Friday 28 June 2019

రామాయణము యుద్ధకాండ -పదిహేడవసర్గ

                                  రామాయణము 

                                     యుద్ధకాండ -పదిహేడవసర్గ 

విభీషణుడు ఆ విధముగా రావణునితో పలికి ,అక్కడ నుండి బయలుదేరి ,ఆకాశ మార్గములోనే ,రామలక్ష్మణులు సుగ్రీవాది వానరులు ఉన్న సముద్ర ఆవలి తీరమునకు చేరి ,ఆకాశములోనే నిలిచి తనను చూస్తున్న సుగ్రీవుడితో మిగిలిన వానరులతో "నా పేరు విభీషణుడు ,నేను రావణుని తమ్ముడిని ,పేరులో మాత్రమే కాక ప్రవర్తనలో కూడా దుర్మార్గుడైన ఆ రాక్షసుడు సీతాదేవిని అపహరించెను . దారిలో అడ్డు వచ్చిన జటాయువును చంపెను . నేను అనేకసార్లు అది మంచిపని కాదు ,సీతామాతను క్షేమముగా శ్రీరామచంద్రుడికి అప్పగించమని చెప్పివున్నాను . కానీ అతడు నా మాటలు పెడచెవిన పెట్టటమే కాకుండా నన్ను నానా దుర్భాషలాడేను . సభలో నన్ను అవమానించేను . అది తట్టుకోలేక నేను అతడిని వదిలి శ్రీరాముడిని శరణు వేడి ఆయన పక్షంలో చేరుటకు వచ్చి ఉన్నాను . ఈ విషయములు శ్రీరామునికి విన్నవించి ఆయన దర్శనమునకు నాకు అనుమతి ఇవ్వమని అడగండి "అని పలికెను . 
ఆ మాటలు విన్న సుగ్రీవుడు పరుగుపరుగున వెళ్లి శ్రీరామునికి విభీషణుడు వచ్చిన విషయము విన్నవించెను . పిదప శ్రీరాముడి ఆజ్ఞ మేరకు సుగ్రీవుడు విభీషుణుడు నమ్మదగినవాడు కాదని తెలిపెను , పిమ్మట శ్రీరాముడు మిగిలిన వానర ప్రముఖులను కూడా వారివారి అభిప్రాయములు తెలుపమని అడిగెను . అప్పుడు అక్కడ వున్న ప్రముఖులైన వానరులు ,జాంబవంతుడు తమతమ అభిప్రాయమును తెలిపిరి . చివరిలో హనుమ విభీషణుడిని నమ్మవచ్చునని తన అభిప్రాయమును తెలిపెను . 

రామాయణము యుద్ధకాండ పదిహేడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Thursday 27 June 2019

రామాయణము యుద్ధకాండ -పదునాఱవసర్గ

                                 రామాయణము 

                                  యుద్ధకాండ -పదునాఱవసర్గ 

విభీషణుడు పలికిన మాటలు విన్న రావణుడు మిక్కిలి కోపముతో "ఓ విభీషణా !ప్రాణాపాయకరమై ,కోపముతో బుసలు కొట్టుచున్న మహా విషసర్పముతో కలిసి అయినా జీవించవచ్చును కానీ ,మిత్రుడి వలె ప్రవర్తించుచు ,శత్రుపక్షపాతబుద్ధితో వున్న జ్ఞాతితో మాత్రము ఎన్నడూ నివసింపరాదు . రాక్షసా !ఈ లోకములోని దాయాదుల స్వభావము నేను పూర్తిగా ఎరుగుదును . ఈ జ్ఞాతులందరూ తమ దాయాదులు దుఃఖములు పాలయినపుడు మిక్కిలి సంతోషపడుదురు . 
అదే వారు తమకంటే ఉన్నత స్థితిలో వున్నా ,విడవాసుడైనా ,కార్యదక్షుడైనా ,శూరుడైనా అట్టి వాడిని ఈ జ్ఞాతులు ఎల్లప్పుడూ అవమానించుచు ఉందురు . ఈ జ్ఞాతులు తమ దాయాదులు కష్టములలో ఉన్నప్పుడు చేయూతనివ్వకపోగా ,ద్రోహము తలపెట్టుచుందురు . మిక్కిలి ఆనందించుచుందురు . 
ఓ విభీషణా !నేను అన్నిలోకములలో గౌరవాదరములు పొందినవాడను ,ఐశ్వర్యవంతుడను ,ఉత్తమవంశమున జన్మించినవాడను ,శత్రువులను పాదాక్రాంతులను చేసుకొనినవాడను . ఇటువంటి నా ఔన్నత్యములు చూసి నాజ్ఞాతివైన నీవు ఇంతగా అసూయపడుచున్నావు . ఛీ !నీవు వంశమున చెడబుట్టినవాడవు . నా తమ్ముడవైనందున బ్రతికిపోయావు . నీవు త్రప్పు ఇంకొకరు ఇలా మాట్లాడినచో వారిని వెనువెంటనే చంపివేసెదను . "అని పలికెను . 
రావణుడు ఇలా పలుకగా ధర్మవర్తనుడైన విభీషణుడు 'ఇక ఇచట ఉండరాదు 'అని భావించి ,గదను చేతబూని ఆకాశములోకి ఎగిరెను . విభేషణుడి వేనుక మరో నలుగురు రాక్షసులు కూడా ఆకాశములోకి ఎగిరిరి . అలా ఆకాశములోకి ఎగిరిన విభీషణుడు ,రావణునితో "రావణా !నీవు నాకంటే పెద్దవాడివగుటచే ఇష్టము వచ్చినట్టు పలుకుచున్నావు . ఆయువు మూడినవారు తమ హితము కోరి పలికిన మంచి మాటలను చెవికి ఎక్కించుకోరు . ఆపద వచ్చినపుడు రాజు హితాహితములు పట్టించుకొనక రాజుకు నచ్చినట్టే మాట్లాడువారు ఈ లోకములో కోకొల్లలు . నీ హితము కోరే నేను పరుష వచనములు పలికితిని . అందులకు నన్ను క్షమించుము . ఏది ఏమైనను నిన్ను నీవు రక్షించుకొనుము . ఈ లంకా నగరమును కూడా రక్షించుకొనుము . నేను వెళ్లిపోవుచున్నాను . నీవు హాయిగా ఉండుము . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదునాఱవసర్గ సమాప్తము . 

       శశి ,

ఎం.  ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Wednesday 26 June 2019

రామాయణము యుద్ధకాండ -పదునైదవసర్గ

                                  రామాయణము 

                                       యుద్ధకాండ -పదునైదవసర్గ 

విభీషణుడు ఎంతో దూరదృష్టితో పలికిన పలుకులు విన్న ఇంద్రజిత్తు "ఓ పినతండ్రీ !నీవు పిరికివాని వలె నిరర్ధకములైన మాటలు మాట్లాడుతున్నావేమిటి ?మన పౌలస్త్య వంశములో ఇంతటి పిరికివాడు ఇప్పటివరకు పుట్టివుండలేదు . మానవమాత్రులైన రాకుమారులు మనముందు ఒక లెక్కా ?మనలోని ఒక సాధారణ రాక్షసుడు కూడా వారిని చంపగలడు . నీవు భయపడటమే కాకుండా మమ్మల్నందరినీ భయపెట్టుటకు చూస్తున్నావు . నేను త్రిలోకాధిపతి ఐన ఇంద్రుడినే రాజ్యభ్రష్టుడిని చేసి ,భూలోకములో బంధించాను . అప్పుడు దేవతలందరూ నాలుగువైపులా భయముతో పారిపోయారు . అంతటి మహావీరుడైన నాకు మానవమాత్రులు ఒక లెక్కా ?"అని పలికెను . 
ఇంద్రజిత్తు మాటలు విన్న విభీషణుడు "నాయనా !ఇంద్రజిత్తూ ! నీవు ఇంకా బాలుడవు ఈ విషయములు అన్ని అర్ధము చేసుకునే వయసు నీకు లేదు . నీవు బాల్యచాపముతో ఇలా పలుకుతున్నావు . శ్రీరాముని బాణములు బ్రహ్మదండములు వలె ,నిప్పులు గ్రక్కేవి . మృత్యుసమములు . "అని పలికి రావణునితో "మహారాజా !రత్నములు ,విలువైన ఆభరణములు ,దివ్యవస్త్రములు కానుకులుగా సమర్పిస్తూ సీతాసాధ్విని శ్రీరామునికి అప్పగించుట ఉత్తమము "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదునైదవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Thursday 20 June 2019

రామాయణము యుద్ధకాండ -పదునాల్గవసర్గ

                               రామాయణము 

                                యుద్ధకాండ -పదునాల్గవసర్గ 

కుంభకర్ణుడి ,మహాపార్శ్వుడి ,రావణుని మాటలు విన్న విభీషణుడు "మహారాజా !సీతాదేవి మీ కంటికి ఒక సుందరస్త్రీలా కనిపిస్తోందేమో ?కానీ నిజానికి ఆమె ఒక భయంకరమైన సర్పము వంటిది . ఆ సర్పము జోలికి వెళ్లిన ఎవడు ప్రాణములతో వుండలేడు . అటువంటి మహా సర్పమును నీ మెడకు చుట్టుకోకు . భయంకరమైన వానరసైన్యముతో రాముడు లంకపై దండెత్తక ముందే సీతను ఆమె భర్తకు అప్పగించు . నీవు కానీ ,కుంభకర్ణుడు కానీ ఇంద్రజిత్తు కానీ మహాపార్శ్వుడు కానీ ఇంకా మిగిలిన రాక్షస ప్రముఖులు కానీ యుద్దములో శ్రీరాముని ఎదురుగా నిలిచి బ్రతకలేరు . నీవు ఇంద్రుడి వెనక దాగుకున్నా ,పాతాళములో దాక్కున్నా రాముడి బాణముల నుండి తప్పించుకొనలేవు ". అని పలికెను . 
ఆ మాటలు విన్న ప్రహస్తుడు "మాకు దేవదానవయక్షగంధర్వకిన్నెరకింపురుషులలో ఎవరివల్లా భయములేదు ఇక సాధారణ మానవుడైన రాముడికి భయపడుట హాస్యాస్పదం "అని పలికెను . ఆ మాటలు విన్న విభీషణుడు "ప్రహస్తా !చెడు ప్రవర్తన కలవాడు ఏ విధముగా స్వర్గమును పొందలేడో ,నౌకలేనివాడు ఏ విధముగా సముద్రమును దాటలేడో అదే విధముగా సీతాపహరణ దోషము చేసిన రావణుడు కానీ అతని పరివారము కానీ రాముడిని యుద్దములో జయించలేరు . శ్రీరాముడు ఇక్ష్వాకు వంశములో పుట్టిన పురుషోత్తముడు . అతడు అవలీలగా విరాధుడు ,కబంధుడు ,వాలి ,ఖరదూషణాదులు ఇంకా పదునాలుగువేల రాక్షసయోధులను పరిమార్చాడు . అట్టి మహావీరుడు ఎదుట దేవతలు కూడా ఓడిపోవుదురు . 

రావణుడు వ్యసన లొనుడై తానూ నశించుటే కాక సమస్త రాక్షస లోకమును నశింపచేయుటకు పూనుకొనియున్నాడు . మీరందరూ రావణుని హితులు అతడి చేత పెక్కు ప్రయోజనములు పొందినవారు . మిత్రులు . భయంకరములైన శక్తివంతములైన భూతములు పట్టిన వాడిని ,అతడి హితులు బలవంతముగా ఆ ప్రభావము నుండి లాగినట్టు ,మీరు ఇతడి జుట్టుపట్టి లాగి అయినను అనుచితమార్గము నుండి మరల్చండి . ప్రభువు హితము కోరి సముచిత సూచనలు చేయండి "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదునాల్గవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









రామాయణము యుద్ధకాండ -పదమూడవసర్గ

                                      రామాయణము 

                                   యుద్ధకాండ -పదమూడవసర్గ 

కుంభకర్ణుడి మాటలు విన్న రావణుడు కోపముతో ఊగిపోసాగెను . అది గమనించిన మహాపార్శ్వుడు లంకాధిపతి కోపము తొలగించుటకు "ప్రభూ !నీవు ఆ సీతకు సంవత్సరకాలం గడువు ఇవ్వవలిసిన అవసరము ఏమి వున్నది ?ఆమెకు ఇష్టము లేకున్నా వివాహము చేసుకొనవచ్చును కదా !ఎందుకు ఆమె అంగీకారము కొఱకు ఎదురుచూడటం ?ఆమెను బలవంతముగా తీసుకువచ్చినట్టే ,వివాహము కూడా చేసుకో "అని పలికెను . 
ఆ మాటలకు కొంత శాంతించిన రావణుడు "ఓ మహాపార్శ్వా !చాలాకాలము క్రితము జరిగిన ఒక రహస్య సంఘటనను నీకు ఇప్పుడు చెబుతాను విను . ఒకనాడు 'పుంజకస్థల 'అను అప్సరస బ్రహ్మదేవుడి వద్దకు ఆకాశమార్గములో వెళుతుండగా చూసి ఆమెను వివాహము చేసుకోవాలని బలవంతముగా తీసుకువచ్చుటకు ప్రయత్నించాను . కానీ అతి కష్టము మీద ఆమె నా నుండి తప్పించుకుని అట్లే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి ,జరిగిన విషయము చెప్పినది . అప్పుడు బ్రహ్మదేవుడు కోపముతో నాకు "స్త్రీ కి ఇష్టములేకుండా బలవంతము చేస్తే మరుక్షణమే తలపగిలి చస్తావని శపించాడు "ఆ శాపమునకు భయపడే ఈ సీతను బలవంతముగా వివాహము చేసుకొనుట లేదు . ఈ లోకములో నా అంత శక్తివంతుడు మరొకడు లేడు . అది తెలియక రాముడు సైన్యముతో యుద్ధమునకు వచ్చుచున్నాడు . వజ్రతుల్యమైన నా బాణములతో ఆ రాముడిని క్షణములో పరిమార్చెదను "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పదమూడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Monday 17 June 2019

రామాయణము యుద్ధకాండ -పన్నెండవసర్గ

                                 రామాయణము 

                                   యుద్ధకాండ -పన్నెండవసర్గ 

రావణుడు సభలో వేంచేసి ఉన్న రాక్షస ప్రముఖులందరినీ చూసి "ఓ రాక్షప్రముఖులారా !రాముడు సుగ్రీవుడితో కూడి సమస్త వానర భల్లూక సేనలతో కలిసి సముద్రము ఆవలి తీరమునకు చేరినాడు అని మన గూఢచారులద్వారా తెలిసినది . ఏది ఏమయినప్పటికీ సీతను రాముడికి అప్పగించేది లేదు . సీతను నేను చాలా ఇష్టపడి తీసుకువచ్చాను . ఆమె తన మనసు మార్చుకొనుటకు ఒక సంవత్సరము గడువు ఇచ్చాను . ఇప్పుడు మన తక్షణ కర్తవ్యమును ఆలోచించండి . కుంభకర్ణుడు 6 నెలల నుండి నిద్రలో వున్నాడు . ఈరోజే నిద్రలేచాడు సభకు కూడా వచ్చి వున్నాడు "అని పలికెను .

అప్పుడు విషయము అంతా తెలుసుకున్న కుంభకర్ణుడు రావణునితో "అన్నా !నీవు సీతాదేవి విషయములో చేసినది చాలా తప్పు నిన్ను ఇప్పటివరకు రాముడు చంపకుండా ఉండుట ,నీ అదృష్టము . నీవు ఇప్పుడు సలహా అడుగుట కంటే ,సీతాదేవిని అపహరించునపుడు మా అందరి సలహా అడిగివుంటే బాగుండేది . సరే జరిగినదేదో జరిగినది . యుద్ధ విషయములో నీవు బయపడనవసరము లేదు . రాముడు ఒక బాణము వేసి ,రెండవ బాణము తీసే లోపల నేను అతడి రక్తమును మొత్తము త్రాగివేసెదను . పర్వతాకారములో ఉన్నశరీరముతో నేను యుద్ధరంగములో ఉండగా నన్ను జయించుట దేవేంద్రుడికి సైతము సాధ్యము కాదు . ఇక సాధారణ మానవుడైన ,శ్రీరాముడు ఒక లెక్కా ?వారనులందరిని చంపివేయుదును . రాముడు మృత్యు ముఖమునకు చేరిన పిమ్మట సేత శాశ్వతముగా నీకు వశమవుతుంది . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పన్నెండవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము యుద్ధకాండ -పదకొండవసర్గ

                                  రామాయణము 

                                  యుద్ధకాండ -పదకొండవసర్గ 

రావణుని మంచి కోరి ,విభీషణుడు మంచి చెప్పినప్పటికీ ,రావణుడు వినిపించుకోలేదు . ఇప్పుడు యుద్ధము అనివార్యమని గ్రహించిన రావణుడు తక్షణ కర్తవ్యము ఆలోచించుటకు సభకు రధాన్ని అధిరోహించి ,సభా భవనమునకు వెళ్లి ప్రముఖులైన రాక్షసులకు సభకు రమ్మని కబురుపెట్టెను . రావణుడి కబురు అందుకున్న రాక్షస ప్రముఖులు వెనువెంటనే వారివారి రథాలను అధిరోహించి ,సభాభవనమునకు వెళ్లిరి . ముందుగా విభేషణుడు సభకు వచ్చి రావణుడి పాదాలకు నమస్కరించి ,తన ఆసనంపై కూర్చున్నాడు . మిగిలిన రాక్షసప్రముఖులు కూడా అదే విధముగా ముందుగా రావణుడి పాదములకు నమస్కరించి ,తమతమ ఆసనములపై కూర్చున్నారు . 

రామాయణము యుద్ధకాండ పదకొండవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Friday 14 June 2019

రామాయణము యుద్ధకాండ -పదవసర్గ

                                     రామాయణము 

                                            యుద్ధకాండ -పదవసర్గ 

విభీషణుడు ధర్మతత్వాలు బాగుగా తెలిసినవాడు . సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుటే పరమధర్మము అని భావించి ఏమాత్రము జంకు లేక అన్నకు హితము చెప్పుటకు పూనుకుని మరునాడు ఉదయమే అన్న రాయణుడి అంతఃపురమునకు వెళ్లెను . అక్కడికి వెళ్లిన విభీషణుడు రావణునికి నమస్కరించి ,అన్న ఆజ్ఞతో ఆసనంపై కూర్చుని "అన్నా !నీవు సీతాదేవిని అపహరించి తీసుకువచ్చిన దగ్గరనుండి ఈ లంకా నగరములో పెక్కు అపశకునములు కనపడుచున్నవి . కావున జరగబోవు అనర్థములను ఊహించి ,మనకు లంకా నగరమునకు ,మన ప్రజలకు మంచిని కోరి ,సీతామాతను ఆమె భర్త చెంతకు చేర్చు . ప్రహస్తుడు మొదలగు మంత్రులందరూ నీతో ఇలా చెప్పుటకు భయపడుతున్నారు . కావున అన్ని విషయములు లోతుగా అలోచించి ,సముచితముగా కార్యమును చేయుము . "అని పలికెను . 

ఆ మాటలు విన్న రావణుడు కోపముతో "ఇప్పుడు నేను ఏ మాత్రమూ భయపడుటలేదు . ఎట్టి పరిస్థితులలో సీతను రాముడికి అప్పగించను . శ్రీరాముడు నన్ను గెలుచుటకు ఇంద్రాది దేవతలతో కూడి వచ్చినా అతడు నా ముందు నిలవలేడు . "అని పలికి తన తమ్ముడైన విభీషణుడిని అక్కడి నుండి పంపివేసెను . 

రామాయణము యుద్ధకాండ పదవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Tuesday 11 June 2019

రామాయణము యుద్ధ కాండ -తొమ్మిదవసర్గ

                                     రామాయణము  

                                        యుద్ధ కాండ -తొమ్మిదవసర్గ 

అప్పుడు నికుంభుడు ,రబసుడు ఇంకా ఆ సభలోని బలవంతులైన రాక్షసులు ఒక్కసారిగా పైకి లేచి ,"మోసముతో ఈ లంకా నగరములో ప్రవేశించిన ఆ వానరుడిని మేము చంపివేస్తాము ."అని పలికిరి . అలా ఆయుధములు చేతితో పట్టుకుని యుద్ధ ఉత్సాహములో ఉన్న రాక్షసులను ఆపి ,వారందరిని కూర్చొండబెట్టి రావణుడికి అంజలి ఘటించి 

"నాయనలారా !ఎంతటి క్లిష్టమైన కార్యమునైనా సాధించుటకు సామదానభేద ఉపాయములను ఉపయోగించవలెను . అవి సాధ్యము కానిచో  చివరిదైన దండుపాయమును ఉపయోగించాలి . 
శ్రీరాముని సైన్యములో ఒక్కడు గొప్పదైన సముద్రమును దాటి మన లంకా నగరమునకు వచ్చినాడు . శ్రీరాముని సైన్యములో అపారమైన సైన్యము కలరు . వారందరూ బలపరాక్రమములు కలవారు . శతృవు యొక్క బలాబలములు ఎరుగక అనాలోచితముగా వారిని చులకనగా చూడుట మంచిదికాదు . అసలు శ్రీరాముడు మన ప్రభువు చేసిన అపకారము ఏమిటి ?ఇంకా మన రాజే అతడి భార్యను అపహరించాడు . శ్రీరాముడు ఖరుడిని వధించుట తప్పుగా చూడరాదు . ఖరుడే శ్రీరాముని  మీదకు యుద్ధముకు వెళ్లి ఆయన చేతిలో మరణించాడు . 
పరస్త్రీని తాకుట మహాపాపము . సీతాదేవిని అపహరించితీసుకురావటంచేత మనకు కూడా భయము పట్టుకున్నది . కావున సీతాదేవిని వారికి అప్పగించటం ఉత్తమము . శ్రీరాముడు ధర్మనిరతుడు ,మహావీరుడు అట్టివానితో యుద్ధమునకు దిగుట మంచిది కాదు . శ్రీరాముడు  బాణములతో ఈ సమస్త లంకా నగరమును చిన్నాభిన్నము చేయకముందే జానకిని ఆయన వద్దకు చేర్చుట మంచిది . అట్లు చేయనిచో మన నగరము మట్టిపాలవుట తధ్యము . నీవు సీతాదేవిని అప్పగించుట ద్వారా నీకే కాదు నీ బంధు మిత్రులకు ఆపద తొలగి ,ప్రశాంతముగా ఉంటాము . "అని పలికెను . 
రాక్షస రాజైన రావణుడు విభీషణుడి మాటలు విని ఏమి మాట్లాడక తన భవనమునకు వెళ్లెను . 

రామాయణము యుద్ధకాండ తొమ్మిదవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Sunday 9 June 2019

రామాయణము యుద్ధకాండ -ఎనిమిదవసర్గ

                              రామాయణము 

                                యుద్ధకాండ -ఎనిమిదవసర్గ         

రాక్షస సేనానాయకుడైన ప్రహస్తుడు "దేవ, దానవ, యక్ష ,కిన్నెర, కింపురుష ,నాగుల వల్ల ఎవరివల్ల ఎదిరింప శక్యము కానీ నీవు రాజ్య పాలన చేయుచుండగా మనము సుఖముగా ఉంటిమి . అలా మనము ఆదమరపుగా ఉండగా ఆ వానరుడు వచ్చి లంకను నాశనము చేసినాడు . మనము జాగరూపులమై  వున్నచో ఎవడు మన వంక చూసే ధైర్యము కూడా చేయలేడు "అని రావణునితో పలికెను . 
అప్పుడు దుర్ముఖుడు అను రాక్షసుడు "రాజా !మన అనుమతి లేకుండా లంకా నగర ప్రవేశము ,అంతః పుర ప్రవేశము ,లంకా నగర దహనము ఇవి క్షమించరాని నేరములు . నేను ఒక్కడినే ఆ వానరుడు ఎక్కడ వున్నను ,వెతికి చంపెదను . అతడిని ఒక్కడినే కాదు ఒక్క వానరుడిని కూడా వదలక చంపెదను . "అని పలికెను . 
పిమ్మట మహాబలశాలి ఐన వజ్రద్రంష్టుడు అనే వాడు పరిఘనుచేతపట్టి "ప్రభూ !నాకు అనుమతి ఇచ్చినచో ,రామలక్ష్మణులను ,సుగ్రీవుడిని సమస్త వానరులను పరిమార్చెదను . "అని పలికెను . ఇలా ఆ సభలో వున్న ప్రముఖులైన రాక్షసులందరూ రావణుని ఎదుట ప్రగల్భములు పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఎనిమిదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




రామాయణము యుద్ధకాండ -ఏడవసర్గ

                             రామాయణము 

                                 యుద్ధకాండ -ఏడవసర్గ 

రాక్షసులు బలశాలురు అయినప్పటికి వారు బుద్ధిలేనివారు శత్రువుబలము తెలియనివారు కావున వారు రావణునితో "ప్రభూ !నీవు మహాబలపరాక్రమవంతుడివి . నీవు ఇలా పలుకుట సబబుగాలేదు . నీవు భోగవతీనగరమును జయించి సమస్త సర్పములను తరిమి కొట్టితివి . నీవంటే భయముతో వారందరూ పాతాళలోకమునకు పారిపోయిరి . అయినను వారిలో ప్రముఖులను పట్టి తెచ్చితివి . స్వయముగా పరమేశ్వరుడి స్నేహితుడైన కుభేరుడిని అతడి అపారమైన యక్ష సైన్యమును ఓడించి నావు . పుష్పకమును  తెచ్చినావు . 
ఓ రాక్షస శ్రేష్టా !నీమీద భయముతో దానవులతో ప్రముఖుడైన మయుడు తన కుమార్తె మండోదరికి నీకిచ్చి వివాహము చేసినాడు . ఇతరులకు ఎదిరింపశక్యము కానీ వాడు నీ చెల్లెలి భర్త ఐన కుంభీనసుని అదుపుచేసినావు . ఇంకా ఎంతో మందిని నీ పరాక్రమముతో అదుపుచేసితివి . వరుణదేవుడి కుమారులను ,వారి చతురంగ బలములను జయించితివి . యముని సైన్యమును అల్లకల్లోలపరచి మృత్యువును జయించితివి . అట్టి వారందరిని జయించిన నీకు సాధారణ మానవుడైన రాముడొక లెక్కా ?
ఓ రాజా !నీవరకు అవసరమే లేదు . మహాబాహువైన ఇంద్రజిత్తు ఒక్కడే వానరులందరినీ మట్టికరిపించగలడు . ఇంద్రుడిని సైతము జయించి బందించగా బ్రహ్మ దేవుడి మాట కొరకు అతడిని వదిలివేసినాడు . అంతటి పరాక్రమవంతుడు ఇంద్రజిత్తు . ఈ విషయము ఇంద్రజిత్తుకే అప్పగించుము . శ్రీరాముడితో సహా ,వానరులందరినీ ఇంద్రజిత్తు చిత్తూ చేయగలడు . "అని పలికిరి . 

రామాయణము యుద్ధకాండ ఏడవసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Saturday 8 June 2019

రామాయణము యుద్ధకాండ -ఆరవసర్గ

                               రామాయణము 

                                      యుద్ధకాండ -ఆరవసర్గ 

హనుమ లంకా నగరమును ధ్వంసము చేసి వెళ్లిన పిమ్మట రావణుడు ప్రముఖులైన రాక్షసవీరులతో తన మంత్రులతో సమావేశమయ్యెను . పిమ్మట వారితో "ఓ రాక్షసులారా !శత్రుదుర్భేద్యమైన ఈ లంకా నగరంలోకి ఒక వానరుడు ప్రవేశించి ,జానకిని దర్శించగలిగెను . అశోకవనమును ధ్వంసము చేసెను . లంకా నగరంలోని బవనములను  ధ్వంసము చేసెను . ఇప్పుడు రాక్షసుల రక్షణార్ధము ఏమి చేయవలెనో ఆలోచించుడు . ఆ వానరం మాటలు బట్టీ త్వరలోనే రాముడు కూడా ఇక్కడికి రాగలడని నాకు అనిపిస్తోంది . అతడి పరాక్రమమును నేను ఇంతకూ ముందే విని ఉన్నాను . అతడే అలా రావాలని అనుకుంటే అతడు అపారమైన సముద్రమును అవలీలగా దాటగలడు . లేదా మరో మార్గము ద్వారా అయినా లంకకు చేరగలడు . కావున వానరులను ఎదుర్కొనుటకు ,,మన లంకా నగరమును సైన్యమును కాపాడుటకు తగిన సలహాలు ఇవ్వండి "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఆరవసర్గసమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -అయిదవసర్గ

                                  రామాయణము 

                                      యుద్ధకాండ -అయిదవసర్గ 

సమస్తమైన వానరసేనతో సముద్రతీరమునకు చేరిన శ్రీరాముడు సీతాదేవిని తలుచుకుని దుఃఖమునకు లోనయ్యేను . ఆయన దుఃఖము చూసిన లక్ష్మణుడు తన అన్నగారిని ఊరడించెను . పిమ్మట శ్రీరాముడు ఊరటచెంది ,ధైర్యము తెచ్చుకుని తదనంతర కర్తవ్యమును ఆలోచించసాగెను . 

రామాయణము యుద్ధకాండ అయిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

Friday 7 June 2019

రామాయణము యుద్ధకాండ -నాల్గవసర్గ

                                రామాయణము 

                                     యుద్ధకాండ -నాల్గవసర్గ 

హనుమ తెలిపిన లంకా నగర విశేషాలను విన్న శ్రీరాముడు సుగ్రీవుడితో "సుగ్రీవా !సూర్యుడు ఆకాశమధ్య భాగమునకు చేరి వున్నాడు . ఇది విజయ ముహూర్తము . ఈ ముహూర్తములోనే లంకానగరముపై దండయాత్రకు బయలుదేరుదుము . ఇవ్వాళ ఉత్తరఫల్గుణీ నక్షత్రము ,రేపు హస్త ఇవి మన ప్రయాణమునకు తగినవి . కనుక మన సైన్యమును తీసుకుని వెంటనే బయలుదేరుము . మనము వెళ్లు దారి అరణ్యములతో అనేక భయములతో ఉండును . కావున ముసలివారిని ,ఆడవారిని ,బాలురులను కిష్కిందలోనే ఉండమను . 
మహావీరులైన లక్షమంది సైన్యముతో నీలుడు మార్గము చూపుతూ ముందు నడవవలెను . ఫలములు జలములు సమృద్ధిగా వుండే దారిలో మన సైన్యమును నడపవలెను . పర్వత తుల్యుడైన గజుడు ,మహాబలశాలి ఐన గవయుడు ,గవాక్షుడు ముందు నడవవలెను . సేనానాయకుడైన వృషభుడు సేనను రక్షించుచు కుడివైపు నడవవ లెను . గంధమాదనుడు సేనకు ఎడమవైపు నడవవలెను . 
సుగ్రీవా !నేను హనుమ భుజముల మీద ,లక్ష్మణుడు అంగదుడి భుజముల మీద నీవు పల్లకీలో ముందుకు సాగవలెను . జాంబవంతుడు ,సుషేణుడు ,వేగఁదర్శి వీరు మువ్వురు సేనను రక్షించుచు ,సైన్యమునకు వెనక భాగములో నడవవలెను . "అని పలికెను . ఆ మాటలు విన్న వానరవీరులు సమరోత్సాహముతో ,జయజయద్వానములు చేసిరి . అపారమైన వానరసేన శ్రీరాముని చుట్టూ చేరగా "మనకు జయము తధ్యము "అని పలుకులతో ఉత్సాహముతో వానరవీరులందరూ శ్రీరాముడు చెప్పినట్టుగా ముందుకు సాగుచుండిరి . అలా ముందుకు సాగిన దక్షిణ దిశగా ప్రయాణించి ,సముద్రతీరమునకు చేరిరి . అక్కడ అపారమైన సముద్రమును చూసిన వానరులు ఆశ్చర్యపోయిరి . పిమ్మట అక్కడే విశ్రమించిరి . 

రామాయణము యుద్ధకాండ నాల్గవసర్గ సమాప్తము .  

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Thursday 6 June 2019

రామాయణము యుద్ధకాండ -మూడవసర్గ

                                     రామాయణము 

                                         యుద్ధకాండ -మూడవసర్గ 

సుగ్రీవుడి పలుకులు విన్న శ్రీరాముడు దైన్యము వదిలి ,తదనంతర కార్యము కొరకై ఆలోచించసాగెను . పిదప ఆ మహానుభావుడు హనుమతో "మారుతీ !మనమందరమూ సముద్ర తీరమునకు వెళ్లి సేతువు ఏర్పాట్లు చేసుకొనెదము . ముందుగా నీవు నాకు లంకా నగర భద్రత అచటి రక్షణ వ్యవస్థ గూర్చి నాకు వివరముగా వివరింపుము "అని పలికెను . 
అప్పుడు హనుమ శ్రీరామునితో "స్వామీ !లంకా నగరము సముద్రము ఆవలి ఉన్నది . అసలు అక్కడ నగరము ఉన్నదనే ఎవ్వరికిని తెలియదు . ఆ నగరము చుట్టూ దుర్బేధ్యమైన ప్రాకారములు నిర్మించివుండెను . ఆ ప్రాకారములపై బురుజులపై సైన్యము నిరంతరమూ కాపలా కాయుచు ఉండును . ఆ ప్రాకారములు వద్ద యంత్రములు కలవు . ఆ యంత్రములు శత్రువులపై రాళ్ళ వర్షము కురిపించును . లంకా నగరము బయట చుట్టూ కందకములు లోతుగా త్రవ్వబడి ఉండెను . అవి ముసళ్ళతో భయంకరముగా ఉండెను . 
ఆ కందకములు దాటుటకు చెక్కలతో ఇనుముతో వంతెనలు కలవు . అవి కావలిసినపుడు వేసుకునేలా ,అవసరము లేనపుడు తీసేసేలా ఏర్పాట్లు చేయబడివుండెను . శత్రువులు వచ్చినపుడు వారు వారు ఆ వంతెనపై సగములో ఉండగా ఆవంతెన తీసేసి శత్రువులను ఆ కందకంలో పడేలా ఏర్పాట్లు చేయబడినవి . లంకా నగరము మిక్కిలి శోభాయమానంగా ఉన్నది . అక్కడి గోడలు బంగారముతో తాపడము చేయబడి మణులతో ,రత్నములతో అందముగా అలంకరించబడి ఉండెను . అక్కడి సైన్యము వీరులు వారు కోటికి మించి వుండరు . రావణుడు ఎల్లప్పుడూ అప్రమత్తముగా ఉండి తన సైన్యమును ఉత్సాహపరుస్తూ ఉంటాడు . 
స్వామీ !మనము ఏదేని ఉపాయముచేత సముద్రమును దాటగలిగినట్టయితే మనము యుద్ధము గెలిచినట్టే . లంకా విజయమునకు అంగదుడు ,ద్వివిదుడు ,మైందుడు ,జాంబవంతుడు పనసుడు ,నలుడు సేనాధిపతి ఐన నీలుడు నేను మాత్రమే చాలు మిగిలిన వానరవీరులతో పనేలేదు . అంగదుడు మొదలగు వారు కూడా నాతోపాటు సముద్రమును లంఘించగలరు . మేము లంకకు వెళ్లి లంకా నగరమును ధ్వంసము చేసి అక్కడి వనములను ,ప్రాకారములను ,సమస్త భవనములు నాశనము చేసి సీతామాతను తీసుకురాగలము తగిన విధముగా అలోచించి అటు ఆజ్ఞను వానరవీరులకు ఇమ్ము "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ మూడవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Wednesday 5 June 2019

రామాయణము యుద్ధకాండ -రెండవసర్గ

                             రామాయణము 

                                యుద్ధకాండ -రెండవసర్గ 

శ్రీరామప్రభువు దీనంగా ఉండటం చూసిన సుగ్రీవుడు ,"ప్రభూ !మేమందరమూ మీతో వున్నాము . ఇంతమంది నీకు తోడుగా ఉండగా ఇలా దిగులుగా ఉండుట అనవసరం . పైపెచ్చు దీనంగా ఉండుటవలన కావలిసిన ఆలోచనలు రావు . కావున ఆ దీనత్వమును వదిలి ఆలోచన చేయుము . మనకు ఇప్పుడు సీతామాత జాడ తెలిసినది . శత్రువు జాడ అతడి బలాబలములు కూడా తెలిసినవి .  మనవద్ద వున్న వీరులందరూ మహా పరాక్రమము కలవారు వారు తమ గోళ్ళతో ,రాళ్లతో ,వివిధ ఆయుధములతో శత్రువులను పరిమార్చగల సమర్థులు . 

లంకకు వెళ్ళవలెనంటే సముద్రమునకు వారధి కట్టవలెను . సముద్రమునకు వారధి కట్టకుండా లంకా నగరమునకు చేరుట అసాధ్యము . కావున వారధి కట్టు ఉపాయమును ఆలోచించుము . "అని ధైర్యము చెప్పెను . 

రామాయణము యుద్ధకాండ రెండవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -మొదటి సర్గ

                                రామాయణము 

                                   యుద్ధకాండ -మొదటి సర్గ 

హనుమంతుడి వచనములు విన్న శ్రీరాముడు సంతోషముతో హనుమను కౌగిలించుకొనెను . పరిపరి విధములుగా హనుమను పోగేడేను . శ్రీరాముడు హనుమ తో "మారుతీ !నీవు సాధించిన కార్యములు నీవు తప్ప ఈ లోకములో ఎవ్వరును సాధించలేరు . రాక్షసుల కాపలాలతో కట్టుదిట్టమైన భద్రతల నడుమ వున్న లంకా నగరంలోకి ప్రవేశించుట కాదు కదా !కనీసము దాని వంక చూసెడి ధైర్యమును కూడా ఎవ్వరూ చెయ్యలేరు . ఒకవేళ సాహసించి ప్రవేశించినా ,ప్రాణములతో తిరిగి రాగల మొనగాడెవ్వడు ?. ప్రభువు తనకెంతటి క్లిష్టమైన కార్యము అప్పగించినప్పటికీ ,తన శక్తి యుక్తులతో దానిని సాధించి ,దానికి భంగము కలగకుండా ఇతర కార్యములు కూడా నెరవేర్చువాడే భృత్యులలో అత్యుత్తముడు . 

సీతాదేవి క్షేమసమాచారములు తెలియజేసి నా ప్రాణములు నిలబెట్టిన ధీరుడవు నీవు . ఇంతటి గొప్ప మహోపకారం చేసిన నీకు నేను ఏమి ఇవ్వగలను . ఒక్క గాడాలింగనమే ఇవ్వగలను . ప్రస్తుతము నేను ఇవ్వగలిగిన సర్వస్వము ఇదే . "అని పలికి హనుమను శ్రీరాముడు హృదయమునకు హత్తుకొనెను . పిమ్మట శ్రీరాముడు "నాకొక సందేహము కలుగుతున్నది . ఈ అపారమైన వానరసైన్యముతో సముద్రమును ఎలా దాటాలి ?సీతకూడా నీతో ఇదే సందేహము వెలిబుచ్చినది . ఈ సందర్భములో నీ ఆలోచనఏమిటి ?"అని హనుమతో పలికి శ్రీరాముడు దీర్ఘాలోచనలో పడెను . 

రామాయణము యుద్ధకాండ మొదటిసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


Monday 3 June 2019

రామాయణము సుందరకాండ - అరువది ఎనిమిదవసర్గ

                                         రామాయణము 

                                               సుందరకాండ - అరువది ఎనిమిదవసర్గ 

హనుమ ఇంకనూ ఇలా చెప్పసాగెను . సీతాదేవి "శ్రీరాముని వీలయినంత త్వరగా ఇక్కడకు వచ్చి నన్నుతీసుకువెళ్ళమని చెప్పు "అని చెప్పెను . ఇంకనూ ఆ సాధ్వి నన్ను అచటనే ఆ రాత్రి విశ్రమించి ఉదయమే వెళ్ళమని చెప్పెను . ఇంకనూ సీతామాతకు ఒక సందేహము కలిగెను అది ఏమనగా "ఓ హనుమా !నీవు బలశాలివి కావున వందయోజనములు దూరము వున్న సముద్రమును అవలీలగా దాటి వచ్చినావు . మరి రామలక్ష్మణులు ,మిగిలిన వానరులు సముద్రమును దాటుట ఎట్లు ?అని ఆ సాద్వి నన్ను ప్రశ్నించెను . అప్పుడు నేను "అమ్మా !సుగ్రీవ మహారాజువద్ద నా కంటే బలశాలురైన వానరవీరులు పెక్కుమంది కలరు . వారందరూ అవలీలగా సముద్రమును దాటగలిగినవారే . రామలక్ష్మణులను నా భుజముపై కూర్చోండపెట్టుకుని ఇక్కడకు తీసుకురాగలనని "ఆ మాతకు ధైర్యము చెప్పాను "అని హనుమ శ్రీరాముడితో చెప్పెను . 

రామాయణము సుందరకాండ అరువది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -అరువదియేడవసర్గ

                                రామాయణము 

                           సుందరకాండ -అరువదియేడవసర్గ 

మహానుభావుడైన శ్రీరాముడు ఇలా పలుకగా ,హనుమ సీతాదేవి తనతో పలికిన విషయములు సవివరముగా శ్రీరామునికి విన్నవించెను . సీతాదేవిని తాను తన భుజములపై ఎక్కించుకుని మీ వద్దకు తీసుకువస్తానని చెప్పానని ,దానికి ఆమె పర పురుషులను తాకనని ,రావణుడు తనని తీసుకు వచ్చినపుడు అది విధి వశమున జరిగినదని చెప్పెనని కూడా చెప్పెను . లక్ష్మణుడి కుసలముఅడిగినదనీ సుగ్రీవుని ఇంకా సమస్త వానరవీరుల కుశలమును అడిగినది చెప్పెను . శ్రీరాముని కోసమే ప్రాణములు గుప్పిటలో పెట్టుకుని బ్రతుకుతున్నాని చెప్పెనని హనుమ శ్రీరాముడితో చెప్పెను . 

రామాయణము సుందరకాండ అరువదియేడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -అరువదిఆరవసర్గ

                                రామాయణము 

                              సుందరకాండ -అరువదిఆరవసర్గ 

హనుమంతుడు ఈ విధముగా పలికిన పిమ్మట శ్రీరాముడు చూడామణిని హృదయమునకు హత్తుకుని మిక్కిలి విలపించెను . అన్నగారిని చూసిన లక్ష్మణుడు కూడా విలపించెను . అప్పుడు శ్రీరాముడు సుగ్రీవునితో "సుగ్రీవా !ఈ చూడామణిని మా వివాహసమయములో మా మామగారు ఐన జనకమహారాజు సీతాదేవికి ఇచ్చెను . ఆమె దీనిని ధరించిన వెంటనే దీని అందము రెట్టింపు అయ్యెను . దీనిని చూసిన వెంటనే మా తండ్రి గారిని ,మా మామగారిని చూసినట్టు వున్నది . ఈ చూడామణిని జనకమహారాజుకి ఆయన చేయు యజ్ఞములకు సంతసించిన దేవేంద్రుడు ఇచ్చెను "అని పలికెను . 
పిమ్మట శ్రీరాముడు హనుమతో "హనుమా !సుందరాంగి ,సహజముగా భయపడు స్వభావము కలది అయిన సీతాదేవి ,ఆ రాక్షసుల మధ్య ఎలా ఉంటోందో ?ఎన్ని బాధలు అనుభవిస్తోందో ?హనుమా !నా సీత ఇంకా ఏమి చెప్పినదో నాకు వివరముగా చెప్పుము . ఇప్పుడు ఆమె మాటలే నా ప్రాణములను నిలుపుచున్నవి . అంత దుఃఖము పొందుచున్న సీతాదేవి ఎలా ఉండగలుగుతుంది ?"అని ప్రశ్నించెను . 

రామాయణము సుందరకాండ అరువదిఆరవసర్గ సమాప్తము . 

             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -అరువదియైదవసర్గ

                                     రామాయణము 

                                     సుందరకాండ -అరువదియైదవసర్గ 

రామలక్ష్మణులు ,సుగ్రీవుడి వద్దకు వెళ్లిన వానరులు సుగ్రీవునికి ,రామలక్ష్మణులకు నమస్కారము చేసి ,మారుతిని సీతాన్వేషణ వృత్తాంతమును చెప్పవలసినదిగా కోరిరి . అప్పుడు హనుమ "స్వామీ !నేను నూరు యోజనములు దూరము ఉన్న సముద్రమును లంఘించి ఆవలితీరమునకు చేరితిని . అక్కడ లంక అను పేరు కల ఒక నగరము కలదు . అది రాక్షసరాజైన రావణుని సామ్రాజ్యము ఆ నగరములో రావణుని అంతఃపురంలో అశోకవనంలో సీతామాతను చూసితిని . ఆమె అక్కడ రాక్షస స్త్రీల పర్యవేక్షణలో ఉన్నది . ఆమె రావణుని మాటలకు లొంగక  నిన్నే స్మరించుచు ,ఉపవాసములతో శుష్కించి ఉండెను . ఆమె జుట్టు అంతా ఒకే జడగా ఉండెను . ఆమె మిక్కిలి చిక్కి ఉండెను . ఆమె ఆ బాధలు తట్టుకొనలేక మరణించుటకు సిద్దపడెను .
చెట్టుపైనుండే రామకథాగానము వినిపించితిని . అప్పుడు ఆమెకు నాపై విశ్వాసము కలిగెను . అప్పుడు నేను శ్రీరామ ముద్రికను ఆమెకు అందించాను . దానిని చూసిన ఆమె మిక్కిలి సంతోషించెను. ఆ సంతోషముతో ఆమె కన్నులవెంట నీళ్లు వచ్చెను . అప్పుడు ఆమె మీ ఇద్దరకు మాత్రమే తెలిసిన కాకాసుర కథను నీకు చెప్పుటకై తెలిపెను . పిమ్మట ఆమె తన చూడామణిని కూడా నీకు ఇచ్చుటకై ఇచ్చెను . ఇంకనూ ఆమె త్వరగా వచ్చి తీసువెళ్లమని చెప్పమని చెప్పెను . రావణుడు విధించిన గడువులోపల రాలేకపోయినట్లయితే ఆమె జీవించి ఉండదని నీకు విన్నవించమని పలికెను "అని హనుమ యావత్ సీతావృత్తాంతమును శ్రీరామునికి సవివరముగా విన్నవించెను . సీతాదేవి ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి సమర్పించెను . 

రామాయణము సుందరకాండ అరువదియైదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Sunday 2 June 2019

రామాయణము సుందరకాండ -అరువదినాలుగవసర్గ

                                  రామాయణము

                                సుందరకాండ -అరువదినాలుగవసర్గ 

సుగ్రీవుడి మాటలు విన్న దధిముఖుడు తన అనుచరులతో కలిసి తిరిగి ఆకాశములో హనుమంతుడు ,వానరవీరులు వున్న ప్రదేశమునకు వెళ్లెను . అప్పటికి వానరులందరూ వనములో విస్రాంతి తీసుకుంటున్నారు . అప్పుడు వారితో అంగదుడు "ఓ యువరాజా !అంగదా !నీవు ఈ వానరరాజ్యమునకు యువరాజువు ,ఇప్పుడు వానరులందరూ నీ ఆజ్ఞలను నీ పినతండ్రి ఆజ్ఞలను పాటించువారే . ఆ సంగతి మరచి ఇంతకుముందు ఏదేదో మాట్లాడితిని . అందులకు నన్ను క్షమించు . నీకు నచ్చినట్టుగా ఈ వనములోని ఫలములను తినుము . మధువులను త్రాగుము . ఇది మీ వనము . నేను ఈ వన సంరక్షకుడను ఐన కారణమున మీరు వనమును పాడుచేయుట చూసి ,మిమ్ములను అదిలించు ప్రయత్నము చేసితిని . ఈ విషయము సుగ్రీవుడికి విన్నవించితిని . సుగ్రీవుడు కోపము తెచ్చుకోలేదు సరికదా ,మీదుమిక్కిలి సంతోషించెను . ఆయన మిమ్ములను ఆయన వద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపించెను . కావున మీరు ఫలములు తిని ,మధువులు త్రాగిన పిమ్మట సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము . "అని పలికెను . 
ఆ మాటలు విన్న వానరులంతా మధువు మత్తు వదులుటచే ,తదనంతర కర్తవ్యమును ఆలోచించి ,సుగ్రీవుడికి ,రామలక్ష్మణులకు సీతాదేవి దర్శన వృత్తాంతమును చెప్పవలెనని ,ఇక ఆలస్యము చేయరాదని భావించి ,వారందరూ వెంటనే ఆకాశములో ఎగురుతూ సుగ్రీవ రామలక్ష్మణులు వున్న ప్రదేశమునకు బయలుదేరిరి . వారు ఆ విధముగా ఆకాశములో ఎగురుతుండగా మేఘములు దట్టముగా అలుముకున్నట్టుగా ఉండెను . అలా వారు సుగ్రీవ రామలక్ష్మణుల వద్దకు చేరిరి . పిమ్మట అక్కడి వారందరూ ఆత్రముగా ఎదురుచూచుచుండగా మారుతి శ్రీరాముని సమీపించి ,"చూసితిని సీతామాతను "అని ప్రకటించెను . పిమ్మట అతడు" సీతామాత క్షేమముగా ఉన్నది "అని పలికెను . ఆ మాటలు విన్న శ్రీరాముడు సంతోషభరితుడయ్యెను . ఆ సంతోషముతో ఆయనకు కళ్లవెంట నీళ్లు వచ్చెను . 

రామాయణము సుందరకాండ అరువదినాలుగవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .