Friday 23 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబది మూడవసర్గ

                                      రామాయణము 

                                  అయోధ్యకాండ -ఏబది మూడవసర్గ 

 శ్రీ రాముడు ఆ విధముగా కంద మూలాదులను భుజించి ,లక్ష్మణుడితో "లక్ష్మణా !మనము శయనించుటకు కావలిసిన శయ్యను ఇన్నాళ్లు సుమంత్రుడు సిద్దము చేసెను . ఇక నుండి మనమే మనకు కావసిన శయ్య మొదలగు వసతులను ఏర్పాటుచేసుకొనవలెను . అంతే కాక మన రక్షణ భాద్యత కూడా మనమే జాగరూపులమై వహించవలెను . ముఖ్యముగా సుకుమారి అయినసీతాదేవిని అప్రమత్తముగా కాపాడుకోవలెను . ప్రస్తుతము గడ్డి మొదలయినవాటితో శయ్యను ఏర్పాటు చేసుకొనెదము "అని పలికెను . 
తిరిగి అయోధ్యలోని పరిస్థితులను ,తాళులను ,దశరథ మహారాజును తలుచుకుని మిక్కిలి వ్యాకులచిత్తుడై ఇలా పలికెను . "లక్ష్మణా !మన తండ్రి దశరధుడు శయ్యపై ఎంతో బాధపడుతూ ఉండి వుంటారు . ఆ కైకేయి భరతుడి కోసం రాజుగారిని బతకనివ్వదేమో ?తలుచుకుంటేనే నాకు మనసు నిలవడంలేదు . మా మాత కౌశల్య ఎంతో  స్వభావురాలు . ఆమెను కావాలని ఆ కైక అందరి ముందు అవమానిస్తూ వుంది ఉండచ్చు . ఆ అవమానము లన్నీ భరిస్తూ ఆవిడ ఎలా బతకగలదో నాకు అర్ధము కావడంలేదు . ఇక సుమిత్రామాత కూడా మాతల్లి వలె నెమ్మదస్తురాలు . ఆమె ,నీవు నాకు మాతల్లికి సహాయముగా ఉన్న కారణముగా ఆమెను కూడా తన అధికారంతో ,సూటిపోటి మాటలతో గర్విష్టి అయినా కైక భాదిస్తూ ఉన్నదేమో ?
ఈ ఆలోచనలు నా మనసులో తిరుగుతుండగా నేను ఇక్కడ నిలవలేకపోతున్నా . లక్ష్మణా!ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే నీవు వెనువెంటనే బయలుదేరి అయోధ్యకు వెళ్లి ఆ వృద్ధులైన మన తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకొనుట మంచిదని నాకు అనిపిస్తోంది . కావున నీవు కష్ణమైనా ఆలోచించక బయలుదేరుము  . "అని పలికెను . అప్పుడు లక్ష్మణుడు "అన్నా !దశరథ మహారాజును జాగ్రత్తగా చూసుకొనుటకు ఆయన భార్యలు అయిన మన తల్లులు అప్రమత్తముగా వుంటారు . మన తల్లులను ఊరడించుటకు అంతః పురములో పెక్కు మంది మంచి మనసు కలవారు కలరు . కావున వారి గురించి వ్యాకుల పడవలసిన అవసరము లేదు . మిమ్ములను సీతామాతను ఒంటరిగా వదిలి అయోధ్యకు వెళ్ళలేను . కావున నాకు మీతో ఉండుటకు అనుమతిని ఇవ్వుము . "అని పలికెను . 
లక్ష్మణుడి మాటలకు ఊరడిల్లిన శ్రీరాముడు లక్ష్మణుడు తనతో అరణ్యవాసము చేయుటకు అనుమతిచ్చేను . రఘు వంశ వర్ధనులు ,మహా బలశాలురు అయిన రామలక్ష్మణులు ఆ నిర్జన ప్రదేశములో ఎత్తిభయము లేక పర్వత సానువులందు స్వేచ్ఛగా తిరిగాడు సింహములవలె సంచరించుచుండిరి . పిదప లక్ష్మణుడు ఏర్పరిచిన తృణ శయ్యపై సీతారాములు పరుండిరి . 

రామాయణము అయోధ్యకాండ ఏబదిమూడవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment