Wednesday 29 May 2019

రామాయణము సుందరకాండ -అరువదిమూడవసర్గ

                            రామాయణము 

                     సుందరకాండ -అరువదిమూడవసర్గ 

దధిముఖుడు వంటినిండా దెబ్బలతో ,కంగారుగా వచ్చుట చూసిన సుగ్రీవుడు అతడికి ఎదురువెళ్ళి ,"మామ !ఏమి జరిగినది ?ఎందుకు ఇంతగా కంగారు పడుతున్నావు ?నీ వంటిమీద ఈ దెబ్బలన్నీ ఏమిటి ?నీ సంరక్షణలో వున్న మధువనము సురక్షితముగానే వున్నది కదా !"అని ప్రశ్నించెను . 
అప్పుడు దధిముఖుడు "మహారాజా !హనుమ అంగదాది దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరవీరులు ,మధువనములో ప్రవేశించి వనమును నాశనము చేయుచున్నారు . ఫలములు భక్షించుచున్నారు . మధువులను త్రాగుతున్నారు . మిగిలినవి పాఱఁబ్రోయుచున్నారు . నీ తండ్రి సమయములో కానీ ,మీ అన్న వాలి సమయములో కానీ ,ఇంతకాలమూ నీ పాలనలో కానీ ఏ ఒక్క వానరుడు కూడా ఆ వనము వైపు కన్నెత్తి చూచుటకు కూడా సాహసించలేదు . కానీ ఈ రోజు వీళ్ళకి ఇంత ధైర్యము వచ్చుటకు కారణమేమిటో తెలియటం లేదు . పైగా నన్ను ,అక్కడి వనపాలకులను కొట్టారు . వీళ్ళకి ఇంత తెగింపు ఎక్కడినుండి వచ్చినదో తెలియటం లేదు . "అని పలికెను . 
దధిముఖుడి అవతారము సుగ్రీవుడు మాట్లాడుట గమనించిన లక్ష్మణుడు అచటికి వచ్చి ఏమి జరిగినదని ప్రశ్నించెను . అప్పుడు సుగ్రీవుడు "లక్ష్మణా !దక్షిణ దిక్కుగా సీతాదేవి అన్వేషణ కొరకు వెళ్లిన హనుమ అంగదాది వీరులందరు మధువనములో ప్రవేశించి ,అక్కడి వనపాలకులను కొట్టి ,వనమును పాడుచేయుచున్నారట ,వానరులెవ్వరికీ ఆవైపు చూసే ధైర్యము కూడా లేదు . కానీ వీరు ఇలా చేస్తున్నారంటే వారికి తప్పకుండా సీతామాత జాడ తెలిసివుంటుంది . "అని పలికి దధిముఖుడివైపు తిరిగి 
"మామా !సీతాదేవి జాడను కనిపెట్టిన వాళ్ళు నాకెంతో ఇష్టమైన మధువనమును నాశనము చేయుచున్న నాకు కోపము రావటము లేదు . పైగా సీతాదేవి జాడ కనుగొన్నందుకు కాను సంతోషముగా వున్నది . వారిని ఇష్టమొచ్చినట్టు తిననీ పర్వాలేదు . వారిని వీలయినంత శీఘ్రముగా ఇక్కడికి రమ్మని చెప్పు . వారి నోటితోనే సీతాదేవిని చూసాము అనే వార్త వినాలని వున్నది "అని పలికెను . 

రామాయణము సుందరకాండ అరువదిమూడవసర్గ సమాప్తము . 

 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Tuesday 28 May 2019

రామాయణము సుందరకాండ -అరువదిరెండవసర్గ

                                  రామాయణము 

                                         సుందరకాండ -అరువదిరెండవసర్గ 

దధిముఖుడు వెళ్లిన పిమ్మట వానరవీరులు మధువులు త్రాగుతూ ఆడుతూ అరుచుచూ మితిమీరిన సంతోషముతో ఒకరినొకరు కిందపడవేస్తూ ,నవ్వుతూ ఆడుతూ ,తూలుతూ ,ఎక్కువైన మధువును వలకపోస్తూ గoతులువేయసాగిరి . అప్పుడు ఆ వన సంరక్షకులు తమ నాయకుడైన దధిముఖుడని ఈదర ఉంచుకుని ,తమ బలముతో వానరులనుచెదర కొట్టాలని పెద్ద పెద్ద చెట్లను పీకి వానరులను వాటితో కొట్టుటకు వచ్చిరి .అది చూసిన హనుమ అంగదుడు వారిని చిత్తుచిత్తుగా కొట్టి వెళ్లకొట్టిరి . 
అప్పుడు దధిముఖుడు తన సైన్యముతో "వారిని ఇక్కడే ఉండనివ్వండి . సుగ్రీవునికి ఈ వనమన్న ప్రాణము . వీరు ఈ వనమును ధ్వంసము చేయుచున్నారని తెలిసినచో మన ప్రభువు వీరందరికి మరణదండన విధించును . ఇప్పుడు ఆయన శ్రీరాముని వద్ద వున్నాడు . మనము అక్కడికే వెళ్లి ఈ విషయమును వివరించి చెబుదాము . "అని పలికి తన అనుచరులతో సహా ఆకాశములోకి ఎగిరి రామలక్ష్మణ సుగ్రీవులు ఉన్న వనమునకు వెళ్లెను 

రామాయణము సుందరకాండ అరువదిరెండవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -ఆరుదియొకటవసర్గ

                             రామాయణము 

                          సుందరకాండ -ఆరుదియొకటవసర్గ 

జాంబవంతుడు పలికిన మాటలకు వానరులందరూ సమ్మతించి ,మహేంద్రగిరి నుండి పైకి ఎగిరిరి . పిమ్మట వారందరూ తిన్నగా రామలక్ష్మణ సుగ్రీవుల వద్దకు వెళ్లక దారిలో వున్న మధు వనములో ప్రవేశించి ,అచటి ఫలములను తిని మధువులను త్రాగిరి . 
ఈ మధువనము సుగ్రీవునికి అత్యంత ఇష్టమైన వనము సుగ్రీవునికి బయపడి వానరులెవ్వరూ ఆ వనంలోకి ప్రవేశించు సాహసము చేయరు . సీతాదేవి జాడను కనిపెట్టిన సంతోషముతో ఇప్పుడు హనుమదాది వీఁరులంతా మధువనంలోకి ప్రవేశించిరి . 
వారందరూ కడుపు నిండుగా ఫలములను భుజించిరి . మధువును త్రాగిరి . కొందరు వానరులు ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదికి దూకిరి . ఇంకొందరు నవ్వుచుండిరి . మరికొందరు ఏడ్చుచుండిరి . కొంతమంది పాటలు పాడుచుండిరి , ఇంకొంతమంది నాట్యము చేయుచుండిరి ,పెక్కుమంది అక్కడి వృక్షములను ధ్వంసము చేయుచుండిరి . 
ఈ  విధముగా వారు ఆ మధువనములో విజృంభించుచుండగా ఆ వన పాలకుడు ,సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు వారందరీ అదిలించ ప్రయత్నము చేసెను . కానీ వానరులెవరూ పట్టించుకోకపోవువటంతో వారిలో కొందరిని చేతితో చరిచి ,పెద్దగా అరిచి వారిని ఆ వనము నుండి బయటకు పంపించు ప్రయత్నము చేసెను . అప్పుడు ఆ వానరులలో కొందరు దధిముఖుడను కొట్టిరి ,ఇంకొందరు రక్కిరి ,మరికొందరు కొరికిరి . ఈ విధముగా దధిముఖుడను హింసించి బయటకు ప్రాలద్రోలిరి . 

రామాయణము సుందరకాండ అరువదియొకటవసర్గ సమాప్తము . 

        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  






Sunday 26 May 2019

రామాయణము సుందరకాండ - అరువదియవసర్గ

                                   రామాయణము 

                               సుందరకాండ - అరువదియవసర్గ 

లంకా నగర విశేషములన్నీ సవివరముగా తెలుసుకున్న పిమ్మట అంగదుడు "ఓ వానరవీరులారా !సీతాదేవి జాడ తెలిసిన పిమ్మట కూడా మనము జానకీ దేవిని తీసుకువెళ్లకుండా మనమే వెళ్ళుట మంచిది కాదనిపిస్తోంది . హనుమ లంకా నగరంలోని పెక్కు మంది రాక్షసులను పరిమార్చినాడు . ఇక లంకలో కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు . లంకా నగరము కూడా దగ్దమయిపోయినది . వారు ఆ ఇబ్బంది లోనుండి బయటపడకముందే మనము దండెత్తి వెళ్లి మిగిలిన రాక్షసులను ,రావణుని చంపి సీతామాతను తీసుకువచ్చి శ్రీరాముని ముందు పెట్టినచో శ్రీరాముడు లక్ష్మణుడు ,మన ప్రభుబీవైన సుగ్రీవుడు కూడా చాలా సంతోషిస్తారు . 
ఆ విధముగా సీతారాములను కలిపి మనము పుణ్యము మూటకట్టుకొనవచ్చును . పైగా ఈ లంకలో వున్న కొద్దీ మంది రాక్షసుల కోసము సుగ్రీవుని ,రామలక్ష్మణులను , వానరులను ఇబ్బంది పెట్టుట ఎందుకు ?మనమే సీతామాతను తీసుకుని రామలక్ష్మణుల ,సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము . "అని పలికెను . ఆ మాటలు విన్న జాంబవంతుడు "అంగదా !సీతామాతను ఈ కష్టముల నుండి రక్షించి సీతారాములను కలపవలెననే నీ ఉత్సాహము చూడముచ్చటగా ఉన్నది . కానీ ,వానరప్రభువైన సుగ్రీవుడు మనల్ని దక్షిణదిశకు వెళ్లి వెతకమనే చెప్పాడు . కానీ సీతామాతను తీసుకురమ్మని చెప్పలేదు . అదీకాక ,శ్రీరాముడు మన వానరసేనల ముందు "సీతాదేవిని అపహరించినవాడిని చంపుతా"అని తన వంశము మీద ఒట్టు పెట్టి ప్రతిజ్ఞ చేసినాడు . మనము జానకీదేవిని తీసుకువెళ్ళినచో ఆయన ప్రతిజ్ఞ విఫలమగును . అందువలన మనము త్వరగా వెళ్లి రామలక్ష్మణ సుగ్రీవులకు జానకీదేవి జాడ గురించి చెప్పెదము "అని పలికెను . 

రామాయణము సుందరకాండ అరువదియవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము సుందరకాండ -ఏబదితొమ్మిదవసర్గ

                                     రామాయణము 

                                సుందరకాండ -ఏబదితొమ్మిదవసర్గ 

హనుమ లంక నుండి వచ్చిన పిమ్మట వానరవీరులందరూ అక్కడి విశేషములను తెలుసుకొనిరి . పిమ్మట అనంతర కర్తవ్యమును గూర్చి చర్చించుచు ఆ సముద్ర తీరమునే ఉండిరి . 

రామాయణము సుందరకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

Thursday 23 May 2019

రామాయణము సుందరకాండ -ఏబది ఎనిమిదవసర్గ

                                  రామాయణము 

                               సుందరకాండ -ఏబది ఎనిమిదవసర్గ 

వానరులంతా హనుమ  చుట్టూ చేరి అక్కడి విశేషములను అడిగిరి . అప్పుడు హనుమ సవివరముగా తానూ సముద్రమును లంఘించుట ,దారిలో తనకు ఆటంకములు వచ్చుట ,మైనాక పర్వతము అడ్డుగా వచ్చుట ,లంకా నగరమును చేరుట లంకిణిని ఓడించుట ,లంకా నగర ప్రవేశము సీతాదేవి కొరకు లంకా నగరమును వెతుకుట ,ఎట్టకేలకు సీతామాతను కనిపెట్టుట ,అప్పుడే అక్కడికి వచ్చిన రావణుని సీతాదేవి తిరస్కరించుట ,రాక్షస స్త్రీలు సీతాదేవిని బయపెట్టుట, ఆమె ఆత్మహత్య చేసుకోనాలని ఆలోచించుట ,సీతాదేవితో తను మాట్లాడుట ధైర్యము చెప్పుట ,పిమ్మట అశోకవన ధ్వంసము ,రాక్షసులతో యుద్ధము ,పిమ్మట వారికి లొంగిపోవుట ,తోకకు నిప్పు అంటించుట ,లంకానగరమునకు నిప్పు పెట్టుట ,సీతాదేవి క్షేమమును కళ్లారా చూసి తిరిగి వచ్చుట మొదలగు విషయములన్నీ చెప్పెను . 

రామాయణము సుందరకాండ ఏబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -ఏబదియేడవసర్గ

                                     రామాయణము 

                                      సుందరకాండ -ఏబదియేడవసర్గ 

హనుమ రెక్కలులేని ఒక మహా పర్వతము వలే ఆకాశములోకి ఎగిరెను . అలా ఎగురుతూ మార్గ మధ్యలో మైనాక పర్వతమును తన చేతితో స్పృశించెను . పిమ్మట అతడు పెద్దగా సింహనాదమొనర్చెను . హనుమ ఆవలిగట్టు దగ్గరకు వచ్చేసరికి పెద్దగా సింహనాదములు చేయుచు వాలము ఊపుచుండెను . ఆ మహాగర్జనలు విన్న అంగదాది మహా వీరులు ,జాంబవంతుడు "ఇది హనుమ కంఠ ధ్వనియే అతడు ఈ విధముగా గర్జించుచున్నాడంటే అతడు తప్పక సీతామాతను చూసి ఉంటాడు "అని నిర్ణయమునకు వచ్చి ,సంతోషముతో వారిలో కొందరు పెద్దగా అరవసాగిరి . కొందరు గంతులువేయసాగిరి . ఇంకొందరు ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదికి దూకసాగిరి . 
ఇలా సంబరంగా హనుమ కోసము ఎదురుచూస్తున్న వానరవీరులు హనుమ రావటం చూసి అతడికి ఎదురుగా హనుమ దిగు చోటికి వెళ్లిరి . వానరవీరులలో కొందరు హనుమను కౌగిలించుకొనిరి . ఇంకొందరు చెట్ల కొమ్మలను ఇరిపి హనుమకు ఆసనంగా తెచ్చిరి . ఇంకొందరు ఫలములు ,పళ్ళు తీసుకొచ్చి సమర్పించిరి . అందరూ హనుమను మళ్లీ క్షేమముగా చూసినందుకు గాను ,సంతోషముతో  హనుమ చుట్టూ చేరిరి . 

హనుమ వారితో "చూసాను సీతామాతను "అని ప్రకటించెను . ఆ మాట విన్న వానరులు కేరింతలు కొట్టిరి . సమగ్రముగా వివరము చెప్పమని అడిగిరి . అప్పుడు హనుమ "లంకలో రాక్షస స్త్రీల కాపలాలో అశోకవనంలో దీనవదనముతో శ్రీరాముని స్మరిస్తూ వున్న సీతాదేవిని చూసాను . ఆమె జుట్టు మొత్తము ఒకే జడగా ఉన్నది . ఆమె ఉపవాసములతో కృశించి వున్నది . "అని చెప్పెను . అప్పుడు వానరవీరులందరూ హనుమను పొగిడిరి . 

రామాయణము సుందరకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Wednesday 22 May 2019

రామాయణము సుందరకాండ - ఏబదిఆరవసర్గ

                                         రామాయణము 

                                     

                                           సుందరకాండ -  ఏబదిఆరవసర్గ 

పిమ్మట హనుమంతుడు అశోక వృక్ష ఛాయలో ఆసీనురాలైయున్న సీతాదేవికి పాదాభివందనం చేసి "అమ్మా ! దైవానుగ్రహముచేత ఎట్టి అపాయమునకు లోను కాకు సురక్షితముగా నిన్న చూడ గలుగుతున్నాను ". అని పలికెను . 

అప్పుడు సీతాదేవి తిరుగుప్రయాణమవుతున్న హనుమకు జాగ్రత్త చెప్పెను . హనుమ సేతాదేవితో వెళ్లివస్తానని చెప్పి దైర్యంగా ఉండమని చెప్పి , పెద్దగా "నా పేరు హనుమ నేను శ్రీ రాముని దూతను "అని అరిచి తిరుగు ప్రయాణమైయ్యను .
లంక నగరము నుండి బయటకువచ్చిన్న హనుమ అరిష్టము అని పర్వతము  దగ్గరకు సముద్రమును లంఘించుటకు  వచ్చెను  మహాబలశాలి ఐన హనుమ  పాదములదాటికి తట్టుకొనలేక ఆ మహా పర్వతము నేల లోకి కృంగిపోయి  నేలతోసమానమయ్యెను అప్పుడు ఆ పర్వతముపై నివసించుచున్న నాగులు,  కిన్నెరులు గంధర్వులు,   యక్షులు,   విద్యాధరులు మొదలగువారు భయభ్రాంతులకు  లోనై ఆపర్వతమును వదిలి ఆకాశమునకు చేరిరి.  ఆలా పైకి ఎగిరిన హనుమ సముద్రమును లంఘించుట ఆరంభించెను . 


రామాయణము సుందరకాండ ఏబదిఆరవ సరిగా సమాప్తం . 

  

శశి , 

ఎం.ఏ , ఎం.ఏ (తెలుగు), తెలుగు పండితులు . 




Tuesday 21 May 2019

రామాయణము సుందరకాండ -ఏబది ఐదవసర్గ

                                రామాయణము 

                               సుందరకాండ -ఏబది ఐదవసర్గ 

లంకానగరమును పూర్తిగా దగ్దమొనర్చిన పిమ్మట హనుమ తన వాలమును సముద్ర నీటిలో ముంచి అగ్నిని చల్లార్చెను . అప్పుడు హనుమ  కోపము కూడా చల్లారెను . అప్పుడు హనుమ ఆలోచించసాగెను .  "అయ్యో కోపములో నేను అనాలోచితముగా యావత్ లంకా నగరమునకు నిప్పు పెట్టాను . ఈ లంకా నగరంలోనే సీతామాత కూడా ఉన్నది అన్న విషయము కోపములో ఉన్న నా బుద్ధికి తోచలేదు . కోపములో ఉన్న మనిషి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానము నశిస్తుంది . కోపమును అదుపులో పెట్టుకోగలిగిన వాడే నిజముగా గొప్పవాడు . కోపముతో ఆలోచన లేకుండా నా కష్టమును బూడిదలో పోసుకున్న పన్నీరు చేసుకున్నాను . ఇప్పుడు కిష్కింధకు వెళ్లి నా మీద అపారనమ్మకము పెట్టుకున్న సుగ్రీవునకు ,రామలక్ష్మణులకు నా ముఖుము ఎలా చూపించాలి ?
నా పిచ్చి పని వలన అయోధ్య నుండి కిష్కింద వరకు అందరిని బాధించినవాడిని అయితిని . "అని తానునుతాను పెక్కువిధములుగా నిందించుకొనెను . పిదప హనుమ మళ్లీ ఇలా ఆలోచించుకోసాగేను . "మంగళస్వరూపిణి ఐన సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షించును . సీతాదేవి ధర్మస్వరూపుడు ఐన శ్రీరాముని భార్య ఆమె పాతివ్రత్యమే భద్రకవచమై ఆమెను రక్షించెను . అట్టి జానకీ దేవిని తాకుటకు అగ్నిదేవుడు అశక్తుడు . ఈ లోకమునందు దేనినైనా దహించివేయగల అగ్ని నా వాలమును మాత్రము కాల్చలేదు .   అగ్ని నావాలామునే కాల్చలేదు ఇక సీతాదేవిని ఎలా కాల్చుతాడు ?"అని అనుకుని ధైర్యము తెచ్చుకొనెను . అప్పుడు హనుమ చారిణుల మాటలు వినెను . "లంకా నగరమంతా అగ్నితో నిండిపోయినది . సముద్రము పక్కనే ఉన్న లంక అగ్ని వ్యాపించి మరో సముద్రము వలె వున్నది . సముద్రములో అలలు వలె అగ్ని కెరటములు ఎగిరిపడుచున్నవి . కానీ చిత్రముగా సీతాదేవికి మాత్రము ఏమి కాలేదు . ఇది అద్భుతముగా వుంది ఆశ్చర్యమును కలిగించుచున్నది "అనే చారణుల మాటలు విన్న హనుమ పరమానందభరితుడయ్యెను . ఆ మాటలవలన సీతాదేవి క్షేమముగా ఉన్నట్టు తెలుసుకున్న హనుమ స్వయముగా సీతాదేవిని మఱల దర్శించి తిరుగు ప్రయాణమవ్వవలెనని నిశ్చయించుకొనెను . 

రామాయణము సుందరకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

రామాయణము సుందరకాండ -ఏబదినాల్గవసర్గ

                                      రామాయణము 

                                   సుందరకాండ -ఏబదినాల్గవసర్గ 

లంకానగర ముఖద్వారముపై కూర్చుని ఉన్న హనుమ తదేకదృష్టితో లంకా నగరమును చూస్తూ ఉప్పొంగిన ఉత్సాహముతో అనంతరకర్తవ్యమును గూర్చి ఆలోచించసాగెను . "అశోకవనము ధ్వంసము అయినది . ప్రముఖులైన రాక్షసులందరూ మరణించిరి . సైన్యములో కొంతబాగము నశించినది . ఇక లంకా నగరము నాశనము చేయుటే మిగిలిఉన్నది . అది కూడా చేసినచో నా శ్రమ ఫలించినట్టే . నా వాలమున ప్రజ్వలించుచున్న ఈ అగ్ని దేవుడికి (తనను దహించక ,ఏమాత్రము బాధ కలిగించక చల్లగా చూసినందుకు కృతజ్ఞతగా )ఈ మహాభవనములను ఆహుతిగా సమర్పించెదను . "అని అనుకుని లంకా నగరంలోని భవనములపై ఒకదాని మీద నుండి ఇంకొక దాని మీదకు దూకసాగెను . 
మహా పరాక్రమము కల హనుమ మొదట ప్రహస్తుని ఇంటిపై వాలి ఆ ఇంటికి నిప్పు అంటించెను . (ప్రధాన మంత్రి గృహముతో లంకా నగర దహన కార్యక్రమమునకు బోణి కావించెను . "పిదప మారుతి వరుసగా మహాపార్మ్వుని భవనము ,వాగ్రద్రంష్టుడి భవనము ,శుకుని భవనము ,సారణుని భవనము ,ఇంద్రజిత్తు భవనము ,జంబుమాలి భవనము ,సుమాలి భవనములు నిప్పు అంటించేను . తదుపరి మారుతి క్రమముగా రశ్మికేతుడు ,సూర్యశత్రువు ,హ్రస్వకర్ణుడు ,దంష్ట్రుడు ,రోమశుడు ,మత్తుడు ,ధ్వజగ్రీవుడు ,విద్యుజ్జిహ్వుడు ,ఘోరుడు ,హస్తిముఖుడు ,కరాళుడు ,పిశాచుడు ,శోణితాక్షుడు ,కుంభకర్ణుడు ,మకరాక్షుడు ,యజ్ఞశత్రువు ,నరాంతకుడు ,కుంభుడు ,నికుంభుడు ,దురాత్ముడు మొదలగు వారి గృహములను దహించివేసెను . 

అందరి గృహములను దహించిన మారుతి విభీషణుడి ప్రాకారమును కూడా తాకలేదు . తనకు రావణసభలో తనకు అండగా నిలిచి ధర్మవచనములు పలికినందుకు విభీషణుడి భవనమును విడిచిపెట్టెను . పిదప అతడు రావణుని భావనమునకు కొద్ద నిప్పు పెట్టి ప్రళయకాల మేఘము వలె గర్జించెను . మహాబలశాలి ఐన అగ్ని దేవుడు వాయువు తొడగుట వలన మంటలు చెలరేగగా వృద్ధిపొంది ప్రళయాగ్ని వలె ప్రజ్వలించేను . ఆ లంకా నగరంలోని సమస్త భవనములు శిధిలమైపోయినవి . అప్పుడు అక్కడి రాక్షసులు అయ్యో అని పెద్దగా గగ్గోలుపెట్టిరి . పెక్కుమంది రాక్షసులు మరణించిరి . చాలామంది గాయపడిరి . లంకా నగరము నాశనము పొందుట చూసిన సకల దేవతలు వాయునందనుడైన హనుమను వేనోళ్ళ పొగిడిరి . 


రామాయణము సుందరకాండ ఏబదినాల్గవసర్గ సమాప్తము . 

            శశి '

ఎం . ఏ .ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Sunday 19 May 2019

రామాయణము సుందరకాండ -ఏబదిమూడవసర్గ

                                   రామాయణము 

                                  సుందరకాండ -ఏబదిమూడవసర్గ 

సందర్భోచితముగా విభీషణుడు పలికిన మాటలు విన్న రావణుడు "నీవు చెప్పినది నిజమే దూతను వధించుట నింద్యము . వానరమునకు తోక చాలా ఇష్టము . కావున ఈ వానరుడు వాలమునకు నిప్పంటించి మన పురవీధులన్నీ త్రిప్పి వదిలివేయండి . తోక కాలటంతో ఈ వానరమే మన నగరమును వదిలి పారిపోతుంది . కాలిన దీని తోకను చూసిన ఈ వానర స్నేహితులు ఇటు వచ్చుటకే భయపడతారు "అని ఆజ్ఞ ఇచ్చెను . 
రావణుడి ఆజ్ఞను విన్న రాక్షస వీరులు పాత బట్టలు త్రేచ్చి వాటిని నూనెలో ముంచి హనుమ వాలమునకు చుట్టి నిప్పు అంటించిరి . అప్పుడు హనుమ బందనములతో ఉండెను . తనకు ఆ బంధనములు త్రెంచుకొని శక్తి ఉన్నప్పటికీ ,రాత్రి చీకటిలో చూసిన లంకా నగరమును ఈ పగటి సమయములో మరిఒకసారి చూచుటకు , యుద్ధమునకు వచ్చినపుడు ఈ నగర పరిస్థితులు మరింతగా తెలిసినచో వీరిని పరిమార్చుట సులభమని భావించి ,ఆ బంధనములను త్రెంచుకొనక మిన్నకుండిపోయెను . 
రాక్షసులు తోక అంటించి మారుతిని వీధులలో త్రిప్ప  సాగిరి . హనుమను చూచుటకు ఇళ్లలో వున్న పిల్లలు ,ముసలివాళ్లు ,ఆడవాళ్లు బయటకు వచ్చిరి . హనుమను చూసిన స్త్రీలలో కొందరు సీతాదేవి వద్దకు వెళ్లి "నీ వద్దకు వచ్చి మాట్లాడి వెళ్లిన వానరమునకు నిప్పు  అంటించారు " అని పలికిరి . అప్పుడు సీతాదేవి అగ్నిదేవుడిని మారుతికి హాని కలిగించవద్దని ప్రార్ధించెను . సీతాదేవి ప్రార్ధన వలన అగ్ని మారుతిని ఏ మాత్రము బాధించక చల్లగా ఉండెను . 
అగ్ని తనను బాధించక చల్లగా ఉండుట గమనించిన మారుతి తనలోతాను "ఇదేమిటి ?అగ్ని మండుచున్నప్పటికీ నాకు ఏ మాత్రము బాధకలగక చల్లగా ఉన్నది . నిన్న నేను సముద్రము లంఘించునపుడు సముద్రము మధ్యలో నుండి హఠాత్తుగా మైనాక పర్వతము పైకి వచ్చెను . అలాగే శ్రీరామునికి సహాయము చేయుటకు అగ్ని దేవుడు కూడా శ్రీరాముని దూతనైన నన్ను బాధించుటలేదు కాబోలు . సీతారాముల ఆశీర్వాదము వలన అగ్ని నన్ను బాధించలేకపోయివుండవచ్చు . నా తండ్రి వాయుదేవుడికి మిత్రుడైన అగ్ని నన్ను పుత్ర తుల్యునిగా భావించి బాధించకపోయివుండొచ్చు . ఇప్పుడు ఈ రాక్షసులకు నా ప్రతాపము చూపవలెను "అని భావించి బంధనములను త్రెంచుకొని రాక్షసులకు అందకుండా లంకానగర ద్వారముపై కూర్చుండెను . ఆ ద్వారమునకు కల గడియను పీకి అక్కడ కల రాక్షసులను పరిమార్చెను . 

రామాయణము సుందరకాండ ఏబదిమూడవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము సుందరకాండ -ఏబదిరెండవసర్గ

                                   రామాయణము         

                                     సుందరకాండ -ఏబదిరెండవసర్గ 

రాజ్యసభలో తన ఎదురుగా ఏ మాత్రము భయము లేకుండా నిలబడి ,తనకే హితోక్తులు పలికిన వానరశ్రేష్టుడైన మారుతి పలుకులు విని కోపోద్రుక్తుడైన రావణుడు ,తన మంత్రులతో "ఇతడిని చంపివేయుడు "అని ఆజ్ఞాపించెను . ఆ ఆజ్ఞ విన్న అక్కడే ఉన్న రావణుడి సోదరుడైన విభీషణుడు దూతను చంపుట న్యాయ సమ్మతము కాదని ,కావాలంటే ఏదేని ఒక శిక్షను విధించవచ్చునని రావణునికి పరిపరి విధములుగా నచ్చచెప్పెను . 

విభీషణుడి మాటలు విన్న రావణుడు తన సోదరుడి మాటలు సరైనవే అని గ్రహించెను . 

రామాయణము సుందరకాండ ఏబదిరెండవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Wednesday 15 May 2019

రామాయణము సుందరకాండ -ఏబదియొకటవసర్గ

                                      రామాయణము 

                                     సుందరకాండ -ఏబదియొకటవసర్గ 

రావణుని సభాభవనములో ఉన్న హనుమ రావణునితో "ఓ రావణా !నీవు ధర్మార్ధములను బాగుగా తెలిసినవాడవు . ఎంతో ఘోరమైన తపస్సుచేసి అనేకవరములు పొందినావు . దశరధుడు అను గొప్ప మహారాజు కలడు . అతడికుమారుడైన శ్రీరాముడు ఆటను భార్య సీతాదేవితో కలిసి తనతండ్రి ఆజ్ఞ మేరకు వనవాసము చేస్తూ దండకారణ్యములో ప్రవేశించెను . అప్పుడు సీతామాత అపహరించబడెను . ఆమెను వెతుకుతూ రామలక్ష్మణులు అరణ్యములలో తిరుగుతుండగా ఋష్యమూక పర్వతము వద్ద సుగ్రీవునికి శ్రీరామునికి మైత్రి కుదిరెను . 
శ్రీరాముడు వాలిని వాదించి కిష్కిందా రాజ్యమును సుగ్రీవునికి అప్పజెప్పెను . వాలి నీకు తెలుసుకదా !ఆ సహాయమునకు ప్రత్యుపకారముగా మా ప్రభువైన సుగ్రీవుడు ఆమెను వెతుకుటకు తన వద్ద ఉన్న వానరభల్లూకాసేనలను పంపెను . నేను ఇచటికి వచ్చి ఈ నగరములో సీతాదేవి ని చూసితిని . నేను తలుచుకున్నట్లయితే ఈ సమస్త లంకా నగరమును రూపుమాపగలను . కానీ ,నా ప్రభువు శ్రీరాముడి ఆజ్ఞ లేదు . అదీకాక శ్రీరాముడు సీతాదేవిని అపహరించినవారిని తుదముట్టించెదనని ప్రతిజ్ఞ చేసివున్నాడు . కావున ఇపుడు నేను నీకు హాని కలిగించుటలేదు . 
నీ పుణ్య ఫలితము కారణముగా నీవు ఇప్పుడు సంతోషముగా ఉన్నావు . నీ చెడు ప్రవర్తన కారణముగా చాలా త్వరలోనే బాధలు అనుభవించబోచున్నావు . ఇది నిజము . నీవు పెక్కు కష్టములకు ఓర్చి అనితరసాధ్యములైన  వరములు పొందినావు . కానీ నీ కష్టము అంతా బూడిదలో పోసినట్టు నీ ప్రవర్తన కారణముగా ఆ కష్టము అంతా వృధా అవుచున్నది . సీతాదేవి సాధారణ స్త్రీ అనుకుంటున్నావేమో ఆమె నీకు నిన్ను ఆశ్రయించుకున్నవారికి  యమపాశము వంటిది . శ్రీరాముడు అమిత బలపరాక్రమసంపన్నుడు అతడిని ఎదిరించుట దేవేంద్రుడికి సైతము సాధ్యము కాదు . నీవు దేవదానవగంధర్వ ,యక్ష గరుడులలో ఎవరిచేత మరణము లేకుండా వరము పొందావు . కానీ శ్రీరాముడు మానవుడు ,సుగ్రీవుడు వానరుడు వీరిరువురు పైన పేర్కొన్నవారిలో ఎవ్వరును కారు . "కావున నీ దుశ్చరితలకు త్వరలోనే అనుభవించబోవుచున్నావని అర్ధము అవుతోంది . చావు మూడిన నిన్ను త్రిమూర్తులు కానీ ఇంద్రాది మరే ఇతర దేవతలు కానీ నిన్ను కాపాడలేరు . ఇది తధ్యము . "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ఏబదియవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము సుందరకాండ -ఏబదియవసర్గ

                                      రామాయణము 

                                     సుందరకాండ -ఏబదియవసర్గ 

సభాభవనమున తన ఎదురుగా వున్న వానరుడైన హనుమంతుడిని చూసి రావణుడు మిక్కిలి కోపముతో ,తన ముఖ్య మంత్రి ఐన ప్రహస్తునితో "ఈ వానరుడెవరో ,ఎందుకు ఇక్కడికి వచ్చాడో తెలుసుకొనండి . ఎవరు పంపగా ఇక్కడికి వచ్చాడో వివరము కనుక్కోండి . కైలాస పర్వతము వద్దకు వెళ్ళినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడే ఇలా వచ్చాడేమో విషయము తెలుసుకోండి .  దుర్భేద్యమైన నా నగరములో ప్రవేశించుటలో ఆంతర్యమేమిటి ?మన వారితో యుద్ధము చేయుటలో ఇతని ఉద్దేశ్యమేమిటో కనుగొనండి "అని పలికెను . 
రావణుడి ఆజ్ఞను అనుసరించి ప్రహస్తుడు హనుమతో "ఓ వానరా !బయపడకు ,నిన్ను ఎవరు ఇక్కడికి పంపారో తెలుపుము . వారు ఎంత గొప్పవారైనను కంగారుపడక తెలుపుము . నీకు ఎటువంటి హాని చెయ్యము . నీవు నిజము చెప్పినచో నిన్ను వదిలివేసెదము . నిన్ను ఎవరు పంపారు . ఇంద్రుడా ,కుబేరుడా ,యముడా ,వరుణుడా లేక విష్ణువా ?చెప్పుము . నేను చాలామంది వానరులను చూసాను . సాదారణముగా వానరులకు ఇంత బలము కానీ తేజస్సు కానీ ఉండదు . ఓ వానరా !నిజాము చెప్పు నిన్ను ఇప్పుడే వదిలివేస్తాము . అబద్ధము చెబితే నీ ప్రాణములు దక్కవు . "అని పలికెను . 
వారికి సమాధానముగా హనుమ "నేను ఇంద్రయమవరుణులలో ఎవరు పంపగా ఇక్కడికి రాలేదు . కుబేరుడికి మిత్రుడను కాను ,విష్ణువు దూతను కాను ,నేను నిజముగానే వానరుడిని ,శ్రీరాముని దూతగా నన్ను తెలుసుకొనుము . నీ (రావణుడి )దర్శనమునకై నేను వనమును పాడుచేసితిని . అప్పుడు రాక్షసవీరులు యుద్ధ కాంక్షతో వచ్చిపడిరి . వారిని ఎదిరించి యుద్ధము చేసితిని . రాక్షస రాజువైన నిన్ను చూడాలనే బుద్ధిపూర్వకంగా బ్రహ్మాస్త్రమునకు కట్టుబడితిని . బ్రహ్మాస్త్రము నన్ను బందించలేదు . బ్రహ్మాస్త్రమే కాదు మరేఇతర అస్త్రములు నన్ను బందించలేవు . నీ కుమారుడికి వారము ఇచ్చిన బ్రహ్మదేవుడే నాకూ ఈ వరమును ఇచ్చినాడు . నీ హితము కోరి నేను చెప్పే మాటలు శ్రద్దగా విను "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ఏబదియవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Monday 13 May 2019

రామాయణము సుందరకాండ - నలుబదితొమ్మిదవసర్గ

                                      రామాయణము 

                                 సుందరకాండ - నలుబదితొమ్మిదవసర్గ 

హనుమను చూసిన ఆ సభాభవనములోని రాక్షసులందరూ "నీవెవరు ?ఇక్కడకు ఎందుకు వచ్చావు ?అని ప్రశ్నచించసాగిరి . అప్పుడు హనుమ "నేను సుగ్రీవుడు పంపఁగావచ్చాను "అని సమాధానము చెప్పెను . హనుమ అప్పుడు ఆ సభాభవనములో సింహాసనంపై కూర్చుని వున్న రావణుడిని చూసేను . అతడి తేజస్సుని చూసి ఆశ్చర్యపోయి "యితడు ఎంతటి రూపలావణ్యం కలిగి వున్నాడు. భుజబలసంపన్నుడిలా వున్నాడు . యితడు తనకు కల చెడుగుణమును వదిలివేసినచో ఇతడికి సాటి ఇంకెవరూ వుండరు "అని అనుకొనెను . 

రామాయణము సుందరకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -నలుబదియెనిమిదవసర్గ

                               రామాయణము 

                               సుందరకాండ -నలుబదియెనిమిదవసర్గ 

 

హనుమంతుడి చేతిలో అక్షకుమారుడు మరణించిన విషయము తెలుసుకున్న రాయణుడు ఇంద్రజిత్తుని తగురీతిగా ఉత్సాహపరచి హనుమంతుడి వద్దకు  పంపెను.  అప్పూర్వ అస్త్ర బలసంపన్నుడు ఐన  ఇంద్రజిత్తు రావణుడి ఆజ్ఞ ప్రకారము బంగారు రధమును ఎక్కి హనుమంతుడి వద్దకు వేగముగా వెళ్లెను . రధము చప్పుడు ,ధనుష్టంకారము విన్న హనుమ తనతో తలపడుటకు వీరుడు వచ్చుచున్నాడని సంతోషించెను . పిమ్మట హనుమ శత్రువుల గుండె హడలిపోయేలా పెద్దగా గర్జించెను . ఇంద్రజిత్తు ఏ మాత్రము భయపడక ధనుష్టంకారము చేసెను . ఇంద్రజిత్తు చిత్రవిచిత్రములైనబాణములను హనుమపై ప్రయోగించెను . కొన్ని బంగారు పిడి వున్నాయి కొన్ని సూదిగా వున్నవి ,కొన్ని వంకరగా ఉన్నవి ,కొన్ని రెక్కలు ఉన్నవి . వాటన్నిటిని తప్పించుకుని హనుమ ఆకాశములో ఎగరసాగెను . 
దాగుడుమూతలు ఆటలాగా హనుమ బాణమునకు ఎదురుగా నిలబడెను . అది  దగ్గరకు రాగానే పక్కకు తొలగిపోవును . ఈ విధముగా యుద్ధము సాగుతుండగా హనుమ ఇంద్రజిత్తును ఎలా చంపాలా అని ఆలోచించసాగెను . ఇంద్రజిత్తు కూడా హనుమను ఎలా చంపాలా అని ఆలోచించసాగెను ." వేస్తున్న  అస్త్రములన్ని నిర్వీర్యమైపోవుచున్నవి . బ్రహ్మాస్త్రము ప్రయోగించాలి" అని ఇంద్రజిత్తు నిర్ణయించుకొనెను . పిమ్మట అతడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను . ఆ అస్త్ర ప్రభావము వలన హనుమ కింద పడిపోయెను . కానీ బ్రహ్మదేవుడు హనుమకు ఇచ్చిన వరము  కారణముగా క్షణకాలములోనే హనుమకు ఆ అస్త్రము నుండి విముక్తి లభించెను . 
అంతకు ముందు వరకు రాక్షసులను ముప్పతిప్పలు పెట్టిన హనుమ కదలకుండా పది ఉండుట చూసిన రాక్షసులు వెంటనే తాళ్లతో వస్త్రములతో హనుమను బంధించుట మొదలుపెట్టిరి . తాను అస్త్ర ప్రభావము నుండి విముక్తుడు అయినప్పటికీ ,ఆ విషయము రాక్షసులకు తెలియనీయకుండా అలానే పడివుండెను . రాక్షసవీరులు హనుమను బంధించుట చూసిన ఇంద్రజిత్తు "అయ్యో బ్రహ్మాస్త్ర ప్రభావము తెలియక ఈ మూర్ఖులైన రాక్షసులందరూ వానరుడిని బంధించుచున్నారు  . బ్రహ్మాస్త్రము ప్రయోగించినపుడు మారె ఇతర సాధనములచే బంధించుటకు ప్రయత్నించరాదు . అలా ప్రయత్నిస్తే బ్రహ్మాస్త్ర ప్రభావము పోతుంది . ఇప్పుడు ఏమి చెయ్యాలి . ఈ వానరుడికి ఆ బంధనాలు త్రెంచుకొనుట మిక్కిలి తేలిక . అతడు అలా బందనములు త్రెంచుకున్నచో అందరికీ ఇబ్బంది "అని తనలోతాను అనుకొనెను . 
అలా బంధించిన హనుమను రాక్షసులు కొడుతూ ,గుద్దుతూ రావణుడి సభాభవనము వద్దకు తీసుకుపోయిరి . హనుమ ఆ బంధనములు త్రెంచుకొని వారందరిని పరిమార్చగల శక్తి ఉన్నప్పటికీ హనుమ రావణుడిని చూడాలి అనే కోరికతో ఆ రాక్షసి మూకలు చేసే అవమానమును ,దాడిని సహించెను . అలా హనుమ ఆ సభాభవనములోకి ప్రవేశించినంతనే అక్కడివారిలో కొందరు అతడిని చంపండి ,తన్నండి ,కాల్చేయండి ,భక్షించేయండి అని అరవసాగిరి . హనుమ ఆసభాభవనుమును పరికించి చూసేను . అక్కడ వున్న వారందరిని  జాగ్రత్తగా పరిశీలనగా చూసేను . 

రామాయణము సుందరకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Wednesday 8 May 2019

రామాయణము సుందరకాండ -నలుబది ఏడవసర్గ

                               రామాయణము 

                              సుందరకాండ -నలుబది ఏడవసర్గ 

దుర్ధరుడు మొదలగు అయిదుగురు సేనాధిపతులు వారి అనుచరులు మరణించారని తెలిసిన రావణుడు అక్కడవున్న అక్షకుమారుడివంక చూసేను రావణుడి ఆంతర్యము గ్రహించిన అక్షకుమారుడు బంగారు చిత్రమైన విల్లుని ధరించి ,తన బంగారు రధము ఎక్కి తన బలగముతోడి హనుమ వున్న ప్రదేశమునకు వెళ్లెను . ఎల్లీవెళ్లటంతోనే మూడువాడిబాణములతో హనుమను కవ్వించెను . తన దేహమును పెద్దగా పెంచి వున్న హనుమకు ఆ బాణములు తగిలినట్టే లేవు . 
అది గమనించిన అక్షకుమారుడు తన రాధముతో సహా ఆకాశములోకి ఎగిరి  మూడుభాణములతో హనుమ శిరస్సును కొట్టెను . ఆ బాణముల దాటికి హనుమకు ముఖంపై రక్తము కారేను . ఆ బాణములకు అక్కడికి వచ్చిన అక్షకుమారుడిని అతని సైన్యమును చూసిన హనుమ ఆకాశములోకి ఎగిరెను . పిమ్మట అక్షకుమారుడు అనేకబాణములతో హనుమను కొట్టసాగెను . హనుమ ఆ ఆకాశములోనే ఎగురుతూ ఆ బాణములను తప్పించుకోసాగేను . ఆకాశమునకు జల్లెడ వేసినట్టుగా అక్షకుమారుడు తన బాణములను కురిపించెను . వాయుసుతుడైన హనుమ ఆ బాణములన్నిటిని తప్పించుకుని ఎగరసాగెను . 
అప్పుడు హనుమ తనలో తాను అక్షకుమారుడి యుద్ధవిద్యానైపుణ్యమును మెచ్చుకొనెను . ఇంత చక్కటి యుద్ధనైపుణ్యముకల బాలుడిని చంపుటకు హనుమ ఆలోచించెను . కానీ చంపక వదిలినట్లయితే అతడు తనకు అపకారము కలిగించవచ్చునని ,అతడిని చంపుటకు నిశ్చయించుకుని ,పెద్దగా గర్జించి తన తొడలను ,జబ్బలను చరిచి ,తన అరచేతితో అక్షకుమారుడి రధమును కొట్టెను . ఆ దెబ్బకి రధము ముక్కలుముక్కలయ్యేను . గుఱ్ఱములు మరణించెను . కానీ అక్షకుమారుడు మాత్రము తన శక్తితో ఆకాశములోనే ఎగురుతూ ,బాణములు ప్రయోగించసాగెను . 
అప్పుడు హనుమ అతడి కాళ్ళు పట్టుకుని గిరగిరా త్రిప్పెను . పిమ్మట అతడు బలముగా అతడిని నేలకేసి కొట్టెను . ఆ దెబ్బకు అక్షకుమారుడు మరణించెను . అతడి సైన్యమును కూడా తుదముట్టించి పిమ్మట హనుమ అక్కడే ఇంకా రాక్షసుల కొరకు  ఎదురుచూడసాగెను . 

రామాయణము సుందరకాండ నలుబది ఏడవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Tuesday 7 May 2019

రామాయణము సుందరకాండ- నలుబదిఆరవసర్గ

                                   రామాయణము 

                                సుందరకాండ- నలుబదిఆరవసర్గ 

మంత్రి పుత్రులైన ఏడుగురు యోధులు మరణించిన విషయము తెలిసిన రావణుడు తన దిగులును పైకి కనపడనీయక మేకపోతు గాంభీర్యము తో బాగా ఆలోచించి ,విరూపాక్షుడు ,ప్రఘసుడు ,భాసకర్ణుడు ,యూపాక్షుడు ,దుర్ధరుడు ప్రముఖ సేనా నాయకులను పిలిపించి వారితో "మీరందరూ రథగజతురగపదాది దళములతో కూడిన మహా సైన్యముతో వెళ్లి ఆ వానరుడిని పట్టుకొనండి . యుద్ధసామర్ధ్యమును బట్టీ చూస్తే అతడు కేవలము సాధారణ వానరుడు అని నేను అనుకోను . పూర్వము ఇంద్రాది దేవతలను పెక్కుసార్లు నేను ఓడించాను . వారిలో ఎవరైనా మనల్ని దాడి చేయుటకు ప్రయత్నమూ చేయవచ్చును . లేక ఇంద్రుడే మనల్ని రూపుమాపుటకు తన తపోమహిమతో ఈ భూతమును సృష్టించి పంపి ఉండవచ్చు . నేను ఇదివరకు చాలామంది వానరులను చూసాను కానీ యితడు అలా లేడు . కావున చాలా జాగ్రత్తగా గట్టి పూనిక వహించి ఆ వానరమును పట్టుకొనండి "అని ఆజ్ఞాపించెను . 
రావణుని ఆజ్ఞ పొందిన సేనామాత్యులు తమతమ రథముల మీద వారి బలములతో బయలుదేరి మారుతి వున్నచోటికి వెళ్లి మారుతిని చూసిరి . పిమ్మట రాక్షసులందరూ అన్ని దిక్కులనుండి మారుతిని చుట్టుముట్టిరి . పిదపఁవారు ఆయా దిక్కులనుండి భయంకరములైన వివిధాయుధములతో హనుమంతునిపై విజృంభించిరి . దుర్దురుడు అనువాడు వాడి ఐన ఐదు బాణములను మారుతి శిరస్సుపై ప్రయోగించెను . ఆ శరములు మారుతికి భాదను ఇవ్వకుండా హాయిగా ఉండెను . అప్పుడు హనుమ బిగ్గరగా గర్జించి ఆకాశములోకి ఎగిరెను . అప్పుడు దుర్దనుడు కూడా తన రధముతో సహా ఆకాశములోకి ఎగిరి హనుమను వంద బాణములతో బాధించెను . అప్పుడు హనుమ తన శరీరమును ఇంకా పెంచి పిడుగు పడినట్లుగా దుర్దనుడి మీదపడెను . దుర్దనుడు ,అతని ఎనిమిది గుఱ్ఱములు రధము నూలుగింజంత నుగ్గునుగ్గు అయ్యెను .
అది చూసిన విరూపాక్ష యూపాక్షులు ఆకాశములోకి ఎగిరిరి . వారు హనుమపై బాణములు ప్రయోగించిరి . అప్పుడు హనుమ గరుత్మంతుడు సర్పమును ఎత్తుకునిపోయినట్టు ఒక మద్ది చెట్టును పెకలించి ,దానితో ఆ ఇరువురు రాక్షసులను కొట్టెను . ముగ్గురు చనిపోవుట చూసిన ప్రఘనుడు ఒక అడ్డకత్తిని ,శూలమును హనుమపైకి విసిరెను . అప్పుడు హనుమ ఒక మహా పర్వతమును పీకి ప్రఘనుడు ,భాసకర్ణుడు అను రాక్షసులమీదికి విసిరెను వారిరువురు రధములతో సహా నుగ్గునుగ్గు అయ్యెను . హనుమ ఆ ఐదుగురు సేనాధిపతులు పరిమార్చిన పిమ్మట ,అక్కడి సైన్యమును అంతా హతమార్చెను . అప్పుడు అక్కడ ప్రదేశము పీనుగులా గుట్టగా అనిపించెను . అక్కడి ద్వారములు సైతము పీనుగులచే మూసుకుపోబడెను . వారందరి చంపినా పిమ్మట హనుమ మృత్యుదేవత వాలే ఇంకా సైన్యము కోసము అక్కడే ఎదురుచూడసాగెను . 

రామాయణము సుందరకాండ నలుబదిఆరవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Monday 6 May 2019

రామాయణము సుందరకాండ -నలుబదియైదవసర్గ

                               రామాయణము 

                              సుందరకాండ -నలుబదియైదవసర్గ 

ఎనబదివేలమంది మరణించారని తెలిసి ఆరి బంధువులంతా కన్నీరుమున్నీరు అయ్యారు . రావణుడి ఆదేశము ప్రకారము ఏడుగురు మంత్రి పుత్రులు మిక్కిలి బలశాలురైన తమ బలముతో కలిసి నేను ముందంటే నేను ముందని పోటీపడుతూ హనుమపైకి యుద్ధమునకు బంగారు రాధములపై బయలుదేరిరి . హనుమ వున్నా ప్రదేశమునకు వెళ్లి ఆకాశమును తాకుతున్నాడా అన్నట్లున్న హనుమను చూసిరి . 

వెనువెంటనే వారు హనుమపై బాణముల వర్షము కురిపించిరి . ఆకాశమార్గములోకి ఎగిరి హనుమ ఆ బాణముల పరంపరను చెల్లాచెదురు చేసి ఆ  మహా సైన్యమునకు వణుకు పుట్టేటట్లు భయంకరముగా గర్జించెను . పిమ్మట అతడు ఆ రాక్షసయోధులను హతమార్చుటకు విజృంభించెను . 
వారిలో కొందరిని హనుమ అరచేతితో చావకొట్టెను . కాళ్లతో తన్నుతూ కొందరిని ,ముష్టిఘాతముతో మరికొందరిని ,మట్టికరిపించెను . గోళ్ళతో కొందరిని చీల్చిచెండాడెను . తన వక్షస్థలముతో కొందరిని తొడలతాకిడితో మరికొందరిని నుగ్గునుగ్గు కావించెను . కొందరు మారుతి గర్జనకే హడలి చచ్చిరి . ఇలా రాక్షసయోధులందరూ రణభూమికి బాలి కాగా బతికి బయటపడ్డ సైనికులు భయకంపితులై అన్ని దిశలకూ పారిపోయిరి . 
ఏనుగులు ,గుఱ్ఱములు ఎక్కడికక్కడ చచ్చిపడివుండెను . రథముల పైకప్పులు విరిగి ,ధ్వజపటములు ముక్కలుముక్కలై రాణాభియమి అంతటా చెల్లాచెదురుగా పడిఉండెను . ఆ ప్రదేశము అంతా శత్రువుల రక్తముతో కాలువలా మారెను . లంక అంతా వివిధమైన వికారధ్వనులతో మారుమ్రోగేను . మహా బలసంపన్నుడు ,చందాపరాక్రమశాలి ఐన హనుమ ఇంకా రాక్షసులతో యుద్ధము చేయకోరి మరల అదే ప్రదేశములో ఎత్తైన చోట నుంచుని ఎదురుచూడసాగెను . 

రామాయణము సుందరకాండ నలుబదియైదవసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 








రామాయణము సుందరకాండ -నలుబదినాలుగవసర్గ

                                   రామాయణము 

                           సుందరకాండ -నలుబదినాలుగవసర్గ 

మిక్కిలి బలశాలి ఐన ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి రావణుడి ఆదేశము మేరకు హనుమ బంధించుటకు వచ్చెను . వచ్చునప్పుడు తన ధనస్సుతో ధనుష్టంకారము చేసెను . రాగానే ముఖద్వారం పైనవున్న హనుమపైకి వాడి ఐన బాణములను ప్రయోగించాడు . హనుమంతుడి ముఖంపై ఒక అర్ధచంద్రాకార బాణము ,శిరస్సుపై వంకర ములికి కల బాణము ,బాహువులపై 10 బాణములను ప్రయోగించి ఆయనను బాధించెను . జమ్బుమాలీ చే కొట్టబడిన హనుమ ముఖము ఎర్రగా మారెను . 
అప్పుడు హనుమ మిక్కిలి కోపముతో ,పక్కనే వున్నా ఒక మహాశిలను పెకలించి ఆ రాక్షసుడిపై విసిరెను . జంబుమాలి పది బాణములతో దానిని ముక్కలు చేసెను . అది చూసిన హనుమ కోపముతో ఒక పెద్ద మద్ది చెట్టుని పీకి దానిని త్రిప్పసాగెను . జంబుమాలి నాలుగు బాణములతో ఆ వృక్షమును ముక్కలుగా చేసెను . భుజములపై అయిదు బాణములు ,గుండెపై ఒక బాణము ,వక్షస్థలమున పది బాణములు వేసి జంబుమాలి హనుమను బాధించెను . శరీరము నిండా బాణములు గుచ్చుకోవటంతో హనుమ కోపము రెట్టింపు అయ్యెను . అప్పుడు హనుమ ఆ ద్వారము ను ఊడబెరికి దానిని వేగముగా తిప్పెను . 
వాయుసుతుడైన హనుమ ఆ ద్వారముతో జంబుమాలి గుండెలపై కొట్టెను .

 ఆ దాటికి జంబుమాలి అతడి  రధసారధి ,రధము ,గుఱ్ఱములు నుగ్గునుగ్గు అయ్యెను . మహాబలశాలురు ఐన ఏలుబదివేలమంది వీరులు ,జంబుమాలి మొరాయించిన విషయము విని రావణుడు కోపముతో గుడ్లురుముతూ ,పళ్ళుకొరుకుతూ ,మిక్కిలి బాల పరాక్రమములు కల అమాత్య పుత్రులను హనుమంతుడితో తలపడుటకు వెంటనే పంపెను . 

 రామాయణము సుందరకాండ నలుబదినాలుగవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





 

Sunday 5 May 2019

రామాయణము సుందరకాండ -నలుబదిమూడవసర్గ

                                రామాయణము 

                              సుందరకాండ -నలుబదిమూడవసర్గ 

హనుమ రాక్షసులను చంపిన పిమ్మట అశోకవనముకు దగ్గరలోనే ఉన్న ఒక చైత్యమును చూసేను . దానిని కూడా నాశనము చేయదలిచి ఒక్క గెంతులో చైత్యము పైకి ఎగిరెను . అక్కడ నిలబడి గట్టిగా గర్జించెను . ఆ గర్జన విన్న అక్కడి రాక్షసులందరికి వెన్నులో వణుకు పుట్టెను . ఆక్షణములో హనుమ ఆకాశమును తాకుతున్నాడా అన్నట్లుండెను . అప్పుడు అక్కడికి వచ్చిన రాక్షసులు హనుమను ఎదురించుటకు గండ్రగొడ్డళ్లను ,కత్తులను ,ఈటెలను ఇంకా రాకరకములైన ఆయుధములను తీసుకుని వాటిని హనుమ మీదకి విసరసాగెను . 
అప్పుడు హనుమ ఆ మహా చైత్యము యొక్క ఒక మహా స్తంభమును పీకి దానిని తిప్పసాగెను . అప్పుడు ఆ సువర్ణ స్తంభము నుండి అగ్ని ఉద్భవించి ఆ మహా ప్రాసాదమును దహించివేసెను . అప్పుడు అక్కడ వున్న రాక్షసులందరూ ప్రాణభయముతో పరుగులు తీసిరి . హనుమను ఎదిరిచిచూసిన వారందరిని హనుమ చంపివేసెను . అప్పుడు హనుమ బిగ్గరగా "నావంటి మహాపరాక్రమశాలురైన వానరయోధులు వేలకొలది సీతాన్వేషణకు పంపబడినారు . ఇంకా అనేక వేలకోట్లమంది మహావీరులైన వానరులు సుగ్రీవుని అదుపాజ్ఞలలో వున్నారు . మాలో కొంతమంది పది ఏనుగుల బలము కలవారు ,ఇంకొంత మంది వంద ఏనుగుల బలము కలవారు . ఇంకొంత మంది అసలు లెక్కించుటకు వీలులేనంత బలము కలవారు . 
దంతములు ,నఖములు (గోళ్లు )ఆయుధములుగా కల ఇట్టి వానరయోధులు వందలు ,వేలు ,లక్షలు ,కోట్లమంది వెంట రాగా సుగ్రీవుడు ఇక్కడికి వచ్చి ,మిమ్ములందరిని తుదముట్టించగలడు . మీరు మహాత్ముడైన శ్రీరామచంద్రప్రభువుతో వైరము పెట్టుకున్నారు . ఆ కారణము చేత మీకు చావుమూడినది . మీకు ఆధారభూమి ఐన లంకా నగరము కూడా ఉండదు . మీ ప్రభువైన దుష్టరావణుడు కూడా మిగలడు . "అని హెచ్చరించెను . 

రామాయణము సుందరకాండ నలుబదిమూడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Saturday 4 May 2019

రామాయణము సుందరకాండ -నలుబదిరెండవసర్గ

                                  రామాయణము 

                                  సుందరకాండ -నలుబదిరెండవసర్గ 

హనుమ ఆ విధముగా అశోకవనమును ధ్వంశము చేయునప్పుడు వచ్చిన భయంకరమైన శబ్దములు పక్షులు జంతువులూ భయముతో చేసిన ఆర్తనాదములు విని లంకా నగర ప్రజలందరూ భయభ్రాOతులయిరి . ఆ వనమునందలి మృగములు ,పక్షులు అన్ని గగ్గోలు పెట్టుచూ పారిపోయెను . హనుమ అక్కడి రాక్షస స్త్రీలను ఇంకా భయపెట్టుటకు తన రూపమును ఇంకా పెద్దగా పెంచెను . 
ఇదంతా చూసిన రాక్షస స్త్రీలు సీతాదేవి వద్దకు వెళ్లి "అమ్మా !మేము నిన్ను ఏమి అనము . దయచేసి ఆ వికృతాకారుడైన వానరుడెవరో చెప్పు ?అతడు నీతో ఏమి మాట్లాడాడు ?"అని ప్రశ్నించిరి . అప్పుడు సీతాదేవి (పుతృడిని రక్షించు తల్లి వలె ,హనుమకు ఇబ్బంది కలుగకుండా ఉండుటకు )"ఏమో అతడెవరో నాకెలా తెలుస్తుంది ?అతడు కూడా బహుశా మీ రాక్షసుడే అయి ఉంటాడు . "అని సమాధానమిచ్చెను . 
అప్పుడు ఆ రాక్షస స్త్రీలలో కొందరు ఈ విషయం ను నివేదించుటకు రావణుని వద్దకు వెళ్లారు . మిగిలిన వారు సీతాదేవికి కాపలాగా అక్కడే వున్నారు . రావణుని వద్దకు వెళ్లిన స్త్రీలు రావణునితో "రాక్షస మహారాజా !ఎవడో ఒక భయంకరాకారుడైన వానరుడు ఎటునుంచి వచ్చాడో తెలియదు కానీ అశోకవనంలో చొరబడ్డాడు . అతడు సీతాదేవితో ఎదో మాట్లాడాడు . పిమ్మట అతడు అశోకవనము మొత్తాన్ని సర్వనాశనం చేసాడు . కానీ ,సీతాదేవి కూర్చుని వున్నా ప్రదేశమును మాత్రము పాడు చేయలేదు . బహుశా అతడు రాముడు పంపగా సీతాదేవిని వెతుకుతూ వచ్చాడేమో ?అందుకే ఆమె వున్న ప్రదేశము తప్ప తక్కిన ప్రదేశమును నాశనము చేసివుండొచ్చు . లేదా అంతవరకూ వనమును నాశనము చేసి అలసి ఆ ప్రదేశమును విడిచి ఉండవచ్చు . మేము సీతాదేవి వద్దకు వెళ్లి అతడు ఎవరు ఏమి మాట్లాడాడని ప్రశ్నించాము . కానీ ఆమె మాకు ఏమి సమాధానము చెప్పలేదు  . ఓ మహారాజా !నీకు ఎంతో ప్రియమైన సీతాదేవితో మాటలాడుటకు సాహసించినవాడు . ఎవడైనను భయంకరమైన శిక్షకు అర్హుడు . కావున తడిని శిక్షించుటకు ఆజ్ఞాపించు "అని చెప్పిరి . 
వారి మాటలు విన్న రావణుడు కోపముతో పళ్లు పటపట కొరికెను . కోపముతో ఊగిపోయెను . హనుమంతుడిని బంధించి తెచ్చుటకు గొప్ప బలపరాక్రమములు కల వీరులకు ఆజ్ఞ ఇచ్చెను . రావణుని ఆజ్ఞ మేరకు మిక్కిలి బలశాలురైన నలుబదివేల వీరులు ఖడ్గములు ,శూలములు ,బల్లెములు ఆయుధముగా తీసుకుని రణోత్సాహముతో అశోకవనము వైపు వెళ్లిరి . యుద్ధసన్నద్ధుడై ముఖద్వారముపై నిలిచి వున్న హనుమ వద్దకు వేగముగా అగ్ని మీదకు మిడుతలదండు వచ్చినట్టు వచ్చిరి . వారు వారి చేతిలోని ఆయుధములను హనుమ పైకి విసిరిరి . హనుమ సంతోషముతో తన వాళమును నేలపై కొట్టి భయంకరముగా సింహనాదం చేసెను . వాయుసుతుడైన హనుమంతుడు తన శరీరమును ఇంకా పెద్దగా పెంచి ,లంకలో ప్రతిధ్వనించునట్టుగా దృఢముగా తన జబ్బలను చరిచేను . ఆ చప్పుడుకి ఆకాశములో ఎగురు పక్షులు నేలపై రాలిపోయెను . హనుమ బిగ్గరగా "మహా బలసంపన్నుడైన శ్రీరామునకు జయము . మిక్కిలి పరాక్రమశాలి ఐన లక్ష్మణస్వామికి జయము . శ్రీరాముడికి విధేయుడై కిష్కింధకు రాజైన సుగ్రీవునికి జయము అసహాయ శూరుడు కొసలదేశ ప్రభువు ఐన శ్రీరాముడికి నేను  దాసుడను నా పేరు హనుమ . వేయిమంది రావణులైనా యుద్దములో నా ముందు నిలవలేరు . ఈ లంకా నగరమును సర్వనాశనం చేస్తాను ఈ రాక్షసులందరూ ఏమి చేయలేక చూస్తూ వుంటారు . నేను వచ్చిన పని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్లెదను "అని పలికెను .   . అప్పుడు హనుమ ఆ ముఖద్వారమునకు కల తలుపు గడియాను పీకి దానితో ఆ రాక్షసులపై దాడి చేసెను . ఆ రాక్షసులందరిని చంపివేసెను . అందులో కొందరు ప్రాణములు అరచేతపట్టుకొని పారిపోయి " అక్కడికి వెళ్లిన మన రాక్షసులందరూ ఆ కపి చేతిలో మరణించారు "అని  తెలిపిరి. 
ఆ మాటలు విన్న రావణుడు కన్నులెర్రచేసి ,యుద్ధమున అజేయుడైన  ప్రహస్తపుత్రుడిని (ప్రహస్తుడు అనే మంత్రి కుమారుడు )హనుమతో తలపడుటకు ఆజ్ఞాపించెను . 

రామాయణము సుందరకాండ నలుబదిరెండవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .