Monday 3 October 2016

రామాయణము అయోధ్యకాండ -పదియవసర్గ

                        రామాయణము 


                  అయోధ్యకాండ -పదియవసర్గ 

దశరథ మహారాజు సుమంత్రుడు మొదలగు సచివులు కు పట్టాభిషేక మహోత్సవమునకు ఆదేశములను ఇచ్చి ,వశిష్టుని అనుజ్ఞను పొంది ,అంతః పురమున ప్రవేశించెను . శ్రీరామ పట్టాభిషేకము నిర్ణయించి ఎంతో సేపు అవలేదు కదా ,ఈ వార్త అంతః పురములో తెలియకపోవచ్చునని భావించి ,తనకు అత్యంత ప్రియమైన భార్య కైక కు ఈ ప్రియా వార్తను తెల్పుటకై ఆమె  భవనములో ప్రవేశించెను . సకల సంపదలతో తులతూగునట్టి కైకాదేవి అంతః పురములో ప్రవేశించెను . కానీ అచట శయన మందిరములో తన ప్రియ భార్య కనిపించలేదు . కైకేయిని ఎలుగెత్తి పిలిచెను కానీ సమాధానము లేకుండెను . ద్వారపాలకురాలిని అడగగా ఆమె మిక్కిలి భయపడుతూ కోపగృహమున వున్నవిషయము తెలిపెను . 
ప్రతీహారి మాటలు వినగానే దశరధుడు మనసు కలవరపడెను . వెంటనే కోపగృహమునకు వెళ్లి కైకను చూసినంతనే దుఃఖ భారంతో కుమిలిపోయెను . ఆమె కోపకారణమును తనలో తానుఁ వూహించుటకు ప్రయత్నము చేసి ,తన ఊహకు అందకఆమెతో ఇలా పలికెను "ఓ దేవీ !నీకు నాపై కల కోపమునకు కారణము తెలియటం లేదు . నిన్ను ఎవరైనా నిందించారా ?లేక అవమానించారా ?నీవు ఈవిధముగా దుమ్ములో పడుకుండుట  వలన నా మనసు మిక్కిలి భాదపడుచున్నది . నేను నావందరము నీ అధీనులము . నీ మనోరధము ఏదైనను ,ఎట్టిదైనను ,దానిని నేను నిరాకరింపను . నీ మనసులోని మాటను నిస్సంకోచముగా తెలుపుము . నా ప్రాణములు ఒడ్డి అయిననుదానిని తీర్చెదను . 
ఓ కైకేయి సూర్య రశ్మి తాకినంత వరకు ఈ భూ భాగము అంతా నా అధీనములో వుంది . ఈ భూమండలం మీద ఆలా సంపద ,ధనము  నీ ఇష్టానుసారంగా కోరుకొనుము . "అని దశరథ మహారాజు పలికిన మాటలు విని కైకేయి కొంత ఊరట పడెను . 

రామాయణము అయోధ్యకాండ పదియవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ,తెలుగు పండితులు .  












No comments:

Post a Comment