Sunday 9 June 2019

రామాయణము యుద్ధకాండ -ఏడవసర్గ

                             రామాయణము 

                                 యుద్ధకాండ -ఏడవసర్గ 

రాక్షసులు బలశాలురు అయినప్పటికి వారు బుద్ధిలేనివారు శత్రువుబలము తెలియనివారు కావున వారు రావణునితో "ప్రభూ !నీవు మహాబలపరాక్రమవంతుడివి . నీవు ఇలా పలుకుట సబబుగాలేదు . నీవు భోగవతీనగరమును జయించి సమస్త సర్పములను తరిమి కొట్టితివి . నీవంటే భయముతో వారందరూ పాతాళలోకమునకు పారిపోయిరి . అయినను వారిలో ప్రముఖులను పట్టి తెచ్చితివి . స్వయముగా పరమేశ్వరుడి స్నేహితుడైన కుభేరుడిని అతడి అపారమైన యక్ష సైన్యమును ఓడించి నావు . పుష్పకమును  తెచ్చినావు . 
ఓ రాక్షస శ్రేష్టా !నీమీద భయముతో దానవులతో ప్రముఖుడైన మయుడు తన కుమార్తె మండోదరికి నీకిచ్చి వివాహము చేసినాడు . ఇతరులకు ఎదిరింపశక్యము కానీ వాడు నీ చెల్లెలి భర్త ఐన కుంభీనసుని అదుపుచేసినావు . ఇంకా ఎంతో మందిని నీ పరాక్రమముతో అదుపుచేసితివి . వరుణదేవుడి కుమారులను ,వారి చతురంగ బలములను జయించితివి . యముని సైన్యమును అల్లకల్లోలపరచి మృత్యువును జయించితివి . అట్టి వారందరిని జయించిన నీకు సాధారణ మానవుడైన రాముడొక లెక్కా ?
ఓ రాజా !నీవరకు అవసరమే లేదు . మహాబాహువైన ఇంద్రజిత్తు ఒక్కడే వానరులందరినీ మట్టికరిపించగలడు . ఇంద్రుడిని సైతము జయించి బందించగా బ్రహ్మ దేవుడి మాట కొరకు అతడిని వదిలివేసినాడు . అంతటి పరాక్రమవంతుడు ఇంద్రజిత్తు . ఈ విషయము ఇంద్రజిత్తుకే అప్పగించుము . శ్రీరాముడితో సహా ,వానరులందరినీ ఇంద్రజిత్తు చిత్తూ చేయగలడు . "అని పలికిరి . 

రామాయణము యుద్ధకాండ ఏడవసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment