Tuesday 31 January 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది అయిదవసర్గ

                                         రామాయణము 

                                        అయోధ్యకాండ -ఎనుబది అయిదవసర్గ 

నిషాద రాజైన గుహుడు ఆ విధముగా పలికిన పిమ్మట ,భరతుడు నిషాద రాజుతో "సోదరా !నీవు మా అన్న అగు శ్రీరామునికి పరమ మిత్రుడవు ,మాయీ అపారసేనకు ఆతిధ్యము ఇవ్వదలిచితివి చాలా సంతోషము . ఆతిధ్యము ఇచ్చినట్లే భావించుము .  ఈ దండకారణ్యం లో భారద్వాజముని ఆశ్రమమునకు దారి తెలుపుము . "అని పలికెను . 
నిషాద రాజు గుహుడు "నేను నా సేన లోకల శ్రేష్టమైన విలుకాళ్లు మీకు తోడుగా వచ్చి ,దగ్గర ఉండి మిమ్ము ఆశ్రమమునకు చేర్చెదను . స్వామీ !నాదొక సందేహము . మీ అన్న అగు శ్రీరాముడు ఎవ్వరికిని కీడు తలపెట్టనివాడు . అట్టి వానిని చూచుటకు ఇంత సైన్యముతో వెళ్ళవలసిన పని ఏమున్నది ?దయతో నా  సందేహమును తీర్చుము "అని పలికెను . 
ఆ మాటలు విన్న భరతుడు తనకు రాజ్యకాంక్ష ఏమాత్రము లేదని ,తన అన్నను తిరిగి రాజ్యమునకు తీసుకు వచ్చుటకు మాత్రమే వెళ్తున్నానని స్పష్టం చేసెను . ఆ మాటలు విన్న గుహుడు మిక్కిలి సంతోషించెను . భరతుడు తన సేనను విశ్రమించుటకు ఆజ్ఞను ఇచ్చెను . పిమ్మట అతడు తన గుడారములో చేరి శ్రీరామునకై చింతించుచు ఉండెను . గుహుడు అతడిని ఓదార్చెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబదియైదవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Monday 30 January 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది నాల్గవసర్గ

                                              రామాయణము 

                                            అయోధ్యకాండ -ఎనుబది నాల్గవసర్గ 

ఆ ప్రాంతమునకు రాజైన గుహుడు గంగా తీరమున కల భరతుని సేనను చూచి తన అనుచరులతో " ఈ సమీపముననే ఉన్న మహా సేనను చూడుడు ఇంతటి మహా సేనను నేను మనసున సైతము ఊహించలేదు . ఇది ఓ మహా సముద్రము వలె వున్నది . రాధములపై ఎగురుచున్న ఆ కోవిదారధ్వజము (ఎఱ్ఱకాంచనము )ఇక్ష్వాకు ప్రభువుల చిహ్నము . దీనిని బట్టీ ఆ రధమును ఉన్న వాడు నిశ్చయముగా భరతుడే . అతడు దుర్భుద్ధితో ఇటు వచ్చియుండును . దశరథ మహారాజు యొక్క రాజ్యలక్ష్మి సుసంపన్నమైనది అది ఇతరులకు దుర్లభమయినది . దానిని కైకేయి సుతుడు శాశ్వతముగా హస్తగతము చేసుకోనదలిచినట్లున్నాడు . అందులకు భరతుడు శ్రీరాముని సన్నిహితులమైన మనల్ని భందించుటకాని ,చంపుట కానీ చేయును . పిమ్మట అతడు రాముని అడ్డుని కూడా శాశ్వతముగా తొలగించుకోనున్నాడు కాబోలు . ఏదేమయినా నేను అతడి వద్దకు వెళ్లి విషయము సావధానంగా కనుక్కొని వత్తును . మన సేనను యుద్ధమునకు సిద్దము కమ్మని తెలపండి "
ఆవిధముగా పలికి సేనలకు యుద్ధమునకు సిద్దము కమ్మని ఆజ్ఞను ఇచ్చి విషయము తెలుసుకొనుటకు పండ్లు ,తేనే మున్నగు వస్తువులను తీసుకుని భరతుని వద్దకు వెళ్లి ,భరతుని అనుమతితో గుడారములోకి ప్రవేశించి తానూ తెచ్చిన పండ్లు ,తేనెలు వినయముతో సమర్పించెను . పిమ్మట భరతుని తన ఆతిధ్యము శ్వీకరించి ఈ రాత్రికి తన ఇంట బస చేయవలసినదిగా ప్రార్ధించెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబది నాల్గవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము అయోధ్యకాండ _ఎనుబదిమూడవసర్గ సమాప్తము .

                                   రామాయణము 

                             అయోధ్యకాండ _ఎనుబదిమూడవసర్గ సమాప్తము . 

భరతుడు ప్రాతః కాలమునే లేచి శ్రీరాముని చూడవలెననే కోరికతో ఉత్తమమయిన రథములను అధిరోహించి త్వరత్వరగా బయలుదేరెను . మంత్రులు పురోహితులు మున్నగువారు మేలుజాతి గుఱ్ఱములు తో కూడిన రధములపై భరతునికి ముందు భాగమున ప్రయాణించుచుండిరి . 9 వేల ఏనుగులు భరతుని అనుసరించెను . వివిధాయుధములతో విలుకాండ్రు అరువదివేల రధములతో భరతుని అనుసరించిరి . ఇంకనూ లక్షమంది అశ్వికులు తమ గుఱ్ఱములపై భరతుని వెంట సాగిపోయిరి . కౌశల్య ,సుమిత్ర ,కైకేయి సైతము రామలక్ష్మణులను చూడవలెననే కోరికతో ఆ యాత్రలో పాల్గొనిరి . పిదప బ్రాహ్మణాది త్రివర్ణముల వారు ,వివిధ వృత్తులవారు రామలక్ష్మణులను చూచు వేడుకతో భరతుని వెంట సాగిపోవుచు ,ఆ సోదరుల అపూర్వ గాధలను తమలో తాము ప్రస్తావించుకొనుచు ఆనందమును పొంగిపోవుచుండిరి . 
ఆవిధముగా అందరూ సంతోషముతో భరతుని అనుసరించి ముందుకు సాగుచుండిరి . శృంగిబేరి పురము చేరి గంగానదీ తీరమున విశ్రాంతి తీసుకొనుటకు సేనలకు ,తనతో వచ్చిన జనులకు భరతుడు  ఆదేశము ఇచ్చెను . ఆ గంగా జలములలో దశరధుని తర్పణములు విడిచి ,పిదప తన స్థావరంలో విశ్రమించి ,రాముని తిరిగి రాజ్యమునకు తెచ్చుటకు ఉపాయములు ఆలోచించుచు అచట వసించెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబది మూడవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Sunday 29 January 2017

రామాయణము అయోధ్యకాండ - ఎనుబది రెండవసర్గ

                             రామాయణము 

                      అయోధ్యకాండ      -      ఎనుబది రెండవసర్గ 

వశిష్టుని ఆజ్ఞను అనుసరించి అచటికి వచ్చిన వారందరితో ఆ సభ నిండుగా ఉండెను . అపుడు వశిష్ఠుడు భరతునితో "నాయనా !భారతా !మీ తండ్రి దశరధ మహారాజు ధర్మబద్ధముగా ఈ కోశలదేశమును పెద్దకాలము పాలించెను . ధనధాన్య సంపదలతో తులతూగుచున్న ఈ రాజ్యమును మీ తండ్రి నీకు అప్పగించారు . మీ అన్న అగు శ్రీరాముడు సైతము దీనిని అంగీకరించారు . కావున నీవు వెంటనే ఈ రాజ్యమునకు పట్టాభిషిక్తుడవు కమ్ము . రాజ్యమును రక్షించుము "అని పలికిరి . 
ఆ మాటలు విన్న భరతుడు మిక్కిలి బాధపడుతూ మనసులోనే శ్రీరాముని శరణు వేడుకుని ,వశిష్టునితో "ఓ గురువర్యా !శ్రీరాముడు బ్రహ్మచర్యా నిష్టాగరిష్టుడు ,సకల విద్యలలో ఆరితేరినవాడు ఎల్లపుడు ధర్మమును ఆచరించినవాడు మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని రాజ్యమును పొందుటకు నావంటివాడు ఎట్లు అర్హుడు అగును . ఓ మహాముని ఈ రాజ్యము శ్రీరామునిది నేనును ఆయన వాడను . శ్రీరాముడు నా కంటే వయసులో పెద్దవాడు . అంతేకాదు గుణములచేతనూ శ్రేష్ఠుడు .,ఉదాత్తుడు కనుక ఈ రాజ్యమును పాలించుటకు దశరథ మహారాజు వలె అతడే అర్హుడు . 
శ్రీరాముని రాజ్యము నేను శ్వీకరించుట మహా పాపము అట్టి పాపము చేసిన యెడల నాకు నిష్కృతి ఉండదు . నా తల్లి చేసిన ఈ పాపకృత్యమును నేను ఎప్పటికి అంగీకరింపను . ఈ రాజ్యమును రాముడే పాలించగలడు "అని పలికెను . 
ఆ మాటలు విని సభాసదులందరూ ఆనందాశ్రువులు రాల్చిరి . అంతట భరతుడు సభాసదులను ఉద్దేశించి "శ్రీరాముని వద్దకు వెళ్లి ఆయనను రాజ్యమునకు మరల్చదలిచితిని . తమరు ఎల్లరు నాతొ వనములకు రండు . ఇంతక ముందే నేను పంపిన సేనలు వాన దారులను శుభ్రపరచి అచట విడుదులను ఏర్పాటు చేసినవి . "అని పలికి
 సుమంత్రునితో "ఓ సుమంత్రా !మీరు వెంటనే అందరకూ వనములకు బయలుదేరమని నా ఆజ్ఞగా తెలుపుము . చతురంగబలమును సిద్దము చేయుము మనము రేపే బయలుదేరి వనములకు వెళ్ళెదము . "అని పలికెను . 
భరతుడి ఆజ్ఞను వెంటనే సుమంత్రుడు పాటించెను . ప్రతి గృహములోను పురుషులు వనములకు శ్రీరాముని దగ్గరకు వెళ్ళుటకు సిద్ధమయ్యెను . వేగముగా వెళ్ళు అశ్వములు ,రథములు ,కాల్బలము సిద్ధమయ్యెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబది రెండవ సర్గసమాప్తము . 

         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




రామాయణము అయోధ్యకాండ -ఎనుబదియొకటవసర్గ

                            రామాయణము 

                                 అయోధ్యకాండ -ఎనుబదియొకటవసర్గ 

ఆ విధముగా భరతుడి మాటలకు అందరూ సంతోషించిరి . ఆ రాత్రి భరతుడు జరిగినది తలచుకుంటూ బాధతో గడిపెను . తెల్లవారిన పిదప భరతుడిని నిద్రలేపుటకు స్తుతి పాఠకులు ,వందిమాగధులు ,మంగళకరమైన స్త్రోత్రములతో భరతుడిని స్తుతించుట ఆరంభించిరి . బంగారు వాద దండముతో జాములను సూచించు గారాలను మ్రోగించిరి . వందలకొలది శంఖములను పూరించిరి . వివిధ వాద్యముల ద్వారా మధుర ధ్వనులను కావించిరి . 
భరతుడు మేల్కొని నేను రాజుని కాను అని పలుకుచు ఆ వాద్యములు అన్నిటిని ఆపివేసెను . పిదప శత్రుఘ్నుడితో "నా తల్లి కైకేయి వలన ఎంతటి మహాపరాధము జరిగినదో కదా . ఎవ్వరిని మాటవరసకు కూడా బాధించి ఎరుగని రాముడు అడవులకు వెళ్ళినాడు . తండ్రి మరణించాడు . ఇప్పుడీ రాజ్యము చుక్కాని లేని నావ వలె విలవిలలాడుచున్నది . "అని పలుకుతూ రోధించెను . భరతుడి ఏడ్పు ,మాటలు విన్న అంతః పుర స్త్రీలు సైతము ఎడ్వాసాగిరి . 
భరతుడు ఇట్లు ఏడ్చుచుండగా రాజధర్మములు బాగుగా ఎరిగిన వశిష్ఠుడు తన శిష్యులతో కూడి సభాభవనములోకి ప్రవేశించెను . ఆ మహర్షి సముచితాసనము పై కూర్చుండి దూతలతో ఇలా ఆజ్ఞాపించెను . "మీరు కడుజాగరూకులై బ్ర్రాహ్మణోత్తములను ,క్షత్రియ ప్రముఖులను ,వైశ్యప్రవరులను ,భరతుడిని ,శత్రుఘ్నుడిని భరతుడి మేనేమామ అగు యధాజిత్తుని సుమంత్రుని ,ఇంకనూ మన శ్రేయోభిలాషులైన పురజనులను ఈ సభకు తీసుకురండు . "
దూతల కబురు విని వారందరూ అశ్వముల మీద రథముల మీద అచటికి ఏతెంచిరి . అప్పుడా ఆ సభాభవనము దశరధుడు బతికి వున్నప్పుడు వలె జనులతో కళకళలాడెను . 

          రామాయణము అయోధ్యకాండ ఎనుబదియొకటవసర్గ సమాప్తము . 

         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము అయోధ్యకాండ -ఎనుబదియవసర్గ

                                                      రామాయణము 

                                                     అయోధ్యకాండ -ఎనుబదియవసర్గ 

భరతుడి ఆజ్ఞను అనుసరించి అడవి మార్గమును శుభ్రపరచి ,సున్నము ఇసుకతో గచ్చు చేసెను . అడ్డుగా వున్న మూళ్ళ మొక్కలని తొలగించి ,మొక్కలు లేని చోట మొక్కలు నాటెను . మరియు విశ్రాంతి గృహములను ఏర్పాటు చేసెను . ఆ గృహముల చుట్టూ కందకములు త్రవ్వబడెను . ఆ విధముగా ఏర్పాటు చేయబడిన రాజమార్గము చూచుటకు ఎంతో శోభాయమానంగా ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబదియవసర్గ సమాప్తము . 

శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Saturday 28 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బది తొమ్మిదవసర్గ

                                రామాయణము 

               అయోధ్యకాండ -డెబ్బది తొమ్మిదవసర్గ                         

దశరథ మహారాజు మరణించిన పదునాల్గవ రోజు ప్రభాత వేళ రాజాకార్యములను నిర్వహించునట్టి    మంత్రివర్యులు ఒక చోట సమావేశమై భరతునితో "  మహా యశస్వి అయిన ఓ రాకుమారా !మనకు  మహారాజు అయిన దశరథ మహారాజు తన జ్యేష్ఠ కుమారుడైన ,శ్రీరాముని ,బలశాలి అయిన లక్ష్మణుని అడవులకు పంపి ,తాను స్వర్గస్తుడాయెను . ఇప్పుడు ఈ రాజ్యమునకు రాజు ఎవ్వరు లేరు . కనుక ఈ రాజ్యాధికారమును మీరే శ్వీకరింపవలెను . మహారాజు స్వయముగా రామలక్ష్మణులను అరణ్యములకు పంపి రాజ్యాధికారమును నీకు ఏర్పాటు చేసెను . కనుక నీవు రాజు అగుట న్యాయసమ్మతమే . కావున వెంటనే పట్టాభిషిక్తుడవయి మమ్ము ,ఈ రాజ్య ప్రజలను రక్షింపుము . " అని పలికెను . 
వారి మాటలకు భరతుడు "జ్యేష్ఠుడకు రాజ్యము అప్పగించుట పరంపరగా వచ్చుచున్న ఆచారము . కనుక అనుభవజ్ఞులు ,పెద్దలు అయిన మీరు ఇటుల మాట్లాడుట ఏమాత్రము తగదు . మా సోదరులలో పెద్దవాడైన శ్రీరామునికే రాజ్యమును అప్పగించెదను . ఆయనకు మారుగా నేను వనవాసము చేసెదను . చతురంగ బలముతో కూడిన సేనను సిద్దపరుచుము . నేను ఈ క్షణమే బయలుదేరి వెళ్లి ,మా అన్నను తీసుకువచ్చెదను . పట్టాభిషేకమునకు కావలిసిన సమస్త వస్తువులను తీసుకువెళ్లి అక్కడనే రామునికి పట్టాభిషేకము చేసి ఆయనను రాజుగా తీసుకువచ్చెదను . 
ఈ కైకేయి పేరుకు మాత్రమే నా తల్లి ఈమెలో మాతృ భావము ఏమాత్రము లేదు . ఈమె కోరికను నేను నెరవేరనివ్వను . ఈ రాజ్యమునకు శ్రీరాముడే రాజు కాగలడు . నేను మాత్రము కారడవులలో నివసించెదను . శిల్పులు ముందుగా వెళ్లి ఎగుడుదిగుడుగా వుండు బాటలు సరిచేయవలెను . అడవుల బాటలు బాగుగా ఎరిగిన వారు మనకు రక్షణగా మనతో వత్తురు "అని పలికెను . 

 భరతుడి మాటలు విని ఆ ముని శ్రేష్ఠులు అందరూ మిక్కిలి సంతోషించిరి . వారి కనుల వెంట ఆనంద భాష్పములు రాలినవి . వారి మదిలోని దుఃఖము పటాపంచలయ్యెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది తొమ్మిదవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









            

రామాయణము అయోధ్యకాండ -డెబ్బది ఎనిమిదవసర్గ

                                            రామాయణము 

                                  అయోధ్యకాండ -డెబ్బది ఎనిమిదవసర్గ 

దశరథ మహారాజు అంత్యక్రియలు ఆచరించిన పిమ్మట భరతుడు ఆ దుఃఖము నుండి తేరుకొనలేదు . అట్టి స్థితిలో లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు "అన్నా !సకల ప్రాణుల ఆపదలను తొలగించి ,వారిని కాపాడు సమర్ధుడు శ్రీరాముడు . అట్టి మహా మాహాసత్వసంపన్నుడైన శ్రీరాముని ఒక అబల అడవులకు పంపినే . నిజముగా ఇది మిగుల బాధాకరం . బలశాలి ,పరాక్రమ సంపన్నుడగు లక్ష్మణుడు ఎదుటే ఉండి ,తండ్రిని ఎదురించి అయినను శ్రీరామునికి తటస్తించిన  ఈ సంకట స్థితిని ఎందుకు తొలగింపలేదు ?ఇది నాకు ఆశ్చర్యము కలిగించుచున్నది . "అని భరతుడితో పలికెను . 
లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు రోషముతో ఇట్లు పలుకుచుండగా ,ఇంతలో ఒంటి నిండా నగలు ధరించి గూని మంధర అచటికి వచ్చి వాకిలి ఎదుట నిలబడి ఉండెను . అచట కల ద్వారపాలకులు దానిని తెచ్చి శత్రుఘ్నునితో "అయ్యా !దీని కారణముగనే శ్రీరాముడు అరణ్యములకు వెళ్లెను . దశరథ మహారాజు మరణించెను . దీనిని మీ ఇష్టమొచ్చినట్టు చేయుడు . "అని పలికిరి . 
అప్పుడు శత్రుఘ్నుడు "ఈమె అందరికి తీరని దుఃఖము తెచ్చిపెట్టింది . దీనిని శిక్షించవలిసిందే "అని పలుకుతూ ఆ కుబ్జను  గట్టిగా పట్టుకొనెను . అప్పుడు అచట ఉన్న కైకేయి దాసీ జనమంతా భయముతో పరుగులు తీసిరి . వారిలో వారు "భరతుడు మనలను కూడా  చంపివేయునేమో , కౌసల్యా మాతను శరణు వేడెదము . ఆవిడ తప్ప మనలను ఎవ్వరు కాపాడలేరు "అని భయముతో అనుకోసాగిరి . 
శత్రు భయంకరుడైన శత్రుఘ్నుడు ఆ గూని మందరను ఈడ్చుతూ తీసుకువచ్చెను . ఆమె ఆర్తనాదములు విని కైకేయి ఆమెను రక్షించుటకు పరుగుపరుగున వచ్చెను శత్రుఘ్నుడు ఆమెను తన కఠిన మాటలతో బాధించెను . అప్పుడు కైకేయి దారి నుండి తొలగిపోయెను . తనను శరణు వేడిన మందరను వదిలేయమని భరతుడు చెప్పెను . తిరిగి "స్త్రీ హత్య చేసిన యెడల శ్రీరాముడు మనలను కోపించును కావున దానిని వదిలివేయుము "అని పలికెను . 
భరతుడి మాటలు విని శత్రుఘ్నుడు మందరను విడిచిపెట్టెను . కైకేయి దానిని ఓదార్చెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది ఎనిమిదవసర్గ సమాప్తము . 

             శశి , 

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Sunday 22 January 2017

రామాయణము అయోధ్యకాండ-డెబ్బది ఏడవసర్గ

                                             రామాయణము 

                                    అయోధ్యకాండ-డెబ్బది ఏడవసర్గ 

పది దినములు గడిచిన పిమ్మట పదునొకండవ దినమున శుచియై శుద్ధి ,ఫుణ్యావచనాది కార్యక్రమములను ఆచరించెను . పన్నెండోవదినమున షోడసము ,సపండీకరణము మొదలగు శ్రార్ధ కర్మలను అతడు నిర్వహించెను . పిమ్మట భరతుడు బ్రాహ్మణులకు ,బంగారము ,రత్నములు ,ధనము మొదలగు వాటిని దానము చేసెను . సమృద్ధిగా అన్నదానము చేసెను . ఆ రాజకుమారుడు మహారాజుకి ఉత్తమగతులు లభించుటకు విప్రోత్తములకు ఇంకనూ మిక్కిలి తెల్లని ఉన్ని శాలువాలు ,వేలకొలది గోవులు ,దాస దాసీ జనములను ,వస్తు సమూహములను ,అందమైన గృహములను దానము చేసెను . 
పిమ్మట పదమూడవ దినము ప్రాతః కాలమున భరతుడు విలపించుచు అస్తి సంచయనార్ధము స్మశానమునకు వెళ్లెను . అచట చితా భస్మము ,ఎముకలు చెల్లాచెదురుగా ఉండెను . అది చూచి కన్నీటి ప్రవాహమును ఆపుకోలేక ఏడవసాగెను . శత్రుఘ్నుడు సైతము ఎక్కీఎక్కి ఏడవసాగెను . వారిరువురు పూర్వము తండ్రి వారితో వున్న సందర్భములను తలచుకుని ఏడవసాగెను 
"తినఁడ్రీ భోజన సమయముల నందు నీవు మాకు కొసరికొసరి తినిపించెడివాడవు . పానీయములు తాగించెడివాడవు . మాకు నచ్చెడి వస్త్రములను మమ్ము అడిగి తెలుసుకుని మాచేత ధరింపచేసేవాడవు . ఇప్పుడు మమ్ము ఆవిధముగా ఎవరు చూచెదరు . మా కిపుడు అంత గారాబముతో ఎవరు విచారణ చేయుదురు . "అంటూ పలుపాలు విధములుగా తలుచుకుని మిక్కిలి శోకముతో ఎడ్వాసాగిరి . అప్పుడు సుమంత్రుడు శత్రుఘ్నుడిని లేపి వారిరువురికి జననమరణములు అనివార్యమని బోధించెను . అప్పుడు వారు కన్నులు తుడుచుకుని బాధను దిగమింగుతూ లేచి నిలబడిరి . అపుడు వారిరువురిని మంత్రులు ఇంకను మిగిలి వున్న అస్తి సంచయాది కార్యములు నిర్వహించుటకై తొందరపెట్టసాగిరి . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది ఏడవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Friday 20 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బది ఆరవసర్గ

                                    రామాయణము 

                                   అయోధ్యకాండ -డెబ్బది ఆరవసర్గ 

కైకేయి సుతుడగు భరతుడు శోకముతో కుమిలిపోవుచుండగా ,వశిష్ఠమహర్షి " రాకుమారా!ఇది శోకింపవలసిన సమయము కాదు . శోకింపవలదు . మహారాజునకు ఉత్తమగతులు కలుగుటకై అంత్యక్రియలు జరపవలసిన సమయమిది . కర్తవ్యమునకు సిద్దపడుము . "అని పలుకగా భరతుడు మనస్సుని కుదుటపరుచుకుని తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించెను . దశరధుని దేహమును తైల ద్రోణిలోనుండి వెలుపలికి తీసిరి . చాలా కాలము తైల ద్రోణిలో ఉండుటచే ముఖము పాలిపోయెను . కానీ అవయవములు శిదిలము కాకుండుటచే చూచుడు వారికి రాజు నిద్రించునట్లు కనపడుచుండెను . 
విధ్యుక్తముగా చేయవలసిన పనులన్నీ పూర్తిచేసిరి . భరతుడు ,రాణులు ,మిగిలిన స్త్రీల ఆక్రన్దలతో ఆ భవనము మారుమ్రోగిపోయెను . రాజలాంఛనాలతో దశరధుని దేహముని స్మశానమునకు చేర్చిరి . కౌసల్య ,సుమిత్ర ,కైకేయి మొదలగు రాణులు వారి వారి అర్హతను బట్టీ అచటకు చేరిరి . భరతుడు విధ్యుక్తముగా దహన సంస్కారములు చేసెను . రాణులు సవ్యాపసవ్యముగా ప్రదక్షణలు చేసిరి . ఆ సమయమున దీనంగా ఏడ్చుచుచున్న స్త్రీల ఆర్తనాదములతో ఆ ప్రదేశము మారుమ్రోగేను . శోకవికలులై తమ వాహనములలో సరయు నదీ తీరమునకు చేరెను . అచట ఆ రాజపత్నులు ,మంత్రులు ,పురోహితులు ,భరతుడు మొదలగు వారందరు నదీ జలములతో తర్పణములు విడిచిరి . పిమ్మట అందరూ కన్నీరు కార్చుచు నగరమున ప్రేవిశించిరి . పది దినముల వరకు నిత్యము నేలపై శయనించుచు దుఃఖమును ద్రిగమింగుచు అంత్యక్రియలను నెఱిపిరి . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది ఆరవసర్గ సమప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    








Sunday 15 January 2017

రామాయణము అయోధ్యకాండ --డెబ్బది అయిదవసర్గ

                                          రామాయణము 

                              అయోధ్యకాండ --డెబ్బది అయిదవసర్గ 

భరతుని రాకను గురించి తెలుసుకున్న సుమంత్రుడు మొదలగు  మంత్రులు కైకేయి భవనమునకు వచ్చిరి . స్పృహ తప్పి పడిపోయి వున్నా భరతుడు కొద్దిసేపటికి మేల్కొని "మంత్రులారా !నేను ఎన్నడూ ఈ రాజ్యాధికారమును కాంక్షించలేదు . దానిని గూర్చి తల్లితో ఆలోచన చేసి ఎరుగను . శ్రీరాముని వనవాసము మున్నగు విషయములేవి నేను ఎరుగను ఏలననగా నేను ఇక్కడ లేను మా తాతగారి ఇంట ఉంటిని . "అని ఏడుస్తూ గగ్గోలు పెట్టెను . 
పిమ్మట భరతుడు కౌశల్యాదేవి భవనమునకు బయలుదేరెను . అక్కడ కౌశల్యాదేవి మాసిన వస్త్రములతో ,తనువు కృశించి దుఃఖిస్తూ ఉండెను . భరతుడు శత్రుఘ్నుడు దూరము నుండే కౌశల్యను చూసి వారు కౌగలించుకుని ఏడ్చిరి .అప్పుడు కౌశల్యా మాత "నాయనా !భరతా !మీ తల్లి కైక వరముల పేరుతొ  శ్రీరాముని వనవాసములకు పంపినది . ఆ బాధతో దశరథ మహారాజు మరణించెను . వీటి వల్ల ఆమె ఏమి బాగుకున్నదో తెలియదు మీ అమ్మ నన్ను కూడా అడవులకు పంపితే బాగుండును . అటుల జరగనిచో నేనే ఆత్మాహుతి చేసుకొనెదను . మీ తల్లి దయ వలన నీకు ఈ రాజ్యలక్ష్మి ప్రాప్టించినది . "అని పలికెను . 
ఆమె మాటలు విన్న భరతుడు కౌశల్యాదేవి పాదములపై పడి ఏడ్చుచు "మాతా !అన్న రాముడనిన నాకును అమితమైన ప్రేమ ఈ రాజ్యమును నేను కలలో కూడా ఆశించలేదు . ఈ జరిగిన పరిణామములు ఏవి నాకు తెలియదు నన్ను నమ్ము "అని పలు రకములుగా వాగ్ధానములు చేస్తూ ఏడ్చెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది అయిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,(తెలుగు ),తెలుగు పండితులు . 




 

Friday 13 January 2017

రామాయణము అయోధ్యకాండ -డబ్బదినాలుగవసర్గ

                                 రామాయణము 

                           అయోధ్యకాండ -డబ్బదినాలుగవసర్గ 

భరతుడు ఆ విధముగా తన తల్లిని నిందించిన పిమ్మట మిక్కిలి క్రుద్ధుడై ఆమెతో మఱల ఇలా అనెను . "క్రూరురాలా !దుర్మార్గురాలా !నీవు ధర్మభ్రష్టురాలవు . కావున ఈ రాజ్యము నుండి వెళ్లిపొమ్ము . మహారాజు మరణించినందుకు ఏడవకుము . నేను మరణించినట్టు భావించి జీవితాంతము ఏడువుము . నీ కారణముగానే మహారాజు మృత్యు ముఖమును చేరినాడు . నీవలనే శ్రీరాముడు అడవులకు వెళ్ళినాడు . నీ కారణముగనే నేను అపకీర్తి పాలయ్యాను . నీవు నాకు తల్లి రూపమున వున్న శత్రువువు . పతి హత్యకు పాల్పడినావు . కనుక నీతో నేను ఇక మాట్లాడను . 
మహాబలశాలి అయిన శ్రీరాముని ఇచటకు రప్పించి ఆయనకు మారుగా నేను దండకారణ్యములకు వెళ్లెదను . ఆప్తులు ,జెనులు అందరూ దీన వదనములతో ఏడ్చుచు ,నన్ను చూచుచుండగా నేను ఈ పాపభారమును మోయలేను . శ్రీరాముడు వచ్చి రాజ్యము చేపట్టినప్పుడు కానీ నాకు ఈ కళంకము తొలగదు "అంటూ ఏడుస్తూ భరతుడు కిందపడిపోయెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బదినాలుగవసర్గసమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






 

Tuesday 10 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బదిమూడవసర్గ

                                            రామాయణము 

                                          అయోధ్యకాండ -డెబ్బదిమూడవసర్గ 

జరిగిన విషయము అంతా తెలుసుకున్న భరతుడు మిక్కిలి దుఃఖముతో "నేను తండ్రిని కోల్పోయి ,తండ్రితో సమానుడైన అన్న అగు శ్రీరామునికి దూరమై దుఃఖ సాగరంలో మునిగిపోయి వున్నాను . నాకు ఈ రాజ్యముతో పనిలేదు . ఈ వంశము సుఖములను శాశ్వతముగా నేలపాలుచేసితివి . పాపాత్మురాలా !మా తండ్రిని మృత్యుకౌగిట చేర్చిన పుణ్యము నీదే . కౌశల్యాదేవి నిన్ను తన సోదరి వలె చూచుకుంటున్నది . అటువంటి ఆమె కుమారుని వనములకు పంపావు . ఆమె నీకు చేసిన ద్రోహమేమి ?మహారాజుసైతము మరణించెను . ఇప్పుడైనను నీకు ఏమాత్రము విచారము కలుగుటలేదా ?
సత్పురుషుడైన శ్రీరాముని అడవులకు పంపి ఏమి బాగుకుంటివి . దశరథ మహారాజు ఈ రాజ్యమును సుభిక్షంగా పరిపాలించెడివాడు . ఆయనకు ఏదేని అవసరము వచ్చినను శ్రీరామునే ఆశ్రయించెడివాడు . అట్టి శ్రీరాముడు ఇచటలేడు . అల్పుడనైన నేను ఈ సమస్త రాజ్యభాద్యతలను ఎలా మోయగలను ?అది నాకు అసాధ్యమైనది . అయినను నాకు ఈ రాజ్యము మీద వాంఛ ఏ మాత్రము లేదు నీవు రామునికి అపకారము చేసిన కారణముగా నేను నిన్ను సైతము పరిత్యజించెదను . ఇక ఈ రాజ్యము ఎంత ?
ఇక్ష్వాకు ప్రభులు ఎల్లప్పుడూ జ్యేష్ఠ కుమారునికి పట్టాభిషేకము చేయుదురు . చిన్నలైన తమ్ములు అన్నాను అనుసరించెదరు . ఇది ఇక్ష్వాకు ధర్మము . దానిని తప్పు పట్టించితివి . అన్న తదుపరి తండ్రి వంటి వాడు . ఆయనను అర్ధించి పాదములపైన పడి ఆయనను తీసుకువచ్చి సింహాసనంపై కూర్చొండబెట్టెదను . పిదప నేను ఆయనకు దాసుడను అవుదును . ఇదే నా నిర్ణయము "అని పలికి పర్వత గుహలోని సింహము వలె గర్జించెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బదిమూడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Monday 9 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బదిరెండవసర్గ

                                               రామాయణము 

                                           అయోధ్యకాండ -డెబ్బదిరెండవసర్గ 

దశరధుని భవనంలోకి ప్రవేశించిన భరతుడికి అక్కడ తన తండ్రి కనపడకపోవుటచే తల్లి కైక భవనంలోకి వెళ్లెను .  కైక చాలా కాలము తర్వాత  చూచుటచే సంతోషముతో బంగారు సింహాసనము నుండి దిగి కుమారుడికి ఎదురెళ్ళేను. తన పాదములకు నమస్కరించిన కుమారుని లేపి నుదిటిన ముద్దు పెట్టి తనతో పాటు సింహాసనమున పక్కన కూర్చొండబెట్టుకుని 
"నాయనా !కుమారా !ఎప్పుడు బయలుదేరినావు . వేగముగా వచ్చుటచే అలసిపోలేదుకదా !అచట మీ తాతగారు ,మేనమామ గారు సర్వులూ కుశలమేనా?"అని కుమారుని ప్రశ్నించెను . అప్పుడు  భరతుడు "తల్లీ !నేను బయలుదేరి నేటి రాత్రికి 7రాత్రులు గడిచినవి . అచట సర్వులూ క్షేమమే . మా తాతగారు ,మేనమామ గారు నా కొఱకు అనేక బహుమతులను పంపినారు . అవి వెనక వస్తున్నాయి . నేను వేగముగా వచ్చినాను . నేను రాగానే తండ్రి గారి మందిరమునకు వెళ్లితిని అచట తండ్రి గారు నాకు కనిపించలేదు . ఇచట మీ భావనమందు కూడా ఆయన అగుపించుటలేదు ?ఆయన ఎల్లప్పుడూ మీ భవనము నందే వసింతురు కదా !మరి నేడు ఆయన ఇచటలేరు . కౌశల్యా మాత గృహమున వుండినారా ?"అని తన తల్లిని ప్రశ్నించెను . 

అప్పుడు కైకేయి  చేసిన ఘనకార్యమును తలుచుకుని మురిసిపోతూ సంతోషముతో "కుమారా అన్ని ప్రాణులూ కడకు ఎచటికి చేరుతాయో మీ తండ్రిగారు కూడా అచటికే చేరినారు . సహృదయులు ,ముల్లోకములలో కీర్తి గడించినవాడు అయిన మీ తండ్రి పరమపదించారు . "అని చెప్పెను . అంతట భరతుడు బిగ్గరగా ఏడుస్తూ కింద పడిపోయెను . అయ్యో తండ్రీ అని బిగ్గరగా ఏడవసాగెను . అప్పుడు కైక "భారతా !దీనులవలె ఏడవకు . లే ఈ రాజ్యమును పాలించు . వశిష్ఠుడు మొదలయిన పురోహితుల సలహాలతో మీ తండ్రి వలే రాజ్యమును పాలించి పేరు తెచ్చుకొనుము . "అని పలికెను . 
అప్పుడు భరతుడు "తల్లీ !మా తండ్రిగారు ఎలా చనిపోయినవారు ?ఆయనకు వచ్చిన వ్యాధి ఏది ?అయ్యో మా తండ్రగారు నేను కనపడినంతనే నా నుదిటిన ముద్దు పెట్టి ఆప్యాయముగా కౌగలించుకొని తన వడిలో నన్ను కూర్చొండబెట్టుకుని ఆప్యాయముగా మాట్లాడేడి వారు . రామలక్ష్మణులు ఎంత ధన్యులో కదా !తండ్రిగారి చివరిదశలో ఆయనచెంత వున్నారు . తల్లీ మా తండ్రిగారు చివరిగా పలికిన పలుకులు ఏమిటి ?అని అడిగెను . అప్పుడు కైక "రామా !లక్ష్మణా !సీతా అని కలవరించుచు మరణించిరి . వారు అరణ్యములకు వెళ్ళుటచే వారి మీద దిగులుతో మరణించెను . "అని తెలిపెను 
అపుడు భరతుడు "అయ్యో !మా అన్నగారు అయోధ్యను వీడి వనములకు ఏల వెళ్లితిరి . వారు చేసిన దోషమేమి ?భ్రూణ హత్యచేసిన  వారు అనుభవించే శిక్ష వనములకు వెళ్ళుట . మా అన్నగారు ఎందుకు వనములకు వెళ్ళినారు ?లక్ష్మణుడు ,వదినసీత వనములకు ఎందుకు వెళ్ళినారు "అని అడిగెను . అపుడు కైక మిక్కిలి సంతోషముతో తానూ చేసిన ఘన కార్యమును తత్ఫలితముగా రాముడు వనములకేగుట ,ఆయన వెనుక సీతా లక్ష్మణులు అనుసరించుట సమస్తమూ తెలిపెను  . ఇంకనూ "భరతా !నీ కొరకు ఈ సమస్త కార్యమును నేనే నిర్వహించితిని . శోకమును వీడుము రాజ్యమును చేపట్టుము . ఇక ఈ రాజ్యమునకు నీవే అధిపతివి . నాయనా !భారతా !విధివిధానములను బాగుగా ఎరిగిన వశిష్టాది మునులు మొదలగు బ్ర్రాహ్మణోత్తములతో కూడి ,సాటిలేని పరాక్రమశాలి అయిన మీ తండ్రికి అంతిమసంస్కారము నెరపుము . వెంటనే ఈ కోశల  రాజ్య సింహాసనమున పట్టాభిషిక్తుడవుకమ్ము "అని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బదిరెండవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Sunday 8 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బదిఒకటవసర్గ

                                    రామాయణము 

                             అయోధ్యకాండ -డెబ్బదిఒకటవసర

మిగుల పరాక్రమశాలి అయిన భరతుడు ఆ విధముగా" రాజగృహము" అను తాతగారి ఊరి నుండి బయలుదేరి నదులను ,వనములను దాటుతూ ప్రయాణించెను . ఆ రోజు రాత్రి "వరూదము"అను పేరు కల పురములో విశ్రమించెను . వేకువ జామునే తిరిగి ప్రయాణము ఆరంభించి ఆ రోజు రాత్రి "సర్వ తీర్ధ " అనే పురములో విశ్రమించెను . మరునాడు ప్రాతః కాలమునే లేచి అయోధ్య దిశగా ప్రయాణము సాగించెను . అయోధ్యలో ప్రవేశించిన భరతుడికి అయోధ్య అంతా కళాహీనంగా ఎవరి గుమ్మముముందు ముగ్గులు లేక ,గృహములన్నియు పాడుబడినవాటి వలె అగుపించెను  . జనుల ముఖములలో ఆనందము అన్నది లేక ఉండెను . ఎల్లప్పుడూ సంగీత  ,వాద్య శబ్దములు వినపడుతూ  గజములు ,గుర్రములు వీధులలో తిరుగాడుతూ మిక్కిలి సందడిగా  ఆ పుర వీధులన్నీ ఉండెడివి . కానీ ఇపుడు వీధులన్నియు నిశ్శబ్దముగా ఉండెను . 
ఈ పరిస్థితులన్నియు గమనించిన భరతుడు ఏమి జరిగినదో అని మనసు కీడు శంకించుచుండగా ,తనకు వచ్చిన కలలో  దశరధుడు పడిన బాధను తలచుకుంటూ ,మిక్కిలి వేగముగా దశరధుని భవనమునకు చేరెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది ఒకటవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Saturday 7 January 2017

రామాయణము అయోధ్యకాండ -డబ్బదియవ సర్గ

                                           రామాయణము

                              అయోధ్యకాండ -డబ్బదియవ సర్గ 

భరతుడు ఇలా తన మిత్రులకు తన స్వప్నవృత్తాన్తమును వివరించుచుండగా వశిష్ఠుడు పంపిన దూతలు అచటికి విచ్చేసి "రాకుమారా !భారతా !అయోధ్యలో నీవు శీఘ్రముగా నిర్వర్తింపవలసిన బాధ్యత ఒకటి వున్నది . కావున వేగిరమే బయలుదేరి అయోధ్యకు రండు ". అని పలికిరి ఇంకనూ "మీ తాతగారికి ,మేనమామగారికి వస్త్రములు అయోధ్య నుండి మీ కొరకు పంపినారు వాటిని గ్రహించి మీ తాతగారికి ,మేనమామగారికి బహూకరించండి "అని పలికిరి . 
బంధు మిత్రులయెడ ప్రేమాభిమానములు కల భరతుడు తండ్రి,తల్లులు రామలక్ష్మణులు ,కులగురువుల కుశలములు అడిగెను . అందుకు ఆ దూతలు  అందరూ కుశలమే .  శీఘ్రముగా బయలుదేరుము అని తొందరపెట్టిరి . అప్పుడు భరతుడు బహుమతిగా దూతలు తెచ్చిన వస్త్రములను శ్వీకరించి తాతగారికి ,మేనమామకు  బహూకరించెను . పిదప వారును భరతుడికి అనేక ఆభరణములు ఇచ్చిరి . భరతుడు తాతగారి వద్ద ,మేనమామ వద్ద ,మాతామహి వద్ద అనుమతి పొంది అయోధ్యకు పయనమయ్యెను . 
అపుడు కేకేయ రాజు భరతుడికి రక్షణార్ధము అనేకమంది సేనలను పంపెను . చతురంగ బలములు తోడుగా వచ్చుచుండగా తాతగారి ఇంటి నుండి బయలుదేరెను . 

రామాయణము అయోధ్యకాండ డబ్బదియవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 










Friday 6 January 2017

రామాయణము అయోధ్యకాండ -అరువది తొమ్మిదవసర్గ

                                 రామాయణము 

                అయోధ్యకాండ -అరువది తొమ్మిదవసర్గ              

వశిష్ట మహర్షి పంపిన దూతలు ఆ నగరమున ప్రవేశించినంతనే భరతుడు తన స్వప్నమున దశరథ మహారాజు అనేక భాదలు పడుచున్నట్లుగా కలగనెను . తెల్లవారిన పిమ్మట ఆ కాలనీ తలచుకుని మిక్కిలి మానసికవేదనను అనుభవించెను . చింతాగ్రస్తుడైవున్న అతడిని గమనించి అతని ప్రియ మిత్రులు ఆ బాధనుండి ఆయనను బయటకు తీసుకువచ్చుటకు ఒక సభ ఏర్పాటు చేసిరి . 
అందు కధలు చెప్పసాగిరి . ఇంకనూ వీణావేణు నాదములను వినిపించిరి . వివిధములగు నృత్యములను ప్రదర్సింపచేసిరి . ఇంకనూ రసరంజకములైన నాటికలను ,నాటకములను ప్రదర్శించిరి . హాస్య ప్రశంగములు కావించిరి . అయినను ఆ రఘువంశజుడు తన విచారము నుండి బయటపడకుండెను . 
అప్పుడు భరతుడి మిత్రులు ఆయన విచారమునకు కారణము అడిగిరి . అప్పుడు భరతుడు తనకు వచ్చిన భయంకరమైన కలను గూర్చి వారికి వివరించెను . అందు దశరథ మహారాజు పడుతున్న బాధ నాకు పదేపదే జ్ఞప్తికి వచ్చుటచే తాను ఆ విచారము నుండి బయటపడలేకపోతున్నానని తెలిపెను . 

రామాయణము అయోధ్యకాండ అరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




             

రామాయణము అయోధ్యకాండ -అరువది ఎనిమిదవసర్గ

                                           రామాయణము 

                          అయోధ్యకాండ -అరువది ఎనిమిదవసర్గ 

మార్కండేయాది మహర్షుల మాటలు విన్న వశిష్ట మహర్షి "ప్రస్తుతము భరతుడు ,తన సోదరుడు అయిన శత్రుఘ్నుడితో కలసి తన మేనమామ ఇంట హాయిగా వున్నాడు . అతడికి ఇక్కడి విషయములు ఏమి తెలియవు .కావున శీఘ్రముగా పోవు గుఱ్ఱముల పై విస్వాసపాత్రులైన దూతలను అచటికి పంపి భరతశత్రుఘ్నులను ఇచటకు రప్పింతుము . "అని పలికి 
సిద్దార్థ ,విజయ ,జయంత ,అశోక ,నందన అను పేర్లు కల దూతలను పిలిచి "నాయనలారా !మీరు అతిశీఘ్రముగా కేకేయ రాజ్యమునకు వెళ్లి భరతశత్రుఘ్నులను  ఇచటకు తీసుకు రావలెను . వారికి ఇక్కడి విషయములు ఏమియు తెలుపరాదు . మీ ముఖముమీద శోకాచిహ్నములు కనపడనీయక నా ఆజ్ఞను పాటించవలెను "అని తెలిపెను . 
అంతట వారు దారిఖర్చులు తీసుకుని ,తమ ఇంటి వారికి చెప్పి శీఘ్రముగా బయలుదేరి అనేక ప్రాంతములు ,ఎత్తయిన ప్రదేశములు ,అరణ్యములను దాటుతూ ఆగమేఘములమీద కైకేయ రాజ్యమయిన" గిరివ్రజపురము"ను చేరిరి . అప్పటికి రాత్రి అయినను ,వారు గుఱ్ఱములు మిక్కిలి అలసిపోయి ఉన్నను దశరథ మహారాజు ఆత్మశాంతి కొరకు ,ఇక్ష్వాకు వంశజుల రక్షణ కొరకు ,ఆ ప్రభువుల వంశ పేరుప్రతిష్టలు నిలుపుటకు త్వరత్వరగా ఆ పురమున ప్రవేశించిరి . 

రామాయణము అయోధ్యకాండ అరువది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము అయోధ్యకాండ -అరువది ఏడవసర్గ

                            రామాయణము 

                            అయోధ్యకాండ -అరువది ఏడవసర్గ 

అయోధ్య లోని సమస్త ప్రజలకు ఆ రాత్రి ఏడుపులు పెడబొబ్బలతోనే గడిచింది . అందరూ దుఃఖంలో నిండి ఉండుటచే ఆ రాత్రి ఒక యుగములా గడిచెను . ఎవ్వరికి నిద్రలేదు . తెల్లవారిన పిమ్మట రాచకార్యములు నిర్వహించెడి బ్ర్రాహ్మణులందరూ సభ చేసిరి . 
మార్కండేయుడు ,మౌద్గల్యుడు ,వామదేవుడు ,కాశ్యపుడు ,కాత్యాయనుడు ,గౌతముడు ,జాబాలి ,మొదలగు సుప్రసిద్ధ బ్రాహ్మణోత్తములందరూ ,అమాత్యులతో ,రాజపురోహితుడు ,మునిశ్రేష్ఠుడు అయిన వశిష్ట మహర్షి సమక్షమున తమ ,తమ సూచనలు తెలిపిరి . 
రాజులేనట్లయితే వచ్చెడి ఇబ్బందులు చెప్పి దశరధుని పుత్రులలో ఒకరిని రాజుగా చేయమని వశిష్టుని కోరిరి . ఇంకనూ "దశరధుడు బతికి ఉండగా మేము మీ ఆజ్ఞలను పాటించేడి వారము . ఇప్పుడును మీ ఆజ్ఞలను పాటిస్తాము "అని పలికిరి . 

రామాయణము అయోధ్యకాండ అరువది ఏడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Wednesday 4 January 2017

రామాయణము అయోధ్యకాండ -అరువది ఆరవసర్గ

                                రామాయణము 

                                అయోధ్యకాండ -అరువది ఆరవసర్గ 

అసువులు వీడిన దశరధ మహారాజుని చూసి కౌశాల్య్ కన్నీరుమున్నీరుగా ఏడ్చుచుండెను . తన భర్త శిరస్సుని వడిలో పెట్టుకుని ఏడ్చుచు ,కైకతో "దుష్టురాలా !నీ కోరికలు తీరినవా ?రాజును అడ్డు తొలగించుకున్నావు .  ఇక నిన్ను అడిగేది వారు వుండరు . ఈ సమస్త  నెట్టినకొట్టుకొనుము . నా రాముడిని  పంపివేసావు ,నా భర్తను చంపేసావు .నాకు  కూడా జీవితేచ్ఛ  నశించినది . నేనును రాజుగారితో సహగమనము చేసి నా తనువును చాలించెదను" . అని కైకేయిని నిందించుచు ఏడవసాగెను . పరిచారికలు కౌశల్యను అక్కడనుండి ఇవతలకు తీసుకు   వచ్చిరి . 
మంత్రులు పుత్రులు దగ్గర లేని కారణముగా దశరథ మహారాజుకి అగ్ని సంస్కారాలు చేయుటకు ఇష్టపడక వశిష్టుని ఆజ్ఞ మేరకు దశరధుని శరీరమును తైలద్రోణిలో (నూని తొట్టి )భద్రపరిచి రాజకీయోపచారములు అన్నియు చేసిరి . రాజు శరీరమును తైలద్రోణిలో ఉంచుట చూసిన అంతః పుర స్త్రీలు ఆర్తనాదములు చేస్తూ ఏడవసాగిరి . అక్కడవున్న వారు ,అక్కడకు వచ్చినవారు అందరూ ,నగరంలోని వారు కైకేయిని తిట్టిపోసిరి . ఈ విధముగా మహారాజు మరణముతో అయోధ్యా నగరము శోభను కోల్పోయి తేజోవిహీనమై ఉండెను . చీకట్లు కమ్మెను . రాత్రి అయ్యెను . 

రామాయణము అయోధ్యకాండ అరువది ఆరవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Tuesday 3 January 2017

రామాయణము అయోధ్యకాండ -అరువది అయిదవసర్గ

                                 రామాయణము 

                         అయోధ్యకాండ -అరువది అయిదవసర్గ     

రాత్రి గడిచి తెల్లవారినది . రోజులాగే రాజుగారిని నిద్రలేపుటకు వందిమాగధులు ,వ్యాకరణ శాస్త్ర పండితులు , సంగీత కుశులురైన గాయకులూ దశరధుని ,వారి వంశమును స్తుతించుచు దశరధుని భవనమునకు వచ్చిరి .ఎంతసేపటికి దశరధుడు బయటకు రాకపోవుటతో వారందరూ కారణమేమిటని శంకించుచు ,వారు అచటనే నిలబడిరి . దశరథ మహారాజుకి సన్నిహితులైన భార్యలు మొదలగు స్త్రీలందరూ చక్కగా తలస్నానములు చేసి అచటికి వచ్చిరి . 
వారును మహారాజు ఇంతకీ లేవకపోవుట చూసి మహారాజు వద్దకు వెళ్లి మృదువయిన మాటలతో మహారాజుని నిద్ర లేపుటకు యత్నించిరి . ఎంతకూ ఆయనలో చలనము లేకపోవటంతో వారు అనుమానము వచ్చి ఆయన నాడిని పరిశీలించి మరణించిన విషయము గుర్తించిరి . వెనువెంటనే వారి ఆర్త నాదములతో ఆ భవనము దద్దరిల్లినది . మహారాజుకి దగ్గరలోనే కౌశల్య ,సుమిత్ర రాముని గురించి ఏడ్చి ,ఏడ్చి ఆదమరచి నిద్రిస్తూ వున్నారు . వారు ఈ ఏడ్పులధ్వని విని ఉలిక్కిపడి లేచిరి . 
వారు జరిగిన విషయము తెలిసి వారునూ ఏడ్చుచు నేలపై పడిపోయిరి . కౌశల్య ,సుమిత్ర ,కైకేయి ఇంకా మిగిలిన రాణులు అంతః పురస్త్రీల ఏడ్పులకు ఆ భవనము దద్దరిల్లేను . అక్కడ వున్నా స్త్రీలందరూ ఒకరినొకరు పట్టుకుని ఎడ్వాసాగిరి . 

రామాయణము అయోధ్యకాండ అరువది అయిదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 




 

Monday 2 January 2017

రామాయణము అయోధ్యకాండ -అరువది నాల్గవసర్గ

                                            రామాయణము 

                                    అయోధ్యకాండ -అరువది నాల్గవసర్గ 

ధర్మాత్ముడైన దశరథ మహారాజు ఆ ముని బాలుని యొక్క మిక్కిలి బాధాకరమైన మృతిని జ్ఞప్తికి తెచ్చుకుని ఎంతో విలపించుచు కౌశల్యతో "ఓ దేవి నేను చేసిన ఈ పాపమునకు న ఇంద్రియములన్నీ వణకసాగెను . కొంతసేపటికి తేరుకుని అక్కడపడివున్న కడవతో నీటిని  తీసుకుని ఆ ముని బాలుడు చెప్పిన దారిలో వెళ్లి మునిబాలుడి తల్లితండ్రులను చేరాను . వారు మిక్కిలి వృద్దులు గుడ్డివారు . నా అడుగుల చప్పుడు విని వారు తమ కుమారుడు వచ్చాడని భావించి "కుమారా !నీరు తెచ్చుటకు ఇంత ఆలస్యము ఎందుకు చేసావు ?మేము దాహముతో అలమటించుచున్నాము . మేము కదలలేమని మరచితివా ?లేదా మామీద ఏమయినా కోపము వచ్చినదా ?మేము ముసలివారము మా సమస్త ప్రాణములు నీమీదనే పెట్టుకుని వున్నాము . ఇంతకూ నీవు ఏమి మాట్లాడవేమి ?"అని పలికిరి . 
ఆ మునిని చూడగానే నాకు భయము వేసెను . నా నాలుక తడబడెను . ఎట్టకేలకు ధైర్యము తెచ్చుకుని "ఓ మహాత్మా ! నేను నీ కుమారుడును కాను . క్షత్రియుడను నా పేరు దశరధుడు . నేను శబ్దవేది విద్యను అభ్యసించాను . ఆ 
విద్యను ప్రదర్శించదలచి పొదల చాటున దాక్కుని శబ్దముల బట్టీ అడవి జంతువులను వేటాడుచువున్నాను . ఇంతలో సరయు నదిలో మీ కుమారుడు కడవను ముంచెను . ఆ శబ్దము నాకు ఏనుగు నీరు త్రాగుతున్న శబ్దము వలే విని వినిపించి బాణము వేసాను అది మీ కుమారుడి వక్షస్థలముకు తగిలెను . ఆర్తనాదములు విని పరుగుపరుగున వెళ్లి చూడగా మీ కుమారుడు రక్తపుమడుగులో పది గిలగిలా కొట్టుకుంటున్నాడు . 
అతడు మీ గురించి చెప్పి బాణమును తీసివేయమని అడుగగా అతడి బాధ చూడలేక బాణమును పెరికివేసితిని . అతడు మరణించెను . నా అజ్ఞానము వలన మీ కుమారుడు మరణించాడు . ఇక మీరు నన్ను శపించెదరో ?శిక్షించెదరో ?మీ ఇష్టము "అని పలికి వారి ఎదుట తలవంచి నిలబడితిని . అప్పుడా వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించినేను . ముని బాలకుని తండ్రి "నీవు చేసిన దుష్కృత్యమును స్వయముగా చెప్పాపోయివున్నచో నీ తల వేయి ముక్కలై ఉండెడిది . మా కుమారుని కడకు మమ్ము తీసుకువెళ్లుము "అని కుమారా !కుమారా !అని కలవరించుచు ఎడ్వసాగిరి . 
అప్పుడు వారిని నేను వారి కుమారుడి మృతదేహము కడకు తీసుకువెళ్ళితిని . ఆ తల్లి ముని బాలకుని దేహము స్పృశించి తలలోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ దేహముపై పది ఏడ్చెను . అతడి శరీరమంతా రక్తసిక్తమయ్యెను . అప్పుడా వృద్ధుడు "నాయనా !నేను పిలిచినంతనే పరుగుపరుగున న చెంతకు వచ్చెడివాడివి . ఇప్పుడు నేనే నీ చెంతకు వచ్చినా పలుకవేమి ?ఇక నుండి మా అవసరములు ఎవరు చూచుకొనెదరు . ఇకనుండి ఎవరిచేత నేను వేదములు వల్లింపచేయను . ఇక నుండి ఎవరు నాకు పురాణములు చదివి వినిపించేందరు . నాయనా నా మీద అలుక వహించినావా ?పలుకవేమి ?నీ తల్లి నీకొరకు కన్నీరుమున్నీరుగా విలపించుచున్నది . ఆమెతోనైనా మాట్లాడు "అని పెక్కు విధములుగా విధములుగా వారు విలపించిరి . 
వారి చేత ఆ ముని బాలుడికి ఉత్తరక్రియలు జరిపించినాను . అప్పుడా మునికుమారుని తీసుకుపోవుటకు ఇంద్రుడే స్వయముగా వచ్చెను . ఇంద్రుడితో కలసి దివ్యరథముపై వుత్తం లోకములకు సాగిపోతూ ఆ మునికుమారుడు . తల్లితండ్రులతో "నా కొరకు చింతించకండి . ఏది ఎలా జరుగవలెనని ఉంటే అదిఅలానే జరుగుతుంది "అని చెప్పి ఉత్తమ లోకములకు వెళ్లిపోయెను . అప్పుడా ముని నాతో "మా ఒక్కగానొక్క కుమారుని చంపితివి . మేము పుత్రశోకంతో మరణించనున్నాము . నీవుకూడా మా వలె పుత్రుని ఎడబాటుతో మరణించెదవు "అని శపించి వారిరువురు కూడా మరణించిరి . 
ఆ శాప ఫలితముగా నేనును ఇపుడు మరణించబోతున్నాను . కౌశల్యా నా దృష్టి మందగించింది . నన్ను యమభటులు తొందరపెడుతున్నారు . పదునాలుగు సంవత్సరముల తర్వాత రాముడు తిరిగి వచ్చునప్పుడు ఆ ముద్దు మోమును చూచేది అదృష్టము నాకు లేదు . "అయ్యో కుమారా !నా గారాల తండ్రీ !నన్ను వీడి ఎక్కడకు వెళ్ళావు ?"అంటూ ఆ దశరథ మహారాజు పదేపదే రామా !రామా !అని కలవరించుచు అర్ధరాత్రి దాటినా పిమ్మట ప్రాణములు వీడెను . 

రామాయణము అయోధ్యకాండ అరువదినాలుగవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .