Tuesday 21 May 2019

రామాయణము సుందరకాండ -ఏబదినాల్గవసర్గ

                                      రామాయణము 

                                   సుందరకాండ -ఏబదినాల్గవసర్గ 

లంకానగర ముఖద్వారముపై కూర్చుని ఉన్న హనుమ తదేకదృష్టితో లంకా నగరమును చూస్తూ ఉప్పొంగిన ఉత్సాహముతో అనంతరకర్తవ్యమును గూర్చి ఆలోచించసాగెను . "అశోకవనము ధ్వంసము అయినది . ప్రముఖులైన రాక్షసులందరూ మరణించిరి . సైన్యములో కొంతబాగము నశించినది . ఇక లంకా నగరము నాశనము చేయుటే మిగిలిఉన్నది . అది కూడా చేసినచో నా శ్రమ ఫలించినట్టే . నా వాలమున ప్రజ్వలించుచున్న ఈ అగ్ని దేవుడికి (తనను దహించక ,ఏమాత్రము బాధ కలిగించక చల్లగా చూసినందుకు కృతజ్ఞతగా )ఈ మహాభవనములను ఆహుతిగా సమర్పించెదను . "అని అనుకుని లంకా నగరంలోని భవనములపై ఒకదాని మీద నుండి ఇంకొక దాని మీదకు దూకసాగెను . 
మహా పరాక్రమము కల హనుమ మొదట ప్రహస్తుని ఇంటిపై వాలి ఆ ఇంటికి నిప్పు అంటించెను . (ప్రధాన మంత్రి గృహముతో లంకా నగర దహన కార్యక్రమమునకు బోణి కావించెను . "పిదప మారుతి వరుసగా మహాపార్మ్వుని భవనము ,వాగ్రద్రంష్టుడి భవనము ,శుకుని భవనము ,సారణుని భవనము ,ఇంద్రజిత్తు భవనము ,జంబుమాలి భవనము ,సుమాలి భవనములు నిప్పు అంటించేను . తదుపరి మారుతి క్రమముగా రశ్మికేతుడు ,సూర్యశత్రువు ,హ్రస్వకర్ణుడు ,దంష్ట్రుడు ,రోమశుడు ,మత్తుడు ,ధ్వజగ్రీవుడు ,విద్యుజ్జిహ్వుడు ,ఘోరుడు ,హస్తిముఖుడు ,కరాళుడు ,పిశాచుడు ,శోణితాక్షుడు ,కుంభకర్ణుడు ,మకరాక్షుడు ,యజ్ఞశత్రువు ,నరాంతకుడు ,కుంభుడు ,నికుంభుడు ,దురాత్ముడు మొదలగు వారి గృహములను దహించివేసెను . 

అందరి గృహములను దహించిన మారుతి విభీషణుడి ప్రాకారమును కూడా తాకలేదు . తనకు రావణసభలో తనకు అండగా నిలిచి ధర్మవచనములు పలికినందుకు విభీషణుడి భవనమును విడిచిపెట్టెను . పిదప అతడు రావణుని భావనమునకు కొద్ద నిప్పు పెట్టి ప్రళయకాల మేఘము వలె గర్జించెను . మహాబలశాలి ఐన అగ్ని దేవుడు వాయువు తొడగుట వలన మంటలు చెలరేగగా వృద్ధిపొంది ప్రళయాగ్ని వలె ప్రజ్వలించేను . ఆ లంకా నగరంలోని సమస్త భవనములు శిధిలమైపోయినవి . అప్పుడు అక్కడి రాక్షసులు అయ్యో అని పెద్దగా గగ్గోలుపెట్టిరి . పెక్కుమంది రాక్షసులు మరణించిరి . చాలామంది గాయపడిరి . లంకా నగరము నాశనము పొందుట చూసిన సకల దేవతలు వాయునందనుడైన హనుమను వేనోళ్ళ పొగిడిరి . 


రామాయణము సుందరకాండ ఏబదినాల్గవసర్గ సమాప్తము . 

            శశి '

ఎం . ఏ .ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment