Tuesday 11 June 2019

రామాయణము యుద్ధ కాండ -తొమ్మిదవసర్గ

                                     రామాయణము  

                                        యుద్ధ కాండ -తొమ్మిదవసర్గ 

అప్పుడు నికుంభుడు ,రబసుడు ఇంకా ఆ సభలోని బలవంతులైన రాక్షసులు ఒక్కసారిగా పైకి లేచి ,"మోసముతో ఈ లంకా నగరములో ప్రవేశించిన ఆ వానరుడిని మేము చంపివేస్తాము ."అని పలికిరి . అలా ఆయుధములు చేతితో పట్టుకుని యుద్ధ ఉత్సాహములో ఉన్న రాక్షసులను ఆపి ,వారందరిని కూర్చొండబెట్టి రావణుడికి అంజలి ఘటించి 

"నాయనలారా !ఎంతటి క్లిష్టమైన కార్యమునైనా సాధించుటకు సామదానభేద ఉపాయములను ఉపయోగించవలెను . అవి సాధ్యము కానిచో  చివరిదైన దండుపాయమును ఉపయోగించాలి . 
శ్రీరాముని సైన్యములో ఒక్కడు గొప్పదైన సముద్రమును దాటి మన లంకా నగరమునకు వచ్చినాడు . శ్రీరాముని సైన్యములో అపారమైన సైన్యము కలరు . వారందరూ బలపరాక్రమములు కలవారు . శతృవు యొక్క బలాబలములు ఎరుగక అనాలోచితముగా వారిని చులకనగా చూడుట మంచిదికాదు . అసలు శ్రీరాముడు మన ప్రభువు చేసిన అపకారము ఏమిటి ?ఇంకా మన రాజే అతడి భార్యను అపహరించాడు . శ్రీరాముడు ఖరుడిని వధించుట తప్పుగా చూడరాదు . ఖరుడే శ్రీరాముని  మీదకు యుద్ధముకు వెళ్లి ఆయన చేతిలో మరణించాడు . 
పరస్త్రీని తాకుట మహాపాపము . సీతాదేవిని అపహరించితీసుకురావటంచేత మనకు కూడా భయము పట్టుకున్నది . కావున సీతాదేవిని వారికి అప్పగించటం ఉత్తమము . శ్రీరాముడు ధర్మనిరతుడు ,మహావీరుడు అట్టివానితో యుద్ధమునకు దిగుట మంచిది కాదు . శ్రీరాముడు  బాణములతో ఈ సమస్త లంకా నగరమును చిన్నాభిన్నము చేయకముందే జానకిని ఆయన వద్దకు చేర్చుట మంచిది . అట్లు చేయనిచో మన నగరము మట్టిపాలవుట తధ్యము . నీవు సీతాదేవిని అప్పగించుట ద్వారా నీకే కాదు నీ బంధు మిత్రులకు ఆపద తొలగి ,ప్రశాంతముగా ఉంటాము . "అని పలికెను . 
రాక్షస రాజైన రావణుడు విభీషణుడి మాటలు విని ఏమి మాట్లాడక తన భవనమునకు వెళ్లెను . 

రామాయణము యుద్ధకాండ తొమ్మిదవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment