Monday 2 January 2017

రామాయణము అయోధ్యకాండ -అరువది నాల్గవసర్గ

                                            రామాయణము 

                                    అయోధ్యకాండ -అరువది నాల్గవసర్గ 

ధర్మాత్ముడైన దశరథ మహారాజు ఆ ముని బాలుని యొక్క మిక్కిలి బాధాకరమైన మృతిని జ్ఞప్తికి తెచ్చుకుని ఎంతో విలపించుచు కౌశల్యతో "ఓ దేవి నేను చేసిన ఈ పాపమునకు న ఇంద్రియములన్నీ వణకసాగెను . కొంతసేపటికి తేరుకుని అక్కడపడివున్న కడవతో నీటిని  తీసుకుని ఆ ముని బాలుడు చెప్పిన దారిలో వెళ్లి మునిబాలుడి తల్లితండ్రులను చేరాను . వారు మిక్కిలి వృద్దులు గుడ్డివారు . నా అడుగుల చప్పుడు విని వారు తమ కుమారుడు వచ్చాడని భావించి "కుమారా !నీరు తెచ్చుటకు ఇంత ఆలస్యము ఎందుకు చేసావు ?మేము దాహముతో అలమటించుచున్నాము . మేము కదలలేమని మరచితివా ?లేదా మామీద ఏమయినా కోపము వచ్చినదా ?మేము ముసలివారము మా సమస్త ప్రాణములు నీమీదనే పెట్టుకుని వున్నాము . ఇంతకూ నీవు ఏమి మాట్లాడవేమి ?"అని పలికిరి . 
ఆ మునిని చూడగానే నాకు భయము వేసెను . నా నాలుక తడబడెను . ఎట్టకేలకు ధైర్యము తెచ్చుకుని "ఓ మహాత్మా ! నేను నీ కుమారుడును కాను . క్షత్రియుడను నా పేరు దశరధుడు . నేను శబ్దవేది విద్యను అభ్యసించాను . ఆ 
విద్యను ప్రదర్శించదలచి పొదల చాటున దాక్కుని శబ్దముల బట్టీ అడవి జంతువులను వేటాడుచువున్నాను . ఇంతలో సరయు నదిలో మీ కుమారుడు కడవను ముంచెను . ఆ శబ్దము నాకు ఏనుగు నీరు త్రాగుతున్న శబ్దము వలే విని వినిపించి బాణము వేసాను అది మీ కుమారుడి వక్షస్థలముకు తగిలెను . ఆర్తనాదములు విని పరుగుపరుగున వెళ్లి చూడగా మీ కుమారుడు రక్తపుమడుగులో పది గిలగిలా కొట్టుకుంటున్నాడు . 
అతడు మీ గురించి చెప్పి బాణమును తీసివేయమని అడుగగా అతడి బాధ చూడలేక బాణమును పెరికివేసితిని . అతడు మరణించెను . నా అజ్ఞానము వలన మీ కుమారుడు మరణించాడు . ఇక మీరు నన్ను శపించెదరో ?శిక్షించెదరో ?మీ ఇష్టము "అని పలికి వారి ఎదుట తలవంచి నిలబడితిని . అప్పుడా వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించినేను . ముని బాలకుని తండ్రి "నీవు చేసిన దుష్కృత్యమును స్వయముగా చెప్పాపోయివున్నచో నీ తల వేయి ముక్కలై ఉండెడిది . మా కుమారుని కడకు మమ్ము తీసుకువెళ్లుము "అని కుమారా !కుమారా !అని కలవరించుచు ఎడ్వసాగిరి . 
అప్పుడు వారిని నేను వారి కుమారుడి మృతదేహము కడకు తీసుకువెళ్ళితిని . ఆ తల్లి ముని బాలకుని దేహము స్పృశించి తలలోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ దేహముపై పది ఏడ్చెను . అతడి శరీరమంతా రక్తసిక్తమయ్యెను . అప్పుడా వృద్ధుడు "నాయనా !నేను పిలిచినంతనే పరుగుపరుగున న చెంతకు వచ్చెడివాడివి . ఇప్పుడు నేనే నీ చెంతకు వచ్చినా పలుకవేమి ?ఇక నుండి మా అవసరములు ఎవరు చూచుకొనెదరు . ఇకనుండి ఎవరిచేత నేను వేదములు వల్లింపచేయను . ఇక నుండి ఎవరు నాకు పురాణములు చదివి వినిపించేందరు . నాయనా నా మీద అలుక వహించినావా ?పలుకవేమి ?నీ తల్లి నీకొరకు కన్నీరుమున్నీరుగా విలపించుచున్నది . ఆమెతోనైనా మాట్లాడు "అని పెక్కు విధములుగా విధములుగా వారు విలపించిరి . 
వారి చేత ఆ ముని బాలుడికి ఉత్తరక్రియలు జరిపించినాను . అప్పుడా మునికుమారుని తీసుకుపోవుటకు ఇంద్రుడే స్వయముగా వచ్చెను . ఇంద్రుడితో కలసి దివ్యరథముపై వుత్తం లోకములకు సాగిపోతూ ఆ మునికుమారుడు . తల్లితండ్రులతో "నా కొరకు చింతించకండి . ఏది ఎలా జరుగవలెనని ఉంటే అదిఅలానే జరుగుతుంది "అని చెప్పి ఉత్తమ లోకములకు వెళ్లిపోయెను . అప్పుడా ముని నాతో "మా ఒక్కగానొక్క కుమారుని చంపితివి . మేము పుత్రశోకంతో మరణించనున్నాము . నీవుకూడా మా వలె పుత్రుని ఎడబాటుతో మరణించెదవు "అని శపించి వారిరువురు కూడా మరణించిరి . 
ఆ శాప ఫలితముగా నేనును ఇపుడు మరణించబోతున్నాను . కౌశల్యా నా దృష్టి మందగించింది . నన్ను యమభటులు తొందరపెడుతున్నారు . పదునాలుగు సంవత్సరముల తర్వాత రాముడు తిరిగి వచ్చునప్పుడు ఆ ముద్దు మోమును చూచేది అదృష్టము నాకు లేదు . "అయ్యో కుమారా !నా గారాల తండ్రీ !నన్ను వీడి ఎక్కడకు వెళ్ళావు ?"అంటూ ఆ దశరథ మహారాజు పదేపదే రామా !రామా !అని కలవరించుచు అర్ధరాత్రి దాటినా పిమ్మట ప్రాణములు వీడెను . 

రామాయణము అయోధ్యకాండ అరువదినాలుగవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





 





No comments:

Post a Comment