Tuesday 21 May 2019

రామాయణము సుందరకాండ -ఏబది ఐదవసర్గ

                                రామాయణము 

                               సుందరకాండ -ఏబది ఐదవసర్గ 

లంకానగరమును పూర్తిగా దగ్దమొనర్చిన పిమ్మట హనుమ తన వాలమును సముద్ర నీటిలో ముంచి అగ్నిని చల్లార్చెను . అప్పుడు హనుమ  కోపము కూడా చల్లారెను . అప్పుడు హనుమ ఆలోచించసాగెను .  "అయ్యో కోపములో నేను అనాలోచితముగా యావత్ లంకా నగరమునకు నిప్పు పెట్టాను . ఈ లంకా నగరంలోనే సీతామాత కూడా ఉన్నది అన్న విషయము కోపములో ఉన్న నా బుద్ధికి తోచలేదు . కోపములో ఉన్న మనిషి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానము నశిస్తుంది . కోపమును అదుపులో పెట్టుకోగలిగిన వాడే నిజముగా గొప్పవాడు . కోపముతో ఆలోచన లేకుండా నా కష్టమును బూడిదలో పోసుకున్న పన్నీరు చేసుకున్నాను . ఇప్పుడు కిష్కింధకు వెళ్లి నా మీద అపారనమ్మకము పెట్టుకున్న సుగ్రీవునకు ,రామలక్ష్మణులకు నా ముఖుము ఎలా చూపించాలి ?
నా పిచ్చి పని వలన అయోధ్య నుండి కిష్కింద వరకు అందరిని బాధించినవాడిని అయితిని . "అని తానునుతాను పెక్కువిధములుగా నిందించుకొనెను . పిదప హనుమ మళ్లీ ఇలా ఆలోచించుకోసాగేను . "మంగళస్వరూపిణి ఐన సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షించును . సీతాదేవి ధర్మస్వరూపుడు ఐన శ్రీరాముని భార్య ఆమె పాతివ్రత్యమే భద్రకవచమై ఆమెను రక్షించెను . అట్టి జానకీ దేవిని తాకుటకు అగ్నిదేవుడు అశక్తుడు . ఈ లోకమునందు దేనినైనా దహించివేయగల అగ్ని నా వాలమును మాత్రము కాల్చలేదు .   అగ్ని నావాలామునే కాల్చలేదు ఇక సీతాదేవిని ఎలా కాల్చుతాడు ?"అని అనుకుని ధైర్యము తెచ్చుకొనెను . అప్పుడు హనుమ చారిణుల మాటలు వినెను . "లంకా నగరమంతా అగ్నితో నిండిపోయినది . సముద్రము పక్కనే ఉన్న లంక అగ్ని వ్యాపించి మరో సముద్రము వలె వున్నది . సముద్రములో అలలు వలె అగ్ని కెరటములు ఎగిరిపడుచున్నవి . కానీ చిత్రముగా సీతాదేవికి మాత్రము ఏమి కాలేదు . ఇది అద్భుతముగా వుంది ఆశ్చర్యమును కలిగించుచున్నది "అనే చారణుల మాటలు విన్న హనుమ పరమానందభరితుడయ్యెను . ఆ మాటలవలన సీతాదేవి క్షేమముగా ఉన్నట్టు తెలుసుకున్న హనుమ స్వయముగా సీతాదేవిని మఱల దర్శించి తిరుగు ప్రయాణమవ్వవలెనని నిశ్చయించుకొనెను . 

రామాయణము సుందరకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

No comments:

Post a Comment