Thursday 6 June 2019

రామాయణము యుద్ధకాండ -మూడవసర్గ

                                     రామాయణము 

                                         యుద్ధకాండ -మూడవసర్గ 

సుగ్రీవుడి పలుకులు విన్న శ్రీరాముడు దైన్యము వదిలి ,తదనంతర కార్యము కొరకై ఆలోచించసాగెను . పిదప ఆ మహానుభావుడు హనుమతో "మారుతీ !మనమందరమూ సముద్ర తీరమునకు వెళ్లి సేతువు ఏర్పాట్లు చేసుకొనెదము . ముందుగా నీవు నాకు లంకా నగర భద్రత అచటి రక్షణ వ్యవస్థ గూర్చి నాకు వివరముగా వివరింపుము "అని పలికెను . 
అప్పుడు హనుమ శ్రీరామునితో "స్వామీ !లంకా నగరము సముద్రము ఆవలి ఉన్నది . అసలు అక్కడ నగరము ఉన్నదనే ఎవ్వరికిని తెలియదు . ఆ నగరము చుట్టూ దుర్బేధ్యమైన ప్రాకారములు నిర్మించివుండెను . ఆ ప్రాకారములపై బురుజులపై సైన్యము నిరంతరమూ కాపలా కాయుచు ఉండును . ఆ ప్రాకారములు వద్ద యంత్రములు కలవు . ఆ యంత్రములు శత్రువులపై రాళ్ళ వర్షము కురిపించును . లంకా నగరము బయట చుట్టూ కందకములు లోతుగా త్రవ్వబడి ఉండెను . అవి ముసళ్ళతో భయంకరముగా ఉండెను . 
ఆ కందకములు దాటుటకు చెక్కలతో ఇనుముతో వంతెనలు కలవు . అవి కావలిసినపుడు వేసుకునేలా ,అవసరము లేనపుడు తీసేసేలా ఏర్పాట్లు చేయబడివుండెను . శత్రువులు వచ్చినపుడు వారు వారు ఆ వంతెనపై సగములో ఉండగా ఆవంతెన తీసేసి శత్రువులను ఆ కందకంలో పడేలా ఏర్పాట్లు చేయబడినవి . లంకా నగరము మిక్కిలి శోభాయమానంగా ఉన్నది . అక్కడి గోడలు బంగారముతో తాపడము చేయబడి మణులతో ,రత్నములతో అందముగా అలంకరించబడి ఉండెను . అక్కడి సైన్యము వీరులు వారు కోటికి మించి వుండరు . రావణుడు ఎల్లప్పుడూ అప్రమత్తముగా ఉండి తన సైన్యమును ఉత్సాహపరుస్తూ ఉంటాడు . 
స్వామీ !మనము ఏదేని ఉపాయముచేత సముద్రమును దాటగలిగినట్టయితే మనము యుద్ధము గెలిచినట్టే . లంకా విజయమునకు అంగదుడు ,ద్వివిదుడు ,మైందుడు ,జాంబవంతుడు పనసుడు ,నలుడు సేనాధిపతి ఐన నీలుడు నేను మాత్రమే చాలు మిగిలిన వానరవీరులతో పనేలేదు . అంగదుడు మొదలగు వారు కూడా నాతోపాటు సముద్రమును లంఘించగలరు . మేము లంకకు వెళ్లి లంకా నగరమును ధ్వంసము చేసి అక్కడి వనములను ,ప్రాకారములను ,సమస్త భవనములు నాశనము చేసి సీతామాతను తీసుకురాగలము తగిన విధముగా అలోచించి అటు ఆజ్ఞను వానరవీరులకు ఇమ్ము "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ మూడవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment