Thursday 6 October 2016

రామాయణము అయోధ్యకాండ -పండ్రెండవసర్గ

                             రామాయణము 



                 అయోధ్యకాండ -పండ్రెండవసర్గ 

కైకేయి పలికిన మాటలు విన్న దశరధుడు తానూ స్వప్నమున వుంటినేమో అని భ్రమపడెను లేక నిద్ర లేమివలన కలిగిన భ్రమ ఏమో అని పరి పరి విధముల చింతించుచు దుఃఖించ సాగెను . కైకేయి మాటలకు స్పృహతప్పిన దశరధుడు కొంత సేపటికి స్పృహ తెచ్చుకుని ఆడపులిని చూసిన లేడి వలె గిలగిలలాడేను . ఎంతో సేపటికి తేరుకుని దహించివేయు చూపులతో కైకను చూస్తూ "ఓసి కౄరురాలా !దుష్టురాలా !రాముడు నీకు చేసిన అపకారము ఏమిటి ?నేను చేసిన దోషమేమి ?ఆ రాఘవుడు అనుక్షణము నిన్ను తల్లి వలె సేవించుచున్నాడు కదా !అట్టి రాముడికి కీడు చేయుటకు ఎందుకు పూనుకున్నావు ?అట్టి కోరికని కోరుటకు నీకు నోరెట్లు వచ్చినది ?
నీవు రాజకుమార్తెవు అని తలచి ,నీలో ఇంత విషమున్నట్లు ఎరుగక ఆడవిషసర్పము వలె నిన్ను నా భవనము న ప్రవేశపెట్టి నా వినాశనమును నేనే కొని తెచ్చుకుంటిని . లోకమంతా శ్రీరాముని గుణగణములను వేనోళ్ళ ప్రస్తుతించుచుండగా ,అతడు ఏ అపరాధము చేసాడని నేను పరిత్యజింతును ?నా ప్రాణములు ,ఈ రాజ్యము ,నా భార్యలు వేటినైనా పరిత్యజింతును కానీ శ్రీరాముని మాత్రము విడిచి క్షణకాలమైన బతకలేను . పెక్కు సార్లు నీవే భరతుడు రాముడు నీకు సమానమని చెప్పివుంటివి . మరి ఇపుడు మిక్కిలి సుకుమారుడు అయిన రాముని పదునాల్గు సంవత్సరములు వనమునకు పంపమని ఎలా అడుగుతున్నావు ?
ఓ కైకేయి !నేను వృద్ధుడను ,జీవితమున చివరి దశకు చేరినవాడను . దీనంగా విలపించుచున్నాను . అట్టి నాపై కనికరము చూపుము . నీకు చేతులు జోడించి నమస్కరించుచున్నాను . నీ పాదములు కూడా పట్టుకొందును . "అని దశరధుడు ఎంతగానో ప్రాధేయపడెను . కానీ ఏమాత్రము చలించని కైక "చేసిన వాగ్ధానము మరచి ,ధర్మ విరుద్ధముగా రామునికి యువరాజు పట్టాభిషేకము చేసి ,కౌశల్యతో నిత్యమూ సుఖపడుటకు వాoచించుచున్నావా ?ఏది ధర్మమో ,ఏది అధర్మమో నాకు తెలియదు . నీవు రాముడికి పట్టాభిషేకము చేసినచో నేను ఇప్పుడే నీవు చూచుచుండగానే కాలకూట విషము త్రాగి చనిపోయెదను . "అని మిక్కిలి కఠినముగా పలికెను . 
అంత దశరధుడు నిశ్చేష్టుడై ,నిస్సహాయముగా కైకనే చూస్తూ నిలబడెను . పిదప తానూ చేసిన ప్రతిజ్ఞ ,కైక బెదిరింపును తలచుకుని పదే పదే రామారామా అని నిట్టూర్చుచు మొదలు నరికిన చెట్టువలె కూలెను . ఇంకనూ ఆశ చావక కైకను ప్రాధేయపడసాగెను . "రేపు ప్రాతః కాలమున వృద్దులు ,పండితులు అందరూ రాముడెక్కడ అని అడిగితే నేను కైక కోసం రాముని అడవులకు పంపానని చెప్పనా ?రాముడు నేను అడవులకు వేళ్ళు అని చెప్పగానే మారు మాట్లాడక ,కారణము అడగక ,అట్లే అని వనములకు వెళ్ళును . నా రాముడు వెళ్లనంటే బాగుండును . "కౌశల్య పట్టపురాణి అయినప్పటికీ ఓకే దాసీ వలే నాకు సేవ చేసెను . నేను మిగిలిన నాభార్యలను వివాహము చేసుకుని తీసుకుని వచ్చినపుడు వారిని తన చెల్లెల్లు వలె ఆదరించెను . ఆమె ఎల్లప్పుడూ నా హితమునే కోరుకున్నది . శ్రీరాముడి వంటి ప్రియా పుతృడిని నాకు ప్రసాదించింది . సర్వదా నాతొ ప్రియముగా మాట్లాడుచున్నది . అట్టి సద్గుణములు కల ఆమెను నీ పై కల వెర్రి ప్రేమతో ఉపేక్షించితిని . 
శ్రీరాముడు అరణ్యములకే వెళ్ళినచో సీత అతని ఎడబాటు తట్టుకోలేక దుఃఖించును . అది చూసి నేను తాళలేను . నా మరణము తధ్యము . నేను మరణించినతర్వాత నీవు విధవవై నీ ప్రియా పుత్రుడితో కలసి రాజ్యమును పరిపాలించుకో . నీ కారణముగా నలుగురిలో నాకు అంతులేని అపకీర్తి ,తీరని పరాభవం తప్పవు . ఓసీ !నీవు నా చావును కోరెడిదానవు . నాకు కీడునే తలపెట్టెడిదానవు . నీవు నాపాలిట శత్రువువు . మృత్యుదేవతవు . అట్టి నిన్ను నా ఇంట వశింపచేసితిని . 
ఓ దేవీ !నాకు బతుకుపై ఆశయే లేదు . ఇక సుఖమెక్కడిది . నీకాళ్ళు పట్టుకొందును . నాకు కీడు తలపెట్టవద్దు . కనికరింపుము . ప్రసన్నురాలివి కమ్ము "అని అతడు కైక కాళ్లకు నమస్కరింపబోయేను . అప్పుడామె కాళ్ళను దూరము చేసెను . అంతట దశరధుడు అట్లే రోగి వలె నేలపై పడిపోయెను . 

రామాయణము అయోధ్యకాండ పండ్రెండవసర్గ సమాప్తము . 

         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












No comments:

Post a Comment