Monday 30 May 2016

రామాయణము ద్వితియోధ్యాయః

                   రామాయణము 

                               ద్వితియోధ్యాయః 

                     ఋషులు వచించిరి 

పూజ్యుడైన ఓ మహాముని మహాత్ముడైన నారద మహర్షి రామాయణము అందలి సమస్తమైన ధర్మములను సనత్కుమారునకు ఎట్లు వివరించెను . ఆ ఇద్దరు బ్రహ్మవాదులు ఎ క్షేత్రమున ఎట్లు కలుసుకొనిరి . నారద మహర్షి ఆయనకు తెలిపిన విశేషములు ఏమిటి వాటిని అన్నింటిని మాకు వివరింపుము . 

                      సూత మహర్షి పలికెను 

మహాత్ములైన సనకాదులు సృష్టి కర్త ఐన బ్రహ్మ దేవునకు మానస పుత్రులు వారు అహంకార మమకారములు ఎమాత్రమును లేని వారు . వారు జితేనద్రియులు . సనక సనందన ,సనత్కుమార సనాతనులు అనునవి వారి పేర్లు ఆ మహాత్ములు విష్ణు భక్తులు సర్వదా బ్రహ్మ ద్యానము నందే నిమగ్నులై ఉండెడివారు . వారు సత్య వచనులు ,మోక్ష కాంక్ష కలవారు . సహస్ర సూర్య కాంతులతో వెలుగొన్దుచున్దురు . 
మహా తేజో మూర్తులు బ్రహ్మదేవుని కుమారులైన సనకాదులు ఒకానొకప్పుడు బ్రహ్మదేవుని సభను వీక్షించుటకై మేరు శృంగమునకు వెళ్ళిరి . అచట వారు విష్ణు పాదము నుండి జన్మించిన పవిత్ర గంగా నదిని చూచిరి . పిదప తేజో నిదులైన ఆ మునులు" సీత "అను గల ఆ నదిలో స్నానము చేయుటకు సిద్దపడిరి . 
ఓ విప్రోత్తములారా !ఇంతలో దేవర్షి ఐన నారద మహా ముని శ్రీ మహా విష్ణువు యొక్క నారాయణాది నామములను కీర్తించుచు అచటికి చేరెను . 
నారాయణా !అచ్యుతా !అనంతా !వాసు దేవా ! జనార్ధనా ! యజ్ఞేశ !యజ్ఞ పురుష !రామా !విష్ణు ! నీకు నమస్కారములు . అని హరి నామములను వుచ్చరించుచు సమస్త జగత్తును పావనమొనర్చుచు ఆ ముని లోక పావని ఐన గంగా నదిని స్తుతించుచు అచ్చటికి విచ్చేసెను . 
ఆ విధముగా అచటికి విచ్చేసిన ఆ మునిని చూచి తేజో ముర్తులైన ఆ సనకాదులు యధోచితముగా ఆయనను సత్కరించిరి . అంతట నారదుడు వారికి అభివందనము వొనర్చెను . 
వారు బ్రహ్మ సభలో సుఖాసీనులైన పిమ్మట నారాయణ నామ స్మరణము అందే నిమగ్నుడై వున్న నారద మహా మునిని చూచి సనత్కుమారుడు ఇట్లు నుడివెను . 

          సనత్కుమారుడు వచించెను 

సర్వజ్ఞుడవు ఐన ఓ నారద మహర్షి నీవు వేద వేదాంగము లను బాగుగా ఎరిగిన వాడవు . ముని లోకమునకే వన్నె తెచ్చేది వాడవు . నీవు హరి భక్తులలో అగ్రేసరుడవు నిన్ను మించిన విష్ణు భక్తుడు మరియోకడు లేడు . ఆ శ్రీ మహా విష్ణువు నుండియే ఈ సమస్త చరాచర జగత్తు వెలువడినది . ఆయన పాదము నుండియే ఈ గంగా నది ఆవిర్భవించింది . అట్టి హరిని  గూర్చిన జ్ఞానము ఎట్లు కలుగును . మాపై దయ వుంచి ఈ విషయములని అన్నింటిని సమగ్రముగా వివరింపుము . 

నారదుడు పలికెను 

ఆ శ్రీ మహా విష్ణువు దేవా దేవుడు పరాత్పరుడు ఆయన నివాస స్థానమైన పరందామము సర్వోత్కృష్టమైనది . అతడు సుగుణ స్వరూపుడు ,జ్ఞానము ,అజ్ఞానము,ధర్మమూ ,అధర్మము ,విద్య ,అవిద్య ఇవన్నియు ఆయన స్వరూపములే . సకల జీవులకు ఆయన ఆత్మ స్వరూపుడు . అట్టి మహా విష్ణువుకు అనుక్షణము నమస్కరింతును . 
త్రేతా యుగమున ఈ లోకము నందు రఘు వంశమున అవతరించిన శ్రీ రాముడు మాహా విష్ణువే . అతడు రాక్షసులను సంహరించెను . పాపములను రూపు మాపెను . తన భుజ బలము చేతనే ధర్మమును రక్షించెను . భూ బారమును తొలగించుట ఆయనకు వినోదము . అట్టి ఆ అది దేవునికి నమస్కరించుచున్నాను .  
అతడు ఒక్కడే నాలుగు (రామ ,లక్ష్మణ ,భరత,శతృజ్ఞులు )రూపములలో అవతరించెను . వానరోత్తములతో కూడి రాక్షస సమూహములను హతమార్చెను . దశరద కుమారుడైన అట్టి శ్రీ రాముడికి నమస్కరింతును . 

మహాత్ముడు ఐన శ్రీ రాముని యొక్క చరితములు అనేకములు . ఆయన నామములను లెక్కించుటకు ఎన్ని సంవత్సరముల కాలమైనను  చాలదు ఆయన మహిమను పూర్తిగా ఎరుంగు టకు మనువులకును ,మహర్షులకును అసాధ్యము . ఇక నావంటి అల్పుని విషయము చెప్పనేల ?ఆయన పవిత్ర నామములను విన్ననంతనే మహా పాపాత్ములు  అగుదురు . ఇక అట్టి మహాత్ముని గూర్చి అల్ప బుద్దినైన నేను ఎట్లు వివరింప గలను . 
ఓ బ్రాహ్మనోత్తములారా ఘోరమైన ఈ కలియుగమున రామాయణ పఠణ ,శ్రవణముల అందు నిరతులైన వారు మాత్రమే ధన్యాత్ములగుదురు . వారికి నేను నిత్యము  నమస్కరింతును . భగవన్నామ మహిమను ఎరుంగ గోరువారు చైత్ర ,కార్తీక ,మాఘ మాసములయందు శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు 9 దినములు రామాయణ కదామృతము ఆస్వాదిమ్పవలెను . 

సనత్కుమారుడు పలికెను 

ఓ మునోత్తమా సమస్త ధర్మముల ఫలములను ప్రసాదించునట్టి రామాయణమును ఎవరు రచించిరి ? గౌతముడు సౌదాసుని ఎందులకు శపించెను ?  రామాయణ ప్రభావము చే అతడు మరల ఎట్లు శాప విముక్తుడయ్యేను . ఓ మునీశ్వరా మీకు నాపై దయ ఉన్నచో నన్ను అనుహ్రహించి ఈ విషయములను అన్నింటిని మాకు సమగ్రముగా తెల్పుడు . ఎందుకనగా ఈ రామాయణ కద తెల్పేది వారి యొక్క వినేది వారి యొక్క సమస్త పాపములను రూపుమాపునట్టిది  ఈ గాధ . 

నారదుడు పలికెను 

ఓ విప్రోత్తమా ! శ్రద్దగా వినుము . ఈ రామాయణము వాల్మీకి మహర్షి ముఖము నుండి వెలువడినది . మహిమాన్వితమైన ఈ కదామ్రుతము 9 దినములు ఆస్వాదించుట ఎంతయో శ్రేయస్కరము . 
కృత యుగము నందు ఒక విప్రుడు కలడు  . అతని పేరు సోమదత్తుడు . అతడు ధర్మ కర్మలను అనుచరించుటలో గొప్పవాడు ,ధర్మ నిరతుడు . 
అతడు బ్రహ్మ వాది  ఐన గౌతముని వలన మనోహరమైన గంగా నదీ తీరము నందు సకల ధర్మములను వినెను . . మరియు అతడికి గౌతముడు పురాణములను ,శాస్త్రములను భోదించెను . ఇంకను ఆ సోమదత్తుడు వివిదములగు ధర్మ రహస్యముల గూర్చి ఆ మహర్షి నుండి తెలుసుకొనెను . 
ఒకానొక సమయమున ఆ సోమధత్తుడు పరమేశ్వరుని సేవలో నిమగ్నుడై ఉండెను . ఆ సమయములో అతని గురువైన గౌతముడు అక్కడికి విచ్చేసెను . కాని సోమదత్తుడు(సౌదాసుడు )దైవ సేవలో మునిగి ఉన్నందున లేచి ఆయనకు నమస్కరించలేదు . శాంతస్వరూపుడు బుద్ధిశాలిఐన గౌతముడు సౌదాసుని చూసి "ఇతడు నేను భోధించిన రీతిగా ధర్మ కార్యములనే చేయుచున్నాడు . అని సంతోషించెను . జగద్గురువు మహాదేవుడైన శివుని వుపాసిన్చినట్టి గౌతముడు అచటికి వచ్చినప్పటికిని ఆ సౌదాసుడు లేచి నిలబడి తన గురువును గౌరవిమ్పలేదు . ఇట్లు చేయుట మహాపచారము అని తలంచి సర్వ ధర్మజ్ఞుడు ,సర్వదర్శి దేవదేవుడైన పరమ శివుడు గురువును అవమానించిన  ఇతనికి రాక్షసత్వం ప్రాప్తించును గాక అని శపించెను . అంతట సౌదాసుడు పశ్చాత్తాపముతో అంజలి గటించి న్యాయ కోవిధుదైన గౌతమునితో ఓ పూజ్య మహర్షి గురు దేవా మీ యెడ నేనోనర్చిన మహాపరాధములన్నింటిని క్షమింపుడు . అని వేడుకొనెను . 

శశి ,

                                            ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు 
















x

No comments:

Post a Comment