Saturday 17 December 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదియేడవసర్గ

                                       రామాయణము 

                                        అయోధ్యకాండ -నలుబదియేడవసర్గ 

సూర్యోదయమయిన పిమ్మట జనులందరూ మేల్కొనిరి . అచట శ్రీరాముడు కనపడకపోవుటచే వారు శోకముతో నిశ్చేష్టులయ్యి  పోయిరి . వారు దుఃఖ భారంతో కన్నీరు కార్చుతూ శ్రీ రామునికై వెతికిరి . శ్రీరాముడు కనపడక పోవుటచే వారు మిగుల దుఃఖితులయ్యిరి .  ఆ పౌరులు దీనావదనాలతో తమను తాము వొళ్ళు తెలియకుండా నిద్రపోయినందుకు తిట్టుకొనెను . తిరిగి వారిలో వారు 
"శ్రీ రాముడు లేని ఈ బతుకులు ఎందుకు మనము కూడా ఇక్కడే ప్రాయోపవేశము చేసి ప్రాణములు వీడెదము . రాముడు  ఎక్కడ అని మనము తిరిగి వెళ్లిన తర్వాత అయోధ్యలోని వారు అడిగితే శ్రీరాముని వదిలి నిద్రపోయాము అని ఏ ముఖము పెట్టుకుని చెప్పాలి . అసలు వారికి మన ముఖము ఎలా చూపగలము ?అని పలురీతులుగా వాపోవుతూ లేగదూడలకు దూరమైనా పాడి ఆవులవలె విలపించెను . 
వారు ఎట్టకేలకు రధ చక్రముల జాడను కనిపెట్టి కొంత దూరము ముందుకు సాగిరి . పిమ్మట రథచక్రముల గుర్తులు కానరాకపోవుటచే అంతులేని విషాదంలో మునిగిపోయి "ఇదియేమి? ఇప్పుడు ఏమి చేయవలెను ?"అంటూ మిక్కిలి దుఃఖితులై చేసేది లేక తిరుగు ముఖము పట్టి అయోధ్యకు చేరిరి . వెళ్లిన వారితో శ్రీరాముడు తిరిగి రాకపోవుట చూసిన అయోధ్య ప్రజలందరూ కన్నులు వాచిపోవునట్లు కన్నీరు మున్నీరుగా విలపించిరి . 
ఆ సమయమున ఆనగరము చంద్రుడు లేని ఆకాశము  వలె ,నీరు లేని సముద్రము వలె చూసే వారికి కనిపించెను . అయోధ్యలోని జనులు ,పశుపక్షాదులు సైతము దుఃఖముతో నిండిన హృదయములలో భారముగా ఉండిరి . 

రామాయణము అయోధ్యకాండ నలుబదియేడవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment