చీకట్లు వ్యాపించినవి . నక్షత్రములతో సహా సూర్యచంద్రులు వక్ర గతిన తిరుగసాగిరి . ఆకాశమున సుడిగాలులు తిరిగినవి . 
అప్పుడు సముద్రుడు భయముతో పారిపోవుచుండెను . పారిపోవు వాడి మీదకు బాణము ప్రయోగించరాదని భావించిన శ్రీరాముడు బాణము వేయక ఆగెను . అది గమనించిన సముద్రుడు దివ్య రూపములో వచ్చి శ్రీరాముని దయతలచమని నీటిని మరల్చి దారి ఇవ్వలేనని ప్రార్ధించెను . అప్పుడు శ్రీరాముడు "ఎక్కుపెట్టిన బాణము వృధాగా పోరాదు ఎక్కడ ప్రయోగించను ?"అని అడుగగా సముద్రుడు దొంగలు దోపిడీ దారులు వుండే ద్రుమకుల్యము అనే ప్రదేశము చూపెను . వెనువెంటనే శ్రీరాముడు బాణమును ప్రయోగించెను . అది పెద్దపెద్ద మంటలతో దగ్దమయ్యెను . 
అది చూసిన సముద్రుడు తనలో ఏది వేసినా తేలుస్తాననీ ,అలా సేతువు నిరమించుకోమని ,వానరులలో నీలుడు విశ్వకర్మ కుమారుడు ,అతడు చక్కగా సేతువు నిర్మించుటలో నిపుణుడు . అతడి సహాయముతో సేతువు నిర్మించుకుని లంకా నగరమునకు చేరమని ఎంతో మర్యాదగా పలికి ,అంతర్ధానమయ్యెను . అప్పుడు నీలుడి పర్యవేక్షణలో ,వానరులు పెకలించి  తెచ్చిన వృక్షములు ,కొమ్మలు బండరాళ్ల తో సేతువు నిర్మాణము చక్కగా పూర్తి అయినది . ఆ సేతువు మీదగా సకల సేనా లంకా నగరము వైపుగా సాగిపోవుచున్నది . అందులో కొందరు వానరులు సేతువుపై నడుస్తూ వెళ్తున్నారు . ఇంకొందరు గాలిలో ఎగురుతూ ,మరికొందరు గంతులేస్తూ ,మిగిలిన వాళ్ళు సముద్రపు నీళ్లలో ఈదుతూ సముద్రమును దాటిరి .యావత్ సైన్యముతో శ్రీరాముడు ,లక్ష్మణుడు ,సుగ్రీవుడు సముద్రము ఆవలి తీరమునకు చేరిరి . 

రామాయణము యుద్ధకాండ ఇరువదిరెండవసర్గ . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




1 comment: