Sunday 5 May 2019

రామాయణము సుందరకాండ -నలుబదిమూడవసర్గ

                                రామాయణము 

                              సుందరకాండ -నలుబదిమూడవసర్గ 

హనుమ రాక్షసులను చంపిన పిమ్మట అశోకవనముకు దగ్గరలోనే ఉన్న ఒక చైత్యమును చూసేను . దానిని కూడా నాశనము చేయదలిచి ఒక్క గెంతులో చైత్యము పైకి ఎగిరెను . అక్కడ నిలబడి గట్టిగా గర్జించెను . ఆ గర్జన విన్న అక్కడి రాక్షసులందరికి వెన్నులో వణుకు పుట్టెను . ఆక్షణములో హనుమ ఆకాశమును తాకుతున్నాడా అన్నట్లుండెను . అప్పుడు అక్కడికి వచ్చిన రాక్షసులు హనుమను ఎదురించుటకు గండ్రగొడ్డళ్లను ,కత్తులను ,ఈటెలను ఇంకా రాకరకములైన ఆయుధములను తీసుకుని వాటిని హనుమ మీదకి విసరసాగెను . 
అప్పుడు హనుమ ఆ మహా చైత్యము యొక్క ఒక మహా స్తంభమును పీకి దానిని తిప్పసాగెను . అప్పుడు ఆ సువర్ణ స్తంభము నుండి అగ్ని ఉద్భవించి ఆ మహా ప్రాసాదమును దహించివేసెను . అప్పుడు అక్కడ వున్న రాక్షసులందరూ ప్రాణభయముతో పరుగులు తీసిరి . హనుమను ఎదిరిచిచూసిన వారందరిని హనుమ చంపివేసెను . అప్పుడు హనుమ బిగ్గరగా "నావంటి మహాపరాక్రమశాలురైన వానరయోధులు వేలకొలది సీతాన్వేషణకు పంపబడినారు . ఇంకా అనేక వేలకోట్లమంది మహావీరులైన వానరులు సుగ్రీవుని అదుపాజ్ఞలలో వున్నారు . మాలో కొంతమంది పది ఏనుగుల బలము కలవారు ,ఇంకొంత మంది వంద ఏనుగుల బలము కలవారు . ఇంకొంత మంది అసలు లెక్కించుటకు వీలులేనంత బలము కలవారు . 
దంతములు ,నఖములు (గోళ్లు )ఆయుధములుగా కల ఇట్టి వానరయోధులు వందలు ,వేలు ,లక్షలు ,కోట్లమంది వెంట రాగా సుగ్రీవుడు ఇక్కడికి వచ్చి ,మిమ్ములందరిని తుదముట్టించగలడు . మీరు మహాత్ముడైన శ్రీరామచంద్రప్రభువుతో వైరము పెట్టుకున్నారు . ఆ కారణము చేత మీకు చావుమూడినది . మీకు ఆధారభూమి ఐన లంకా నగరము కూడా ఉండదు . మీ ప్రభువైన దుష్టరావణుడు కూడా మిగలడు . "అని హెచ్చరించెను . 

రామాయణము సుందరకాండ నలుబదిమూడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment