Monday 13 May 2019

రామాయణము సుందరకాండ -నలుబదియెనిమిదవసర్గ

                               రామాయణము 

                               సుందరకాండ -నలుబదియెనిమిదవసర్గ 

 

హనుమంతుడి చేతిలో అక్షకుమారుడు మరణించిన విషయము తెలుసుకున్న రాయణుడు ఇంద్రజిత్తుని తగురీతిగా ఉత్సాహపరచి హనుమంతుడి వద్దకు  పంపెను.  అప్పూర్వ అస్త్ర బలసంపన్నుడు ఐన  ఇంద్రజిత్తు రావణుడి ఆజ్ఞ ప్రకారము బంగారు రధమును ఎక్కి హనుమంతుడి వద్దకు వేగముగా వెళ్లెను . రధము చప్పుడు ,ధనుష్టంకారము విన్న హనుమ తనతో తలపడుటకు వీరుడు వచ్చుచున్నాడని సంతోషించెను . పిమ్మట హనుమ శత్రువుల గుండె హడలిపోయేలా పెద్దగా గర్జించెను . ఇంద్రజిత్తు ఏ మాత్రము భయపడక ధనుష్టంకారము చేసెను . ఇంద్రజిత్తు చిత్రవిచిత్రములైనబాణములను హనుమపై ప్రయోగించెను . కొన్ని బంగారు పిడి వున్నాయి కొన్ని సూదిగా వున్నవి ,కొన్ని వంకరగా ఉన్నవి ,కొన్ని రెక్కలు ఉన్నవి . వాటన్నిటిని తప్పించుకుని హనుమ ఆకాశములో ఎగరసాగెను . 
దాగుడుమూతలు ఆటలాగా హనుమ బాణమునకు ఎదురుగా నిలబడెను . అది  దగ్గరకు రాగానే పక్కకు తొలగిపోవును . ఈ విధముగా యుద్ధము సాగుతుండగా హనుమ ఇంద్రజిత్తును ఎలా చంపాలా అని ఆలోచించసాగెను . ఇంద్రజిత్తు కూడా హనుమను ఎలా చంపాలా అని ఆలోచించసాగెను ." వేస్తున్న  అస్త్రములన్ని నిర్వీర్యమైపోవుచున్నవి . బ్రహ్మాస్త్రము ప్రయోగించాలి" అని ఇంద్రజిత్తు నిర్ణయించుకొనెను . పిమ్మట అతడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను . ఆ అస్త్ర ప్రభావము వలన హనుమ కింద పడిపోయెను . కానీ బ్రహ్మదేవుడు హనుమకు ఇచ్చిన వరము  కారణముగా క్షణకాలములోనే హనుమకు ఆ అస్త్రము నుండి విముక్తి లభించెను . 
అంతకు ముందు వరకు రాక్షసులను ముప్పతిప్పలు పెట్టిన హనుమ కదలకుండా పది ఉండుట చూసిన రాక్షసులు వెంటనే తాళ్లతో వస్త్రములతో హనుమను బంధించుట మొదలుపెట్టిరి . తాను అస్త్ర ప్రభావము నుండి విముక్తుడు అయినప్పటికీ ,ఆ విషయము రాక్షసులకు తెలియనీయకుండా అలానే పడివుండెను . రాక్షసవీరులు హనుమను బంధించుట చూసిన ఇంద్రజిత్తు "అయ్యో బ్రహ్మాస్త్ర ప్రభావము తెలియక ఈ మూర్ఖులైన రాక్షసులందరూ వానరుడిని బంధించుచున్నారు  . బ్రహ్మాస్త్రము ప్రయోగించినపుడు మారె ఇతర సాధనములచే బంధించుటకు ప్రయత్నించరాదు . అలా ప్రయత్నిస్తే బ్రహ్మాస్త్ర ప్రభావము పోతుంది . ఇప్పుడు ఏమి చెయ్యాలి . ఈ వానరుడికి ఆ బంధనాలు త్రెంచుకొనుట మిక్కిలి తేలిక . అతడు అలా బందనములు త్రెంచుకున్నచో అందరికీ ఇబ్బంది "అని తనలోతాను అనుకొనెను . 
అలా బంధించిన హనుమను రాక్షసులు కొడుతూ ,గుద్దుతూ రావణుడి సభాభవనము వద్దకు తీసుకుపోయిరి . హనుమ ఆ బంధనములు త్రెంచుకొని వారందరిని పరిమార్చగల శక్తి ఉన్నప్పటికీ హనుమ రావణుడిని చూడాలి అనే కోరికతో ఆ రాక్షసి మూకలు చేసే అవమానమును ,దాడిని సహించెను . అలా హనుమ ఆ సభాభవనములోకి ప్రవేశించినంతనే అక్కడివారిలో కొందరు అతడిని చంపండి ,తన్నండి ,కాల్చేయండి ,భక్షించేయండి అని అరవసాగిరి . హనుమ ఆసభాభవనుమును పరికించి చూసేను . అక్కడ వున్న వారందరిని  జాగ్రత్తగా పరిశీలనగా చూసేను . 

రామాయణము సుందరకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment