Wednesday 15 May 2019

రామాయణము సుందరకాండ -ఏబదియవసర్గ

                                      రామాయణము 

                                     సుందరకాండ -ఏబదియవసర్గ 

సభాభవనమున తన ఎదురుగా వున్న వానరుడైన హనుమంతుడిని చూసి రావణుడు మిక్కిలి కోపముతో ,తన ముఖ్య మంత్రి ఐన ప్రహస్తునితో "ఈ వానరుడెవరో ,ఎందుకు ఇక్కడికి వచ్చాడో తెలుసుకొనండి . ఎవరు పంపగా ఇక్కడికి వచ్చాడో వివరము కనుక్కోండి . కైలాస పర్వతము వద్దకు వెళ్ళినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడే ఇలా వచ్చాడేమో విషయము తెలుసుకోండి .  దుర్భేద్యమైన నా నగరములో ప్రవేశించుటలో ఆంతర్యమేమిటి ?మన వారితో యుద్ధము చేయుటలో ఇతని ఉద్దేశ్యమేమిటో కనుగొనండి "అని పలికెను . 
రావణుడి ఆజ్ఞను అనుసరించి ప్రహస్తుడు హనుమతో "ఓ వానరా !బయపడకు ,నిన్ను ఎవరు ఇక్కడికి పంపారో తెలుపుము . వారు ఎంత గొప్పవారైనను కంగారుపడక తెలుపుము . నీకు ఎటువంటి హాని చెయ్యము . నీవు నిజము చెప్పినచో నిన్ను వదిలివేసెదము . నిన్ను ఎవరు పంపారు . ఇంద్రుడా ,కుబేరుడా ,యముడా ,వరుణుడా లేక విష్ణువా ?చెప్పుము . నేను చాలామంది వానరులను చూసాను . సాదారణముగా వానరులకు ఇంత బలము కానీ తేజస్సు కానీ ఉండదు . ఓ వానరా !నిజాము చెప్పు నిన్ను ఇప్పుడే వదిలివేస్తాము . అబద్ధము చెబితే నీ ప్రాణములు దక్కవు . "అని పలికెను . 
వారికి సమాధానముగా హనుమ "నేను ఇంద్రయమవరుణులలో ఎవరు పంపగా ఇక్కడికి రాలేదు . కుబేరుడికి మిత్రుడను కాను ,విష్ణువు దూతను కాను ,నేను నిజముగానే వానరుడిని ,శ్రీరాముని దూతగా నన్ను తెలుసుకొనుము . నీ (రావణుడి )దర్శనమునకై నేను వనమును పాడుచేసితిని . అప్పుడు రాక్షసవీరులు యుద్ధ కాంక్షతో వచ్చిపడిరి . వారిని ఎదిరించి యుద్ధము చేసితిని . రాక్షస రాజువైన నిన్ను చూడాలనే బుద్ధిపూర్వకంగా బ్రహ్మాస్త్రమునకు కట్టుబడితిని . బ్రహ్మాస్త్రము నన్ను బందించలేదు . బ్రహ్మాస్త్రమే కాదు మరేఇతర అస్త్రములు నన్ను బందించలేవు . నీ కుమారుడికి వారము ఇచ్చిన బ్రహ్మదేవుడే నాకూ ఈ వరమును ఇచ్చినాడు . నీ హితము కోరి నేను చెప్పే మాటలు శ్రద్దగా విను "అని పలికెను . 

రామాయణము సుందరకాండ ఏబదియవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment