Monday 20 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూట పందొమ్మిదవసర్గ

                                              రామాయణము 

                                                 అయోధ్యకాండ -నూట పందొమ్మిదవసర్గ 

సీతాదేవి చెప్పిన స్వయంవరగాధ విని అనసూయాదేవి మిక్కిలి సంతోషించెను . సీతాదేవిని కౌగలించుకుని ,నుదిటిపై ముద్దుపెట్టుకొనెను . అప్పుడు అనసూయాదేవి సీతాదేవితో "నేనిచ్చిన దివ్య వస్త్రాభరణములను ధరించు . చూడవలెనని నాకు కోరికగా వుంది . "అని పలికెను . అప్పుడు సీతాదేవి ఆ దివ్యవస్త్రాభరణములన్నియు ధరించెను . అనసూయా దేవి మిక్కిలి సంతోషించి "సీతా చీకటి పడినది . ఇక నీవు భర్త సేవకు వేళ్ళు "అని అనుమతి ఇచ్చెను . 
సీతాదేవి రాముని వద్దకు వెళ్లి అనసూయాదేవి ఇచ్చిన వస్త్రాభరణములు చూపించెను . ఎవ్వరికి దక్కని గొప్ప సత్కారము సీతకు దక్కినందుకు రామలక్ష్మణులు మిక్కిలి సంతోషించిరి . 

వారు మువ్వురు ఆ రాత్రి అచటనే విశ్రమించిరి . మరునాడు ఉదయమే సీతారామలక్ష్మణులు తమ ప్రయాణమునకు అనుమతి ఇవ్వమని తాపసులని అడిగెను . అప్పుడు వారు "ఈ దండకారణ్యములో రాక్షసులు ,క్రూరమృగములు ఎక్కువుగా వున్నవి . అవి మునులను చంపివేయుచున్నవి . నరమాంస భక్షకులు అయిన రాక్షసులు మునులను చంపి తింటూ మిక్కిలి హింస పెట్టుచున్నారు . కావున నీవు ఆ క్రూరమృగముల ,రాక్షసుల బారి నుండి మునులను కాపాడుచు ఉండుము . ఈ దారిలో మేము కందమూలాదులను తెచ్చుకుందుము . మీరు ఈ దారిలో వెళ్ళవచ్చు "అని పలికిరి . 
వారందరికీ నమస్కారములు చేసి వారు చూపిన దారిలో నడుచుకుంటూ సీతారామలక్ష్మణులు దండకారణ్యములో ప్రవేశించిరి . 

రామాయణము అయోధ్యకాండ నూటపందొమ్మిదవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం .ఏ (తెలుగు )తెలుగు పండితులు . 






No comments:

Post a Comment