Tuesday 10 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బదిమూడవసర్గ

                                            రామాయణము 

                                          అయోధ్యకాండ -డెబ్బదిమూడవసర్గ 

జరిగిన విషయము అంతా తెలుసుకున్న భరతుడు మిక్కిలి దుఃఖముతో "నేను తండ్రిని కోల్పోయి ,తండ్రితో సమానుడైన అన్న అగు శ్రీరామునికి దూరమై దుఃఖ సాగరంలో మునిగిపోయి వున్నాను . నాకు ఈ రాజ్యముతో పనిలేదు . ఈ వంశము సుఖములను శాశ్వతముగా నేలపాలుచేసితివి . పాపాత్మురాలా !మా తండ్రిని మృత్యుకౌగిట చేర్చిన పుణ్యము నీదే . కౌశల్యాదేవి నిన్ను తన సోదరి వలె చూచుకుంటున్నది . అటువంటి ఆమె కుమారుని వనములకు పంపావు . ఆమె నీకు చేసిన ద్రోహమేమి ?మహారాజుసైతము మరణించెను . ఇప్పుడైనను నీకు ఏమాత్రము విచారము కలుగుటలేదా ?
సత్పురుషుడైన శ్రీరాముని అడవులకు పంపి ఏమి బాగుకుంటివి . దశరథ మహారాజు ఈ రాజ్యమును సుభిక్షంగా పరిపాలించెడివాడు . ఆయనకు ఏదేని అవసరము వచ్చినను శ్రీరామునే ఆశ్రయించెడివాడు . అట్టి శ్రీరాముడు ఇచటలేడు . అల్పుడనైన నేను ఈ సమస్త రాజ్యభాద్యతలను ఎలా మోయగలను ?అది నాకు అసాధ్యమైనది . అయినను నాకు ఈ రాజ్యము మీద వాంఛ ఏ మాత్రము లేదు నీవు రామునికి అపకారము చేసిన కారణముగా నేను నిన్ను సైతము పరిత్యజించెదను . ఇక ఈ రాజ్యము ఎంత ?
ఇక్ష్వాకు ప్రభులు ఎల్లప్పుడూ జ్యేష్ఠ కుమారునికి పట్టాభిషేకము చేయుదురు . చిన్నలైన తమ్ములు అన్నాను అనుసరించెదరు . ఇది ఇక్ష్వాకు ధర్మము . దానిని తప్పు పట్టించితివి . అన్న తదుపరి తండ్రి వంటి వాడు . ఆయనను అర్ధించి పాదములపైన పడి ఆయనను తీసుకువచ్చి సింహాసనంపై కూర్చొండబెట్టెదను . పిదప నేను ఆయనకు దాసుడను అవుదును . ఇదే నా నిర్ణయము "అని పలికి పర్వత గుహలోని సింహము వలె గర్జించెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బదిమూడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment