Saturday 1 October 2016

రామాయణము అయోధ్యకాండ -ఎనిమిదవసర్గ

                                రామాయణము 

                            అయోధ్యకాండ -ఎనిమిదవసర్గ 

కైకేయి వచనములు సహింపరానివై ఆ దుష్ట మంధర కోపము దుఃఖము పొంగిరాగా కైకేయి ఇచ్చిన ఆభరణమును విసిరి కొట్టి "ఓ దేవీ !నీకు అంతులేని ఆపద సంబవిస్తుండగా నీవు ఇలా సంతోషపడుట నీ అజ్ఞానము . రామాభరతులు ఇద్దరు బలపరాక్రమములలో సములే . శ్రీరాముడి తర్వాత సింహాసనము వరించేది భరతుడికి ,ఆ తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులకి ,కావున రాముడికి భరతుడు శత్రువు కాగలడు . అదీ కాక రాముడు రాజైతే కౌశల్యాదేవి రాజమాత అవుతుంది . అప్పుడు యావత్ దాసీగణము అందరూ ఆవిడకు దాసోహమంటారు . మాతో పాటు నీవు కూడా ఆవిడ అదుపాజ్ఞలలో మసలవలసి ఉంటుంది . రాముడు రాజైతే భరతుడు ,అతని పుత్రులు ఆయనకు సేవ చేస్తూ గడపవలసిందే . కావున మేల్కొని కర్తవ్యము ఆలోచించు . "అని పలికెను . 
అప్పుడు కైకేయి "ఓ కుబ్జా !ఎందుకు అనవసరముగా ఆందోళన చెబుతున్నావు ?శ్రీరాముడు కొంతకాలము రాజ్యము పరిపాలించిన పిమ్మట నిశ్చయముగా భరతుడి ఈ రాజ్యమునకు రాజు అగును . శుభ పరంపరలు మొదలవుతుండగా సంతోషించక దుఃఖించెదవేల ?"అని పలికెను . 
అప్పుడు మంధర "పూర్వము దశరథమహారాజు నిన్ను మిక్కిలి ప్రేమగా చూచుచున్నారనే గర్వముతో కౌశల్యను తిరస్కరించినావు . ఇప్పుడు ఆమె రాజమాత అయినా పిమ్మట ఆమె ఆ అవమానమునకు ప్రతీకారము తీర్చుకోకుండునా ?ఒక్కసారి రాముడు రాజు అయిన పిమ్మట భరతుడు రాజు అగుట అసంభవం . రాజకుమారులందరిని రాజ్యలక్ష్మి వరించదు . అదే రాజనీతి ధర్మము . రామలక్ష్మణులిద్దరు చిన్నపాటి నుండి అన్యోన్యముగా మెలిగినారు . కావున రాముడు లక్ష్మణుడు కి ఎట్టి అపకారము తలపెట్టడు . కానీ భరతుడు చిన్నప్పటి నుండి తాతగారింట పెరిగాడు . రాజ్యమునకు పోటీ వస్తాడు కావున రాముడు భరతుడికి తప్పకుండా అపకారము చేస్తాడు . కావున వనములకు వెళ్లి తలదాచుకోవలసిన పరిస్థితి కూడా రావచ్చును . ఓ భామినీ !సముద్రములు పర్వతములు ,నగరములు కల ఈ విశాలమైన భూమండలమును శ్రీరాముడు ప్రభువై ,ఆయన తల్లి కౌశల్య ,భార్య సీత తో హాయిగా అధికారము చెలాయించుచుండగా ,నీవు నీ కుమారుడు కోడలి తో వారి ఆజ్ఞలను పాటిస్తూ దీనవధనురాలవై ఉండవలెను . తీరని అవమానములు పాలగుదువు . కావున బాగుగా అలోచించి నీ కుమారుడు రాజగునట్లు ,శత్రువు అరణ్యములకు పోవునట్లు చూడుము ". అని పరం దుష్టురాలైన మంధర కైకేయికి దుర్భోధ చేసి ఆమె హృదయమును కలుషితము చేసివేసెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనిమదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













No comments:

Post a Comment