Sunday 12 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటపండ్రెండవసర్గ

                                       రామాయణము 

                                   అయోధ్యకాండ -నూటపండ్రెండవసర్గ   

శ్రీరామ భరతుల అన్యోన్యము చూసి అచట వున్న జనులందరూ సంతోషముతో గగురుపాటు చెందినవారై ,మిగుల ఆశ్చర్యపడిరి . అంతకుముందే అచట చేరి వున్న ఋషీశ్వరులు ,సిద్దులు ,రాజర్షులు మున్నగు దివ్యజాతులవారు మహాత్ములగు ఆ సోదరులను చూసి ,ధర్మములు బాగుగా ఎరిగి వాటిని చక్కగా ఆచరించు ఈ రాజకుమారులు కన్న దశరధుడు ఎంతో ధన్యుడు . వారి ప్రేమాభిమానములు ,రాజ్యము పట్ల అనాశక్తి మిక్కిలి ఆశ్చర్యపరుచుచున్నవి . వారి వచనములు వినవలెనని కుతూహలపడుచున్నాము . అని వారిలో వారు అనుకోసాగిరి . 
పిదప వారందరూ రావణుని వద శీఘ్రముగా జరుగవలెననే కోరికతో కిందకు వచ్చి ,భరతునితో "భరతా !నీవు సదవంశమున జన్మించినవాడివి . సకల ధర్మములను బాగుగా ఎరిగినవాడు . అతడు చెప్పినది సరయినదే . మీ తండ్రి కైకేయికి వరములను ఇచ్చి ఆవిడ రుణవిముక్తుడై స్వర్గమునకు వెళ్లెను . "అని పలుకగా  భరతుడు తన కోరిక నెరవేరనందున ధైర్యమును కోల్పోయి వణికిపోతూ శ్రీరాముని పాదములపై పడి  ఏడ్చుచు ,పదేపదే ప్రార్ధించెను . 
కానీ ఎంత ప్రార్ధించిననూ శ్రీరాముడు వినక భరతుడికి నచ్చచెప్పచూసెను . చేసెడిది లేక భరతుడు అన్నా !నీ ఈ పాదుకలు (అయోధ్యలో ఉపయోగించినవి )బంగారంతో తాపడము చేసినవి . వీటిని ఒక్కసారి ధరించి నాకి ఇమ్ము . రాజ్య పాలనా భారము ఈ పాదుకలపైనే వేయుదును . నేను ఈ పదునాలుగు సంవత్సరములు నగరము బయటే జటా వల్కలములు ధరించి మీ వలెనే కందమూలాదులు తింటూ ఉండేదను . పదునాలుగు సంవత్సరములు గడిచిన వెంటనే నీ దర్శనము కానిచో నేను అగ్నిప్రవేశము చేసెదను . "అని పలికెను . 
భరతుని మాటలకు శ్రీరాముడు అంగీకారము తెలిపి భరతుని ఆలింగనము చేసుకొనెను . పిమ్మట శత్రుఘ్నుడిని కూడా హత్తుకొనెను . పిదప రాముడు "భరతా !కైకేయి మాతను భద్రముగా చూసుకొనుము . ఆమె మీద కోపము ఏ మాత్రము ప్రదర్శించరాదు . ఈ మాట నేను నా మీద ,సీతమీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను "అని పలికెను . భరతుడు శ్రీరాముడు ధరించి ఇచ్చిన పాదుకలకు పూజ చేసి ,వాటికి శ్రీరామునికి ప్రదక్షణ నమస్కారములు చేసి ,వాటిని భద్రగజము అను మహారాజు వాహనంపై పెట్టెను . పిమ్మట అచట వున్న జనులు ,గురువులు ,బంధువులు అందరూ శ్రీరామునికి వీడ్కోలు పలికెను . శ్రీ రాముడు తల్లులతో బాధతో ఏమి మాట్లాడలేక ఏడ్చుచు పర్ణశాలలో ప్రవేశించెను . 

రామాయణము అయోధ్యకాండ నూటపండ్రెండవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment