Saturday 4 May 2019

రామాయణము సుందరకాండ -నలుబదిరెండవసర్గ

                                  రామాయణము 

                                  సుందరకాండ -నలుబదిరెండవసర్గ 

హనుమ ఆ విధముగా అశోకవనమును ధ్వంశము చేయునప్పుడు వచ్చిన భయంకరమైన శబ్దములు పక్షులు జంతువులూ భయముతో చేసిన ఆర్తనాదములు విని లంకా నగర ప్రజలందరూ భయభ్రాOతులయిరి . ఆ వనమునందలి మృగములు ,పక్షులు అన్ని గగ్గోలు పెట్టుచూ పారిపోయెను . హనుమ అక్కడి రాక్షస స్త్రీలను ఇంకా భయపెట్టుటకు తన రూపమును ఇంకా పెద్దగా పెంచెను . 
ఇదంతా చూసిన రాక్షస స్త్రీలు సీతాదేవి వద్దకు వెళ్లి "అమ్మా !మేము నిన్ను ఏమి అనము . దయచేసి ఆ వికృతాకారుడైన వానరుడెవరో చెప్పు ?అతడు నీతో ఏమి మాట్లాడాడు ?"అని ప్రశ్నించిరి . అప్పుడు సీతాదేవి (పుతృడిని రక్షించు తల్లి వలె ,హనుమకు ఇబ్బంది కలుగకుండా ఉండుటకు )"ఏమో అతడెవరో నాకెలా తెలుస్తుంది ?అతడు కూడా బహుశా మీ రాక్షసుడే అయి ఉంటాడు . "అని సమాధానమిచ్చెను . 
అప్పుడు ఆ రాక్షస స్త్రీలలో కొందరు ఈ విషయం ను నివేదించుటకు రావణుని వద్దకు వెళ్లారు . మిగిలిన వారు సీతాదేవికి కాపలాగా అక్కడే వున్నారు . రావణుని వద్దకు వెళ్లిన స్త్రీలు రావణునితో "రాక్షస మహారాజా !ఎవడో ఒక భయంకరాకారుడైన వానరుడు ఎటునుంచి వచ్చాడో తెలియదు కానీ అశోకవనంలో చొరబడ్డాడు . అతడు సీతాదేవితో ఎదో మాట్లాడాడు . పిమ్మట అతడు అశోకవనము మొత్తాన్ని సర్వనాశనం చేసాడు . కానీ ,సీతాదేవి కూర్చుని వున్నా ప్రదేశమును మాత్రము పాడు చేయలేదు . బహుశా అతడు రాముడు పంపగా సీతాదేవిని వెతుకుతూ వచ్చాడేమో ?అందుకే ఆమె వున్న ప్రదేశము తప్ప తక్కిన ప్రదేశమును నాశనము చేసివుండొచ్చు . లేదా అంతవరకూ వనమును నాశనము చేసి అలసి ఆ ప్రదేశమును విడిచి ఉండవచ్చు . మేము సీతాదేవి వద్దకు వెళ్లి అతడు ఎవరు ఏమి మాట్లాడాడని ప్రశ్నించాము . కానీ ఆమె మాకు ఏమి సమాధానము చెప్పలేదు  . ఓ మహారాజా !నీకు ఎంతో ప్రియమైన సీతాదేవితో మాటలాడుటకు సాహసించినవాడు . ఎవడైనను భయంకరమైన శిక్షకు అర్హుడు . కావున తడిని శిక్షించుటకు ఆజ్ఞాపించు "అని చెప్పిరి . 
వారి మాటలు విన్న రావణుడు కోపముతో పళ్లు పటపట కొరికెను . కోపముతో ఊగిపోయెను . హనుమంతుడిని బంధించి తెచ్చుటకు గొప్ప బలపరాక్రమములు కల వీరులకు ఆజ్ఞ ఇచ్చెను . రావణుని ఆజ్ఞ మేరకు మిక్కిలి బలశాలురైన నలుబదివేల వీరులు ఖడ్గములు ,శూలములు ,బల్లెములు ఆయుధముగా తీసుకుని రణోత్సాహముతో అశోకవనము వైపు వెళ్లిరి . యుద్ధసన్నద్ధుడై ముఖద్వారముపై నిలిచి వున్న హనుమ వద్దకు వేగముగా అగ్ని మీదకు మిడుతలదండు వచ్చినట్టు వచ్చిరి . వారు వారి చేతిలోని ఆయుధములను హనుమ పైకి విసిరిరి . హనుమ సంతోషముతో తన వాళమును నేలపై కొట్టి భయంకరముగా సింహనాదం చేసెను . వాయుసుతుడైన హనుమంతుడు తన శరీరమును ఇంకా పెద్దగా పెంచి ,లంకలో ప్రతిధ్వనించునట్టుగా దృఢముగా తన జబ్బలను చరిచేను . ఆ చప్పుడుకి ఆకాశములో ఎగురు పక్షులు నేలపై రాలిపోయెను . హనుమ బిగ్గరగా "మహా బలసంపన్నుడైన శ్రీరామునకు జయము . మిక్కిలి పరాక్రమశాలి ఐన లక్ష్మణస్వామికి జయము . శ్రీరాముడికి విధేయుడై కిష్కింధకు రాజైన సుగ్రీవునికి జయము అసహాయ శూరుడు కొసలదేశ ప్రభువు ఐన శ్రీరాముడికి నేను  దాసుడను నా పేరు హనుమ . వేయిమంది రావణులైనా యుద్దములో నా ముందు నిలవలేరు . ఈ లంకా నగరమును సర్వనాశనం చేస్తాను ఈ రాక్షసులందరూ ఏమి చేయలేక చూస్తూ వుంటారు . నేను వచ్చిన పని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్లెదను "అని పలికెను .   . అప్పుడు హనుమ ఆ ముఖద్వారమునకు కల తలుపు గడియాను పీకి దానితో ఆ రాక్షసులపై దాడి చేసెను . ఆ రాక్షసులందరిని చంపివేసెను . అందులో కొందరు ప్రాణములు అరచేతపట్టుకొని పారిపోయి " అక్కడికి వెళ్లిన మన రాక్షసులందరూ ఆ కపి చేతిలో మరణించారు "అని  తెలిపిరి. 
ఆ మాటలు విన్న రావణుడు కన్నులెర్రచేసి ,యుద్ధమున అజేయుడైన  ప్రహస్తపుత్రుడిని (ప్రహస్తుడు అనే మంత్రి కుమారుడు )హనుమతో తలపడుటకు ఆజ్ఞాపించెను . 

రామాయణము సుందరకాండ నలుబదిరెండవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







 

No comments:

Post a Comment