Wednesday 19 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదిఒకటవసర్గ

                                 రామాయణము 

                         అయోధ్యకాండ -ఇరువదిఒకటవసర్గ 

కౌసల్యా దేవి దీనంగా ఆ విధముగా విలపించుచుండగా ,లక్ష్మణుడు "పూజ్యురాలివైన ఓ అమ్మా !మహారాజు కుటిలాత్మురాలైన కైక మాటల వలలో చిక్కుకుని వున్నాడు . విషయలోలుడై బుద్ధివైపరీత్యము కలిగి వున్నాడు . ఈ స్థితిలో మహారాజు ఏమి మాట్లాడలేడు . రాముడు నిర్మలుడు ,కార్యదక్షణాదక్షుడు ,ఆయన ఎవరికీ ఏ అపకారము చేయలేదు . రాజ్యదోహము చేయలేదు . కావున రాముడు ఏ కారణమున వనములకు వెళ్ళాలి ?నేను ఇందుకు అంగీకరింపను . విచక్షణ జ్ఞానము లేని రాజు మాటలను రాజనీతి ఎరిగిన ఏ కుమారుడు పాటించును ?"అని ఆమెతో పలికి తిరిగి రామునితో 
ఓ రఘునందనా !ఈ వనవాస విషయము బయట కు తెలియక ముందే మనము రాజ్యమును వశము చేసుకోవలయును . ఈ రాజ్యము నీకు చెందవలసినిది . నీవు ముందు నిలబడు నేను ధనుర్ధారినై నీ వెంట ఉండి ఆ భరతుడికి అనుకూలురు అందరిని తుదముట్టించి లేదా బందించి ఈ రాజ్యమును హస్తగతము చేసుకుందాము . తండ్రి అయినా దుర్భుద్ధి కలవాడు కావున ఆయనను భందించుటకు కూడా నేను సిద్దము . "అని పలికి తిరిగి కౌసల్యతో 
"అమ్మా !ప్రజ్వలిల్లుచున్న అగ్నిలో కానీ ,వనములకు కానీ రాముడు ప్రవేశించవలెననుకుంటే నేను ఆయనకన్నా ముందు వాటిలో వుంటాను . ఇది నిజాము నమ్ముము . నేను అన్నకు అండగా ఉండగా ఆయనకు ఎట్టి ఆపద కలగదు . నీవు దుఃఖింపకు "అని ఆమెకు ధైర్యము చెప్పెను . 
అప్పుడు కౌసల్య రాముడితో "తండ్రీ !నీ తమ్ముని మాటలు విన్నావు కదా యుక్తాయుక్తా జ్ఞానము తెలిసినవాడవు . ఏమి చేయవలెనో నీవే నిర్ణయించుకో . వనవాసమునకు తల్లితండ్రుల అనుమతి కావలెను కదా !నీవు వనవాసమునకు వెళ్ళుటకు నేను ఎట్టి పరిస్తిస్తులలో అనుమతించను. నీవు వనవాసమునకు వెళ్ళినచో నేను నా ప్రాణములు విడిచెదను . నీవు లేని ఈ బతుకు వ్యర్ధము . దానికన్నను అరణ్యములో నీతోపాటు కందమూలములు తినుట ఉత్తమము "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు తల్లితో "అమ్మా !తండ్రి ఆజ్ఞను జవదాటుటకు నేను అశక్తుడను . శిరాసా ప్రణమిల్లుచున్నాను . నేను వనములకు వెళ్ళుటకు సిద్ధముగా వున్నాను . దయతో నాకు అనుమతిని ఇమ్ము . మన వంశమునే సగరుని పుత్రులు తండ్రి ఆనతి మేరకు భూమిని త్రవ్వుతూ మృత్యువు పాలయ్యిరి . జమదగ్ని కుమారుడైన పరుశురాముడు తండ్రి ఆనతి మేరకు తల్లి శిరస్సుని గండ్ర గొడ్డలితో నరికివేసెను . అంతేకాదు పెక్కుమంది ధర్మజ్ఞులు తండ్రి ఆనతిని అనుసరించే నడుచుకొనిరి . పిత్రాజ్ఞ కాదనరాదు . తండ్రి తృప్తికై నేను అడవులకు వెళ్లెదను "అని పలికెను . 
పిమ్మట రాముడు "లక్ష్మణా !నాపై నీకు కల ప్రేమ అపారం . నీ బలపరాక్రమములు నిరుపమానములు వీటినన్నిటిని నేనెఱుగుదును . నా మీద ప్రేమ కారణముగా మాతృమూర్తి చిత్తస్తైర్యము విస్మరించి అంతులేని దుఃఖముతో ఈ విధముగా పలుకుచున్నది . నీవు కూడా ఈ విధముగా పలుకుచుంటివేల ?లోకములోని ధర్మములలో కెల్లా ఉత్తమమైనది పిత్రాజ్ఞ . తీవ్రత మాని ధర్మమును ఆశ్రయించుము . "అని లక్ష్మణుడిని  అనునయించెను . 
అప్పుడు కౌశల్యాదేవి రాముడికి నచ్చచెప్పుటకు అశక్తురాలై తానూ కూడా వనవాసమునకు వచ్చెదననగా ,రాముడు సుమంగళి భర్తను వీడి రావడం సబబు కాదని నచ్చచెప్పెను . ఆ విధముగా రాముడు వనవాసమునకు వెళ్ళుటకే నిశ్చయించుకుని తల్లిని ప్రసన్నురాలిగా చేసుకుని ధర్మస్వరూపమును తల్లికి ,లక్ష్మణుడికి విపులముగా వివరించేను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదిఒకటవ సర్గసమాప్తము . 


                  శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
 


                            

No comments:

Post a Comment