Thursday 22 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబదిరెండవసర్గ

                                      రామాయణము 

                                       అయోధ్యకాండ -ఏబదిరెండవసర్గ 

ప్రాతః కాలమున సీతారాములు నిద్రలేచేను . రాముడు లక్ష్మణుని పిలిచి గంగా నది దాటుటకు ఏర్పాట్లు చేయమని చెప్పెను . లక్ష్మణుడు చేప్పడముతో ఆ ఏర్పాట్లు అన్నీ గుహుడు చేసెను . శ్రీ రాముడు సుమంత్రుని ఇక అయోధ్యకు వెళ్ళమని చెప్పెను . ఆ మాటలు విన్న సుమంత్రుడు కన్నీరుమున్నీరయ్యేను . శ్రీ రామునీతో సుమంత్రుడు 
"స్వామీ !నేనును మీ వెంట అరణ్యములకు వచ్చెదను . మీకు ముందుగా రధము నడుపుతూ మీకు క్రూరజంతువుల నుండి హాని కలుగకుండా రక్షణ చేసెదను . దయచేసి కాదనకుము . మీరు లేను అయోధ్యలో బతుకలేను . జనులు అడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పలేను . వారి బాధ చూడలేను . ఆ దుష్ట కైకేయి ముందు చేతులు కట్టుకుని ఆమె ఆజ్ఞలను నిర్వర్తించలేను . కావున నేను కూడా మీతో ఉండి వనవాస సమయములో అత్యంత జాగరూకుడనై మిమ్ము రక్షించుకుని సమయము అయిన పిమ్మట అయోధ్యకు చేరెదను "అని పలికెను . 
అపుడు రాముడు "సుమంత్రా !అయోధ్య మంత్రులందరిలో నీవు ఉత్తముడవు . సుమంత్రా !నిన్ను అయోధ్య కు పంపుటకు కల ముఖ్య కారణము . నీవు కాలి రధముతో అయోధ్య కు వెళ్తేనే కైకేయి నేను అరణ్యాలకు వెళ్లానని పూర్తిగా నమ్ముతుంది . దశరథ మహారాజు నేను దగ్గర లేకపోవడంతో ఆయన దుఃఖభారములో మునిగిపోయి వుండివుంటారు . నీవు అక్కడి పరిస్తుతులు అన్నీ క్షుణ్ణముగా తెలిసినవాడివి . నీవు ఆయనకు తోడుగా ఉంటే నాకు కొంత ధైర్యముగా ఉంటుంది "అని పలికెను . శ్రీ రాముని మాటలు విన్న సుమంత్రుడు కన్నీరు మున్నీరు అయ్యెను .  . శ్రీరాముడు గుహునితో "మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము జటా ,వల్కల దారినై వనవాసము చేయవలెను . వల్కలములు అయోధ్యనుండి ధరించి వచ్చితిని . ఇప్పుడు జతలు ధరించుటకు మర్రి పాలు తెప్పింపుము "అని కోరగా గుహుడు అట్లే తెప్పించెను . వాటితో రామలక్ష్మణులు జటలు ధరించెను . అప్పుడు వారు చూచుటకు మునుల వలె చూడముచ్చటగా ఉండిరి . 
 గుహుడు నావను సిద్దము చేయగా సీతారామలక్ష్మణులు అందు ఎక్కెను . శ్రీరాముడు గుహునికి ,సుమంత్రునికి వెళ్ళుటకు అనుజ్ఞను ఇచ్చి నావలో ముందుకు సాగిపోయెను . సీతాదేవి గంగా మాటకు నమస్కరాము చేసి ప్రార్ధించెను . సీతారామలక్ష్మణులు గంగను దాటి అరణ్యము లో ప్రవేశించి నడువనారంభించిరి . వారు కనుమరుగయ్యేవరకు గుహుడు ,సుమంత్రుడు అలాగే నిలబడి చూస్తూ వారు సాంతం కనుమరుగయ్యాక భారంతో నిండిన గుండెలతో వెనుతిరిగెను . అరణ్యములో ముందు లక్ష్మణుడు మధ్యలో సీత వెనుక రాముడు నడుస్తూ ముందుకు సాగిరి . రామలక్ష్మణులు వనములలో నివసించు మునుల రక్షణార్ధము క్రూరమృగములను వేటాడెను . సాయంసమయములో కందమూలాదులను భుజించుటకు తెచ్చుకుని ,ఓ చెట్టు నీడకు చేరిరి . 

రామాయణము అయోధ్యకాండ ఏబదిరెండవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



 

No comments:

Post a Comment