Friday 20 January 2017

రామాయణము అయోధ్యకాండ -డెబ్బది ఆరవసర్గ

                                    రామాయణము 

                                   అయోధ్యకాండ -డెబ్బది ఆరవసర్గ 

కైకేయి సుతుడగు భరతుడు శోకముతో కుమిలిపోవుచుండగా ,వశిష్ఠమహర్షి " రాకుమారా!ఇది శోకింపవలసిన సమయము కాదు . శోకింపవలదు . మహారాజునకు ఉత్తమగతులు కలుగుటకై అంత్యక్రియలు జరపవలసిన సమయమిది . కర్తవ్యమునకు సిద్దపడుము . "అని పలుకగా భరతుడు మనస్సుని కుదుటపరుచుకుని తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించెను . దశరధుని దేహమును తైల ద్రోణిలోనుండి వెలుపలికి తీసిరి . చాలా కాలము తైల ద్రోణిలో ఉండుటచే ముఖము పాలిపోయెను . కానీ అవయవములు శిదిలము కాకుండుటచే చూచుడు వారికి రాజు నిద్రించునట్లు కనపడుచుండెను . 
విధ్యుక్తముగా చేయవలసిన పనులన్నీ పూర్తిచేసిరి . భరతుడు ,రాణులు ,మిగిలిన స్త్రీల ఆక్రన్దలతో ఆ భవనము మారుమ్రోగిపోయెను . రాజలాంఛనాలతో దశరధుని దేహముని స్మశానమునకు చేర్చిరి . కౌసల్య ,సుమిత్ర ,కైకేయి మొదలగు రాణులు వారి వారి అర్హతను బట్టీ అచటకు చేరిరి . భరతుడు విధ్యుక్తముగా దహన సంస్కారములు చేసెను . రాణులు సవ్యాపసవ్యముగా ప్రదక్షణలు చేసిరి . ఆ సమయమున దీనంగా ఏడ్చుచుచున్న స్త్రీల ఆర్తనాదములతో ఆ ప్రదేశము మారుమ్రోగేను . శోకవికలులై తమ వాహనములలో సరయు నదీ తీరమునకు చేరెను . అచట ఆ రాజపత్నులు ,మంత్రులు ,పురోహితులు ,భరతుడు మొదలగు వారందరు నదీ జలములతో తర్పణములు విడిచిరి . పిమ్మట అందరూ కన్నీరు కార్చుచు నగరమున ప్రేవిశించిరి . పది దినముల వరకు నిత్యము నేలపై శయనించుచు దుఃఖమును ద్రిగమింగుచు అంత్యక్రియలను నెఱిపిరి . 

రామాయణము అయోధ్యకాండ డెబ్బది ఆరవసర్గ సమప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    








No comments:

Post a Comment