Wednesday 15 May 2019

రామాయణము సుందరకాండ -ఏబదియొకటవసర్గ

                                      రామాయణము 

                                     సుందరకాండ -ఏబదియొకటవసర్గ 

రావణుని సభాభవనములో ఉన్న హనుమ రావణునితో "ఓ రావణా !నీవు ధర్మార్ధములను బాగుగా తెలిసినవాడవు . ఎంతో ఘోరమైన తపస్సుచేసి అనేకవరములు పొందినావు . దశరధుడు అను గొప్ప మహారాజు కలడు . అతడికుమారుడైన శ్రీరాముడు ఆటను భార్య సీతాదేవితో కలిసి తనతండ్రి ఆజ్ఞ మేరకు వనవాసము చేస్తూ దండకారణ్యములో ప్రవేశించెను . అప్పుడు సీతామాత అపహరించబడెను . ఆమెను వెతుకుతూ రామలక్ష్మణులు అరణ్యములలో తిరుగుతుండగా ఋష్యమూక పర్వతము వద్ద సుగ్రీవునికి శ్రీరామునికి మైత్రి కుదిరెను . 
శ్రీరాముడు వాలిని వాదించి కిష్కిందా రాజ్యమును సుగ్రీవునికి అప్పజెప్పెను . వాలి నీకు తెలుసుకదా !ఆ సహాయమునకు ప్రత్యుపకారముగా మా ప్రభువైన సుగ్రీవుడు ఆమెను వెతుకుటకు తన వద్ద ఉన్న వానరభల్లూకాసేనలను పంపెను . నేను ఇచటికి వచ్చి ఈ నగరములో సీతాదేవి ని చూసితిని . నేను తలుచుకున్నట్లయితే ఈ సమస్త లంకా నగరమును రూపుమాపగలను . కానీ ,నా ప్రభువు శ్రీరాముడి ఆజ్ఞ లేదు . అదీకాక శ్రీరాముడు సీతాదేవిని అపహరించినవారిని తుదముట్టించెదనని ప్రతిజ్ఞ చేసివున్నాడు . కావున ఇపుడు నేను నీకు హాని కలిగించుటలేదు . 
నీ పుణ్య ఫలితము కారణముగా నీవు ఇప్పుడు సంతోషముగా ఉన్నావు . నీ చెడు ప్రవర్తన కారణముగా చాలా త్వరలోనే బాధలు అనుభవించబోచున్నావు . ఇది నిజము . నీవు పెక్కు కష్టములకు ఓర్చి అనితరసాధ్యములైన  వరములు పొందినావు . కానీ నీ కష్టము అంతా బూడిదలో పోసినట్టు నీ ప్రవర్తన కారణముగా ఆ కష్టము అంతా వృధా అవుచున్నది . సీతాదేవి సాధారణ స్త్రీ అనుకుంటున్నావేమో ఆమె నీకు నిన్ను ఆశ్రయించుకున్నవారికి  యమపాశము వంటిది . శ్రీరాముడు అమిత బలపరాక్రమసంపన్నుడు అతడిని ఎదిరించుట దేవేంద్రుడికి సైతము సాధ్యము కాదు . నీవు దేవదానవగంధర్వ ,యక్ష గరుడులలో ఎవరిచేత మరణము లేకుండా వరము పొందావు . కానీ శ్రీరాముడు మానవుడు ,సుగ్రీవుడు వానరుడు వీరిరువురు పైన పేర్కొన్నవారిలో ఎవ్వరును కారు . "కావున నీ దుశ్చరితలకు త్వరలోనే అనుభవించబోవుచున్నావని అర్ధము అవుతోంది . చావు మూడిన నిన్ను త్రిమూర్తులు కానీ ఇంద్రాది మరే ఇతర దేవతలు కానీ నిన్ను కాపాడలేరు . ఇది తధ్యము . "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ఏబదియవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment