Friday 7 June 2019

రామాయణము యుద్ధకాండ -నాల్గవసర్గ

                                రామాయణము 

                                     యుద్ధకాండ -నాల్గవసర్గ 

హనుమ తెలిపిన లంకా నగర విశేషాలను విన్న శ్రీరాముడు సుగ్రీవుడితో "సుగ్రీవా !సూర్యుడు ఆకాశమధ్య భాగమునకు చేరి వున్నాడు . ఇది విజయ ముహూర్తము . ఈ ముహూర్తములోనే లంకానగరముపై దండయాత్రకు బయలుదేరుదుము . ఇవ్వాళ ఉత్తరఫల్గుణీ నక్షత్రము ,రేపు హస్త ఇవి మన ప్రయాణమునకు తగినవి . కనుక మన సైన్యమును తీసుకుని వెంటనే బయలుదేరుము . మనము వెళ్లు దారి అరణ్యములతో అనేక భయములతో ఉండును . కావున ముసలివారిని ,ఆడవారిని ,బాలురులను కిష్కిందలోనే ఉండమను . 
మహావీరులైన లక్షమంది సైన్యముతో నీలుడు మార్గము చూపుతూ ముందు నడవవలెను . ఫలములు జలములు సమృద్ధిగా వుండే దారిలో మన సైన్యమును నడపవలెను . పర్వత తుల్యుడైన గజుడు ,మహాబలశాలి ఐన గవయుడు ,గవాక్షుడు ముందు నడవవలెను . సేనానాయకుడైన వృషభుడు సేనను రక్షించుచు కుడివైపు నడవవ లెను . గంధమాదనుడు సేనకు ఎడమవైపు నడవవలెను . 
సుగ్రీవా !నేను హనుమ భుజముల మీద ,లక్ష్మణుడు అంగదుడి భుజముల మీద నీవు పల్లకీలో ముందుకు సాగవలెను . జాంబవంతుడు ,సుషేణుడు ,వేగఁదర్శి వీరు మువ్వురు సేనను రక్షించుచు ,సైన్యమునకు వెనక భాగములో నడవవలెను . "అని పలికెను . ఆ మాటలు విన్న వానరవీరులు సమరోత్సాహముతో ,జయజయద్వానములు చేసిరి . అపారమైన వానరసేన శ్రీరాముని చుట్టూ చేరగా "మనకు జయము తధ్యము "అని పలుకులతో ఉత్సాహముతో వానరవీరులందరూ శ్రీరాముడు చెప్పినట్టుగా ముందుకు సాగుచుండిరి . అలా ముందుకు సాగిన దక్షిణ దిశగా ప్రయాణించి ,సముద్రతీరమునకు చేరిరి . అక్కడ అపారమైన సముద్రమును చూసిన వానరులు ఆశ్చర్యపోయిరి . పిమ్మట అక్కడే విశ్రమించిరి . 

రామాయణము యుద్ధకాండ నాల్గవసర్గ సమాప్తము .  

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment