Wednesday 29 March 2017

రామాయణము అరణ్యకాండ -ఎనిమిదవసర్గ

                                                 రామాయణము 

                                                   అరణ్యకాండ -ఎనిమిదవసర్గ 

సీతారామలక్ష్మణులు సుతీక్షమహర్షి చే అతిధి సత్కారములు పొంది ఆ రాత్రి అచటనే విశ్రమించి ఉదయమే సుతీక్షణ మహర్షిని తమ ప్రయాణమునకు అనుమతి అడిగెను . ఇంకనూ దండకారణ్యములో కల పెక్కు మునుల ఆశ్రమములను దర్శించవలెనని కోరికగా ఉందని వారు పలికిరి . సీతారామలక్ష్మణులు సుతీక్షణమహర్షి పాదములకు వందనము చేసెను . వారిని లేపి సుతీక్షణమహర్షి 
"శుభలక్షణ రామా !నీకు శుభమగుగాక !నీవు కోరుకున్నట్టే మునుల ఆశ్రమములు దర్శించు . ఈ అడవి రసభరితములైన ఫలములతోను ,పుష్పములతోను ఆహ్లాదభరితముగా ఉండును . నీతోపాటుగా ఈ మునులు కూడా వత్తురు . తిరిగి ఇక్కడకు రా . "అని సుతీక్షణ మహర్షి పలికెను . మహర్షి ఆ విధముగా అనుమతి ఇచ్చిన పిమ్మట సీతాదేవి ధనుస్సు బాణములు ,ఖడ్గములను తెచ్చి రామలక్ష్మణులకు అందించెను . అప్పుడు రామలక్ష్మణులు సీతా ,మునుల సమేతులై దండకారణ్యములో ముందుకు సాగనారంభించిరి . 

రామాయణము అరణ్యకాండ ఎనిమిదవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


Monday 27 March 2017

రామాయణము అరణ్యకాండ -ఏడవసర్గ

                                                 రామాయణము 

                                                          అరణ్యకాండ -ఏడవసర్గ 

సీతారామలక్ష్మణులు మందాకినీ నదిని దాటి సుతీక్షణ మహర్షి ఆశ్రమమునకు చేరిరి . అక్కడ వాతావరణము ఎంతో ప్రశాంతముగా ,ఆహ్లాదంగా ఉండెను . అచటి వాతావరణమునకు రాముడు ముగ్దుడయ్యెను . వృద్ధుడు తపస్సంపన్నుడు అయిన సుతీక్షణ మహర్షి ఆతిధ్యము అందుకుని ఆ రోజు సీతారామలక్ష్మణులు అచటనే విశ్రమించిరి . 

రామాయణము అరణ్యకాండ ఏడవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Sunday 26 March 2017

రామాయణము అరణ్యకాండ -ఆరవసర్గ

                                  రామాయణము 

                                         అరణ్యకాండ -ఆరవసర్గ 

 

శరభంగమహర్షి దివంగతుడైన పిమ్మట ధ్యానయోగసాధననిష్ఠ కలవారైన పెక్కుమంది మునులు శ్రీరాముని కడకు వచ్చిరి . వారందరూ ఆ అరణ్యములో పెక్కు ఏండ్లుగా తాపములాచరించువారు . వారందరూ ఆ అరణ్యములో ని రాక్షసుల క్రూర మృగముల బారి నుండి రక్షించమని శ్రీరాముని వేడుకొనిరి . అప్పుడు శ్రీరాముడు "మహర్షులారా !మీరు నన్ను అర్ధించుట తగదు . ఆజ్ఞాపించవలెను . మీ కష్టములు తొలగించుట కొరకే దైవవశమున తండ్రి ఆజ్ఞ నెపముతో నేను ఇచటికి వచ్చితినేమో . నా శాయశక్తులా మిమ్ము రక్షించెదను "అని పలికి సీతారామలక్ష్మణులు సుతీష్ణ మహర్షి ఆశ్రమదిక్కుగా సాగిరి .

రామాయణము అరణ్యకాండ ఆరవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .

Saturday 25 March 2017

రామాయణము అరణ్యకాండ -ఐదవసర్గ

                                                   రామాయణము 

                                                               అరణ్యకాండ -ఐదవసర్గ 

విరాధుని వధించిన పిమ్మట సీతారామలక్ష్మణులు శరభంగమహర్షి ఆశ్రమము దిక్కుగా పయనం ప్రారంభించిరి . ముని ఆశ్రమము దగ్గరకు రాగా అక్కడ ఒక దివ్య రధము దానిపై మిగుల తేజశ్శాలీ ,అనేకమంది సేవిస్తూ వున్న ఒక దివ్య పురుషుని వారు చూసిరి . రాముడు వారెవరో తెలుసుకోవాలనే కోరికతో వడివడిగా నడవసాగెను . రాముడు తన దిక్కుగా వచ్చుట చూసిన ఆ మహా పురుషుడు (ఇంద్రుడు )శరభంగ మహర్షితో "మహర్షీ !విష్ణు మూర్తి అవతారమైన శ్రీరాముడు ఈ దిక్కుగా వచ్చుచున్నాడు . ఆయనను నేను అవతార సమాప్తిలో దర్శించుకొనెదను . ఇప్పుడు దర్శించుకొనుట యుక్తము కాదు . "అని పలికి అచట నుండి వెడలిపోయెను . 
సీతారామలక్ష్మణులు శరభంగమహర్షి ని దర్శించి ,కుశలప్రశ్నలు కావించి ఆ మహా పురుషుడు ఎవరని ప్రశ్నించిరి . 
అప్పుడా మహర్షి "నన్ను సత్యలోకము (బ్రహ్మలోకము )నకు తీసుకు వెళ్ళుటకు దేవేంద్రుడే స్వయముగా వచ్చినాడు మీరు చూసిన దివ్యపురుషుడు ఆయనే . అని పలికి నా తపశ్శక్తిని రామా !నీకు దారపోయదలిచాను "అని పలికెను . అప్పుడు శ్రీరాముడు ఆయన తపశ్శక్తిని గ్రహించెను .శ్రీరాముడు ఆమహర్షిని తాము నివసించుటకు అనువగు ప్రదేశమును తెలుపని అడుగగా ఆ మహర్షి సుతీక్ష మహర్షి ఆశ్రమమునకు వెళ్ళమని వెళ్ళినచో ఆయన సహాయపడగలదని చెప్పెను .  
అప్పుడా శరభంగమహర్షి అగ్ని కార్యములను చేసుకొని ఆ అగ్నిలో ప్రవేశించెను . అప్పడు ఆ వృద్ధుడైన ఆ ముని పదునైదు సంవత్సరములు కల బాలుడిగా మారి ఊర్ధ్వలోకములకు వెళ్లిపోయెను . అదంతా చూసిన తరువాత సీతారామలక్ష్మణులు సుతీక్ష మహర్షి ఆశ్రమము ఉన్న  దిక్కువైపు తమ ప్రయాణమును సాగించెను . 

రామాయణము అరణ్యకాండ ఐదవసర్గసమాప్తము . 

             శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Friday 24 March 2017

రామాయణము అరణ్యకాండ -నాల్గవసర్గ

                                                రామాయణము 

                                                         అరణ్యకాండ -నాల్గవసర్గ 

రామలక్ష్మణులను ఎత్తుకుపోతున్న రాక్షసుడిని చూసి భీతిల్లిన సీతాదేవి భయముతో కేకలు పెట్టసాగెను . సీతాదేవి భయపడుట గమనించిన రామలక్ష్మణులు చెరొక చేతిని నరికివేసెను . అప్పుడు ఆ రాక్షసుడు నేలపై పడిపోయెను . రామలక్ష్మణులు వాడిని ముష్టిఘాతములతో ,కత్తులతో దాడి చేసి మిక్కిలి గాయపరిచేను . అయినను రాక్షసుడు చావకుండుట చూసి రాముడు లక్ష్మణుడితో "వీడి వరప్రభావము వలన చావకున్నాడు . కావున వేడిని భూమిలో పాతి వేద్దాము "అని పలికెను . 
రాక్షసులను మరణించిన పిదప పాతిపెట్టుట ఆచారము . ఆ మాటలు విన్న విరాధుడు ." నేను తుంబురుడు అనే గంధర్వుడను . రంభ ప్రేమలో పడి కుభేరుడి సేవకు వేళకు వెళ్లకుండుటచే ఆయన నన్ను రాక్షసుడవు కమ్మని శపించాడు . నేను ప్రార్ధించగా రామలక్ష్మణుల వలన నీకు శాపవిముక్తి అవుతుందని చెప్పాడు . ఆ రామలక్ష్మణులు మీ రె అని నాకు తెలుస్తోంది "అని పలికెను . ఇంకనూ ఆ విరాధుడు 
"ఇక్కడకు దగ్గరలోనే శరభంగమహర్షి ఆశ్రమము కలదు మీరు అచటికి వెళ్ళండి . మీకు శుభము కలుగుతుంది" అని పలికి   తనను గోతిలో పాతిపెట్టమని చెప్పెను . రాముడు భయంకరముగా బాధతో అరుచుచున్న ఆ రాక్షసుడిని గోతిలో పాతిపెట్టెను . ఆ సమయములో విరాధుడు అరచిన అరుపులకు ఆ అరణ్యము ప్రతిధ్వనించింది . సీతారామలక్ష్మణులు తిరిగి తమ ప్రయాణమును కొనసాగించిరి . 

రామాయణము అరణ్యకాండ నాల్గవసర్గ సమాప్తము . 

                                      శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











Thursday 23 March 2017

రామాయణము అయోధ్యకాండ -మూడవసర్గ

                                                      రామాయణము 

                                                         అయోధ్యకాండ -మూడవసర్గ 

లక్ష్మణుడు ఆ విధముగా రామునితో పలుకుతుండగా ఆ రాక్షసుడు భయంకర స్వరముతో మీరెవరు ఇచటకు ఎందుకు వచ్చారు ?అని ప్రశ్నించెను . అప్పుడు రామలక్ష్మణులు తమ వృత్తాంతమును తెలిపి "నీవెవరవు ?అని ప్రశ్నించెను "అప్పుడు ఆ రాక్షసుడు నా పేరు విరాధుడు . 'జయుడు 'అను రాక్షసుడి కుమారుడును . బ్రహ్మ వర ప్రభావం వలన ఏవిధమయిన శస్త్రములు ఏమియు నన్ను ఏమి చేయలేవు . మీరిరువురు ఈ సుందరాంగిని ఇక్కడే వదిలి వెళ్లిపోండి . ఈ నారీమణి నాకు దక్కిన కారణముగా మీ ప్రాణములు తీయుటలేదు . నా మనసు మారక ముందే పారిపోండి . మీ ప్రాణములు దక్కించుకొండి "అని పలికెను . 
ఆ పలుకులు విన్న రామునికి మిక్కిలి కోపము వచ్చెను . తన బాణములతో ఆ రాక్షసుడిని గాయపరిచేను . రక్తము కారుతుండగా ,సీతను వదిలి పెద్ద శూలము పట్టుకుని రామలక్ష్మణుల పైకి రాసాగేను . రాముడు బాణములతో ఆ శూలమును ముక్కలు చేసెను . రామలక్ష్మణులు తమ బాణములతో ఆ రాక్షసుడి శరీరమును గాయపరిచేను . అయినను రాక్షసుడు పట్టించుకొనక రామలక్ష్మణులను రెండు చేతులతో పట్టుకుని తీసుకుపోవతలిచి వారిరువురిని రెండు చేతులతో పట్టుకొనెను . వాడి అంతరార్ధము గ్రహించిన రాముడు "లక్ష్మణా !ఈ రాక్షసుడు మనులను ఎత్తుకుపోవనెంచాడు . ఎత్తుకుపోనిమ్ము . ఏలననగా మనము వెళ్ళవలసిన దారి కూడా ఈ వైపునే "అని పలికెను . 
అంత ఆ విరాధుడు రామలక్ష్మణులను మోసుకొని దట్టమైన అరణ్యము వైపుగా వడివడిగా  పోవసాగెను . 

రామాయణము అరణ్యకాండ మూడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Wednesday 22 March 2017

రామాయణము అరణ్యకాండ -రెండవసర్గ

                                                     రామాయణము   

                                                             అరణ్యకాండ -రెండవసర్గ 

మునీశ్వరులు వద్ద ఆ రోజు ఉండి మరునాడు ఉదయమే రాముడు దండకారణ్యములో ముందుకు సాగెను .


 కొంత దూరము వెళ్లిన పిదప వారికి చెట్లు ,తీగలు విరిగిపోయి ఎండిపోయి వున్న ఒక ప్రదేశమును చూసిరి . అచట సరస్సులు లేకుండెను . చూచుటకు భయంకరముగా ఉండెను . అచట ఒక పర్వతప్రమాణములో  వికృతాకారుడైన ఒక రాక్షసుడు నెత్తురోడుతున్న పులి చర్మం ధరించి వారికి ఎదురుగా వచ్చెను . వాడు అమాంతం సీతాదేవి నడుము పట్టుకుని ఎత్తి "ఎవరు మీరు ?ముని వేషము వేసుకున్నారు . ధనుర్భాణములు ధరించారు . పైగా ఒక స్త్రీతో వున్నారు . అధర్మ ప్రవర్తన మునుల పద్దతికి విరుద్ధము కాదా ?"అని అడిగెను . 
ఇంకనూ ఆ రాక్షసుడు "నా పేరు విరాధుడు . మీకు కాలము మూడి ఈ ప్రదేశములో ప్రవేశించారు . మీ రక్తము తాగుతాను . ఈ సుందరి నాకు భార్య కాగలదు . "అని పెద్ద కంఠస్వరముతో పలికెను . ఆ రాక్షసుడి చేతిలో వున్న సీత భయముతో గజగజ వణికిపోయెను . సీతను అలా చూసిన రాముడు లక్ష్మణునితో "లక్ష్మణా !కైకేయి మనలను అడవుల పాలు చేసినను నేను బాధపడలేదు . తండ్రి మరణమును కూడా తట్టుకుని నిలబడగలిగాను . కానీ జనకుని కూతురు ,నా భార్య ,మిక్కిలి సుకుమారి అయిన సీత పరస్పర్శకు లోనగుట తట్టుకోలేకున్నాను "అని పలుకుతూ కన్నీరు కార్చుచుండెను . 
అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముని ఓదార్చి ,తానూ బాణముతో రాక్షసుడిని చంపుతానని ధైర్యము చెప్పాను . 

రామాయణము అరణ్యకాండ  రెండవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Tuesday 21 March 2017

రామాయణము అరణ్యకాండ -మొదటిసర్గ

                                              రామాయణము 

                                                       అరణ్యకాండ -మొదటిసర్గ 

ఆ విధముగా సీతారామలక్ష్మణులు దండకారణ్యములో ప్రవేశించిరి . అచట కొంత దూరము నడవగా వారికి మునుల ఆశ్రమములు అగుపించినవి . వారు ఆ ఆశ్రమముల వద్దకు వెళ్లిరి . ఆ మునులందరూ సీతారామ లక్ష్మణులను సాదరముగా ఆహ్వానించి అతిథిమర్యాదలు చేసిరి . వారందరూ సీతారామలక్ష్మణులు రూపసౌందర్యములకు ఆశ్చర్యపడుతూ ,వారివంక తదేకంగా చూచుచుండిరి .  పిమ్మట ఆ మునులందరూ అచట లభించు ఫలములు ,దుంపలను వారికి సమర్పించిరి . 

ఆ మునులందరూ శ్రీరామునితో అచట గల రాక్షసుల బారి నుండీ రక్షించమని అర్ధించిరి . వారి ఆశ్రమములలో ఒక కుటీరమును  సీతారాములకై  ఇచ్చిరి . . ఆ మునులు తమ సేవలతో వారిని సంతుష్టులను చేసిరి . 

రామాయణము అరణ్యకాండ మొదటిసర్గసమాప్తము . 

                                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Monday 20 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూట పందొమ్మిదవసర్గ

                                              రామాయణము 

                                                 అయోధ్యకాండ -నూట పందొమ్మిదవసర్గ 

సీతాదేవి చెప్పిన స్వయంవరగాధ విని అనసూయాదేవి మిక్కిలి సంతోషించెను . సీతాదేవిని కౌగలించుకుని ,నుదిటిపై ముద్దుపెట్టుకొనెను . అప్పుడు అనసూయాదేవి సీతాదేవితో "నేనిచ్చిన దివ్య వస్త్రాభరణములను ధరించు . చూడవలెనని నాకు కోరికగా వుంది . "అని పలికెను . అప్పుడు సీతాదేవి ఆ దివ్యవస్త్రాభరణములన్నియు ధరించెను . అనసూయా దేవి మిక్కిలి సంతోషించి "సీతా చీకటి పడినది . ఇక నీవు భర్త సేవకు వేళ్ళు "అని అనుమతి ఇచ్చెను . 
సీతాదేవి రాముని వద్దకు వెళ్లి అనసూయాదేవి ఇచ్చిన వస్త్రాభరణములు చూపించెను . ఎవ్వరికి దక్కని గొప్ప సత్కారము సీతకు దక్కినందుకు రామలక్ష్మణులు మిక్కిలి సంతోషించిరి . 

వారు మువ్వురు ఆ రాత్రి అచటనే విశ్రమించిరి . మరునాడు ఉదయమే సీతారామలక్ష్మణులు తమ ప్రయాణమునకు అనుమతి ఇవ్వమని తాపసులని అడిగెను . అప్పుడు వారు "ఈ దండకారణ్యములో రాక్షసులు ,క్రూరమృగములు ఎక్కువుగా వున్నవి . అవి మునులను చంపివేయుచున్నవి . నరమాంస భక్షకులు అయిన రాక్షసులు మునులను చంపి తింటూ మిక్కిలి హింస పెట్టుచున్నారు . కావున నీవు ఆ క్రూరమృగముల ,రాక్షసుల బారి నుండి మునులను కాపాడుచు ఉండుము . ఈ దారిలో మేము కందమూలాదులను తెచ్చుకుందుము . మీరు ఈ దారిలో వెళ్ళవచ్చు "అని పలికిరి . 
వారందరికీ నమస్కారములు చేసి వారు చూపిన దారిలో నడుచుకుంటూ సీతారామలక్ష్మణులు దండకారణ్యములో ప్రవేశించిరి . 

రామాయణము అయోధ్యకాండ నూటపందొమ్మిదవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం .ఏ (తెలుగు )తెలుగు పండితులు . 






Sunday 19 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటపదునెనిమిదవసర్గ

                                   రామాయణము 

                                అయోధ్యకాండ -నూటపదునెనిమిదవసర్గ      

అనసూయాదేవి మాటలను సీతాదేవి ఎంతో  భక్తిశ్రద్దలతో వినెను . పిమ్మట భక్తి గౌరవములతో సీతాదేవి అనసూయాదేవి తో మాట్లాడేను . సీతా దేవి మాటలకు ముచ్చటపడిన అనసూయాదేవి సీతాదేవిని ఏదేని వరము కోరుకోమనెను . అంత సీతాదేవి "మీ మృదు మధుర వచనములతోనే న మనస్సు నిండిపోయింది ఇక వరం ఏమి వద్దు "అనెను . 
ఆ మాటలకు మిక్కిలి సంతోషించిన అనసూయాదేవి సీతాదేవికి దివ్యమైన మాలలు ,వస్త్రములు ,ఆభరణములు ,అంగరాగములు (వంటిపై రాసుకును పై పూతలు ),మైపూతలు (సువాసనలు ఇచ్చు సుగంధద్రవ్యములు )ఇచ్చెను 




సీతాదేవి వాటినన్నిటిని ఎంతో అపురూపముగా తీసుకొనెను . పిమ్మట అనసూయాదేవి సీతాదేవితో "మీ స్వయంవర గాధను గూర్చి వింటిని . ఆ కథను నాకు వినిపించుము . "అని కోరెను . అప్పుడు సీతాదేవి "మిథిలా నగరమును జనకుడు అను మహారాజు పాలించుచున్నాడు . ఆయన మిగుల ధార్మికుడు ,మహావీరుడు . ఆయన ఒకానొక సమయములో యాగము చేసి ,భూమిని దున్నుతుండగా నేను పసిపాపగా ఆయనకు దొరికాను . అప్పుడు ఆకాశవాణి "ఈమె మనుష్య బాలిక కాదు దివ్య శిశువు . ఇక ఈమె నీ కుమార్తె "అని పలికెను . 
అప్పటివరకు ఆయనకు సంతతి లేకుండుటచే ఆ మహారాజు ఎంతో సంతోషముతో తన కూతురుగా చేసుకుని పెంచి పెద్దచేసెను . నేను ఆ ఇంట అడుపెట్టిన తదుపరి ఆయన సంపద మిక్కిలి వృద్ధి అయ్యెను . ఆలా అల్లారుముద్దుగా పెరిగి పెద్దయిన నాకు వివాహ ఈడు రాగా స్వయంవరం ఏర్పాటు చేసి ,పురాతన కాలము నుండి జనక మహారాజు ఇంట ఉన్న ధనస్సును ఎక్కుపెట్టిన వారికి సీత నిచ్చి పెండ్లి చేస్తానని వాగ్దానము చేసెను . 
ఎంతో మంది రాజులు వచ్చి కొండ ప్రమాణములో ఉన్న దానిని కనీసం కదల్చలేక దానికొక దండము పెట్టి వెళ్లిపోయెను . కొంతకాలమునకు ఆ ధనుస్సుని చూడవలెనని కోరికతో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మిధిలకు వచ్చెను . వారి కోరికపై మా తండ్రి ఆ ధనుస్సుని వారికి చూపించేను . శ్రీరాముడు ఆ ధనుస్సుని చూసి దానిని ఎక్కుపెట్టవలెననే కోరికతో వింటిని ఆకర్ణాంతము లాగెను . అపుడు అది పెద్ద శబ్దము చేస్తూ విరిగిపోయెను . 

మా తండ్రి ఆయన ఇచ్చిన ప్రతిజ్ఞ మేరకు నన్ను ఇచ్చి వివాహము చేయుటకు సిద్దపడెను . 
అప్పుడు శ్రీరాముడు ఆయన తండ్రి దశరథ మహారాజు అనుమతి లేకుండా నన్ను చేపట్టుటకు సిద్దపడకుండెను . అప్పుడు మా తండ్రి దశరథ మహారాజుకు వర్తమానము పంపి ఆయనను రప్పించెను . 

మా పెండ్లితో పాటు మా చెల్లి ఊర్మిళను లక్ష్మణుడికి ,మా పినతండ్రి కుమార్తెలు మాండవి ,శృతకీర్తులను భారత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము అంగరంగ వైభవముగా జరిపించెను . "అని సీత ఆ వృత్తాన్తము అంతా సవివరముగా వివరించెను . 

రామాయణము అయోధ్యకాండ నూటపదునెనిమిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Saturday 18 March 2017

రామాయణము అయోధ్యకాండ - నూటపదునేడవసర్గ

                                                రామాయణము 

                                                అయోధ్యకాండ - నూటపదునేడవసర్గ 

మునులందరూ అక్కడ నుండి వెళ్లిపోవటంతో రాముడికి అక్కడ వుండబుద్దికాలేదు . తల్లులు ,భరతుడు ,జనులు వచ్చిన ప్రదేశము కావడముతో వారు కూడా పదేపదే రామునికి గుర్తురాసాగిరి . అందువలన రాముడు సీతాలక్ష్మణులతో అక్కడనుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ముందుకు సాగెను . 
వారు మువ్వురు అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరిరి . . అచట వారికి సాదరముగా స్వాగత సత్కారములు జరిగెను 


.పిమ్మట సీతాదేవిని అత్రిమహాముని భార్య అయిన అనసూయా దేవి లోపలి తీసుకువెళ్ళేను  . అనసూయా దేవి మహాపతివ్రత ,ఒకానొకసమయములో లోకములు కరువుకాటకములతో అల్లాడుతున్న సమయములో అనసూయాదేవి తన తపః ప్రభావంతో లోకములను రక్షించెను . ఆవిడ సీతా దేవికి పతివ్రతా ధర్మములను బోధించెను. 

రామాయణము అయోధ్యకాండ నూటపదునేడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Thursday 16 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటపదునాఱవసర్గ

                                                   రామాయణము 

                                                  అయోధ్యకాండ -నూటపదునాఱవసర్గ 

భరతుడు అయోధ్యకు మరలి వెళ్లిన పిమ్మట చాలాకాలము శ్రీరాముడు అచటనే ఉండెను . అప్పుడు కొంతకాలానికి ర్ మునుల ముఖములలో ఎదో ఆందోళన ,తన వలన ఎదో ఇబ్బంది పడుతున్నట్టు ,వారి ముఖావళికల బట్టి రాముడు గ్రహించెను . వారు ఎదో రహస్యముగా మాట్లాడుకొనుచున్నట్లు రామునికి అనిపించి మునులలో ఒక మునిని అడిగెను . 
అప్పుడా ముని "ఖరుడు అను వాడు రావణుని తమ్ముడు అతడు మునులను బాధిస్తూ ఉంటాడు . అతడు నీవు ఇక్కడ ఉన్నావని తెలుసుకుని సహించలేక మునులను పెక్కు బాధలు పెడుతున్నాడు మునులను చంపుట ,వారి హోమాది కార్యములను ధ్వంసం చేయుట వంటి కార్యములను చేయుచు మమ్ము మిక్కిలి బాధించుచున్నాడు . కనుక మేమందరము ఇక్కడ నుండి వేరే ప్రాంతమునకు వెళ్లదలుచుకొంటిమి . 
నీవు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపో !మాతో పాటు వస్తే రా ." అని పలికెను . ఆ మునులందరూ అచట నుండి వెళ్లిపోయెను. వారంతా వెళ్లిన పిమ్మట శ్రీరాముడు అచట వుండలేకపోయెను . 

రామాయణము అయోధ్యకాండ నూటపదునాఱవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Wednesday 15 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూట పదునైదవసర్గ

                                      రామాయణము 

                                        అయోధ్యకాండ -నూట పదునైదవసర్గ 

దృఢ నిశ్చయము కల భరతుడు తల్లులను అంతఃపురంలో వారివారి గృహములలో ఉంచి ,మంత్రులతో వశిష్టాది గురువులతో శ్రీరాముడు లేని ఈ అయోధ్యలో ఉండలేను . నంది నగరమున ఉండి శ్రీరాముడు కొరకు ఎదురుచూచుచు ఉండెదను . అని పలుకగా  భాతృప్రేమను మెచ్చుకొనిరి . భరతుడు  సిద్ధముచేయించుకుని  తల్లులకు చెప్పి శ్రీరాముని పాదుకలు శిరస్సున ధరించి మంత్రులు ,గురువులతో కలసి నంది గ్రామమునకు వెళ్లెను . 
అచట సింహాసనంపై పాదుకలను ఉంచి ,ఛత్రము పట్టి తానె స్వయముగా వింజామరతో ఆ పాదుకలకు విసరసాగెను . పిదప అచటకు వచ్చిన జనులు మంత్రులతో "పూజ్యులారా ! అన్నయగు శ్రీరాముడు  న్యాసముగా (భద్రముగా రక్షించి ,తిరిగి యజమానికి అప్పగించవలిసిన వస్తువుగా )నాకు ఈ రాజ్యమును అప్పగించినాడు . మఱియు ఈ పాదుకలు కూడా అనుగ్రహించెను . 


ఇవి ఈ రాజ్య ప్రజల యోగక్షేమముల భారమును వహించుచుండును . ఈ విషయమున నేను నిమ్మిత్తమాత్రుడను . రాముని బంటును . ఈ రాజ్యమును రక్షించుచు మా అన్న కొరకు వేచివుందును "అని పలికెను . 
భరతుడు జటావల్కలములు ధరించి  తింటూ నందీ గ్రామమునుండే రాజ్యపాలన విషయములు చూచుచుండెను . శత్రుఘ్నుడు అతనికి తోడుగా ఉండెను . రాజ్యపాలన విషయములు అన్నియు ఆ పాడుకులకు నివేదించుచు ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ నూటపదునైదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Tuesday 14 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటపదునాల్గవసర్గ

                                          రామాయణము 

                                       అయోధ్యకాండ -నూటపదునాల్గవసర్గ 

భరతుడు ఆ విధముగా అయోధ్యలో ప్రవేశించేసరికి రాత్రి అయినది . అయోధ్యానగరము అంతా నిశ్శబ్దముగా వున్నది . అలికిడి లేకున్నది . ఎప్పుడూ ఎంతో సుందరముగా అలంకరింపబడి వుండే అయోధ్యానగరము పాడుపడినట్లుగా వున్నది . అది చూసిన భరతుడు తన రాధా సారధి తో "చూడుము అయోధ్యా నగరము ఎలా కళావిహీనంగా నున్నదో . ఈ నగర గాలులలో ఎల్లప్పుడూ కర్పూర,సుగంధ ద్రవ్యముల వాసనలు గుభాళించుచు ఉండెడివి . కానీ ఇప్పుడు అవిలేవు . రేయి పగలు తేడా లేకుండా ఈ నగరము జనులతో అంగళ్ళతో కళకళలాడుచుండెడిది . 
రాముని వనవాసము పిమ్మట మహారాజు మరణముతో ఈ నగరము శోకసముద్రములో మునిగి కళాకాంతులు లేక బోసిపోయి వున్నది . "అని పలుకుచుండగానే రాజభవనములోకి ప్రవేశించెను . అచట జనసంచారం లేకుండెను . ఆ అంతః పురమును చూచి భరతుడు ఏడ్చెను . 

రామాయణము అయోధ్యకాండ నూటపదునాల్గవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


Monday 13 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటపదమూడవసర్గ

                                రామాయణము 

                                అయోధ్యకాండ -నూటపదమూడవసర్గ 

పిమ్మట భరతుడు అన్నగారి అనుజ్ఞను తీసుకుని "శత్రుంజయము "అను పేరుగల భద్రగజమున రాముని పాదుకలను ఉంచి అయోధ్యాముఖుడయ్యెను . భరతుని ముందు వశిష్ఠుడు ,వామదేవుడు ,జాబాలి మొదలగు పురోహితులు నడుచుచుండెను . వారు భారద్వాజముని ఆశ్రమము చెంతకు చేరిరి . భరతుడు భక్తిశ్రద్దలతో  గుఱ్ఱము దిగి భారద్వాజుని దర్శించెను . భారద్వాజుడు అడుగగా భరతుడు జరిగిన వృత్తాన్తమును చెప్పెను . భారద్వాజుడు భరతుని  సోదర ప్రేమను మెచ్చుకొనెను . 


పిమ్మట వారు భారద్వాజముని వద్ద సెలవు తీసుకుని ప్రయాణము కొనసాగించిరి . శృంగిబేరి పురము దాటి అయోధ్య వైపుగా సాగి అయోధ్యకు చేరిరి . ఆ సమయమున అయోధ్యా నగరమున పాడుబడినట్లుగా ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ నూటపదమూడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం .ఏ (తెలుగు )తెలుగు పండితులు . 

Sunday 12 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటపండ్రెండవసర్గ

                                       రామాయణము 

                                   అయోధ్యకాండ -నూటపండ్రెండవసర్గ   

శ్రీరామ భరతుల అన్యోన్యము చూసి అచట వున్న జనులందరూ సంతోషముతో గగురుపాటు చెందినవారై ,మిగుల ఆశ్చర్యపడిరి . అంతకుముందే అచట చేరి వున్న ఋషీశ్వరులు ,సిద్దులు ,రాజర్షులు మున్నగు దివ్యజాతులవారు మహాత్ములగు ఆ సోదరులను చూసి ,ధర్మములు బాగుగా ఎరిగి వాటిని చక్కగా ఆచరించు ఈ రాజకుమారులు కన్న దశరధుడు ఎంతో ధన్యుడు . వారి ప్రేమాభిమానములు ,రాజ్యము పట్ల అనాశక్తి మిక్కిలి ఆశ్చర్యపరుచుచున్నవి . వారి వచనములు వినవలెనని కుతూహలపడుచున్నాము . అని వారిలో వారు అనుకోసాగిరి . 
పిదప వారందరూ రావణుని వద శీఘ్రముగా జరుగవలెననే కోరికతో కిందకు వచ్చి ,భరతునితో "భరతా !నీవు సదవంశమున జన్మించినవాడివి . సకల ధర్మములను బాగుగా ఎరిగినవాడు . అతడు చెప్పినది సరయినదే . మీ తండ్రి కైకేయికి వరములను ఇచ్చి ఆవిడ రుణవిముక్తుడై స్వర్గమునకు వెళ్లెను . "అని పలుకగా  భరతుడు తన కోరిక నెరవేరనందున ధైర్యమును కోల్పోయి వణికిపోతూ శ్రీరాముని పాదములపై పడి  ఏడ్చుచు ,పదేపదే ప్రార్ధించెను . 
కానీ ఎంత ప్రార్ధించిననూ శ్రీరాముడు వినక భరతుడికి నచ్చచెప్పచూసెను . చేసెడిది లేక భరతుడు అన్నా !నీ ఈ పాదుకలు (అయోధ్యలో ఉపయోగించినవి )బంగారంతో తాపడము చేసినవి . వీటిని ఒక్కసారి ధరించి నాకి ఇమ్ము . రాజ్య పాలనా భారము ఈ పాదుకలపైనే వేయుదును . నేను ఈ పదునాలుగు సంవత్సరములు నగరము బయటే జటా వల్కలములు ధరించి మీ వలెనే కందమూలాదులు తింటూ ఉండేదను . పదునాలుగు సంవత్సరములు గడిచిన వెంటనే నీ దర్శనము కానిచో నేను అగ్నిప్రవేశము చేసెదను . "అని పలికెను . 
భరతుని మాటలకు శ్రీరాముడు అంగీకారము తెలిపి భరతుని ఆలింగనము చేసుకొనెను . పిమ్మట శత్రుఘ్నుడిని కూడా హత్తుకొనెను . పిదప రాముడు "భరతా !కైకేయి మాతను భద్రముగా చూసుకొనుము . ఆమె మీద కోపము ఏ మాత్రము ప్రదర్శించరాదు . ఈ మాట నేను నా మీద ,సీతమీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను "అని పలికెను . భరతుడు శ్రీరాముడు ధరించి ఇచ్చిన పాదుకలకు పూజ చేసి ,వాటికి శ్రీరామునికి ప్రదక్షణ నమస్కారములు చేసి ,వాటిని భద్రగజము అను మహారాజు వాహనంపై పెట్టెను . పిమ్మట అచట వున్న జనులు ,గురువులు ,బంధువులు అందరూ శ్రీరామునికి వీడ్కోలు పలికెను . శ్రీ రాముడు తల్లులతో బాధతో ఏమి మాట్లాడలేక ఏడ్చుచు పర్ణశాలలో ప్రవేశించెను . 

రామాయణము అయోధ్యకాండ నూటపండ్రెండవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Friday 10 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటపదునొకండవసర్గ

                                                రామాయణము 

                                              అయోధ్యకాండ -నూటపదునొకండవసర్గ 

రాజపురోహితుడైన వశిష్ఠుడు ఆ విధముగా పలికి తిరిగి ఇలా పలుకసాగెను . "రఘునందనా !జన్మించిన ప్రతి వ్యక్తికీ ఆచార్యుడు ,తండ్రి ,తల్లి అని ముగ్గురు గురువులు ఉందురు . ఆచార్యుడు తల్లితండ్రుల కంటే శ్రేష్ఠుడైన గురువు . రామా !నేను నీకే కాదు నీ తండ్రికి కూడా గురువునే కావున నా మాట వినుము సత్సాంప్రదాయమును పాటించుము . వృద్ధురాలు ధర్మపరాయణరాలు అయిన మీ తల్లి మాట కాదనుట యుక్తము కాదు . నిన్ను వేడుకొనుచున్న  భరతుని పలుకును మన్నింపుము . "అని పలికెను . 
ఆ మాటలు విని శ్రీరాముడు "తల్లితండ్రులు తమ సంతానమునకు జన్మనిచ్చుట కాక అనేక సేవలు చేయుదురు వారి ఋణము తీర్చుకొనుట ఎవ్వరికైనను అసాధ్యము . కావున ఆయన నాకు ఇచ్చిన ఆదేశము వమ్ము కారాదు . "అని పలికెను . శ్రీరాముని మాటలు విని భరతుడు ఎంతో నిస్పృహకు లోనయ్యేను . భరతుడు సుమంత్రునితో "సుమంత్రా !దర్భాసనమును సిద్దపరుచుము . ఈ ప్రభువు నాయెడ ప్రసన్నుడయ్యెడి వరకు ఆయనకు అడ్డముగా ఇచటనే అన్నపానాదులు మాని  నిరాహార దీక్ష వహించి కూర్చుని ఉండెదను . "
అని పలికెను . సుమంత్రుడు కదలక శ్రీరాముని ఆజ్ఞ కొరకు వేచి చూస్తుండెను . అతని పరిస్థితి గమనించి భరతుడు తానే దర్భాసనమును తెప్పించుకుని అచట కూర్చునెను . అది చూసిన శ్రీరాముడు "భరతా !నీవు ఇటుల చేయరాదు . ఈ కఠోర వ్రతమును మాని అయోధ్యకు వెళ్లుము "అని పలికెను . ఆ మాటలు విన్న భరతుడు అచటనే వున్న పౌరులు ,పల్లెవాసులు చూసి" మీరందరు ప్రభువుకు ఏల నచ్చచెప్పరు ?"అని పలికెను . అప్పుడు వారందరూ "రాముడు సర్వధర్మములు బాగుగా ఎరిగినవాడు . పైగా తండ్రి మాట నిలబెట్టవలెననే కృత నిశ్చయముతో ఉండెను . ఆయనను మరలించుటకు మేము అశక్తులము "అని పలికెను . 
అపుడు భరతుడు ఓ ప్రజలారా !శ్రీరాముని బదులుగా నేను అరణ్యవాసము చేసెదను అని పలికెను . అప్పుడు శ్రీరాముడు" తండ్రి బతికి ఉండగా చేసిన నిర్ణయములను మార్చెడి శక్తి నాకు కానీ భరతుడికి కానీ లేవు . సమర్థుడైనవాడు తనకు మారుగా ప్రతినిధి చేత పనులు చేయించడు . కావున నేను కూడా భరతుడు నా బదులుగా అరణ్యవాసము చేయుటకు ఇష్టపడను నా వనవాసము పూర్తి అయిన పిమ్మట ఈ సోదరుడితో కలిసి రాజ్యపాలన చేయుదును . "అని పలికి తిరిగి భరతుడితో "భరతా !అయోధ్యకు వెళ్లి రాజ్యపాలన చేయుము . అని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ నూటపదునొకండవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 







రామాయణము అయోధ్యకాండ -నూటపదవసర్గ

                                      రామాయణము 

                                         అయోధ్యకాండ -నూటపదవసర్గ  

శ్రీ రాముడు క్రుద్ధుడై ఉండుటను గమనించిన వశిష్ఠుడు "నాయనా రఘునందనా !జనులు ఈలోకము నుండి పరలోకమునకు వెళ్ళుట ,తిరిగి ఈ లోకమునకు వచ్చుట జాబాలి ఎరుగుదుడు . కనుక అతడు నాస్తికుడుకాదు . నిన్ను వనముల నుండి మరల్చుటకు అటుల పలికినాడు . ఈ లోకముల  యొక్క ఆవిర్భావమును వివరించెదను వినుము . 
సృష్టి ప్రారంభ సమయమున లోకమంతయు జలమయమయి ఉండెను . అందుండియే భూమండలం ఏర్పడెను . పిమ్మట స్వయంభూ అయిన దేవుడు దేవతలతో కూడి ఆవిర్భవించాడు . విష్ణుస్వరూపుడైన ఆ దేవుడే వరాహ రూపమున ప్రకటితమై జలమగ్నమై వున్న భూమిని ఉద్దరించెను . పిదప అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా ఈ జగత్తును సృష్టించెను . 

ఆకాశ స్వరూపుడైన ఆ పరమాత్మనుండి భ్రహ్మదేవుడు ప్రాఉద్భవించెను . అతడు శాశ్వతుడు ,నిత్యుడు ,నాశనరహితుడు . ఆయన నుండి మరీచి జన్మించెను . మరీచి కుమారుడే కశ్యపుడే ,కాశ్యపుని నుండి వివస్వంతుడు (సూర్యుడు )ఆవిర్భవించెను . ఆయన సుతుడే వైవస్వత మనువు . అతడే మొదటి ప్రజాపతి . అతని కుమారుడే ఇక్ష్వాకు ప్రభువు . 
సర్వసంపదతో కూడిన ఈ భూమండలమును ఇక్ష్వాకునకు అప్పగించెను . ఆ విధముగా అతడు అయోధ్యకు మొదటి ప్రభువు అయినాడు . ఇక్ష్వాకు కుమారుడైన కుక్షి సర్వ శుభలక్షణ సంపన్నుడు . కుక్షి పుత్రుడైన వికుక్షి మహావీరుడు . వికుక్షి సుతుడు బాణుడు మహా తేజస్వి . భానుని కొడుకే అనరణ్యుడు . అతడు మహా యశస్వి . 
భానుడు రాజ్యమును పాలించునపుడు అనావృష్టి కానీ వరదలు కానీ చోరభయము కానీ లేవు . 
ఆయన పుత్రుడే మహాబాహువైన పృధు మహారాజు . త్రిశంకు మహారాజు ఆ పృధు మహారాజు పుత్రుడే . సత్యవచనుడు ,వీరుడు అయిన త్రిశంకప్రభువు విస్వామిత్రుని తపః ప్రభావమున సశరీరంగా స్వర్గమునకు వెళ్లెను . త్రిశంకు కుమారుడు దుందుమారుడు . అతని సుతుడు మహా పరాక్రమశాలి అయిన  యువనాశ్వుడు . అతని పుత్రుడు మాంధాత . మాంధాత కుమారుడు సుసంధి . ధ్రువసంధి ,ప్రసేనజిత్తు అనువారు ఆయన కుమారులు . ధ్రువసంధి కుమారుడు భరతుడు . అతడు శత్రు భయంకరుడు . 
భరతుని కుమారుడు అసితుడు . అతనికి శూరులైన హైహయలు ,తాళజంఘలు ,శశిబిందువులు ,అను సామంత రాజులు శత్రువులు అయిరి . వారందరిని ఎదుర్కొనుటకు సేనావ్యూహము రచించి ,యుద్ధమున స్థిరముగా రచించినను శత్రువుల దాటికి తట్టుకొనలేక ,యుద్ధమున పరాజితుడై హిమాలయ ప్రాంతమునకు చేరెను . అచట ఏకాగ్ర చిత్తుడై భగవధ్యానమున మునింగెను . అప్పటికే అతని ఇద్దరు భార్యలు గర్భవతులు . వారిలో ఒకతె సవతి కాళింది గర్భవిచ్చితికై ఆమెకు గరళము ఇచ్చెను . 
భృగు వంశము వాడైన చ్యవన మహర్షి హిమత్పర్వతము మీద నివసించుఉండెను . ఆసీటుని భార్య అయిన కాళింది ఆ మహర్షి కడకు ఏగి ఆయనకు నమస్కరించెను . అప్పుడా మహర్షి దేవీ !నీకు పుత్ర సంతానము కలుగును . అతడు ధర్మాత్ముడు ,సుశీలుడు ,మహాత్ముడై వాసికెక్కును అని దీవించెను . అప్పుడామె ఆ మునికి ప్రదక్షణ నమస్కారములు చేసి తన భవనమునకు  వెళ్లి ఒక పుత్రునికి జన్మనిచ్చెను . విషప్రయోగము జరిగినను బాలుడు జన్మించుటచే అతనికి సగరుడు అని పేరు పెట్టిరి . 
ఆ సగర మహారాజు ఒక పుణ్య దినమున యజ్ఞము చేయుచు అపహరింపబడిన యాగాశ్వము నకై కుమారుల ద్వారా సాగరమును త్రవ్వించేను 

. ఆ సాగరునకు అసమంజసుడు అను పుత్రుడు కలడు . అతడు దుష్టుడు అగుటచే అతనికి రాజ్య బహిష్కరణ విధించెను . అసమంజసుని కుమారుడు అంశుమంతుడు అతని కొడుకు దిలీపుడు . అతని సుతుడు భగీరధుడు . భగీరథుని వలన కకుస్తుడు జన్మించేను . అందుకే ఈ వంశము వారిని కాకుస్తులు అని అందురు . అతని కుమారుడు రఘు మహారాజు అతని పేరునే ఈ వంశమునకు రఘువంశము అనే పేరు వచ్చ్నెను . 
ఆయన కుమారుడు కల్మాషపాదుడు . అతడు పెరిగి పెద్దవాడై నరమాంశభక్షకుడు అయ్యెను . అతడే సౌదాసుడు పేరుతొ ప్రసిద్ధికెక్కెను . సుప్రసిద్ధుడైన శంఖణుడు కల్మాషపాదుడు కుమారుడు . శంఖునుడు కుమారుడు సుదర్శనుడు . అతని కొడుకు అగ్నివర్ణుడు . అతని కొడుకు శీఘ్రగుడు . అతని కొడుకు మరువు  . అతని పుత్రుడు ప్రశుశ్రుకుడు . అతని కొడుకు అంబరీషుడు . అతని కొడుకు నహుషుడు . ఆయన కొడుకు నాభాగుడు . అతని కొడుకు అజుడు ఆయన కుమారుడే దశరధ మహారాజు . ఆ మహారాజు పుత్రుడవైన నీవు . కోశాల రాజ్యము జ్యేష్ఠుడిది కావున నీవు రాజ్యమును శ్వీకరించుము . ఓ రామా !పరంపరగా వచ్చుచున్న రఘువంశీయుల ధర్మములను విస్మరించరాదు . ఈ రాజ్యమును నీ తండ్రి వలె నీవును పరిపాలించుము . 

రామాయణము అయోధ్యకాండ నూటపదవ సర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు . 










Thursday 9 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటతొమ్మిదవసర్గ

                               రామాయణము 

                                 అయోధ్యకాండ -నూటతొమ్మిదవసర్గ 

సత్య పరాక్రముడైన శ్రీరాముడు తనను మార్చుటకు జాబాలి పలికిన నాస్తిక మాటలను విని క్రుద్ధుడై "మహాత్మా !బ్రాహ్మణోత్తమా !మీరు నాస్తికుల వలె ఎందుకు ఇలా మాట్లాడుచున్నారు . పర లోకము వున్నది . మనము ఇక్కడ చేసిన పాపపుణ్యముల ఫలితమును తప్పక అనుభవించెదము . ఇహ లోక సుఖములు అశాశ్వతములు . నేను సత్యమునకు కట్టుబడినవాడను . తండ్రి మాటను సత్యము చేసేదని సత్య ప్రమాణము చేసి ఉంటిని . అట్టి నేను ఆ మాటను ఎలా జవదాటగలను . ?"అంటూ ఎన్నో ధర్మము పలికెను . 

అప్పుడు జాబాలి "రామా !నేను నాస్తికుడను కాను . ఆస్తికుడను . లోక కళ్యాణార్ధము నాస్తికుడుగా మారుటకు కూడా సన్నద్ధుడనే . రామా !నిన్ను ప్రసన్నునిగా చేసుకొనుటకు ,తిరిగి అయోధ్యకు మరల్చుటకు అటుల పలికితిని . కావున నన్ను క్షమింపుము "అని పలికెను . 

 రామాయణము అయోధ్యకాండ నూటతొమ్మిదవసర్గ సమాప్తము . 

             శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు . 

రామాయణము అయోధ్యకాండ -నూటఎనిమిదవసర్గ

                                     రామాయణము 

                             అయోధ్యకాండ -నూటఎనిమిదవసర్గ 

ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఈ విధముగా భరతుని ఓదార్చెను . అపుడు బ్రాహ్మణోత్తమమైన జాబాలి శ్రీరాముని ఒప్పించి అయోధ్యకు మరల్చవలెననే ఉద్దేశ్యముతో శతవిధములుగా యత్నించెను . కానీ కృత నిశ్చయుడైన శ్రీరాముని ఆలోచన ను మాత్రము కొంచుమైనను మార్చలేకపోయెను . 

రామాయణము అయోధ్యకాండ నూటఎనిమిదవసర్గ సమాప్తము . 

          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Tuesday 7 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూట ఏడవసర్గ

                                 రామాయణము 

                        అయోధ్యకాండ -నూట ఏడవసర్గ 

బందు మిత్రుల మధ్య భరతుడు ఎంతగా ప్రాధేయపడినా శుభ లక్షణ సంపన్నుడైన శ్రీరాముడు భరతునితో "సోదరా !భరతా!రాజశిరోమణి అయిన దశరధుని కైకేయి దేవి అందు కలిగిన పుత్రుడవు నీవు . నీవు పలికిన వచనములు అన్నీ నీకు తగినట్లుగానే వున్నవి . 
సోదరా !పూర్వము మన తండ్రి మీ తల్లిని వివాహము చేసుకోను సందర్భమున "కైకేయికి పుట్టిన వారికే రాజ్యాధికారం ఇత్తును "అని మన తండ్రి ప్రతిజ్ఞ చేసియున్నాడు . ఆ పిమ్మట దేవాసురలకు జరిగిన సంగ్రామములో మీ తల్లి చేసిన సేవలకు మహారాజు మిగుల సంతుష్టుడై ఆమెకు రెండు వరములు ఇత్తునని వాగ్ధానము చేసెను . 
వాసిగాంచినదియు ,ఉత్తమ మహిళ అయిన మీ తల్లి మహారాజుచే ఒట్టు పెట్టించుకుని   నిన్ను రాజ్యాభిషిక్తుడను చేయుట ,నన్ను వనములకు పంపుట అను రెండు వరములను ఆయనను అడిగెను . అందులకు ఆమహారాజు సమ్మతించి ,ఆమెకు ఆ రెండు వరములను ఇచ్చెను . 
ఓ నరశ్రేష్టా !భరతా !ఈ విధముగా మన తండ్రి వరదాన రూపమున 14  సంవత్సరములు వనవాసము చేయుము అని నన్ను ఆజ్ఞాపించెను . కనుక ఆయన ఆజ్ఞకు బద్ధుడనై సీతాలక్ష్మణ సహితుడనై వనవాసమునకు  వచ్చితిని . సత్యసంధనుడైన మన తండ్రి మాట నిలబెట్టుటకు ఇచటనే ఉండెదను . నీవు కూడా తండ్రి ఆజ్ఞను శిరసావహించి శీఘ్రముగా పట్టాభిషిక్తుడవు కమ్ము . 
భరతా !శీఘ్రముగా అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడవుకమ్ము . తండ్రిని సత్యసంధునిగా చేయుము . అదే    సముచితము . ఓ భరతా !నీవు ప్రజలందరికి రాజువి కమ్ము . నేను సమస్త వనములకు రాజు అయ్యేదను . సంతోషముగా దణ్డకారణ్యములో అడుగిడెదను . ఇక నీవు దుఃఖిపకు . 

రామాయణము అయోధ్యకాండ నూట ఏడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .