Tuesday 7 May 2019

రామాయణము సుందరకాండ- నలుబదిఆరవసర్గ

                                   రామాయణము 

                                సుందరకాండ- నలుబదిఆరవసర్గ 

మంత్రి పుత్రులైన ఏడుగురు యోధులు మరణించిన విషయము తెలిసిన రావణుడు తన దిగులును పైకి కనపడనీయక మేకపోతు గాంభీర్యము తో బాగా ఆలోచించి ,విరూపాక్షుడు ,ప్రఘసుడు ,భాసకర్ణుడు ,యూపాక్షుడు ,దుర్ధరుడు ప్రముఖ సేనా నాయకులను పిలిపించి వారితో "మీరందరూ రథగజతురగపదాది దళములతో కూడిన మహా సైన్యముతో వెళ్లి ఆ వానరుడిని పట్టుకొనండి . యుద్ధసామర్ధ్యమును బట్టీ చూస్తే అతడు కేవలము సాధారణ వానరుడు అని నేను అనుకోను . పూర్వము ఇంద్రాది దేవతలను పెక్కుసార్లు నేను ఓడించాను . వారిలో ఎవరైనా మనల్ని దాడి చేయుటకు ప్రయత్నమూ చేయవచ్చును . లేక ఇంద్రుడే మనల్ని రూపుమాపుటకు తన తపోమహిమతో ఈ భూతమును సృష్టించి పంపి ఉండవచ్చు . నేను ఇదివరకు చాలామంది వానరులను చూసాను కానీ యితడు అలా లేడు . కావున చాలా జాగ్రత్తగా గట్టి పూనిక వహించి ఆ వానరమును పట్టుకొనండి "అని ఆజ్ఞాపించెను . 
రావణుని ఆజ్ఞ పొందిన సేనామాత్యులు తమతమ రథముల మీద వారి బలములతో బయలుదేరి మారుతి వున్నచోటికి వెళ్లి మారుతిని చూసిరి . పిమ్మట రాక్షసులందరూ అన్ని దిక్కులనుండి మారుతిని చుట్టుముట్టిరి . పిదపఁవారు ఆయా దిక్కులనుండి భయంకరములైన వివిధాయుధములతో హనుమంతునిపై విజృంభించిరి . దుర్దురుడు అనువాడు వాడి ఐన ఐదు బాణములను మారుతి శిరస్సుపై ప్రయోగించెను . ఆ శరములు మారుతికి భాదను ఇవ్వకుండా హాయిగా ఉండెను . అప్పుడు హనుమ బిగ్గరగా గర్జించి ఆకాశములోకి ఎగిరెను . అప్పుడు దుర్దనుడు కూడా తన రధముతో సహా ఆకాశములోకి ఎగిరి హనుమను వంద బాణములతో బాధించెను . అప్పుడు హనుమ తన శరీరమును ఇంకా పెంచి పిడుగు పడినట్లుగా దుర్దనుడి మీదపడెను . దుర్దనుడు ,అతని ఎనిమిది గుఱ్ఱములు రధము నూలుగింజంత నుగ్గునుగ్గు అయ్యెను .
అది చూసిన విరూపాక్ష యూపాక్షులు ఆకాశములోకి ఎగిరిరి . వారు హనుమపై బాణములు ప్రయోగించిరి . అప్పుడు హనుమ గరుత్మంతుడు సర్పమును ఎత్తుకునిపోయినట్టు ఒక మద్ది చెట్టును పెకలించి ,దానితో ఆ ఇరువురు రాక్షసులను కొట్టెను . ముగ్గురు చనిపోవుట చూసిన ప్రఘనుడు ఒక అడ్డకత్తిని ,శూలమును హనుమపైకి విసిరెను . అప్పుడు హనుమ ఒక మహా పర్వతమును పీకి ప్రఘనుడు ,భాసకర్ణుడు అను రాక్షసులమీదికి విసిరెను వారిరువురు రధములతో సహా నుగ్గునుగ్గు అయ్యెను . హనుమ ఆ ఐదుగురు సేనాధిపతులు పరిమార్చిన పిమ్మట ,అక్కడి సైన్యమును అంతా హతమార్చెను . అప్పుడు అక్కడ ప్రదేశము పీనుగులా గుట్టగా అనిపించెను . అక్కడి ద్వారములు సైతము పీనుగులచే మూసుకుపోబడెను . వారందరి చంపినా పిమ్మట హనుమ మృత్యుదేవత వాలే ఇంకా సైన్యము కోసము అక్కడే ఎదురుచూడసాగెను . 

రామాయణము సుందరకాండ నలుబదిఆరవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment