Friday 10 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటపదవసర్గ

                                      రామాయణము 

                                         అయోధ్యకాండ -నూటపదవసర్గ  

శ్రీ రాముడు క్రుద్ధుడై ఉండుటను గమనించిన వశిష్ఠుడు "నాయనా రఘునందనా !జనులు ఈలోకము నుండి పరలోకమునకు వెళ్ళుట ,తిరిగి ఈ లోకమునకు వచ్చుట జాబాలి ఎరుగుదుడు . కనుక అతడు నాస్తికుడుకాదు . నిన్ను వనముల నుండి మరల్చుటకు అటుల పలికినాడు . ఈ లోకముల  యొక్క ఆవిర్భావమును వివరించెదను వినుము . 
సృష్టి ప్రారంభ సమయమున లోకమంతయు జలమయమయి ఉండెను . అందుండియే భూమండలం ఏర్పడెను . పిమ్మట స్వయంభూ అయిన దేవుడు దేవతలతో కూడి ఆవిర్భవించాడు . విష్ణుస్వరూపుడైన ఆ దేవుడే వరాహ రూపమున ప్రకటితమై జలమగ్నమై వున్న భూమిని ఉద్దరించెను . పిదప అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా ఈ జగత్తును సృష్టించెను . 

ఆకాశ స్వరూపుడైన ఆ పరమాత్మనుండి భ్రహ్మదేవుడు ప్రాఉద్భవించెను . అతడు శాశ్వతుడు ,నిత్యుడు ,నాశనరహితుడు . ఆయన నుండి మరీచి జన్మించెను . మరీచి కుమారుడే కశ్యపుడే ,కాశ్యపుని నుండి వివస్వంతుడు (సూర్యుడు )ఆవిర్భవించెను . ఆయన సుతుడే వైవస్వత మనువు . అతడే మొదటి ప్రజాపతి . అతని కుమారుడే ఇక్ష్వాకు ప్రభువు . 
సర్వసంపదతో కూడిన ఈ భూమండలమును ఇక్ష్వాకునకు అప్పగించెను . ఆ విధముగా అతడు అయోధ్యకు మొదటి ప్రభువు అయినాడు . ఇక్ష్వాకు కుమారుడైన కుక్షి సర్వ శుభలక్షణ సంపన్నుడు . కుక్షి పుత్రుడైన వికుక్షి మహావీరుడు . వికుక్షి సుతుడు బాణుడు మహా తేజస్వి . భానుని కొడుకే అనరణ్యుడు . అతడు మహా యశస్వి . 
భానుడు రాజ్యమును పాలించునపుడు అనావృష్టి కానీ వరదలు కానీ చోరభయము కానీ లేవు . 
ఆయన పుత్రుడే మహాబాహువైన పృధు మహారాజు . త్రిశంకు మహారాజు ఆ పృధు మహారాజు పుత్రుడే . సత్యవచనుడు ,వీరుడు అయిన త్రిశంకప్రభువు విస్వామిత్రుని తపః ప్రభావమున సశరీరంగా స్వర్గమునకు వెళ్లెను . త్రిశంకు కుమారుడు దుందుమారుడు . అతని సుతుడు మహా పరాక్రమశాలి అయిన  యువనాశ్వుడు . అతని పుత్రుడు మాంధాత . మాంధాత కుమారుడు సుసంధి . ధ్రువసంధి ,ప్రసేనజిత్తు అనువారు ఆయన కుమారులు . ధ్రువసంధి కుమారుడు భరతుడు . అతడు శత్రు భయంకరుడు . 
భరతుని కుమారుడు అసితుడు . అతనికి శూరులైన హైహయలు ,తాళజంఘలు ,శశిబిందువులు ,అను సామంత రాజులు శత్రువులు అయిరి . వారందరిని ఎదుర్కొనుటకు సేనావ్యూహము రచించి ,యుద్ధమున స్థిరముగా రచించినను శత్రువుల దాటికి తట్టుకొనలేక ,యుద్ధమున పరాజితుడై హిమాలయ ప్రాంతమునకు చేరెను . అచట ఏకాగ్ర చిత్తుడై భగవధ్యానమున మునింగెను . అప్పటికే అతని ఇద్దరు భార్యలు గర్భవతులు . వారిలో ఒకతె సవతి కాళింది గర్భవిచ్చితికై ఆమెకు గరళము ఇచ్చెను . 
భృగు వంశము వాడైన చ్యవన మహర్షి హిమత్పర్వతము మీద నివసించుఉండెను . ఆసీటుని భార్య అయిన కాళింది ఆ మహర్షి కడకు ఏగి ఆయనకు నమస్కరించెను . అప్పుడా మహర్షి దేవీ !నీకు పుత్ర సంతానము కలుగును . అతడు ధర్మాత్ముడు ,సుశీలుడు ,మహాత్ముడై వాసికెక్కును అని దీవించెను . అప్పుడామె ఆ మునికి ప్రదక్షణ నమస్కారములు చేసి తన భవనమునకు  వెళ్లి ఒక పుత్రునికి జన్మనిచ్చెను . విషప్రయోగము జరిగినను బాలుడు జన్మించుటచే అతనికి సగరుడు అని పేరు పెట్టిరి . 
ఆ సగర మహారాజు ఒక పుణ్య దినమున యజ్ఞము చేయుచు అపహరింపబడిన యాగాశ్వము నకై కుమారుల ద్వారా సాగరమును త్రవ్వించేను 

. ఆ సాగరునకు అసమంజసుడు అను పుత్రుడు కలడు . అతడు దుష్టుడు అగుటచే అతనికి రాజ్య బహిష్కరణ విధించెను . అసమంజసుని కుమారుడు అంశుమంతుడు అతని కొడుకు దిలీపుడు . అతని సుతుడు భగీరధుడు . భగీరథుని వలన కకుస్తుడు జన్మించేను . అందుకే ఈ వంశము వారిని కాకుస్తులు అని అందురు . అతని కుమారుడు రఘు మహారాజు అతని పేరునే ఈ వంశమునకు రఘువంశము అనే పేరు వచ్చ్నెను . 
ఆయన కుమారుడు కల్మాషపాదుడు . అతడు పెరిగి పెద్దవాడై నరమాంశభక్షకుడు అయ్యెను . అతడే సౌదాసుడు పేరుతొ ప్రసిద్ధికెక్కెను . సుప్రసిద్ధుడైన శంఖణుడు కల్మాషపాదుడు కుమారుడు . శంఖునుడు కుమారుడు సుదర్శనుడు . అతని కొడుకు అగ్నివర్ణుడు . అతని కొడుకు శీఘ్రగుడు . అతని కొడుకు మరువు  . అతని పుత్రుడు ప్రశుశ్రుకుడు . అతని కొడుకు అంబరీషుడు . అతని కొడుకు నహుషుడు . ఆయన కొడుకు నాభాగుడు . అతని కొడుకు అజుడు ఆయన కుమారుడే దశరధ మహారాజు . ఆ మహారాజు పుత్రుడవైన నీవు . కోశాల రాజ్యము జ్యేష్ఠుడిది కావున నీవు రాజ్యమును శ్వీకరించుము . ఓ రామా !పరంపరగా వచ్చుచున్న రఘువంశీయుల ధర్మములను విస్మరించరాదు . ఈ రాజ్యమును నీ తండ్రి వలె నీవును పరిపాలించుము . 

రామాయణము అయోధ్యకాండ నూటపదవ సర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు . 










No comments:

Post a Comment