Saturday 28 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బది ఎనిమిదవసర్గ

                                            రామాయణము 

                                  అయోధ్యకాండ -డెబ్బది ఎనిమిదవసర్గ 

దశరథ మహారాజు అంత్యక్రియలు ఆచరించిన పిమ్మట భరతుడు ఆ దుఃఖము నుండి తేరుకొనలేదు . అట్టి స్థితిలో లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు "అన్నా !సకల ప్రాణుల ఆపదలను తొలగించి ,వారిని కాపాడు సమర్ధుడు శ్రీరాముడు . అట్టి మహా మాహాసత్వసంపన్నుడైన శ్రీరాముని ఒక అబల అడవులకు పంపినే . నిజముగా ఇది మిగుల బాధాకరం . బలశాలి ,పరాక్రమ సంపన్నుడగు లక్ష్మణుడు ఎదుటే ఉండి ,తండ్రిని ఎదురించి అయినను శ్రీరామునికి తటస్తించిన  ఈ సంకట స్థితిని ఎందుకు తొలగింపలేదు ?ఇది నాకు ఆశ్చర్యము కలిగించుచున్నది . "అని భరతుడితో పలికెను . 
లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు రోషముతో ఇట్లు పలుకుచుండగా ,ఇంతలో ఒంటి నిండా నగలు ధరించి గూని మంధర అచటికి వచ్చి వాకిలి ఎదుట నిలబడి ఉండెను . అచట కల ద్వారపాలకులు దానిని తెచ్చి శత్రుఘ్నునితో "అయ్యా !దీని కారణముగనే శ్రీరాముడు అరణ్యములకు వెళ్లెను . దశరథ మహారాజు మరణించెను . దీనిని మీ ఇష్టమొచ్చినట్టు చేయుడు . "అని పలికిరి . 
అప్పుడు శత్రుఘ్నుడు "ఈమె అందరికి తీరని దుఃఖము తెచ్చిపెట్టింది . దీనిని శిక్షించవలిసిందే "అని పలుకుతూ ఆ కుబ్జను  గట్టిగా పట్టుకొనెను . అప్పుడు అచట ఉన్న కైకేయి దాసీ జనమంతా భయముతో పరుగులు తీసిరి . వారిలో వారు "భరతుడు మనలను కూడా  చంపివేయునేమో , కౌసల్యా మాతను శరణు వేడెదము . ఆవిడ తప్ప మనలను ఎవ్వరు కాపాడలేరు "అని భయముతో అనుకోసాగిరి . 
శత్రు భయంకరుడైన శత్రుఘ్నుడు ఆ గూని మందరను ఈడ్చుతూ తీసుకువచ్చెను . ఆమె ఆర్తనాదములు విని కైకేయి ఆమెను రక్షించుటకు పరుగుపరుగున వచ్చెను శత్రుఘ్నుడు ఆమెను తన కఠిన మాటలతో బాధించెను . అప్పుడు కైకేయి దారి నుండి తొలగిపోయెను . తనను శరణు వేడిన మందరను వదిలేయమని భరతుడు చెప్పెను . తిరిగి "స్త్రీ హత్య చేసిన యెడల శ్రీరాముడు మనలను కోపించును కావున దానిని వదిలివేయుము "అని పలికెను . 
భరతుడి మాటలు విని శత్రుఘ్నుడు మందరను విడిచిపెట్టెను . కైకేయి దానిని ఓదార్చెను . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది ఎనిమిదవసర్గ సమాప్తము . 

             శశి , 

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment