Monday 9 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బదిరెండవసర్గ

                                               రామాయణము 

                                           అయోధ్యకాండ -డెబ్బదిరెండవసర్గ 

దశరధుని భవనంలోకి ప్రవేశించిన భరతుడికి అక్కడ తన తండ్రి కనపడకపోవుటచే తల్లి కైక భవనంలోకి వెళ్లెను .  కైక చాలా కాలము తర్వాత  చూచుటచే సంతోషముతో బంగారు సింహాసనము నుండి దిగి కుమారుడికి ఎదురెళ్ళేను. తన పాదములకు నమస్కరించిన కుమారుని లేపి నుదిటిన ముద్దు పెట్టి తనతో పాటు సింహాసనమున పక్కన కూర్చొండబెట్టుకుని 
"నాయనా !కుమారా !ఎప్పుడు బయలుదేరినావు . వేగముగా వచ్చుటచే అలసిపోలేదుకదా !అచట మీ తాతగారు ,మేనమామ గారు సర్వులూ కుశలమేనా?"అని కుమారుని ప్రశ్నించెను . అప్పుడు  భరతుడు "తల్లీ !నేను బయలుదేరి నేటి రాత్రికి 7రాత్రులు గడిచినవి . అచట సర్వులూ క్షేమమే . మా తాతగారు ,మేనమామ గారు నా కొఱకు అనేక బహుమతులను పంపినారు . అవి వెనక వస్తున్నాయి . నేను వేగముగా వచ్చినాను . నేను రాగానే తండ్రి గారి మందిరమునకు వెళ్లితిని అచట తండ్రి గారు నాకు కనిపించలేదు . ఇచట మీ భావనమందు కూడా ఆయన అగుపించుటలేదు ?ఆయన ఎల్లప్పుడూ మీ భవనము నందే వసింతురు కదా !మరి నేడు ఆయన ఇచటలేరు . కౌశల్యా మాత గృహమున వుండినారా ?"అని తన తల్లిని ప్రశ్నించెను . 

అప్పుడు కైకేయి  చేసిన ఘనకార్యమును తలుచుకుని మురిసిపోతూ సంతోషముతో "కుమారా అన్ని ప్రాణులూ కడకు ఎచటికి చేరుతాయో మీ తండ్రిగారు కూడా అచటికే చేరినారు . సహృదయులు ,ముల్లోకములలో కీర్తి గడించినవాడు అయిన మీ తండ్రి పరమపదించారు . "అని చెప్పెను . అంతట భరతుడు బిగ్గరగా ఏడుస్తూ కింద పడిపోయెను . అయ్యో తండ్రీ అని బిగ్గరగా ఏడవసాగెను . అప్పుడు కైక "భారతా !దీనులవలె ఏడవకు . లే ఈ రాజ్యమును పాలించు . వశిష్ఠుడు మొదలయిన పురోహితుల సలహాలతో మీ తండ్రి వలే రాజ్యమును పాలించి పేరు తెచ్చుకొనుము . "అని పలికెను . 
అప్పుడు భరతుడు "తల్లీ !మా తండ్రిగారు ఎలా చనిపోయినవారు ?ఆయనకు వచ్చిన వ్యాధి ఏది ?అయ్యో మా తండ్రగారు నేను కనపడినంతనే నా నుదిటిన ముద్దు పెట్టి ఆప్యాయముగా కౌగలించుకొని తన వడిలో నన్ను కూర్చొండబెట్టుకుని ఆప్యాయముగా మాట్లాడేడి వారు . రామలక్ష్మణులు ఎంత ధన్యులో కదా !తండ్రిగారి చివరిదశలో ఆయనచెంత వున్నారు . తల్లీ మా తండ్రిగారు చివరిగా పలికిన పలుకులు ఏమిటి ?అని అడిగెను . అప్పుడు కైక "రామా !లక్ష్మణా !సీతా అని కలవరించుచు మరణించిరి . వారు అరణ్యములకు వెళ్ళుటచే వారి మీద దిగులుతో మరణించెను . "అని తెలిపెను 
అపుడు భరతుడు "అయ్యో !మా అన్నగారు అయోధ్యను వీడి వనములకు ఏల వెళ్లితిరి . వారు చేసిన దోషమేమి ?భ్రూణ హత్యచేసిన  వారు అనుభవించే శిక్ష వనములకు వెళ్ళుట . మా అన్నగారు ఎందుకు వనములకు వెళ్ళినారు ?లక్ష్మణుడు ,వదినసీత వనములకు ఎందుకు వెళ్ళినారు "అని అడిగెను . అపుడు కైక మిక్కిలి సంతోషముతో తానూ చేసిన ఘన కార్యమును తత్ఫలితముగా రాముడు వనములకేగుట ,ఆయన వెనుక సీతా లక్ష్మణులు అనుసరించుట సమస్తమూ తెలిపెను  . ఇంకనూ "భరతా !నీ కొరకు ఈ సమస్త కార్యమును నేనే నిర్వహించితిని . శోకమును వీడుము రాజ్యమును చేపట్టుము . ఇక ఈ రాజ్యమునకు నీవే అధిపతివి . నాయనా !భారతా !విధివిధానములను బాగుగా ఎరిగిన వశిష్టాది మునులు మొదలగు బ్ర్రాహ్మణోత్తములతో కూడి ,సాటిలేని పరాక్రమశాలి అయిన మీ తండ్రికి అంతిమసంస్కారము నెరపుము . వెంటనే ఈ కోశల  రాజ్య సింహాసనమున పట్టాభిషిక్తుడవుకమ్ము "అని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బదిరెండవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment