Monday 3 June 2019

రామాయణము సుందరకాండ -అరువదియైదవసర్గ

                                     రామాయణము 

                                     సుందరకాండ -అరువదియైదవసర్గ 

రామలక్ష్మణులు ,సుగ్రీవుడి వద్దకు వెళ్లిన వానరులు సుగ్రీవునికి ,రామలక్ష్మణులకు నమస్కారము చేసి ,మారుతిని సీతాన్వేషణ వృత్తాంతమును చెప్పవలసినదిగా కోరిరి . అప్పుడు హనుమ "స్వామీ !నేను నూరు యోజనములు దూరము ఉన్న సముద్రమును లంఘించి ఆవలితీరమునకు చేరితిని . అక్కడ లంక అను పేరు కల ఒక నగరము కలదు . అది రాక్షసరాజైన రావణుని సామ్రాజ్యము ఆ నగరములో రావణుని అంతఃపురంలో అశోకవనంలో సీతామాతను చూసితిని . ఆమె అక్కడ రాక్షస స్త్రీల పర్యవేక్షణలో ఉన్నది . ఆమె రావణుని మాటలకు లొంగక  నిన్నే స్మరించుచు ,ఉపవాసములతో శుష్కించి ఉండెను . ఆమె జుట్టు అంతా ఒకే జడగా ఉండెను . ఆమె మిక్కిలి చిక్కి ఉండెను . ఆమె ఆ బాధలు తట్టుకొనలేక మరణించుటకు సిద్దపడెను .
చెట్టుపైనుండే రామకథాగానము వినిపించితిని . అప్పుడు ఆమెకు నాపై విశ్వాసము కలిగెను . అప్పుడు నేను శ్రీరామ ముద్రికను ఆమెకు అందించాను . దానిని చూసిన ఆమె మిక్కిలి సంతోషించెను. ఆ సంతోషముతో ఆమె కన్నులవెంట నీళ్లు వచ్చెను . అప్పుడు ఆమె మీ ఇద్దరకు మాత్రమే తెలిసిన కాకాసుర కథను నీకు చెప్పుటకై తెలిపెను . పిమ్మట ఆమె తన చూడామణిని కూడా నీకు ఇచ్చుటకై ఇచ్చెను . ఇంకనూ ఆమె త్వరగా వచ్చి తీసువెళ్లమని చెప్పమని చెప్పెను . రావణుడు విధించిన గడువులోపల రాలేకపోయినట్లయితే ఆమె జీవించి ఉండదని నీకు విన్నవించమని పలికెను "అని హనుమ యావత్ సీతావృత్తాంతమును శ్రీరామునికి సవివరముగా విన్నవించెను . సీతాదేవి ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి సమర్పించెను . 

రామాయణము సుందరకాండ అరువదియైదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment