Friday 16 December 2016

                                          రామాయణము 

                                  అయోధ్యకాండ -నలుబది ఆరవసర్గ 

తమసా నదీ తీరమునకు చేరిన పిదప సుమంత్రుడు సీతా రామలక్ష్మణులకు ఆకులతో శయ్యను  చేసెను . వారి వెంట పరిగిడి వచ్చిన జనులు సైతం ఆగి ఆదమరిచి అక్కడే ఆకులు ,అలములు శయ్యలుగా చేసుకుని నిద్రించసాగిరి . సీతారాములు సైతము ప్రయాణ బడలిక చేత ఆదమరచి నిదురించసాగిరి . 
లక్ష్మణుడు మాత్రము నిదురించక సుమంత్రుడితో రాముడి గుణగణముల గురించి వివరించసాగెను . ఆ రాత్రంతా వారిరువురు రామకథాగానముతో నిదురించకనే కాలక్షేపము చేసెను . తెల్లవారెను సీతారాములు నిద్రలేచెను . కానీ జనులు మాత్రము బడలికచే ఇంకా నిదురించసాగెను . 
అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు ,సుమంత్రుడితో" జనులు నా మీద ప్రేమాభిమానములతో చెట్లు ,పుట్లలో నానా భాదలు అనుభవించుచున్నారు . కనుక వీరు నిద్ర లేవకుండానే మనము ఇక్కడ నుండి వెళ్లిపోదాము . అప్పుడు వారికి మనము ఎటు వెళ్ళామో తెలియక అప్పుడైనా ఇంటికి వెళ్తారు . వారికి ఈ బాధలన్నీ తప్పుతాయి . అరణ్యవాసము నాకు మాత్రమే కానీ వీరందరికి కాదు . వీరు నా మీద వళ్ళ మాలిన ప్రేమతో ఇల్లు వాకిళ్లు ,భార్యా పిల్లలను సైతము వదిలి ఇబ్బందులు పడుచున్నారు . కావున మనము త్వరగా బయలుదేరి వెళ్ళెదము ."
అని పలికెను . సుమంత్రుడు రధమును సిద్దము చేసెను . సీతారామలక్ష్మణులు ఆ రధమును ఎక్కి ,సరయు నదిని దాటి అరణ్యప్రాంతములో ప్రవేశించిరి . 

రామాయణము అయోధ్యకాండ నలుబది ఆరవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  

No comments:

Post a Comment