Saturday 22 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఇరువదినాల్గవసర్గ

                              రామాయణము 

                          అయోధ్యకాండ -ఇరువదినాల్గవసర్గ     

వనములకు వెళ్ళుటకు కృత నిశ్చయుడైన శ్రీరాముడితో కౌసల్యాదేవి " నా ప్రియ కుమారుడు రాముడు ఏనాడు దుఃఖమునే ఎరుగడు . అతడు మిక్కిలి ధర్మబుద్ధి కలవాడు . అందరితోనూ ప్రియముగా మాట్లాడువాడు . అట్టి సుకుమారుడు అడవులలో ఉంఛవృత్తితో (దైవ వశమున నేలపై రాలిన గింజలతో ,అడవిలో లభించిన ఫలమూలాదులను భక్షించుచు జీవించుట )ఎలా జీవించగలడు ? శ్రీరాముని సేవకులు ,భటులు ,మృష్టాన్నభోజనముతో ఇచట ఇచట కాలము గడుపుచుండగా ,వారి యజమాని అయిన శ్రీరాముడు అడవిలో కందమూలాదులను భక్షించుచు ఎట్లు కాలము గడుపును ?
పుత్రా !నీవు వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకున్నచో నేను కూడా నీతో వచ్చెదను నీవు లేక ఇక్కడ బతకలేను "అని పెక్కుమార్లు రామునితో వనములకు వెళ్ళుటకు  ఎంతో దీనంగా బ్రతిమాలెను . అప్పుడు శ్రీరాముడు ఆమె కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చుచు ,"అమ్మా !మహారాజు కైకేయిచే వంచితుడయ్యెను . నేను అరణ్యములకు వెళ్లుచున్నాను . నీవు కూడా ఆయనకు తోడుగా లేనిచో ఆయన బతకజాలడు . 
అమ్మా !స్త్రీ భర్తను త్యజించుట క్రూరమైన కార్యము . నింద్యమైన ఆలోచనను నీ మనస్సుకి రానీయకుము . నా తండ్రి గారైన దశరథమహారాజు జీవించివున్నంతవరకు ఆయనకు నీవు సేవలొనర్చుచునే ఉండవలెను . ఇదియే సనాతన ధర్మము . నేను అయోధ్య విడిచి వెళ్లిన పిమ్మట వృద్ధుడైన మహారాజు పుత్రశోకంతో పరితపించకుండా నీవు ఆయనను నీవే జాగ్రత్తగా కాపాడవలెను . పదునాల్గు సంవత్సరములు అడవిలో ప్రశాంతముగా  గడిపిన పిమ్మట రాజ్యమునకు వచ్చి ,నీ మాటలను సంతోషముతో పాటించెదను . "అని తల్లికి నచ్చచెప్పెను . 
ఆయన మాటలు విని కౌసల్యాదేవి రాముడిని తదేక దృష్టితో చూస్తూ  "నాయనా !వనములకు తప్పక వెళ్లవలెను అనే నీ నిరనయము నుండి నిన్ను మరల్చుటకు నేను అశక్తురాలను . నీవు సర్వ సమర్థుడవు . నీవు వనములనుండి క్షేమముగా వచ్చిన పిమ్మట కానీ నా ఈ దుఃఖము చల్లారదు . జటావల్క దారివై అడవులకు వేళ్ళు నిన్ను మరల కళ్లారా ఎన్నాళ్లకు చూడగలనో !నాకాఅదృష్టము వున్నదో లేదో . నాయనా జాగ్రత్తగా వెళ్లిరమ్ము . నీకు శుభమగుగాక !"అని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ ఇరువదినాల్గవసర్గ సమాప్తము . 

                  శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 













No comments:

Post a Comment