Wednesday 22 March 2017

రామాయణము అరణ్యకాండ -రెండవసర్గ

                                                     రామాయణము   

                                                             అరణ్యకాండ -రెండవసర్గ 

మునీశ్వరులు వద్ద ఆ రోజు ఉండి మరునాడు ఉదయమే రాముడు దండకారణ్యములో ముందుకు సాగెను .


 కొంత దూరము వెళ్లిన పిదప వారికి చెట్లు ,తీగలు విరిగిపోయి ఎండిపోయి వున్న ఒక ప్రదేశమును చూసిరి . అచట సరస్సులు లేకుండెను . చూచుటకు భయంకరముగా ఉండెను . అచట ఒక పర్వతప్రమాణములో  వికృతాకారుడైన ఒక రాక్షసుడు నెత్తురోడుతున్న పులి చర్మం ధరించి వారికి ఎదురుగా వచ్చెను . వాడు అమాంతం సీతాదేవి నడుము పట్టుకుని ఎత్తి "ఎవరు మీరు ?ముని వేషము వేసుకున్నారు . ధనుర్భాణములు ధరించారు . పైగా ఒక స్త్రీతో వున్నారు . అధర్మ ప్రవర్తన మునుల పద్దతికి విరుద్ధము కాదా ?"అని అడిగెను . 
ఇంకనూ ఆ రాక్షసుడు "నా పేరు విరాధుడు . మీకు కాలము మూడి ఈ ప్రదేశములో ప్రవేశించారు . మీ రక్తము తాగుతాను . ఈ సుందరి నాకు భార్య కాగలదు . "అని పెద్ద కంఠస్వరముతో పలికెను . ఆ రాక్షసుడి చేతిలో వున్న సీత భయముతో గజగజ వణికిపోయెను . సీతను అలా చూసిన రాముడు లక్ష్మణునితో "లక్ష్మణా !కైకేయి మనలను అడవుల పాలు చేసినను నేను బాధపడలేదు . తండ్రి మరణమును కూడా తట్టుకుని నిలబడగలిగాను . కానీ జనకుని కూతురు ,నా భార్య ,మిక్కిలి సుకుమారి అయిన సీత పరస్పర్శకు లోనగుట తట్టుకోలేకున్నాను "అని పలుకుతూ కన్నీరు కార్చుచుండెను . 
అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముని ఓదార్చి ,తానూ బాణముతో రాక్షసుడిని చంపుతానని ధైర్యము చెప్పాను . 

రామాయణము అరణ్యకాండ  రెండవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment