Sunday 19 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటపదునెనిమిదవసర్గ

                                   రామాయణము 

                                అయోధ్యకాండ -నూటపదునెనిమిదవసర్గ      

అనసూయాదేవి మాటలను సీతాదేవి ఎంతో  భక్తిశ్రద్దలతో వినెను . పిమ్మట భక్తి గౌరవములతో సీతాదేవి అనసూయాదేవి తో మాట్లాడేను . సీతా దేవి మాటలకు ముచ్చటపడిన అనసూయాదేవి సీతాదేవిని ఏదేని వరము కోరుకోమనెను . అంత సీతాదేవి "మీ మృదు మధుర వచనములతోనే న మనస్సు నిండిపోయింది ఇక వరం ఏమి వద్దు "అనెను . 
ఆ మాటలకు మిక్కిలి సంతోషించిన అనసూయాదేవి సీతాదేవికి దివ్యమైన మాలలు ,వస్త్రములు ,ఆభరణములు ,అంగరాగములు (వంటిపై రాసుకును పై పూతలు ),మైపూతలు (సువాసనలు ఇచ్చు సుగంధద్రవ్యములు )ఇచ్చెను 




సీతాదేవి వాటినన్నిటిని ఎంతో అపురూపముగా తీసుకొనెను . పిమ్మట అనసూయాదేవి సీతాదేవితో "మీ స్వయంవర గాధను గూర్చి వింటిని . ఆ కథను నాకు వినిపించుము . "అని కోరెను . అప్పుడు సీతాదేవి "మిథిలా నగరమును జనకుడు అను మహారాజు పాలించుచున్నాడు . ఆయన మిగుల ధార్మికుడు ,మహావీరుడు . ఆయన ఒకానొక సమయములో యాగము చేసి ,భూమిని దున్నుతుండగా నేను పసిపాపగా ఆయనకు దొరికాను . అప్పుడు ఆకాశవాణి "ఈమె మనుష్య బాలిక కాదు దివ్య శిశువు . ఇక ఈమె నీ కుమార్తె "అని పలికెను . 
అప్పటివరకు ఆయనకు సంతతి లేకుండుటచే ఆ మహారాజు ఎంతో సంతోషముతో తన కూతురుగా చేసుకుని పెంచి పెద్దచేసెను . నేను ఆ ఇంట అడుపెట్టిన తదుపరి ఆయన సంపద మిక్కిలి వృద్ధి అయ్యెను . ఆలా అల్లారుముద్దుగా పెరిగి పెద్దయిన నాకు వివాహ ఈడు రాగా స్వయంవరం ఏర్పాటు చేసి ,పురాతన కాలము నుండి జనక మహారాజు ఇంట ఉన్న ధనస్సును ఎక్కుపెట్టిన వారికి సీత నిచ్చి పెండ్లి చేస్తానని వాగ్దానము చేసెను . 
ఎంతో మంది రాజులు వచ్చి కొండ ప్రమాణములో ఉన్న దానిని కనీసం కదల్చలేక దానికొక దండము పెట్టి వెళ్లిపోయెను . కొంతకాలమునకు ఆ ధనుస్సుని చూడవలెనని కోరికతో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మిధిలకు వచ్చెను . వారి కోరికపై మా తండ్రి ఆ ధనుస్సుని వారికి చూపించేను . శ్రీరాముడు ఆ ధనుస్సుని చూసి దానిని ఎక్కుపెట్టవలెననే కోరికతో వింటిని ఆకర్ణాంతము లాగెను . అపుడు అది పెద్ద శబ్దము చేస్తూ విరిగిపోయెను . 

మా తండ్రి ఆయన ఇచ్చిన ప్రతిజ్ఞ మేరకు నన్ను ఇచ్చి వివాహము చేయుటకు సిద్దపడెను . 
అప్పుడు శ్రీరాముడు ఆయన తండ్రి దశరథ మహారాజు అనుమతి లేకుండా నన్ను చేపట్టుటకు సిద్దపడకుండెను . అప్పుడు మా తండ్రి దశరథ మహారాజుకు వర్తమానము పంపి ఆయనను రప్పించెను . 

మా పెండ్లితో పాటు మా చెల్లి ఊర్మిళను లక్ష్మణుడికి ,మా పినతండ్రి కుమార్తెలు మాండవి ,శృతకీర్తులను భారత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము అంగరంగ వైభవముగా జరిపించెను . "అని సీత ఆ వృత్తాన్తము అంతా సవివరముగా వివరించెను . 

రామాయణము అయోధ్యకాండ నూటపదునెనిమిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment