Sunday 29 May 2016

రామాయణం ప్రధమోధ్యాయః

                  రామాయణం 

                     వాల్మీకి విరచిత శ్రీ మధ్రామాయణం 

                            ప్రధమోధ్యాయః 

శ్రీ రామః శరణం సమస్త జగతాం రామం వినా కా గతీ 
రామేణ ,ప్రతి హాన్యతే కలిమలం రామాయ కార్యం నమః !
రామాత్ త్రస్యతి కాలభీమభుజగో రామస్య స్వరం వశే 
రామే భక్తిర ఖండితా భవతు మే రామ !త్వమేవాశ్రయః !

ఈ సమస్త జగత్తుకి శ్రీ రాముడే శరణ్యుడు . ఇహ పర లాభములకి మనకు రాముడే గతి . శ్రీ రాముని స్మరణ వల్లననే కలిదోషములన్నియు నశించును . సమస్త కార్యములును సిద్దించుటకై ఆయనకు నమస్కరింతును . భయంకరమైన కాల సర్పము శ్రీ రాముని కి భీతిల్లును . సమస్త జగత్తు శ్రీ రాముడి ఆధీనములోనే ఉండును . శ్రీ రాముని అందే నా అచంచలమైన భక్తి కుదురుకుని వుండు గాక . ఓ రామా నీవే నాకు దిక్కు . 


శ్రీ రామచంద్రుడు చిత్రకూట నివాసి ,సీతాదేవి యొక్క ఆనందమునకు నెలవైన వాడు . భక్తులకు అభయమిచ్చువాడు . పరమానంద స్వరూపుడు . అట్టి ప్రభువుకు ప్రణమిల్లెదను . 

లోక సాధకులైన బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు  శ్రీ రాముని యొక్క అంశలే . పరమ పవిత్రుడు ,సచ్చిదానంద స్వరూపుడు . ఆది దేవుడైన శ్రీ రాముని నేను సర్వదా భజింతును . 

ఋషులు సూతునితో యిట్లనిరి 

ఓ పూజ్యుడా !నీవు గొప్ప విద్వాంసుడివి . మేము అడిగిన విషయములు అన్నిటిని చక్కగా విశదపరిచితివి . సంసార బంధములలో చిక్కుకున్న వారికి దుఖములు అనంతములు . ఈ సంసార బంధముల నుండి విముక్తి కలిగించువారెవరు ?వైదిక ధర్మములు అన్నియు కలియుగమున అనాదరణకు గురి అగునని నీవే చెప్పి ఉంటివి . అధర్మ మార్గములను అనుసరించేది వారికి సంభవించు తీవ్ర వేదనల గూర్చి నీవు తేట తెల్లము గావించితివి . "ఘోరమైన కలియుగము ప్రారంభమైనంతనే వైదిక ధర్మములు లుప్తమగును ,నాసికత్వం పెచ్చు పెరుగును . "అని పెద్దలందరు పేర్కొని యుండిరి . కలియుగమునందు జనులు కామాతురులు ,పొట్టివారు ,లోభులు అయివుందురు . వారు ధర్మమును ,అట్లే భగవంతుని కూడా ఆశ్రయింపక ,తమలో తాము ఒకరిపై ఒకరు ఆధారపడి వుందురు . కలియుగమున అందరు అల్పాయుష్కులు ,అధిక సంతానం కలవారు అగుదురు . స్త్రీలు తమ సౌందర్య పోశానలకే ప్రాధాన్యమిత్తురు . వారు స్వార్జితము మీద ఆధారపడి జీవించుటకు ప్రాకులాడుచుందురు . లావణ్యమును సాధనముగా చేసుకుని వేశ్యా వృత్తిని అవలంభించుటకు సిద్ధపడుచున్డురు . 
కలియుగమున వనితలు తరచుగా వ్యర్ధ సంభాషణము చేయుచు వుందురు . భిక్షాటులైన సన్యాసులు కుడా బంధు మిత్రుల సంబంధములలో చిక్కుకొని యుందురు . ఓ బ్రహ్మ జ్ఞాని ఘోరమైన ఈ కలియుగమున పాపాత్ములకు మనస్సుద్ది లేని వారికి నిష్కృతి ఎట్లు లభించును . ఓ దయానిదీ సర్వజ్ఞా !సూతా !దేవేశ్వరుడు ,దేవదేవుడు జగన్నాధుడు ఐన శ్రీరాముని సంతృప్తి పరచు ఉపాయము తెలుపుము . 

ఓ మహానుభావా !ఓ సూతా !ఈ విషయములు అన్నిటిని తేట తెల్లము గావింపుము . నీ వచనామృతము ఎవరికి తృప్తి గూర్చదు . 

సూతుడు ఇట్లనెను 

ఓ రుషీశ్వరులారా మీరు కోరిన విషయములన్నిటిని పూర్వము నారద మహర్షి సనత్కుమారునికి తెలిపి ఉండెను . ఇప్పుడు నేను మీకు తెలిపెదను సావధానముగా వినండి . శ్రీ మద్ రామాయణము ఒక మాహా కావ్యము . అది సర్వ వేదముల సారము మహా పాపములను సైతము అది రూపు మాపును . దుష్ట గ్రహ బాధలను తొలగించును . 
రామచంద్రుని గుణగణములను వర్ణించునట్టి ఈ కావ్యము దుస్స్వప్నములను తొలగించును . దుఖములను తొలగించును . ఇది ఐహిక భోగాబాగ్యములనే కాక మోక్ష ఫలములను గూడా ప్రాప్తింప చేయును . సకల శుభములను కలిగిమ్పచేయును . ఇది ప్రశంసా వహమైనది . ఓ మునులారా ఇది ధర్మార్ధ కామ మోక్షములనెడి చతుర్విధ పురుషార్ధ మహా ఫలములను ప్రసాదించునట్టి పెన్నిది . సాటిలేని ఈ కావ్యము ఫుణ్య ఫలమును ఒసంగును . మీరు ఈ విషయములను ఏకాగ్ర చిత్తులై వినుడు . గోహత్యాది మహా పాపములను చేసినవారు గాని అట్టి పాపాత్ములతో సాంగత్యము చేసిన వారు కాని ఋషి ప్రోక్తమైన ఈ కావ్యమును వినినచొ పవిత్రులగుదురు . 
 రామాయణ విషయమున భక్తి శ్రద్దలు గలవారు సమస్తములైన సాస్త్రార్ధాముల అందు ఆరితేరుదురు . వారి వలన లోకమునకు మేలు కలుగుచుండును . ఈ విధముగా వారు క్రుతార్దులగుదురు . 





                                శశి ,

    ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 



















No comments:

Post a Comment