Thursday 13 October 2016

రామాయణము అయోధ్యకాండ -పదునాఱవసర్గ

                            రామాయణము 


                     అయోధ్యకాండ -పదునాఱవసర్గ 

ఆ విధముగా శ్రీరాముని భవనము వద్దకు చేరిన సుమంత్రుడు తనను చూసి లేచి నిలబడి నమస్కారము చేసిన ద్వారపాలకులతో తన రాకను గూర్చి శ్రీరాముడికి తెలుపమని చెప్పెను . అంతట శ్రీరాముని యందు ప్రేమానురాగముకల ఆ భటులు సీతాదేవి సమేతుడైవున్న శ్రీరాముని చేరి సుమంత్రుడు రాక ను తెలిపిరి . శ్రీరాముడు ఆయనను అంతః పురము లోనికి రప్పించెను . చక్కని వస్త్రాభరణము ధరించి ,శ్రేష్టమైన ఎర్రటి చందనమును ధరించి ,బంగారు ఆసనముపై కూర్చొని వున్న ఆశ్రీరాముడిని సుమంత్రుడు దర్శించెను . సీతాదేవి వింజామర విసురుతూ శ్రీరాముడి పక్కనే నిలబడి ఉండెను . 
అప్పుడు సుమంత్రుడు "మీ తండ్రిగారు మిమ్ము తక్షణమే వెంటబెట్టుకుని తీసుకురమ్మన్నారు . బహుశా పట్టాభిషేక విషయమై అయివుంటుంది . "అని తెలిపెను . అంత శ్రీరాముడు సీతాదేవికి తండ్రిగారి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరెను . బయట నమస్కరించి వున్న లక్ష్మణుడిని చూసేను . రాజా వీధులలో పట్టాభిషేకము తిలకించుటకు వచ్చిన జనులు బ్రాహ్మణుల నమస్కారములు అందుకుంటూ వారికి నమస్కరిస్తూ వెండి రధము ఎక్కి తండ్రిగారి అంతః పురము వైపుగా వెళ్లెను . 
శ్రీరాముడి తమ్ముడైన లక్ష్మణుడు వింజామరము చేతబూని ,రథముపై అన్నకు వెనక భాగమున నిల్చి ఆయనను సేవించుచువుండెను . రాముడు అట్లు వెళ్లుచుండగా జనుల యొక్క కళకళధ్వనులు ఆ ప్రాంతమంతయూ నిండెను . రాముడి వెనక అసంఖ్యాకములైన అశ్వములు ,గజములు ఆయన రధమును అనుసరించినవి . ఖడ్గములు ,ధనస్సులు ధరించిన సూరులు రామునికి జయజయ ద్వానములు చేస్తూ రామునికి ముందు నడిచిరి . చక్కగా అలంకరించుకున్న స్త్రీలు తమతమ ఇంటి కిటికీల నుండీ రాముడిపై పరిమళభరితములైన పుష్పములను చల్లిరి . పురజనులు ,ఇతర ప్రదేశములనుండి వచ్చిన జానపదులు రాముడి గురించి ,పట్టాభిషేకము గురించి మాట్లాడుకుంటున్న మాటలను రాముడు వినెను . 
గుఱ్ఱముల సకిలింపులతో ,గజముల ఘింకరింపులతో ,స్తుతి పాటలతో ,జయజయద్వానములతో వందలాది జనులు నడుచుచుండిరి . వాద్య బృంద గాయకులు శ్రీరాముని గుణగణములను కీర్తించుచుండిరి . ఇట్టి జేజేలు కోలాహలముల మధ్య శ్రీరాముడు కుభేరుడి వలె వైభవంతో ముందుకు సాగెను . 

రామాయణము అయోధ్యకాండ పదునాఱవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                 














No comments:

Post a Comment