Sunday 2 June 2019

రామాయణము సుందరకాండ -అరువదినాలుగవసర్గ

                                  రామాయణము

                                సుందరకాండ -అరువదినాలుగవసర్గ 

సుగ్రీవుడి మాటలు విన్న దధిముఖుడు తన అనుచరులతో కలిసి తిరిగి ఆకాశములో హనుమంతుడు ,వానరవీరులు వున్న ప్రదేశమునకు వెళ్లెను . అప్పటికి వానరులందరూ వనములో విస్రాంతి తీసుకుంటున్నారు . అప్పుడు వారితో అంగదుడు "ఓ యువరాజా !అంగదా !నీవు ఈ వానరరాజ్యమునకు యువరాజువు ,ఇప్పుడు వానరులందరూ నీ ఆజ్ఞలను నీ పినతండ్రి ఆజ్ఞలను పాటించువారే . ఆ సంగతి మరచి ఇంతకుముందు ఏదేదో మాట్లాడితిని . అందులకు నన్ను క్షమించు . నీకు నచ్చినట్టుగా ఈ వనములోని ఫలములను తినుము . మధువులను త్రాగుము . ఇది మీ వనము . నేను ఈ వన సంరక్షకుడను ఐన కారణమున మీరు వనమును పాడుచేయుట చూసి ,మిమ్ములను అదిలించు ప్రయత్నము చేసితిని . ఈ విషయము సుగ్రీవుడికి విన్నవించితిని . సుగ్రీవుడు కోపము తెచ్చుకోలేదు సరికదా ,మీదుమిక్కిలి సంతోషించెను . ఆయన మిమ్ములను ఆయన వద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపించెను . కావున మీరు ఫలములు తిని ,మధువులు త్రాగిన పిమ్మట సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము . "అని పలికెను . 
ఆ మాటలు విన్న వానరులంతా మధువు మత్తు వదులుటచే ,తదనంతర కర్తవ్యమును ఆలోచించి ,సుగ్రీవుడికి ,రామలక్ష్మణులకు సీతాదేవి దర్శన వృత్తాంతమును చెప్పవలెనని ,ఇక ఆలస్యము చేయరాదని భావించి ,వారందరూ వెంటనే ఆకాశములో ఎగురుతూ సుగ్రీవ రామలక్ష్మణులు వున్న ప్రదేశమునకు బయలుదేరిరి . వారు ఆ విధముగా ఆకాశములో ఎగురుతుండగా మేఘములు దట్టముగా అలుముకున్నట్టుగా ఉండెను . అలా వారు సుగ్రీవ రామలక్ష్మణుల వద్దకు చేరిరి . పిమ్మట అక్కడి వారందరూ ఆత్రముగా ఎదురుచూచుచుండగా మారుతి శ్రీరాముని సమీపించి ,"చూసితిని సీతామాతను "అని ప్రకటించెను . పిమ్మట అతడు" సీతామాత క్షేమముగా ఉన్నది "అని పలికెను . ఆ మాటలు విన్న శ్రీరాముడు సంతోషభరితుడయ్యెను . ఆ సంతోషముతో ఆయనకు కళ్లవెంట నీళ్లు వచ్చెను . 

రామాయణము సుందరకాండ అరువదినాలుగవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment