Saturday 25 March 2017

రామాయణము అరణ్యకాండ -ఐదవసర్గ

                                                   రామాయణము 

                                                               అరణ్యకాండ -ఐదవసర్గ 

విరాధుని వధించిన పిమ్మట సీతారామలక్ష్మణులు శరభంగమహర్షి ఆశ్రమము దిక్కుగా పయనం ప్రారంభించిరి . ముని ఆశ్రమము దగ్గరకు రాగా అక్కడ ఒక దివ్య రధము దానిపై మిగుల తేజశ్శాలీ ,అనేకమంది సేవిస్తూ వున్న ఒక దివ్య పురుషుని వారు చూసిరి . రాముడు వారెవరో తెలుసుకోవాలనే కోరికతో వడివడిగా నడవసాగెను . రాముడు తన దిక్కుగా వచ్చుట చూసిన ఆ మహా పురుషుడు (ఇంద్రుడు )శరభంగ మహర్షితో "మహర్షీ !విష్ణు మూర్తి అవతారమైన శ్రీరాముడు ఈ దిక్కుగా వచ్చుచున్నాడు . ఆయనను నేను అవతార సమాప్తిలో దర్శించుకొనెదను . ఇప్పుడు దర్శించుకొనుట యుక్తము కాదు . "అని పలికి అచట నుండి వెడలిపోయెను . 
సీతారామలక్ష్మణులు శరభంగమహర్షి ని దర్శించి ,కుశలప్రశ్నలు కావించి ఆ మహా పురుషుడు ఎవరని ప్రశ్నించిరి . 
అప్పుడా మహర్షి "నన్ను సత్యలోకము (బ్రహ్మలోకము )నకు తీసుకు వెళ్ళుటకు దేవేంద్రుడే స్వయముగా వచ్చినాడు మీరు చూసిన దివ్యపురుషుడు ఆయనే . అని పలికి నా తపశ్శక్తిని రామా !నీకు దారపోయదలిచాను "అని పలికెను . అప్పుడు శ్రీరాముడు ఆయన తపశ్శక్తిని గ్రహించెను .శ్రీరాముడు ఆమహర్షిని తాము నివసించుటకు అనువగు ప్రదేశమును తెలుపని అడుగగా ఆ మహర్షి సుతీక్ష మహర్షి ఆశ్రమమునకు వెళ్ళమని వెళ్ళినచో ఆయన సహాయపడగలదని చెప్పెను .  
అప్పుడా శరభంగమహర్షి అగ్ని కార్యములను చేసుకొని ఆ అగ్నిలో ప్రవేశించెను . అప్పడు ఆ వృద్ధుడైన ఆ ముని పదునైదు సంవత్సరములు కల బాలుడిగా మారి ఊర్ధ్వలోకములకు వెళ్లిపోయెను . అదంతా చూసిన తరువాత సీతారామలక్ష్మణులు సుతీక్ష మహర్షి ఆశ్రమము ఉన్న  దిక్కువైపు తమ ప్రయాణమును సాగించెను . 

రామాయణము అరణ్యకాండ ఐదవసర్గసమాప్తము . 

             శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment