Sunday 19 May 2019

రామాయణము సుందరకాండ -ఏబదిమూడవసర్గ

                                   రామాయణము 

                                  సుందరకాండ -ఏబదిమూడవసర్గ 

సందర్భోచితముగా విభీషణుడు పలికిన మాటలు విన్న రావణుడు "నీవు చెప్పినది నిజమే దూతను వధించుట నింద్యము . వానరమునకు తోక చాలా ఇష్టము . కావున ఈ వానరుడు వాలమునకు నిప్పంటించి మన పురవీధులన్నీ త్రిప్పి వదిలివేయండి . తోక కాలటంతో ఈ వానరమే మన నగరమును వదిలి పారిపోతుంది . కాలిన దీని తోకను చూసిన ఈ వానర స్నేహితులు ఇటు వచ్చుటకే భయపడతారు "అని ఆజ్ఞ ఇచ్చెను . 
రావణుడి ఆజ్ఞను విన్న రాక్షస వీరులు పాత బట్టలు త్రేచ్చి వాటిని నూనెలో ముంచి హనుమ వాలమునకు చుట్టి నిప్పు అంటించిరి . అప్పుడు హనుమ బందనములతో ఉండెను . తనకు ఆ బంధనములు త్రెంచుకొని శక్తి ఉన్నప్పటికీ ,రాత్రి చీకటిలో చూసిన లంకా నగరమును ఈ పగటి సమయములో మరిఒకసారి చూచుటకు , యుద్ధమునకు వచ్చినపుడు ఈ నగర పరిస్థితులు మరింతగా తెలిసినచో వీరిని పరిమార్చుట సులభమని భావించి ,ఆ బంధనములను త్రెంచుకొనక మిన్నకుండిపోయెను . 
రాక్షసులు తోక అంటించి మారుతిని వీధులలో త్రిప్ప  సాగిరి . హనుమను చూచుటకు ఇళ్లలో వున్న పిల్లలు ,ముసలివాళ్లు ,ఆడవాళ్లు బయటకు వచ్చిరి . హనుమను చూసిన స్త్రీలలో కొందరు సీతాదేవి వద్దకు వెళ్లి "నీ వద్దకు వచ్చి మాట్లాడి వెళ్లిన వానరమునకు నిప్పు  అంటించారు " అని పలికిరి . అప్పుడు సీతాదేవి అగ్నిదేవుడిని మారుతికి హాని కలిగించవద్దని ప్రార్ధించెను . సీతాదేవి ప్రార్ధన వలన అగ్ని మారుతిని ఏ మాత్రము బాధించక చల్లగా ఉండెను . 
అగ్ని తనను బాధించక చల్లగా ఉండుట గమనించిన మారుతి తనలోతాను "ఇదేమిటి ?అగ్ని మండుచున్నప్పటికీ నాకు ఏ మాత్రము బాధకలగక చల్లగా ఉన్నది . నిన్న నేను సముద్రము లంఘించునపుడు సముద్రము మధ్యలో నుండి హఠాత్తుగా మైనాక పర్వతము పైకి వచ్చెను . అలాగే శ్రీరామునికి సహాయము చేయుటకు అగ్ని దేవుడు కూడా శ్రీరాముని దూతనైన నన్ను బాధించుటలేదు కాబోలు . సీతారాముల ఆశీర్వాదము వలన అగ్ని నన్ను బాధించలేకపోయివుండవచ్చు . నా తండ్రి వాయుదేవుడికి మిత్రుడైన అగ్ని నన్ను పుత్ర తుల్యునిగా భావించి బాధించకపోయివుండొచ్చు . ఇప్పుడు ఈ రాక్షసులకు నా ప్రతాపము చూపవలెను "అని భావించి బంధనములను త్రెంచుకొని రాక్షసులకు అందకుండా లంకానగర ద్వారముపై కూర్చుండెను . ఆ ద్వారమునకు కల గడియను పీకి అక్కడ కల రాక్షసులను పరిమార్చెను . 

రామాయణము సుందరకాండ ఏబదిమూడవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment