Saturday 29 October 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదియవసర్గ

                              రామాయణము 

                        అయోధ్యకాండ -ముప్పదియవసర్గ 

శ్రీరాముడు ఎంత ఓదార్చినా సీతాదేవి అందులకు సమ్మతించక తన వనవాసవిషయమై భర్తతో పరుషముగా మాట్లాడేను . అప్పుడు శ్రీరాముడు సీతాదేవి వనవాస పయనమునకు దృఢ నిశ్చయముతో వున్నదని గ్రహించి "ఓ సీతా !నీవు సుకుమారివి కావున వనములో కష్టములు పడలేవని మాత్రమే నిన్ను వలదు అని అంటిని . నీవు లేనిదే స్వర్గము కూడా నాకు రుచించదు . సరే వనవాసము ముందు చేయవలసిన దానాది క్రియలను త్వరత్వరగా ఆచరింపుము . 
ఓ సాధ్వీ భాహ్మణోత్తములకు రత్నాభరణాదులను దానము చేయుము . అర్థులై వచ్చిన వారిని అన్నపానాదులతో సంతృప్తులను కావించుము . మన ఇద్దరికీ సంభందించిన మిక్కిలి విలువైన నగలను ,అమూల్యమైన పట్టుపీతాంబరాలు ,వెండి బంగారములతో నిర్మితములైన ,మనోహరములైన ,క్రీడా పరికరములు ,మంచములను ,తల్పములను ,వాహనములు ,ఇంకా ఇతర వస్తువులను బ్ర్రాహ్మణులకు ఇచ్చిన పిమ్మట దాసదాసీ జనములకు ఇచ్చివేయుము . "అని చెప్పేను . 
అంత సీతాదేవి రాముడి ఆదేశానుసారం దానములను మొదలుపెట్టేను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదియవసర్గ సమాప్తము . 

                శశి . 

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









x

Friday 28 October 2016

రామాయణము అయోధ్యకాండ -------ఇరువదితొమ్మిదవసర్గ

                                         రామాయణము 



                              అయోధ్యకాండ -------ఇరువదితొమ్మిదవసర్గ 

ఇట్లు రామచంద్రుడు పలికిన సాంత్వవచనములు విని .సీతాదేవి మిగుల దుఃఖిత అయి కన్నీరు కార్చుచు "నాధా !వనములలో పెక్కు కష్టములు కలవు . నిజమే కానీ మీ సాహచర్యప్రభావమున అవన్నియు నాకు సుఖములు ,సంతోషములు అగును . వాటన్నిటిని మీ కృపతో నేను అవలీలగా అధిగమింతును . ప్రభూ !మాతండ్రి జనకుడు కన్యాదాన సమయమున నన్ను మీకు సహధర్మచారిగా అప్పగించారు . కనుక నేను కూడా మీతో వనములకు వచ్చుటే ధర్మము . అంతే కాదు నేను మా తండ్రి గారి గృహమున ఉండగా దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ,ఒక భిక్షకుడు నేను వనములకు వెళ్తానని చెప్పివున్నారు . బ్రాహ్మణులకు వాక్యము తధ్యము . కనుక నేను మీతో వనములకు వచ్చుచున్నాను . 
ఓ పుణ్యాత్మా !మిమ్ములను ప్రేమాదరములతో  అనుసరించుచు సేవించుచుండుట వలన నా దోషములన్నీ తొలగి పవిత్రురాలిని అగుదును . పతియే నాకు ప్రత్యక్షదైవం . దుఃఖిత  అయి ఇంతగా ప్రాధేయపడుతున్న నన్ను మీ వెంట తీసుకుని పోవుటకు సమ్మతించనిచో నేను విషము త్రాగి కానీ ,అగ్నిలో ప్రవేశించికాని ,నీట మునిగి కానీ మృత్యుదేవత వాడి చేరెదను . "అని పలుకుతున్న సీతా దేవి ని వనవాస నిర్ణయము నుండి మరల్చుటకు ప్రత్నించుచు ఆమెను శ్రీ రాముడు ఓదార్చెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 


             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Thursday 27 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదియెనిమిదవసర్గ

                                       రామాయణము 

                                అయోధ్యకాండ -ఇరువదియెనిమిదవసర్గ 

సీతాదేవి పలుకులు ధర్మసమ్మతములే అని తెలిసి కూడా శ్రీరాముడు ఆమెపై కల ప్రేమతో వనములలో సంభవించు కష్టములను గూర్చి ఆలోచించుచు ఆమెను తన వెంట తీసుకుని వెళ్ళుటకు సిద్దపడకుండెను . అంతట ఆ ధర్మాత్ముడు కన్నీరు మున్నీరుగా విలపించుచు సీతాదేవిని ఓదార్చుచు ,ఆమెను తన సంకల్పమునుండి మరల్చుటకు ఇలా పలుకసాగెను . 
"ఓ సీతా !నీవు ఉత్తమ వంశమున జన్మించితివి . ఎల్లప్పుడూ ధర్మాచరణ నందే నిరతురాలవి . కనుక ఇచటనే ఉండి నీ ధర్మములు ఆచరించుము . నా మాటలు విను . వనములలో అనేక కష్టాలు ఎదురవుతాయి . నిర్జనారణ్యములలో స్వేచ్ఛగా విహరించు మత్తిల్లిన సింహములు ,పెద్దపులులు మొదలగు క్రూరమృగములు మనల్ని చూసి చంపుటకై వచ్చి మీద పడును . అడువులలోని నదులన్నీ మొసళ్లతోను ,బురదతోను నిండి దాటుటకు వీలులేకుండా ఉండును . అంతేకాక అక్కడ మదపుటేనుగులు స్వేచ్ఛగా తిరుగుతూ భయముగొలుపుచుండును . అరణ్యములు కష్టములకు ఆలవాలములు . త్రోవలో ముళ్ళు కాళ్లకు గుచ్చుకుని బాధ కలిగించును . 
వనములలో నివశించువారు నేలమీదనే రాలిన ఆకులపైనే పరుండవలెను . అక్కడ హంసతూలికా తల్పములు వుండవు . రాలిన పండ్లను మాత్రమే భుజించవలెను . నియమ పూర్వకముగా స్నానాదులను ఆచరించుచు నిష్టా జీవితము గడపవలెను . నదులను ఆశ్రయించి వుండే మహా సర్పాలు వంకరటింకరగా ప్రాకుచూ దారులకు అడ్డముగా చేరి ప్రమాదకారములై ఉండును . వివిధరకములగు విష సర్పములు బుసలు కొట్టుచు అచటి నేలపై అనుక్షణము తిరుగుచుండెను . ఇంకా అక్కడ మిడతలు తేళ్లు ,మండ్రగబ్బలు ,విషపురుగులు ,అడవి ఈగలు ,దోమలు మొదలగు వాని బాధ చెప్పనలవిగా ఉండును . 
అడవులలో ముండ్ల చెట్లు ,మొందేరిన దర్భలు ,రెళ్ళు గడ్డి మొదలగున్నవి కలగచేయు కష్టములకు అంతే ఉండదు . అరణ్యములలో నివసించేవారు పెక్కు శారీరిక కష్టములను ,నానా విధములైన భయంకర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉండును . కనుక ఓ మైథిలీ !సుకుమారి అయిన నీకు దుర్భరమైన వాన జీవనము ఏ మాత్రము తగదు . అందువలన వనగమనాభిలాష విడనాడితే మంచిది . "
శ్రీరాముడు తనను వనములకు తీసుకువెళ్ళుటకు ఇష్టపడుట లేదు అని గ్రహించిన సీతాదేవి ,ఆయన మాటలను ఆమోదించలేక కడు దుఃఖిత ఐ  రఘురామునితో ఇలా పలికెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువది ఎనిమిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














Wednesday 26 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదియేడవసర్గ

                           రామాయణము 

                   అయోధ్యకాండ -ఇరువదియేడవసర్గ 

సీతాదేవి సహజముగా ప్రియభాషిణి . శ్రీరాముడి మాటలు తన మనస్సుని ఎంతో నొప్పించుటచే ఆయనపై కల ప్రేమతో ఈ విధముగా పలికెను . "ఓ రామా !ఇలా అర్ధరహితముగా ఎలా పలుకుచున్నారు ?ఇంతకూ మునుపెన్నడూ మీ నోటి వెంట నుండి ఇటువంటి మాటలు విని వుండలేదు . ఓ పురుష శ్రేష్టా !భార్య భర్తకు అర్ధాంగి . కావున భర్త యొక్క భాగ్య ఫలమును పొందుటకు భార్య అర్హురాలు . అందువలన 'వనములో నివసింపుము 'అని మహారాజు మీ కిచ్చిన ఆదేశము మీ భార్య అయిన నాకు నూ వర్తించును . కనుక నేను కూడా మీతో కలసి వనవాసము చేయవలసి వున్నది . 
ఇహలోకమునందు పరలోకమునందు  సతులకుపతియే గతి . ఓ రఘోత్తమా !మీరు  ఇప్పుడే దండకారణ్యములకు బయలుదేరినచో నేనును మీతో కూడి వచ్చెదను . ఆ అరణ్యములో నేను మీ ముందు భాగమున నడుచుచు .దర్భలు ,ముండ్లను తొలగించుచు మీ మార్గమును చదును చేయుచు మార్గము సుగమము చేయుదును . సమస్త సుఖములకు నిలయమైన రాజభవనములలో నివసించుట కంటే ,స్వర్గ లోకములలో విమానములలో విహరించుట కంటే ఎన్ని కష్టములు అనుభవించవలసి వచ్చినను పతిఅడుగుజాడలలో  సాగిపోవుటయే సతికి సుఖప్రదము ,శుభప్రదము ,ధర్మసమ్మతము ,సంతోషదాయకం . 
భర్తతో కూడి మసలుకోవలిసిన విషయమున మా తల్లితండ్రులు చక్కగా భోద చేసిరి . జనసంచారం లేక వివిధ మృగములతో నిండి ,క్రూర మృగములు సంచరించునట్టి కీకారణ్యముల యందు మీ వెంట నేను నిర్భయముగా నడవగలను . ఓ మహావీరా !నియమనిష్టలతో బ్రహ్మచర్యము పాటించుచు నేను నిత్యమూ మీకు శుశ్రూషలు చేయుచుందును . ఆర్యా !అన్నపానాదుల విషయములో మీకు నేను ఎట్టి కష్టము కలిగించను . మీతో పాటు నిస్శం కోచముగా కందమూలాదులను ఆహారముగా తీసుకుంటూ గడిపెదను . 
ఓ ప్రాణనాథా !నా హృదయము నందు నిన్నే పూర్తిగా నిలుపుకుని వున్నాను . నీవు నాకు దూరమైనచో నేను మరణించుట తధ్యము . నా ప్రార్ధన మన్నించి ,నన్ను మీ వెంట తీసుకుపొమ్ము . నేను అచట మీకు ఏవిధముగాను భారము కాను ". అని పలికెను . 
సీతాదేవి ఈ విధముగా పలుకుచున్నను ,వనములలో ఎదురగు కష్టములకు ఆమెను గురిచేయుటకు ఇష్టపడని వాడై వనములో వుండే కష్టముల గురించి ఆమెకు వివరింపసాగెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














Tuesday 25 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదిఆరవసర్గ

                              రామాయణము 



                        అయోధ్యకాండ -ఇరువదిఆరవసర్గ 

శ్రీరాముడు తల్లి కౌశల్యాదేవి మంగళాశీస్సులు శ్వీకరించి ,ఆమెకు ప్రణమిల్లి ,వనవాస నిమిత్తమై అచ్చటనుండి బయలుదేరి కిక్కిరిసియున్న రాజవీధులోకి అడుగుపేట్టేను . అక్కడి జనమంతా విచిత్ర పరిస్థితి (పట్టాభిషేక హంగామా ఏమి లేకుండా  సాధారణముగా ) వున్న రాముని చూసి పరిస్థితి అర్ధము కాక ఆ ప్రజల హృదయములు  మిగుల మధనపడెను . 
శ్రీరాముడు సీతాదేవి అంతఃపురము వైపు సాగిపోయెను . ఈ విషయములు ఏమి తెలియని సీతాదేవి పట్టాభిషేక మహోత్సవము పురస్కరించుకొని తాను  చేయవలసిన కర్తవ్యములు నిర్వర్తించుచు శ్రద్ధతో దైవ పూజలు పూర్తిచేసెను . అనంతరము భర్త కోసము సంతోషముతో ఎదురుచూస్తుండెను . ఆ భవనము అంతా శోభాయమానంగా అలంకరించబడెను . అక్కడివారందరి ముఖము సంతోషముతో వెలిగిపోవుచుండెను . ఆ సమయములో అక్కడకు విచ్చేసిన రాముని ముఖము మాత్రము చింతతో  ఉండెను . 
శ్రీరాముని ఆవిధముగా చూసిన సీతాదేవి మనసు బాధతో విలవిలలాడెను . ఆయన విచారము చూసి కకావికలమవుతున్న సీతాదేవితో విషయము ఎలా చెప్పాలా?అని రాముడు ఆలోచించసాగెను . పదేపదే ఏమయినది ?ఎందుకిలా వున్నారు ?అని అడుగుతున్న సీతా దేవితో రాముడు అసలు విషయము చెప్పి ,తానూ వనవాసముకు వెళ్లిన సమయములో సీతాదేవి ఏ విధముగా నడుచుకోవలెనో పరిపరి విధములుగా చెప్పెను . అందరితో అభిమానంతో ,అత్తమామల పట్ల గౌరవముతో ,ప్రతి ఒక్కరితో మంచిగా ఉండమని ,జాగ్రత్తగా మసులుకోమని చెప్పెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదిఆరవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Sunday 23 October 2016

                            రామాయణము 



                         అయోధ్యకాండ -ఇరువది అయిదవసర్గ 

ఎంతో పరితపించుచు చేసేదిలేక కౌసల్యాదేవి రామునికి పరిపరివిధములుగా ఆశీర్వచనములు ఇచ్చి శుభవచనములు పలికి ,ఋత్వికులను పిలిపించి ,వారిచే హోమము చేసి వారిచే  ఆశీర్వచనములు  చేయించి ,శ్రీరాముని తదేకదృష్టితో చూస్తూ "నాయనా !క్షేమముగా వెళ్ళిరా !నీ ఈ సుందరనగుమోము చూసినంతనే నా బాధలు తుడిచిపెట్టినట్టుగా తొలగిపోవును . నిన్ను చూడనిదే నాకు ఎంత శుభము  కలిగినా అది నాకు సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వలేదు . పూర్ణచంద్రుడి వంటి నీ ముఖము చూచు అదృష్టము త్వరగా కలగాలని దేవుళ్ళని వేసుకుంటాను . ఈ పదునాల్గు ఏళ్ళు త్వరత్వరగా గడిచిపోయి నువ్వు మారాలి వచ్చు రోజు త్వరగా రావలెనని వేసుకుంటాను "అని పలికి రాముడు వనవాసమునకు అనుమతి ఇచ్చెను . 
ఆ విధముగా పలికి అశ్రుపూర్ణలోచనయై ,విధ్యుక్తముగా స్వస్తి వాచక కార్యక్రమములు పూర్తిచేసెను . పదేపదే తనయుని హృదయమునకు హత్తుకొనెను . అప్పుడు శ్రీరాముడు నిండు భక్తితో తల్లిచరణములకు నమస్కరించెను . తల్లికి వీడ్కోలు పలికి సీతాదేవి మందిరమునకు బయలుదేరెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువది అయిదవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 










Saturday 22 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదినాల్గవసర్గ

                              రామాయణము 

                          అయోధ్యకాండ -ఇరువదినాల్గవసర్గ     

వనములకు వెళ్ళుటకు కృత నిశ్చయుడైన శ్రీరాముడితో కౌసల్యాదేవి " నా ప్రియ కుమారుడు రాముడు ఏనాడు దుఃఖమునే ఎరుగడు . అతడు మిక్కిలి ధర్మబుద్ధి కలవాడు . అందరితోనూ ప్రియముగా మాట్లాడువాడు . అట్టి సుకుమారుడు అడవులలో ఉంఛవృత్తితో (దైవ వశమున నేలపై రాలిన గింజలతో ,అడవిలో లభించిన ఫలమూలాదులను భక్షించుచు జీవించుట )ఎలా జీవించగలడు ? శ్రీరాముని సేవకులు ,భటులు ,మృష్టాన్నభోజనముతో ఇచట ఇచట కాలము గడుపుచుండగా ,వారి యజమాని అయిన శ్రీరాముడు అడవిలో కందమూలాదులను భక్షించుచు ఎట్లు కాలము గడుపును ?
పుత్రా !నీవు వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకున్నచో నేను కూడా నీతో వచ్చెదను నీవు లేక ఇక్కడ బతకలేను "అని పెక్కుమార్లు రామునితో వనములకు వెళ్ళుటకు  ఎంతో దీనంగా బ్రతిమాలెను . అప్పుడు శ్రీరాముడు ఆమె కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చుచు ,"అమ్మా !మహారాజు కైకేయిచే వంచితుడయ్యెను . నేను అరణ్యములకు వెళ్లుచున్నాను . నీవు కూడా ఆయనకు తోడుగా లేనిచో ఆయన బతకజాలడు . 
అమ్మా !స్త్రీ భర్తను త్యజించుట క్రూరమైన కార్యము . నింద్యమైన ఆలోచనను నీ మనస్సుకి రానీయకుము . నా తండ్రి గారైన దశరథమహారాజు జీవించివున్నంతవరకు ఆయనకు నీవు సేవలొనర్చుచునే ఉండవలెను . ఇదియే సనాతన ధర్మము . నేను అయోధ్య విడిచి వెళ్లిన పిమ్మట వృద్ధుడైన మహారాజు పుత్రశోకంతో పరితపించకుండా నీవు ఆయనను నీవే జాగ్రత్తగా కాపాడవలెను . పదునాల్గు సంవత్సరములు అడవిలో ప్రశాంతముగా  గడిపిన పిమ్మట రాజ్యమునకు వచ్చి ,నీ మాటలను సంతోషముతో పాటించెదను . "అని తల్లికి నచ్చచెప్పెను . 
ఆయన మాటలు విని కౌసల్యాదేవి రాముడిని తదేక దృష్టితో చూస్తూ  "నాయనా !వనములకు తప్పక వెళ్లవలెను అనే నీ నిరనయము నుండి నిన్ను మరల్చుటకు నేను అశక్తురాలను . నీవు సర్వ సమర్థుడవు . నీవు వనములనుండి క్షేమముగా వచ్చిన పిమ్మట కానీ నా ఈ దుఃఖము చల్లారదు . జటావల్క దారివై అడవులకు వేళ్ళు నిన్ను మరల కళ్లారా ఎన్నాళ్లకు చూడగలనో !నాకాఅదృష్టము వున్నదో లేదో . నాయనా జాగ్రత్తగా వెళ్లిరమ్ము . నీకు శుభమగుగాక !"అని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదినాల్గవసర్గ సమాప్తము . 

                  శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 













Friday 21 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదిమూడవసర్గ

                                   రామాయణము 

                            అయోధ్యకాండ -ఇరువదిమూడవసర్గ 

శ్రీరాముడు దైవశక్తి ప్రభావము గూర్చి ,ధర్మాచరణ ప్రాముఖ్యము గూర్చి పదే పదే నొక్కి చెపుతుండగా లక్ష్మణుడు వినమ్రుడై వినెను . జరిగిన పరిణామములకు కోపముతో ఊగిపోతూ ,శ్రీరాముని వనవాస నిర్ణయము నుండి తప్పించుటకు అనేక విధములుగా నచ్చచెప్పచూసెను . ఇంకా "అన్నా !దుర్భుద్ధి కల వారిరువురు నీ పట్టాభిషేక నిర్ణయము ప్రకటించాక మునుపే పధకం వేసి వుంటారు . లేకపోతె ఎన్నో ఏళ్ళు క్రితము ఇచ్చిన వారములు ఇన్నీళ్ళు గడిచినా ఇప్పటివరకు ఇవ్వకపోవుట ఏమిటి ?ఆ పధకం ప్రకారమే నిన్ను ఆ వరములను అడ్డము  పెట్టుకుని వనవాసమునకు పంపచూచుచున్నారు . 
అట్టి దుర్భుద్ధి కలవారి మాటలకు గౌరవము ఇచ్చి నీవు అడవులకు వెళ్ళుట న్యాయము కాదు . మన సూర్యవంశములో రాజులు ,వార్ధక్య సమయములో రాజ్యమును కుమారులకు అప్పగించి ,వారు వానప్రస్థమునకు వెళ్లుదురు . ఇది పూర్తిగా విరుద్ధము . నీవు నన్ను ఆజ్ఞాపింపుము . నన్ను  వారి నందరిని ఎదుర్కొని సింహాసము మీద మిమ్ములను కూర్చొబెట్టెదను . అంతే కానీ వనవాసమునకు అంగీకరించలేను . నా మాట వినుము" అనిఅన్నగారిని తన నిర్ణయము మార్చుకోమని ఎన్నో విధములుగా వేడుకొనెను . 
 లక్ష్మణుడి మాటలు విని రాముడు అతని కన్నీరు తుడిచి ,పెక్కు విధములుగా ఓదార్చి ,అతనితో "నాయనా !లక్ష్మణా !తల్లితండ్రుల ఆజ్ఞను త్రికరణ శుద్ధిగా పాటించువానిగా నన్ను ఎఱుగుము . ఇదియే సత్పురుషుల మార్గము "అని చెప్పెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదిమూడవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












 

Thursday 20 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదిరెండవసర్గ

                                    రామాయణము 

                          అయోధ్యకాండ -ఇరువదిరెండవసర్గ 

రాముడి పట్టాభిషేక అవాంతరం తో లక్ష్మణుడు అశాంతితో ,అసహనంతో ఊగిపోవుతూ ఉండెను . అప్పుడు రాముడు "సోదరా !లక్ష్మణా !నా కారణముగా తండ్రి మీద కలిగిన రోషమును విడనాడుము . జరిగిన సంఘటనలను అవమానంగా భావించకు . ఇదివరకు లానే తండ్రిగారిని గౌరవించుచు ,వారికి సేవలు చేయుము . ఇంతవరకు నా పట్టాభిషేకము కోసము ఎంత ఉత్సాహముతో కావలిసిన సామగ్రి సమకూర్చావో ,అంతే ఉత్సాహముగా నా వనవాసమునకు ఏర్పాట్లు చేయుము . బుద్ధిపూర్వకంగా కానీ తెలియక కానీ తల్లుల్లో ఏ ఒక్కరికి కానీ తండ్రిగారికి కానీ రవ్వంత భాద కలగనీయకూడదు అనేది నా కోరిక . కావున వెనువెంటనే వనవాసమునకు వెళ్లవలెనని నిర్ణయించుకొన్నాను . కావున ఆ ఏర్పాట్లు త్వరితగతిన చేయుము . తల్లి కైక మీద కోపము చూపకు . పెద్దపెద్ద ధర్మజ్ఞులు ,మునులు సైతము ఒక్కొక్కసారి చిత్తచoచలత్వము పొందెదరు .ఆమె విధి ప్రేరణ వలననే ఆవిధముగా మాట్లాడినది .  కావున ఆమెపై ఆగ్రహము తగదు . "అని తమ్ముడిని అనునయించెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదిరెండవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













Wednesday 19 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదిఒకటవసర్గ

                                 రామాయణము 

                         అయోధ్యకాండ -ఇరువదిఒకటవసర్గ 

కౌసల్యా దేవి దీనంగా ఆ విధముగా విలపించుచుండగా ,లక్ష్మణుడు "పూజ్యురాలివైన ఓ అమ్మా !మహారాజు కుటిలాత్మురాలైన కైక మాటల వలలో చిక్కుకుని వున్నాడు . విషయలోలుడై బుద్ధివైపరీత్యము కలిగి వున్నాడు . ఈ స్థితిలో మహారాజు ఏమి మాట్లాడలేడు . రాముడు నిర్మలుడు ,కార్యదక్షణాదక్షుడు ,ఆయన ఎవరికీ ఏ అపకారము చేయలేదు . రాజ్యదోహము చేయలేదు . కావున రాముడు ఏ కారణమున వనములకు వెళ్ళాలి ?నేను ఇందుకు అంగీకరింపను . విచక్షణ జ్ఞానము లేని రాజు మాటలను రాజనీతి ఎరిగిన ఏ కుమారుడు పాటించును ?"అని ఆమెతో పలికి తిరిగి రామునితో 
ఓ రఘునందనా !ఈ వనవాస విషయము బయట కు తెలియక ముందే మనము రాజ్యమును వశము చేసుకోవలయును . ఈ రాజ్యము నీకు చెందవలసినిది . నీవు ముందు నిలబడు నేను ధనుర్ధారినై నీ వెంట ఉండి ఆ భరతుడికి అనుకూలురు అందరిని తుదముట్టించి లేదా బందించి ఈ రాజ్యమును హస్తగతము చేసుకుందాము . తండ్రి అయినా దుర్భుద్ధి కలవాడు కావున ఆయనను భందించుటకు కూడా నేను సిద్దము . "అని పలికి తిరిగి కౌసల్యతో 
"అమ్మా !ప్రజ్వలిల్లుచున్న అగ్నిలో కానీ ,వనములకు కానీ రాముడు ప్రవేశించవలెననుకుంటే నేను ఆయనకన్నా ముందు వాటిలో వుంటాను . ఇది నిజాము నమ్ముము . నేను అన్నకు అండగా ఉండగా ఆయనకు ఎట్టి ఆపద కలగదు . నీవు దుఃఖింపకు "అని ఆమెకు ధైర్యము చెప్పెను . 
అప్పుడు కౌసల్య రాముడితో "తండ్రీ !నీ తమ్ముని మాటలు విన్నావు కదా యుక్తాయుక్తా జ్ఞానము తెలిసినవాడవు . ఏమి చేయవలెనో నీవే నిర్ణయించుకో . వనవాసమునకు తల్లితండ్రుల అనుమతి కావలెను కదా !నీవు వనవాసమునకు వెళ్ళుటకు నేను ఎట్టి పరిస్తిస్తులలో అనుమతించను. నీవు వనవాసమునకు వెళ్ళినచో నేను నా ప్రాణములు విడిచెదను . నీవు లేని ఈ బతుకు వ్యర్ధము . దానికన్నను అరణ్యములో నీతోపాటు కందమూలములు తినుట ఉత్తమము "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు తల్లితో "అమ్మా !తండ్రి ఆజ్ఞను జవదాటుటకు నేను అశక్తుడను . శిరాసా ప్రణమిల్లుచున్నాను . నేను వనములకు వెళ్ళుటకు సిద్ధముగా వున్నాను . దయతో నాకు అనుమతిని ఇమ్ము . మన వంశమునే సగరుని పుత్రులు తండ్రి ఆనతి మేరకు భూమిని త్రవ్వుతూ మృత్యువు పాలయ్యిరి . జమదగ్ని కుమారుడైన పరుశురాముడు తండ్రి ఆనతి మేరకు తల్లి శిరస్సుని గండ్ర గొడ్డలితో నరికివేసెను . అంతేకాదు పెక్కుమంది ధర్మజ్ఞులు తండ్రి ఆనతిని అనుసరించే నడుచుకొనిరి . పిత్రాజ్ఞ కాదనరాదు . తండ్రి తృప్తికై నేను అడవులకు వెళ్లెదను "అని పలికెను . 
పిమ్మట రాముడు "లక్ష్మణా !నాపై నీకు కల ప్రేమ అపారం . నీ బలపరాక్రమములు నిరుపమానములు వీటినన్నిటిని నేనెఱుగుదును . నా మీద ప్రేమ కారణముగా మాతృమూర్తి చిత్తస్తైర్యము విస్మరించి అంతులేని దుఃఖముతో ఈ విధముగా పలుకుచున్నది . నీవు కూడా ఈ విధముగా పలుకుచుంటివేల ?లోకములోని ధర్మములలో కెల్లా ఉత్తమమైనది పిత్రాజ్ఞ . తీవ్రత మాని ధర్మమును ఆశ్రయించుము . "అని లక్ష్మణుడిని  అనునయించెను . 
అప్పుడు కౌశల్యాదేవి రాముడికి నచ్చచెప్పుటకు అశక్తురాలై తానూ కూడా వనవాసమునకు వచ్చెదననగా ,రాముడు సుమంగళి భర్తను వీడి రావడం సబబు కాదని నచ్చచెప్పెను . ఆ విధముగా రాముడు వనవాసమునకు వెళ్ళుటకే నిశ్చయించుకుని తల్లిని ప్రసన్నురాలిగా చేసుకుని ధర్మస్వరూపమును తల్లికి ,లక్ష్మణుడికి విపులముగా వివరించేను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదిఒకటవ సర్గసమాప్తము . 


                  శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
 


                            

Sunday 16 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదియవసర్గ

                               రామాయణము 

                      అయోధ్యకాండ -ఇరువదియవసర్గ 

నరశ్రేష్టుడైన రాముడు తండ్రికి నమస్కరించి ,ఆ అంతఃపుర భావనమును వదిలి బయటకు రాగా ఆ భవనము నందలి మిగిలిన రాణులు ,దాసీలు పెద్దపెట్టున ఎడ్వనారంభించిరి . "ఎవ్వరు చెప్పకున్నను రాముడు మన బాగోగులు ఏంటో చక్కగా చూసాడు . ఇప్పుడు చిన్న వయసులో వనములకు వెళ్లి ,కష్టములననుభవించనున్నాడు "అంటూ పెద్దగా ఏడవసాగిరి . ఆ ఆర్తనాదములు విని దశరధుడి భాద మరింత అధికమాయెను . రాముడు కౌశల్యా దేవి భవనము వైపు సాగెను . భవనము నందలి కక్షలలో వృద్ధ బ్రాహ్మణ పండితులను ,వృద్ధ ముత్తయిదువులు చూసేను . వారంతా రాముని చూసి జయజయద్వానములు చేసిరి . రాముడు కౌశల్యాదేవి అంతః పురములోకి ప్రవేశించేసరికి కౌశల్య ముందు రోజు రాత్రి నుండి ఉపవాసము చేసి వ్రాత దీక్షలో ఉండి యాగ కార్యక్రములో నిమగ్నమైవుండెను . 
రాముడిని చూసి మిక్కిలి సంతోషముతో ఎదురువచ్చి నుదిటి మీద ముద్దు పెట్టి రాముడిని దగ్గర కు తీసుకుని ఆశీర్వచనములతో ముంచెత్తేను . అప్పుడు రాముడు తల్లికి పాదాభివందనం చేసి తన వనవాస వృత్తాoతమును తెలపగా ఆమె ఒక్కసారిగా ఆకాశము నుండి నేలపై పడిన కిన్నెరా స్త్రీ వలె నేలపై పడిపోయెను . అప్పుడు శ్రీరాముడు తల్లిని లేవనెత్తి శుశ్రూషలు చేసెను . అప్పుడు కౌశల్య మిక్కిలి దుఃఖముతో "నాయనా రామా !నా కంటి వెలుగువు నీవు . నిన్ను ఎన్నో నోముల ఫలముగా కని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను . నిన్ను అందరూ ప్రశంశిస్తుంటే మురిసిపోయాను . ఇంతవరకు  సవతుల సూటిపోటిమాటల వల్ల మనసుకి ఎంత భాధ కలిగినా ,నీ తండ్రి దశరధుడు ఆ కైకేయి దాసీ కన్నా కూడా నన్ను తక్కువుగా చూసినా నేను నిన్ను చూసుకుని వాటినన్నిటిని భరించాను . ఇక మీదట ఏ ఆశతో బతకను . వాటిని ఎలా భరించను . నీకు దూరమై నేను జీవించుట వృధా . "అంటూ బోరున విలపించెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




















Saturday 15 October 2016

రామాయణము అయోధ్యకాండ -పందొమ్మిదవసర్గ

                        రామాయణము 



                       అయోధ్యకాండ -పందొమ్మిదవసర్గ 

 కైక మాట్లాడిన మాటలు విని రాముడు ఏమాత్రము వ్యధ చెందక ఆమెతో "అమ్మా !నీవు చెప్పినట్లే చేయుదును . రాజాజ్ఞను శిరసావహించుచు  ఈ అయోధ్యా నగరమును విడిచి ,జటా వల్కలధారినై వనవాసమునకు వెళ్లెదను . సోదరుడు భరతుడు కొరకై నేను రాజ్యమునే కాదు అత్యంత ప్రీతికరములైన ప్రాణములను ,సంపదలను సైతము ఇచ్చివేయుదును . కనుక ఈయనను ఓదార్చుము . అయ్యో !ఇదియేమి ?మహారాజు నేలపై చూచుచు తిన్నగా కన్నీరు కార్చుచున్నాడు ." 
కైక రాముని వనవాసమునికి వెళ్ళమని తొందరపెట్టెను . రాముడు దశరధుడు తనతో మాట్లాడటలేదని బాధపడెను . "అమ్మా !మా తండ్రి నన్ను ఆజ్ఞాపింకకున్నను మీరు చెప్పినారు కదా !అదే చాలు నేను నిర్జన ప్రదేశములో 14 సంవత్సరములు తప్పక నివసించెదను . అమ్మా !కౌశల్యా మాత వద్ద సెలవు తీసుకుని సీతను అనునయించి వచ్చెదను . నాకు ఆ గడువు మాత్రము ఇమ్ము అనంతరము నేను దండకారణ్యమునకు వెళ్లెదను . "అని పలికెను . 
ఆ మాటలు విని దశరధుడు మిక్కిలి దుఃఖమున మునిగిపోయెను . శోక భారముచే కన్నీరు కార్చుచు ,ఏమియు మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడ్చెను . మహా తేజశ్వి అయినా రాముడు స్పుహ కోల్పోయి ఉన్న దశరధుడి పాదములకు నమస్కరించి ,కైక పాదములకు నమస్కరించి భవనము బయటకు వచ్చెను . అక్కడ జరిగిన పరిణామమునకు క్రుద్ధుడైన లక్ష్మణుడు రాముడిని అనుసరించెను . రథములను ,గజములను ,మిత్రులను పంపివేసి కౌశల్యా దేవికి అరణ్యవాస విషయము చెప్పుటకై ఆమె భవనము వైపు కదిలెను . 

రామాయణము అయోధ్యకాండ పందొమ్మిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                     

   

Friday 14 October 2016

రామాయణము అయోధ్యకాండ -పదునెనిమిదవసర్గ

                          రామాయణము 


                 అయోధ్యకాండ -పదునెనిమిదవసర్గ 

శ్రీరాముడు తండ్రిని చూడగానే వినమ్రుడై ఆయనకు పాదాభివందనం చేసెను . పిమ్మట కైక కు కూడా పాదాభివందనం చేసెను . అట్లు శ్రీరాముడు పాదయాభివందనము చేయగానే దీనుడై ఉన్న దశరధుని నోటి వెంటనుండి "తండ్రీ రామా !"అనెడి మాటలు వెలువడినాయి వెనువెంటనే దశరధుని కనుల వెంట అశ్రువుల దారాలు కురిసెను . పిమ్మట గొంతు పెగలలేకపోయెను ,కనులు చూడలేకపోయెను . 
ఇదివరలో ఎన్నడును చూడని దశరధుని భయావహరూపమును చూసి శ్రీరాముడు దిగ్భ్రాంతికి లోనయ్యేను . ఊహలకు అందని దశరధుని శోక పరిస్థితికి విచారపడుచు శ్రీరాముడు మిక్కిలి కలవరపాటుకు లోనయ్యేను . తనలో తానూ తండ్రి ఇంతగా భాదపడుటకు కారణమేమి ?అని తర్కించుకొనెను . 
పిమ్మట దీనవధానుడై కైకేయిని సమీపించి "తల్లీ !తండ్రి ఇంతగా దుఃఖించుట నేను మునుపెన్నడూ చూసి ఎరుగను . ఆయన దుఃఖమునకు కారణమేమి ?శారీరికంగా కానీ మానసికముగా కానీ ఆయనకు ఎట్టి బాధలు కలుగలేదుకదా !వేదనతో అడుగుతున్నాను వాస్తవము తెలుపుము . "అని కోరెను . ఆ విధముగా అర్ధించిన రామునితో కైకేయి 
"ఓ రామా !నీ తండ్రికి అట్టి బాధలు ఏమియు లేవు . ఆయనకు నీవు మిక్కిలి ప్రియమైనవాడవు . అట్టి నీతో అప్రియ వచనములు పలుకుటకు ఆయనకు నోరు రావటంలేదు . ప్రతిజ్ఞా పూర్వకముగా ఆయన నాకొక మాట ఇచ్చినాడు . ఇప్పుడు ఆ విషయమున పామరుడి వలె పశ్చాత్తాపపడుతున్నాడు . రాజు నాకిచ్చిన మాటను నీవు తీర్చెదనని మాట ఇస్తే దాని గురించి నీకు చెబుతాను . దానిని అతడు నీకు స్వయముగా చెప్పలేడు . "అని పలికెను . 
ఆ మాటలు విని శ్రీరాముడు మిక్కిలి బాధపడి నీవు ఇలా పలుకుట నాకు సిగ్గుచేటు . రాజాజ్ఞ అయినచో అగ్నిలోనైనా దూకెదను . అతడాదేశించినచో తీవ్రమైన విషమును సైతము తాగెదను . సముద్రమునైనా పడిపోయెదను . ఆయన నీకిచ్చిన మాట ఏమిటో తెలుపుము నేను దానిని తప్పక నెరవేర్చెదను . రాముడు అసత్యమాడడు "అని పలుకగా 
కైకేయి "ఓ రఘురామా !పూర్వము దేవాసుర సమయములో నీ తండ్రి మిక్కిలి గాయపడగా నేను ఆయనను రక్షించితిని . దానికి మెచ్చి ఆయన నాకు ధనుర్భాణముల సాక్షిగా రెండు వరములను ఇచ్చెను . వాటిని నేను ఇప్పుడు కోరుకుంటిని . అవి 1. భరతుడికి యువరాజుగా పట్టాభిషేకము . 
                                         2. నీవు ఇప్పుడే దండకారణ్యమునకుఁ వెళ్ళుట . 

ఆ రెండు వరములు కోరిన కారణముగా ఈ మహారాజు నీమీద ప్రేమాతిశయముచే శోకమున కుమిలిపోవుచు వాడిన ముఖంతో నీవైపు చూడలేకున్నాడు "అని పలికెను . 
దశరధుడు తన కుమారుడు పడబోయే కష్టములను తలచుకుని కుమిలిపోసాగెను . 

రామాయణము అయోధ్యకాండ పదునెనిమిదవసర్గ సమాప్తం . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















Thursday 13 October 2016

రామాయణము అయోధ్యకాండ -పదునేడవసర్గ

                            రామాయణము 


                        అయోధ్యకాండ -పదునేడవసర్గ 

ఆకాశమును తాకేటి తెల్లని కాంతులను  విరజిమ్ముచున్న  మేడలతో ,ఆగారు దూప పరిమళాలతోఁ విశాలమైన అంగళ్ళతో విరాజిల్లుతున్న రాజా వీధిని శ్రీరాముడు చూస్తూ రధము మీద  వెళ్ళుచుండెను . ఆ వీధిలో అనేక మంది జనసందోహమును  శ్రీరాముడు చూసి వారికి నమస్కరించెను . వారందరూ "ఓ రామా !నీవు పట్టాభిషిక్తుడవై  మీ తాతముత్తాతలు   వేసిన బాటలో సాగుచూ మమ్ము పరిపాలించు "అని పలికిరి . ఇంకనూ శ్రీరాముడిని అనేక విధములుగా ప్రశంశించిరి . వారి ప్రశంశలు ఇతర గాధలు వినుచు శ్రీరాముడు ముందుకు కదిలెను . శ్రీరాముడు ఆ విధముగా ముందుకు సాగిపోవుచుండగా పురుషులలో ఏ ఒక్కడూ తన మనస్సుని కానీ దృష్టిని కానీ రాముడి మీదనుంచి మరల్చుకోలేకపోయెను . ఇక స్త్రీల విషయము చెప్పనేల ?
ఆ విధముగా ముందుకు సాగి శ్రీరాముడు తన తండ్రి దశరధుడి అంతః పురమునకు సమీపించెను . దేవేంద్రుడి భవనములు వలె వున్న భవనములు సముదాయము కల మూడు కక్షలను రధము మీద దాటెను పిమ్మట పాదాచారియై రెండు కక్షలు దాటెను . పిమ్మట తన వెంట వచ్చిన వారందరిని అచ్చటనే ఆపి శ్రీరాముడు రాజఅంతః పురమున ప్రవేశించెను . 

రామాయణము అయోధ్యకాండ పదునేడవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


రామాయణము అయోధ్యకాండ -పదునాఱవసర్గ

                            రామాయణము 


                     అయోధ్యకాండ -పదునాఱవసర్గ 

ఆ విధముగా శ్రీరాముని భవనము వద్దకు చేరిన సుమంత్రుడు తనను చూసి లేచి నిలబడి నమస్కారము చేసిన ద్వారపాలకులతో తన రాకను గూర్చి శ్రీరాముడికి తెలుపమని చెప్పెను . అంతట శ్రీరాముని యందు ప్రేమానురాగముకల ఆ భటులు సీతాదేవి సమేతుడైవున్న శ్రీరాముని చేరి సుమంత్రుడు రాక ను తెలిపిరి . శ్రీరాముడు ఆయనను అంతః పురము లోనికి రప్పించెను . చక్కని వస్త్రాభరణము ధరించి ,శ్రేష్టమైన ఎర్రటి చందనమును ధరించి ,బంగారు ఆసనముపై కూర్చొని వున్న ఆశ్రీరాముడిని సుమంత్రుడు దర్శించెను . సీతాదేవి వింజామర విసురుతూ శ్రీరాముడి పక్కనే నిలబడి ఉండెను . 
అప్పుడు సుమంత్రుడు "మీ తండ్రిగారు మిమ్ము తక్షణమే వెంటబెట్టుకుని తీసుకురమ్మన్నారు . బహుశా పట్టాభిషేక విషయమై అయివుంటుంది . "అని తెలిపెను . అంత శ్రీరాముడు సీతాదేవికి తండ్రిగారి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరెను . బయట నమస్కరించి వున్న లక్ష్మణుడిని చూసేను . రాజా వీధులలో పట్టాభిషేకము తిలకించుటకు వచ్చిన జనులు బ్రాహ్మణుల నమస్కారములు అందుకుంటూ వారికి నమస్కరిస్తూ వెండి రధము ఎక్కి తండ్రిగారి అంతః పురము వైపుగా వెళ్లెను . 
శ్రీరాముడి తమ్ముడైన లక్ష్మణుడు వింజామరము చేతబూని ,రథముపై అన్నకు వెనక భాగమున నిల్చి ఆయనను సేవించుచువుండెను . రాముడు అట్లు వెళ్లుచుండగా జనుల యొక్క కళకళధ్వనులు ఆ ప్రాంతమంతయూ నిండెను . రాముడి వెనక అసంఖ్యాకములైన అశ్వములు ,గజములు ఆయన రధమును అనుసరించినవి . ఖడ్గములు ,ధనస్సులు ధరించిన సూరులు రామునికి జయజయ ద్వానములు చేస్తూ రామునికి ముందు నడిచిరి . చక్కగా అలంకరించుకున్న స్త్రీలు తమతమ ఇంటి కిటికీల నుండీ రాముడిపై పరిమళభరితములైన పుష్పములను చల్లిరి . పురజనులు ,ఇతర ప్రదేశములనుండి వచ్చిన జానపదులు రాముడి గురించి ,పట్టాభిషేకము గురించి మాట్లాడుకుంటున్న మాటలను రాముడు వినెను . 
గుఱ్ఱముల సకిలింపులతో ,గజముల ఘింకరింపులతో ,స్తుతి పాటలతో ,జయజయద్వానములతో వందలాది జనులు నడుచుచుండిరి . వాద్య బృంద గాయకులు శ్రీరాముని గుణగణములను కీర్తించుచుండిరి . ఇట్టి జేజేలు కోలాహలముల మధ్య శ్రీరాముడు కుభేరుడి వలె వైభవంతో ముందుకు సాగెను . 

రామాయణము అయోధ్యకాండ పదునాఱవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                 














Sunday 9 October 2016

రామాయణము అయోధ్యకాండ -పదునైదవసర్గ

                          రామాయణము 



                  అయోధ్యకాండ -పదునైదవసర్గ 

ఆ విధముగా రాజాజ్ఞను తీసుకుని రాజభవనం నుండి బయటకు వచ్చిన సుమంత్రుడికి బయట అనేక మంది ప్రముఖులు ,బ్రాహ్మణులు ,మంత్రులు ,జానపదులు ,జనములు కనిపించెను . వారందరూ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ సందర్భముగా మహోత్సాహముతో ఉండిరి . వారంతా సుమంత్రుడిని చూసి" రామ పట్టాభిషేకమునకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి . దశరథ మహారాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము అన్నీ సిద్ధముగా వున్నవి కానీ ఇంత వరకు మాకు మహారాజు గారి దర్శనము లభించలేదు . ముహూర్తకాలము సమీపించుతున్నది "అని పలికిరి . 
అప్పుడు సుమంత్రుడు "బాగుబాగు మీరంతా వచ్చిన విషయము ,మీరు రాజుగారి క్షేమ సమాచారం అడిగిన విషయము నేను రాజు గారు పూర్తిగా లేచిన తర్వాత తెలిపెదను . అని పలికి తిరిగి మహారాజు భవనము లోకి ప్రవేశించి ,ఆయన శయనించిన మంచము తెర కు కొద్దీ దూరములో నిలబడి ఆయనను ప్రశంసించుచు ,బయట అందరూ వేచివున్న విషయమును విన్నవించెను . ఇంకనూ శ్రీరామ పట్టాభిషేకమునకు కాలము సమీపించబోతోందని తెలిపెను . 
అప్పుడు దశరథ మహారాజు సుమంత్రుడితో "నేను నిన్ను నా శ్రీరాముని తీసుకురమ్మని ఆజ్ఞాపించితిని కదా !మరి ఇంకా జాగు ఎలా చేయుచున్నావు వెంటనే వెళ్లి నా శ్రీరాముని నా వద్దకు తీసుకురమ్ము . "అని ఆజ్ఞాపించెను . మహారాజు ఆజ్ఞను తీసుకున్న సుమంత్రుడు వెనువెంటనే బయలుదేరి శ్రీ రాముని బావనమునకు వెళ్లెను . మిక్కిలి మనోహరముగా శోభాయమానంగా ,వున్న భవనములు సముదాయములతో కూడి వున్న శ్రీ రాముని అంతఃపురము వద్దకు చేరెను . 

రామాయణము అయోధ్యకాండ పదునైదవసర్గ సమాప్తము . 

                       శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

               












                      

Saturday 8 October 2016

రామాయణము అయోధ్యకాండ _పదునాల్గవసర్గ

                                 రామాయణము 

                   అయోధ్యకాండ _పదునాల్గవసర్గ 

ఆ విధముగా భరించలేని శోకముతో విలవిలలాడుతున్న దశరథ మహారాజు నేలపై పది ఉండగా ఆయన పరిస్థితిని ఏమాత్రము పట్టించుకొనక కైక తన వరములు తనకిమ్మని వత్తిడిచేసెను . దశరధుడు అశక్తుడై మిన్నకుండెను . 
తెల్లవారగ  అయోధ్య నగరమంతా పట్టాభిషేకమునకు అలంకరింపబడెను . వశిష్ఠుడు మేళతాళములతో తన శిష్యులతో అయోధ్యానగరములో ప్రవేశించెను . అప్పుడు వశిష్ఠుడు జనములతో, బ్రాహ్మణోత్తములతోకిక్కిరిసి వున్న వీధులను దాటి ,అంతః పురము సమీపమునకు చేరెను . సుమంత్రుడితో "నేను వచ్చిన విషయము మహారాజుగారితో విన్నవింపుము . పట్టాభిషేకము కొరకు సముద్ర జలములతో ,గంగాది నాదీ జలములతో నింపబడిన బంగారు కలశములు ,మేడి చెక్కలతో సిద్ధపరచబడిన భద్రపీఠము ,వివిధములగు ధాన్యములు ,గంధములు ,నానావిధరత్నములు ,తేనెలు ,పాలు ,అందమైన ఎనిమిది మంది కన్యలు ,భద్రగజము ,నాలుగు గుఱ్ఱములు కట్టబడిన అందమైన రధము ,రాజఖడ్గము ,మేలైనధనస్సు ,పల్లకి ,గొడుగు ,తెల్లని వింజామరలు ,బంగారు పాత్ర ,బంగారు గొలుసులతో అలంకరింపబడిన మూపురము కల తెల్లని వృషభము ,నాలుగు కోరలు కల సింహము ,మిక్కిలి బలిష్టమైన మహాశ్వము ,సింహాసనము ,పెద్దపులిచర్మము ,ప్రజ్వలితాగ్ని ,వీణావేణు మృదంగ తాళవాద్య సమూహములు . దేవదాసీ గణము ,ఆచార్యులైన బ్రాహ్మణులు ,పవిత్రములైన గోవులు ,మృగములు ,పక్షులు ,పురజనులు ,ప్రముఖులు,జానపదులు ,వర్తకులు ,శిల్పులు అందరూ సమస్త వస్తువులు సిద్ధముగా ఉన్నవని కూడా మహారాజుగారి తెలియచేయుము "అని చెప్పెను . 
సుమంత్రుడు వశిష్టుని ఆదేశము తీసుకుని దశరథ మహారాజుకి జయము అని పలుకుచు ,ఆయన ,మందిరమున ప్రవేశించెను . ఆయనను ద్వారపాలకులు ఎవ్వరు నిరోధించలేదు . సుమంత్రుడు రాజును సమీపించి ఆయన పరిస్థితి తెలియక ,ఎప్పటియట్లు ఆయన ప్రశంసించుచు దోసిలొగ్గి నిలబడి "ఓ మహారాజా ! త్వరగా మేల్కొనండి . శ్రీరామ పట్టాభిషేకమునకు సమయము సమీపించబోతోంది . మంగళ స్నానములు చేయవలెను . పట్టాభిషేకమునకు కావలిసిన పనులకు ఆగాను ఇవ్వుడు . మీ కొరకు వశిష్ఠుడు ఏర్పాట్లతో ద్వారము నందు వేచి వున్నారు "అని పలికి మహారాజు గారి సమాధానము కొఱకు ఎదురుచూస్తూ నిలబడెను . 
 శోకభారములో మునిగిపోయిన దశరధుడు "కైకేయి మాటలతో మిక్కిలి దుఃఖంలో మునిగిపోయి వున్న నాకు  ఈ మాటలు పుండు మీద కారము చల్లినట్లు అనిపించెను . "అని పలికెను . సుమంత్రుడు దశరధుడి వచనములు విని చేతులు జోడించినవాడై ,తానున్న ప్రదేశము నుండి ఒక అడుగు వెనకకు వేసెను . మిక్కిలి దైన్యములో ఉండుటచే దశరధుడు  జరిగిన విషయమును చెప్పుటకు అశక్తుడయ్యెను . అప్పుడు కైక రాత్రంతా నిద్ర లేకపోవుటచే దశరథ మహారాజు ఇంకా పడుకునే వున్నారు . వెంటనే వెళ్లి శ్రీరాముని ఇచటకు తీసుకురమ్ము . "అని ఆజ్ఞాపించెను . 
అప్పుడు సుమంత్రుడు రాజాజ్ఞ కావాలి అని అంటాడు . అప్పుడు దశరధుడు "నా అందాలరాముడిని వెంటనే తీసుకు రమ్ము . . నా ప్రియా పుతృడిని వెంటనే చూడ దలిచాను" అని పలికెను. రాజాజ్ఞను తీసుకొని సుమంత్రుడు రాముని తీసుకురావటానికి అంతః పురమునుండి బయటకు వచ్చెను . అక్కడ కోకొల్లలుగా వున్న జన సమూహములను, బ్రాహ్మణులను  చూసేను .

రామాయణము అయోధ్యకాండ పదునాల్గవసర్గ సమాప్తము . 

              శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .  













 

Friday 7 October 2016

రామాయణము అయోధ్యకాండ -పదుమూడవసర్గ

                        రామాయణము 

            అయోధ్యకాండ -పదుమూడవసర్గ 

ఆ విధముగా పరితపించుచు దుఃఖముతో విలవిలలాడుతున్న దశరధుని ఏమాత్రము పట్టించుకొనక కైక "ఓ మహారాజా ! నేను సత్యవాదిని ,దృఢవ్రతుని అని గొప్పలు చెప్పుకుంటివే ?కానీ నీవు వాగ్దానము చేసిన విధముగా నా వరములు ఇచ్చుటకు ఎలా వెనకాడుచుంటివి "అని నిష్ఠురముగా పలికెను . 
ఆ కఠోర మాటలు విని దశరథ మహారాజు క్షణకాలం మూర్చితుడయ్యి ,పిదప తేరుకుని కోపముతో "నరోత్తముడైన రాముడు వనములకు వెళ్ళగానే నా ప్రాణములు పోవుట తధ్యము . నేను స్వర్గస్తుడైనచో అచ్చట దేవతలు సైతము శ్రీరాముని క్షేమ సమాచారములు గూర్చి అడుగుతూ స్త్రీ మూలముగా సద్గునవంతుడైన శ్రీరాముని అడవులకు పంపిన మూఢుడవు అని నన్ను నిందించినచో ఆ మాటలకు ఎట్లు తట్టుకోగలను ?
అదియును కాక సభలో నేను శ్రీరాముని పట్టాభిషిక్తుడిని చేసెదను . అని నేను చేసిన ప్రకటన కల్లకాదా ?చాలా కాలము పుత్రులు లేని నాకు పెక్కు  యజ్ఞ యాగాదులు ఫలితముగా ,ఆజానుబాహుడు ,మహాత్ముడు అయిన శ్రీ రాముడు నాకు పుత్రుడుగా లభించెను . ఆ చిన్నారిని చూడకుండా నేను ఎలా ఉండగలను . 
అని పరిపరి విధములుగా పరితపించి ,తనలో తానూ ఓ రాత్రి తెల్లవారకుండా ఇలానే ఉండిపో ,నా రాముని నాకు దూరము చేయవద్దు అనుకొనెను . ఇంకనూ కైకను ఒప్పించుటకు శతవిధములుగా ప్రయత్నించి విఫలుడయ్యెను . మనస్సునే కుమిలిపోవుచు వున్న ఆ దశరధుడికి ఆ రాత్రి ఏట్లో గడిచెను . వేకువజామున రాజును మేల్కొల్పుటకు శంఖపటహవీణారావములు ,వైతాళికులు బహుపరాకులు మొదలుకాగా ఆ దశరథ మహారాజు వాటిని నివారించెను . 

రామాయణము అయోధ్యకాండ పదుమూడవ సర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  









Thursday 6 October 2016

రామాయణము అయోధ్యకాండ -పండ్రెండవసర్గ

                             రామాయణము 



                 అయోధ్యకాండ -పండ్రెండవసర్గ 

కైకేయి పలికిన మాటలు విన్న దశరధుడు తానూ స్వప్నమున వుంటినేమో అని భ్రమపడెను లేక నిద్ర లేమివలన కలిగిన భ్రమ ఏమో అని పరి పరి విధముల చింతించుచు దుఃఖించ సాగెను . కైకేయి మాటలకు స్పృహతప్పిన దశరధుడు కొంత సేపటికి స్పృహ తెచ్చుకుని ఆడపులిని చూసిన లేడి వలె గిలగిలలాడేను . ఎంతో సేపటికి తేరుకుని దహించివేయు చూపులతో కైకను చూస్తూ "ఓసి కౄరురాలా !దుష్టురాలా !రాముడు నీకు చేసిన అపకారము ఏమిటి ?నేను చేసిన దోషమేమి ?ఆ రాఘవుడు అనుక్షణము నిన్ను తల్లి వలె సేవించుచున్నాడు కదా !అట్టి రాముడికి కీడు చేయుటకు ఎందుకు పూనుకున్నావు ?అట్టి కోరికని కోరుటకు నీకు నోరెట్లు వచ్చినది ?
నీవు రాజకుమార్తెవు అని తలచి ,నీలో ఇంత విషమున్నట్లు ఎరుగక ఆడవిషసర్పము వలె నిన్ను నా భవనము న ప్రవేశపెట్టి నా వినాశనమును నేనే కొని తెచ్చుకుంటిని . లోకమంతా శ్రీరాముని గుణగణములను వేనోళ్ళ ప్రస్తుతించుచుండగా ,అతడు ఏ అపరాధము చేసాడని నేను పరిత్యజింతును ?నా ప్రాణములు ,ఈ రాజ్యము ,నా భార్యలు వేటినైనా పరిత్యజింతును కానీ శ్రీరాముని మాత్రము విడిచి క్షణకాలమైన బతకలేను . పెక్కు సార్లు నీవే భరతుడు రాముడు నీకు సమానమని చెప్పివుంటివి . మరి ఇపుడు మిక్కిలి సుకుమారుడు అయిన రాముని పదునాల్గు సంవత్సరములు వనమునకు పంపమని ఎలా అడుగుతున్నావు ?
ఓ కైకేయి !నేను వృద్ధుడను ,జీవితమున చివరి దశకు చేరినవాడను . దీనంగా విలపించుచున్నాను . అట్టి నాపై కనికరము చూపుము . నీకు చేతులు జోడించి నమస్కరించుచున్నాను . నీ పాదములు కూడా పట్టుకొందును . "అని దశరధుడు ఎంతగానో ప్రాధేయపడెను . కానీ ఏమాత్రము చలించని కైక "చేసిన వాగ్ధానము మరచి ,ధర్మ విరుద్ధముగా రామునికి యువరాజు పట్టాభిషేకము చేసి ,కౌశల్యతో నిత్యమూ సుఖపడుటకు వాoచించుచున్నావా ?ఏది ధర్మమో ,ఏది అధర్మమో నాకు తెలియదు . నీవు రాముడికి పట్టాభిషేకము చేసినచో నేను ఇప్పుడే నీవు చూచుచుండగానే కాలకూట విషము త్రాగి చనిపోయెదను . "అని మిక్కిలి కఠినముగా పలికెను . 
అంత దశరధుడు నిశ్చేష్టుడై ,నిస్సహాయముగా కైకనే చూస్తూ నిలబడెను . పిదప తానూ చేసిన ప్రతిజ్ఞ ,కైక బెదిరింపును తలచుకుని పదే పదే రామారామా అని నిట్టూర్చుచు మొదలు నరికిన చెట్టువలె కూలెను . ఇంకనూ ఆశ చావక కైకను ప్రాధేయపడసాగెను . "రేపు ప్రాతః కాలమున వృద్దులు ,పండితులు అందరూ రాముడెక్కడ అని అడిగితే నేను కైక కోసం రాముని అడవులకు పంపానని చెప్పనా ?రాముడు నేను అడవులకు వేళ్ళు అని చెప్పగానే మారు మాట్లాడక ,కారణము అడగక ,అట్లే అని వనములకు వెళ్ళును . నా రాముడు వెళ్లనంటే బాగుండును . "కౌశల్య పట్టపురాణి అయినప్పటికీ ఓకే దాసీ వలే నాకు సేవ చేసెను . నేను మిగిలిన నాభార్యలను వివాహము చేసుకుని తీసుకుని వచ్చినపుడు వారిని తన చెల్లెల్లు వలె ఆదరించెను . ఆమె ఎల్లప్పుడూ నా హితమునే కోరుకున్నది . శ్రీరాముడి వంటి ప్రియా పుతృడిని నాకు ప్రసాదించింది . సర్వదా నాతొ ప్రియముగా మాట్లాడుచున్నది . అట్టి సద్గుణములు కల ఆమెను నీ పై కల వెర్రి ప్రేమతో ఉపేక్షించితిని . 
శ్రీరాముడు అరణ్యములకే వెళ్ళినచో సీత అతని ఎడబాటు తట్టుకోలేక దుఃఖించును . అది చూసి నేను తాళలేను . నా మరణము తధ్యము . నేను మరణించినతర్వాత నీవు విధవవై నీ ప్రియా పుత్రుడితో కలసి రాజ్యమును పరిపాలించుకో . నీ కారణముగా నలుగురిలో నాకు అంతులేని అపకీర్తి ,తీరని పరాభవం తప్పవు . ఓసీ !నీవు నా చావును కోరెడిదానవు . నాకు కీడునే తలపెట్టెడిదానవు . నీవు నాపాలిట శత్రువువు . మృత్యుదేవతవు . అట్టి నిన్ను నా ఇంట వశింపచేసితిని . 
ఓ దేవీ !నాకు బతుకుపై ఆశయే లేదు . ఇక సుఖమెక్కడిది . నీకాళ్ళు పట్టుకొందును . నాకు కీడు తలపెట్టవద్దు . కనికరింపుము . ప్రసన్నురాలివి కమ్ము "అని అతడు కైక కాళ్లకు నమస్కరింపబోయేను . అప్పుడామె కాళ్ళను దూరము చేసెను . అంతట దశరధుడు అట్లే రోగి వలె నేలపై పడిపోయెను . 

రామాయణము అయోధ్యకాండ పండ్రెండవసర్గ సమాప్తము . 

         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Tuesday 4 October 2016

రామాయణము అయోధ్యకాండ -పదునొకొండవసర్గ

                              రామాయణము 

                        అయోధ్యకాండ -పదునొకొండవసర్గ 

అంత ఆ కైక "ఓ దేవా !నన్నెవరు అవమానించలేదు . నాకొకకోరిక వుంది దానిని మేరె తీర్చాలి . అలా తీరుస్తానని మాట ఇస్తే నాకోరిక ఏమిటో తెలుపుతాను "అని పలికెను . అంత దశరధుడు ఆమె శిరస్సుని తన వడిలో చేర్చుకుని ,తన చేతితో ఆమె ముంగురులు సవరించుచు "దేవి నా భార్యలందరిలో నీవే నాకు అత్యంత ప్రియమైనదానవు . నీకోరిక ఏదయినను నేను తప్పక తీర్చెదను దానికై నా ప్రాణములు సైతము విడుచుటకు సిద్దము నా ప్రాణమైన రాముడి మీద ప్రమాణము చేసి చెబుతున్నాను . నీ కోరిక ఏమిటో తెలుపుము "అని ఎంతో అనునయముగా అడిగెను . 
మహారాజు మాటలకు వచ్చిన ధైర్యముతో కైక "రాముడి మీద నీ పుణ్యము మీద ప్రమాణము చేసి నా కోరిక తీరుస్తానని మాట ఇచ్చావు . దీనికి ముక్కోటి దేవతలు సాక్షులు . ఓ దేవా ఆనాడు దేవాసుర సంగ్రామ సమయములో నీవు ఇచ్చిన రెండు వరములను ఇప్పుడు నేను కోరుకోదలిచాను . ఆ వరములు నాకు ఇవ్వనిచో నేను ఈ క్షణమే ప్రాణము లు వదిలేస్తాను . 
ఆ వారములు ఏమనగా ,శ్రీరాముని కొరకై ఏర్పాటు చేసిన సామగ్రితో ,సన్నాహాలతో నేడే నా భరతుడిని యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యాలి . ఇది నా మొదటి వరము . 
శ్రీరాముడు నారా చీరలు జింక చర్మము ధరించి ,జటాధారియై ,దండకారణ్యమునకు వెళ్లి పదునాలుగు సంవత్సరములు తాపస వృత్తిలో నివసింపవలెను . ఇది నా రెండవ వరము . 
రాజులకే రాజువైన నీవు నీ ప్రతిజ్ఞలు కట్టుబడి నీవిచ్చిన వాగ్ధానమును నిలబెట్టుకో "అని కైక ఎంతో పాశాం ఆహృదయముతో పలికెను . 

రామాయణము అయోధ్యకాండ పదకొండవసర్గ సమాప్తము . 

             శశి . 

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Monday 3 October 2016

రామాయణము అయోధ్యకాండ -పదియవసర్గ

                        రామాయణము 


                  అయోధ్యకాండ -పదియవసర్గ 

దశరథ మహారాజు సుమంత్రుడు మొదలగు సచివులు కు పట్టాభిషేక మహోత్సవమునకు ఆదేశములను ఇచ్చి ,వశిష్టుని అనుజ్ఞను పొంది ,అంతః పురమున ప్రవేశించెను . శ్రీరామ పట్టాభిషేకము నిర్ణయించి ఎంతో సేపు అవలేదు కదా ,ఈ వార్త అంతః పురములో తెలియకపోవచ్చునని భావించి ,తనకు అత్యంత ప్రియమైన భార్య కైక కు ఈ ప్రియా వార్తను తెల్పుటకై ఆమె  భవనములో ప్రవేశించెను . సకల సంపదలతో తులతూగునట్టి కైకాదేవి అంతః పురములో ప్రవేశించెను . కానీ అచట శయన మందిరములో తన ప్రియ భార్య కనిపించలేదు . కైకేయిని ఎలుగెత్తి పిలిచెను కానీ సమాధానము లేకుండెను . ద్వారపాలకురాలిని అడగగా ఆమె మిక్కిలి భయపడుతూ కోపగృహమున వున్నవిషయము తెలిపెను . 
ప్రతీహారి మాటలు వినగానే దశరధుడు మనసు కలవరపడెను . వెంటనే కోపగృహమునకు వెళ్లి కైకను చూసినంతనే దుఃఖ భారంతో కుమిలిపోయెను . ఆమె కోపకారణమును తనలో తానుఁ వూహించుటకు ప్రయత్నము చేసి ,తన ఊహకు అందకఆమెతో ఇలా పలికెను "ఓ దేవీ !నీకు నాపై కల కోపమునకు కారణము తెలియటం లేదు . నిన్ను ఎవరైనా నిందించారా ?లేక అవమానించారా ?నీవు ఈవిధముగా దుమ్ములో పడుకుండుట  వలన నా మనసు మిక్కిలి భాదపడుచున్నది . నేను నావందరము నీ అధీనులము . నీ మనోరధము ఏదైనను ,ఎట్టిదైనను ,దానిని నేను నిరాకరింపను . నీ మనసులోని మాటను నిస్సంకోచముగా తెలుపుము . నా ప్రాణములు ఒడ్డి అయిననుదానిని తీర్చెదను . 
ఓ కైకేయి సూర్య రశ్మి తాకినంత వరకు ఈ భూ భాగము అంతా నా అధీనములో వుంది . ఈ భూమండలం మీద ఆలా సంపద ,ధనము  నీ ఇష్టానుసారంగా కోరుకొనుము . "అని దశరథ మహారాజు పలికిన మాటలు విని కైకేయి కొంత ఊరట పడెను . 

రామాయణము అయోధ్యకాండ పదియవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ,తెలుగు పండితులు .  












Saturday 1 October 2016

రామాయణము అయోధ్యకాండ -తొమ్మిదవసర్గ

                                            రామాయణము 

                                     అయోధ్యకాండ -తొమ్మిదవసర్గ 

మంధర దుర్భోధతో కైకేయి మనసు విషపూరితముకాగా కోపముతో వుడికిపోవుతూ "ఈ క్షణమే రాముని వనములకు పంపివేయుదును . భరతుని రాజుగా పట్టాభీష్ఠిక్తుడిని కావించెదను . ఎట్టిపరిస్థితులలో రాజ్యమును రాముడికి దక్కనివ్వను అందుకు ఏదేని ఉపాయమును ఆలోచించమని చెప్పెను . "
అప్పుడు మంధర "దేవీ ! మరచితివా ?పూర్వము దేవదానవ సంగ్రామ సమయములో నీ భర్త దేవతల పక్షమును పోరాడు సమయమున నీ భర్త గాయపడినప్పుడు ,నీవు సారధిగా ఉండి రణరంగము నుండి దూరముగా తీసుకువెళ్లి ఆయన ప్రాణములు కాపాడినందుకు గాను ఆయన నిన్ను రెండు వరముల కోరుకోమన్నాడు . నీవు అవసరము వచ్చినపుడు వాటిని కోరుకుంటాను అన్నావు . కావునా తెలివిగా ఆ వరములు గా భరతుని పట్టాభిషేకము ,రాముని వనవాసమును కోరుకో "అని పలికెను . 
ఇంకనూ ఆ దుష్ట మంధర ఇలా పలికెను "ఓ దేవీ !నీ భర్తకు నీపై కల ప్రేమలో ఏమాత్రము అనుమానము లేదు . ఆ మహారాజు నీ కొరకు అగ్నిలోనైనా దూకును . నీవు కన్నులెర్ర చేసినచో తట్టుకొనజాలడు . నీ తృప్తిని తీర్చుటకు తన ప్రాణములను సైతం లెక్కచేయడు . కావున నీవు ఆరెండు వరములను అడుగు . ఆ వరములా నుండి నిన్ను మరల్చుటకు అనేక విలువైన ఆభరణములు ,రత్నములు మొదలగువాటిని ఆశ చూపును కానీ నీవు వాటికి లొంగవలదు . పదునాలుగేళ్ళు రామును వనవాసమునకు పంపమని అడుగు . ఈలోపు నీ కుమారుడు భరతుడు జనుల అభిమానమును పొందును .కావున ఆలసింపక వెంటనే అలుక వహించు ,నీ కార్యము సిద్దించుకో "అని పలికెను . 
అంత సౌందర్య గర్వముచే విర్రవీగునది ,అందమైన కను తీరుకాలాడి అయినా కైక మంధర తెలివితేటలు మెచ్చుకుని ,భరతుడి పట్టాభిషేకము అనంతరము విలువైన ఆభరణములు కానుకగా ఇస్తానని మాట ఇచ్చి ఆ కుబ్జతో కూడి కోపగృహమునకు చేరెను . అంత కైకా దేవి తన వంటిపై కల విలువైన శ్రేష్టమైన ఆభరణములను తీసివేసెను . నేలపై పరుండెను . అప్పుడు తిరిగి ఆ మంధర "ఓ సుందరీ !రాజ్యాధికారం రామునికి దక్కినచో నీకు నీ కుమారునికి తిప్పలు తప్పవు . కావున భరతుడికి రాజ్యాభిషేకమునకు గట్టిగా పూనుకో "అని రెచ్చకొట్టేను . 
ఈ  విధముగా ఆ కుబ్జ పదేపదే రెచ్చకొట్టగా ఆ రాణి మిగుల వగచెను . తన భర్త తనను వంచించెనని భావించి ఆయనపై మిక్కిలి కోపముగా ఉండెను . ఇంకనూ ఆ కుబ్జ తెలివితేటలకు మెచ్చుకొనెను . పిమ్మట కైక తాన్ అవంతి మీద గల మిగిలిన నగలను కూడా తీసివేసి కఠిన నెల ఫై పరుండెను . ఆ సమయములో ఆమె దివి నుండి భువి పైకి రాలి పడిన కిన్నెర స్త్రీ వలే ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ తొమ్మిదవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 























రామాయణము అయోధ్యకాండ -ఎనిమిదవసర్గ

                                రామాయణము 

                            అయోధ్యకాండ -ఎనిమిదవసర్గ 

కైకేయి వచనములు సహింపరానివై ఆ దుష్ట మంధర కోపము దుఃఖము పొంగిరాగా కైకేయి ఇచ్చిన ఆభరణమును విసిరి కొట్టి "ఓ దేవీ !నీకు అంతులేని ఆపద సంబవిస్తుండగా నీవు ఇలా సంతోషపడుట నీ అజ్ఞానము . రామాభరతులు ఇద్దరు బలపరాక్రమములలో సములే . శ్రీరాముడి తర్వాత సింహాసనము వరించేది భరతుడికి ,ఆ తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులకి ,కావున రాముడికి భరతుడు శత్రువు కాగలడు . అదీ కాక రాముడు రాజైతే కౌశల్యాదేవి రాజమాత అవుతుంది . అప్పుడు యావత్ దాసీగణము అందరూ ఆవిడకు దాసోహమంటారు . మాతో పాటు నీవు కూడా ఆవిడ అదుపాజ్ఞలలో మసలవలసి ఉంటుంది . రాముడు రాజైతే భరతుడు ,అతని పుత్రులు ఆయనకు సేవ చేస్తూ గడపవలసిందే . కావున మేల్కొని కర్తవ్యము ఆలోచించు . "అని పలికెను . 
అప్పుడు కైకేయి "ఓ కుబ్జా !ఎందుకు అనవసరముగా ఆందోళన చెబుతున్నావు ?శ్రీరాముడు కొంతకాలము రాజ్యము పరిపాలించిన పిమ్మట నిశ్చయముగా భరతుడి ఈ రాజ్యమునకు రాజు అగును . శుభ పరంపరలు మొదలవుతుండగా సంతోషించక దుఃఖించెదవేల ?"అని పలికెను . 
అప్పుడు మంధర "పూర్వము దశరథమహారాజు నిన్ను మిక్కిలి ప్రేమగా చూచుచున్నారనే గర్వముతో కౌశల్యను తిరస్కరించినావు . ఇప్పుడు ఆమె రాజమాత అయినా పిమ్మట ఆమె ఆ అవమానమునకు ప్రతీకారము తీర్చుకోకుండునా ?ఒక్కసారి రాముడు రాజు అయిన పిమ్మట భరతుడు రాజు అగుట అసంభవం . రాజకుమారులందరిని రాజ్యలక్ష్మి వరించదు . అదే రాజనీతి ధర్మము . రామలక్ష్మణులిద్దరు చిన్నపాటి నుండి అన్యోన్యముగా మెలిగినారు . కావున రాముడు లక్ష్మణుడు కి ఎట్టి అపకారము తలపెట్టడు . కానీ భరతుడు చిన్నప్పటి నుండి తాతగారింట పెరిగాడు . రాజ్యమునకు పోటీ వస్తాడు కావున రాముడు భరతుడికి తప్పకుండా అపకారము చేస్తాడు . కావున వనములకు వెళ్లి తలదాచుకోవలసిన పరిస్థితి కూడా రావచ్చును . ఓ భామినీ !సముద్రములు పర్వతములు ,నగరములు కల ఈ విశాలమైన భూమండలమును శ్రీరాముడు ప్రభువై ,ఆయన తల్లి కౌశల్య ,భార్య సీత తో హాయిగా అధికారము చెలాయించుచుండగా ,నీవు నీ కుమారుడు కోడలి తో వారి ఆజ్ఞలను పాటిస్తూ దీనవధనురాలవై ఉండవలెను . తీరని అవమానములు పాలగుదువు . కావున బాగుగా అలోచించి నీ కుమారుడు రాజగునట్లు ,శత్రువు అరణ్యములకు పోవునట్లు చూడుము ". అని పరం దుష్టురాలైన మంధర కైకేయికి దుర్భోధ చేసి ఆమె హృదయమును కలుషితము చేసివేసెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనిమదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .