Tuesday 27 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబదిఆరవసర్గ

                                          రామాయణము 

                                 అయోధ్యకాండ -ఏబదిఆరవసర్గ 

చక్కగా విశ్రమించిన తర్వాత సీతారాములు నిద్రలేచిరి . రాముడు లక్ష్మణుని నిద్రలేపేను . వారు మువ్వురు నిద్ర బడలిక తీర్చుకుని తిరిగి చిత్రకూట పర్వతము వైపు తమ ప్రయాణమును కొనసాగించిరి . ఆ దారి అత్యంత రామణీయముగా ఉండెను . మోదుగ చెట్లు విరబూసి తమ పూలను తామే మాలలుగా ధరించినట్లుగా వున్నవి చెట్లు కోసేవారు లేక పండ్లతో నిండి ఉండెను . ప్రతి చెట్టుకు తేనెతుట్టలు కలవు . 
సీతారామలక్ష్మణులు ఆవిధముగా ప్రకృతి దృశ్యములకు ముగ్దులవుతూ చిత్రకూటపర్వతము వద్దకు చేరుకొనిరి . ఆ పర్వత శోభను చూసి రాముడు పరమానందభరితుడయ్యాడు . అక్కడనే కల వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు వెళ్లి ఆయనకు ప్రణామము చేసి తమను తాము పరిచయము చేసుకొనిరి . వాల్మీకి మహర్షి వారిని సాదరముగా ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసెను . అక్కడ ఇంకను అనేకమంది మునుల ఆశ్రమములు కలవు . వాటికి దగ్గరలోనే ఎట్టయిన చిత్రకూటము మీద ఒక పర్ణశాలను నిర్మించమని రాముడు లక్ష్మణుని ఆదేశించెను . 
అన్నగారి ఆజ్ఞను అనుసరించి ఎండకు ,వానకు తట్టుకుని దృఢముగా నిలబడేలా ఒక దృఢమైన ,సుందరమైన పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించెను . దానిని చూసిన రాముడు లక్ష్మణుని మెచ్చుకొనెను . రాముడు గృహాప్రేవేశమునకు విధ్యుక్తముగా చేయవలసిన హోమాది కార్యక్రమములను కావలిసిన వస్తువులను చెప్పి వాటిని తీసుకురమ్మని లక్ష్మణుని ఆదేశించెను . లక్ష్మణుడు అన్నగారు చెప్పిన వస్తువులను ఎంతో శ్రద్దా భక్తులతో సమకూర్చెను . అప్పుడు సీతారాములు విధ్యుక్తముగా చేయవలసిన హోమాది సకల కార్యక్రమములను త్రికరణ శుద్ధిగా ఆచరించి ఆ పర్ణశాలనందు ప్రవేశించిరి . 
ఎత్తయిన చెట్లతో ,ఏనుగుల గుంపులతో వివిధ రకాల పక్షులు ,మృగములు గుంపులు గుంపులుగా తిరుగుతున్న ,మందాకినీ నాదీ తీరమున కిలకిల పక్షులరావాలతో  పరమ రామణీయముగా ఉన్న ఆ చిత్రకూట పర్వతము మీద ఆ సీతారాములు హాయిగా విహరించుచు ఉండిరి . 

 రామాయణము అయోధ్యకాండ ఏబదిఆరవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగుపండితులు . 



No comments:

Post a Comment