Friday 10 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటపదునొకండవసర్గ

                                                రామాయణము 

                                              అయోధ్యకాండ -నూటపదునొకండవసర్గ 

రాజపురోహితుడైన వశిష్ఠుడు ఆ విధముగా పలికి తిరిగి ఇలా పలుకసాగెను . "రఘునందనా !జన్మించిన ప్రతి వ్యక్తికీ ఆచార్యుడు ,తండ్రి ,తల్లి అని ముగ్గురు గురువులు ఉందురు . ఆచార్యుడు తల్లితండ్రుల కంటే శ్రేష్ఠుడైన గురువు . రామా !నేను నీకే కాదు నీ తండ్రికి కూడా గురువునే కావున నా మాట వినుము సత్సాంప్రదాయమును పాటించుము . వృద్ధురాలు ధర్మపరాయణరాలు అయిన మీ తల్లి మాట కాదనుట యుక్తము కాదు . నిన్ను వేడుకొనుచున్న  భరతుని పలుకును మన్నింపుము . "అని పలికెను . 
ఆ మాటలు విని శ్రీరాముడు "తల్లితండ్రులు తమ సంతానమునకు జన్మనిచ్చుట కాక అనేక సేవలు చేయుదురు వారి ఋణము తీర్చుకొనుట ఎవ్వరికైనను అసాధ్యము . కావున ఆయన నాకు ఇచ్చిన ఆదేశము వమ్ము కారాదు . "అని పలికెను . శ్రీరాముని మాటలు విని భరతుడు ఎంతో నిస్పృహకు లోనయ్యేను . భరతుడు సుమంత్రునితో "సుమంత్రా !దర్భాసనమును సిద్దపరుచుము . ఈ ప్రభువు నాయెడ ప్రసన్నుడయ్యెడి వరకు ఆయనకు అడ్డముగా ఇచటనే అన్నపానాదులు మాని  నిరాహార దీక్ష వహించి కూర్చుని ఉండెదను . "
అని పలికెను . సుమంత్రుడు కదలక శ్రీరాముని ఆజ్ఞ కొరకు వేచి చూస్తుండెను . అతని పరిస్థితి గమనించి భరతుడు తానే దర్భాసనమును తెప్పించుకుని అచట కూర్చునెను . అది చూసిన శ్రీరాముడు "భరతా !నీవు ఇటుల చేయరాదు . ఈ కఠోర వ్రతమును మాని అయోధ్యకు వెళ్లుము "అని పలికెను . ఆ మాటలు విన్న భరతుడు అచటనే వున్న పౌరులు ,పల్లెవాసులు చూసి" మీరందరు ప్రభువుకు ఏల నచ్చచెప్పరు ?"అని పలికెను . అప్పుడు వారందరూ "రాముడు సర్వధర్మములు బాగుగా ఎరిగినవాడు . పైగా తండ్రి మాట నిలబెట్టవలెననే కృత నిశ్చయముతో ఉండెను . ఆయనను మరలించుటకు మేము అశక్తులము "అని పలికెను . 
అపుడు భరతుడు ఓ ప్రజలారా !శ్రీరాముని బదులుగా నేను అరణ్యవాసము చేసెదను అని పలికెను . అప్పుడు శ్రీరాముడు" తండ్రి బతికి ఉండగా చేసిన నిర్ణయములను మార్చెడి శక్తి నాకు కానీ భరతుడికి కానీ లేవు . సమర్థుడైనవాడు తనకు మారుగా ప్రతినిధి చేత పనులు చేయించడు . కావున నేను కూడా భరతుడు నా బదులుగా అరణ్యవాసము చేయుటకు ఇష్టపడను నా వనవాసము పూర్తి అయిన పిమ్మట ఈ సోదరుడితో కలిసి రాజ్యపాలన చేయుదును . "అని పలికి తిరిగి భరతుడితో "భరతా !అయోధ్యకు వెళ్లి రాజ్యపాలన చేయుము . అని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ నూటపదునొకండవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 







No comments:

Post a Comment